రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్‌బీఐ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
నాసిక్, దేవాస్, బెంగళూరులోని ప్రింటింగ్ హౌస్‌ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరేలోపు 1,761 మిలియన్ల రూ.500 నోట్లు మాయమైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి .
గల్లంతైన నోట్ల విలువ రూ.88 వేల కోట్లకు పైనే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతనిచ్చింది. మీడియాలో వచ్చిన వార్తలు నిజంకాదని పేర్కొంది.
“ప్రింటింగ్ ప్రెస్ నుంచి నోట్లు మాయమయ్యాయన్న వార్తలు సరికాదు. ఆర్టీఐ ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి వార్తలు ప్రచారమవుతున్నాయి'' అని జూన్ 17న రిజర్వ్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.
“ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రింట్ అయి ఆర్‌బీఐకి పంపిన నోట్లను సరిగా చూసుకుంటారు.ఈ నోట్ల ముద్రణ, నిల్వ, పంపిణీని ఆర్‌బీఐ పూర్తి ప్రోటోకాల్‌లతో పర్యవేక్షిస్తుంది. దీని కోసం ఒక పెద్ద యంత్రాంగం ఉంది" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం కరెన్సీ డిపాజిట్లు, వాటి విలువ గురించి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరారు.
దీంతో పాటు అదే ఆర్థిక సంవత్సరంలో నాసిక్, దేవా, మైసూర్‌లోని నోట్ ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ముద్రించిన, సరఫరా చేసిన నోట్ల సంఖ్య, వాటి విలువ గురించి అడిగారు.
ఆర్‌బీఐ, నోట్ ప్రెస్ ( ప్రింటింగ్ ప్రెస్) అందించిన డేటాలో వ్యత్యాసాన్ని చూసి.. రూ. 88,032,50,00,000 విలువైన నోట్లు మాయమైనట్లు రాయ్ భావించారు.
ఆయన ఇచ్చిన ఈ సమాచారం ఆధారంగానే నోట్లు మాయమైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
“ఒక వార్త చదివాను. ఇది నిజమా అబద్ధమా అనేది పరిశీలించాలి. కొన్ని లక్షల కోట్ల నోట్లను ముద్రించగా, ఆ నోట్లు ఆర్‌బీఐకి చేరలేదనేది వార్త సారాంశం. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ తక్షణమే జోక్యం చేసుకుని ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి'' అని మహారాష్ట్ర ఎన్సీపీ నేత అజిత్ పవార్ కోరారు.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
నాసిక్ ప్రెస్ నుంచి వివరణ
ఈ విషయంపై నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి జగదీష్ గాడ్సే వివరణ ఇచ్చారు.
ముద్రించిన నోట్ల లెక్కలు కేవలం ఒక ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఉండటంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు.
ఎందుకంటే చాలాసార్లు నోట్ ప్రెస్ ఫ్యాక్టరీలు ఆర్‌బీఐ ఆదేశాలనుసారం నోట్లను ప్రింట్ చేస్తాయి. ఆర్థిక సంవత్సరం చివరలో అంటే మార్చి 31న అన్ని కరెన్సీ నోట్లను కలిపి పంపుతాయి.
“కానీ ఈ నోట్లు సంబంధిత ఆర్‌బీఐ చెస్ట్‌లకు చేరే సమయానికి, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఆర్‌బీఐ నోట్లను స్వాధీనం చేసుకునే వరకు కొన్నిసార్లు 5-6 రోజులు పడుతుంది. కాబట్టి, ఈ నోట్లను కొత్త ఆర్థిక సంవత్సరంలో లెక్కిస్తారు. గణాంకాలలో వ్యత్యాసం ఉండటానికి ఇదే కారణం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నోట్ల గణాంకాలను లెక్కిస్తే తేడా కనిపించదు'' అని జగదీష్ తెలిపారు.
ఈ గణాంకాలు 2015-16కి సంబంధించినవని జగదీష్ అన్నారు.
''రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు గత రెండేళ్లుగా మార్చి 15లోపు ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నోట్లను ఆర్‌బీఐకి పంపించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ఆ ఆర్థిక సంవత్సరానికి బ్యాలెన్స్ షీట్ తయారుచేయడానికి ఆర్‌బీఐకి సమయముంటుంది. దీంతో ఆ ఆర్థిక సంవత్సరం గణాంకాల్లో ఎలాంటి తేడా కనిపించదు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘క్యూబా ప్రభుత్వమే మా నాన్నను చంపేసింది’ – ఫిడెల్ క్యాస్ట్రో పాలనను వ్యతిరేకించిన నేత కుమార్తె ఆరోపణ
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














