మాయోన్: ‘బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని చూసిన ప్రతిసారీ అది ఆగిపోవాలని ప్రార్థిస్తాను’

ఫొటో సోర్స్, BBC/ VIRMA SIMONETTE
గుడారాల నుంచి పచ్చి చేపల వాసన వస్తోంది. అక్కడ ఉండే మానెట్ ఆక్సాల్స్ అనే మహిళ చిప్స్, స్వీట్ బ్రెడ్‌లను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
అది దాదాపు మధ్యాహ్న సమయం. గుడారాల్లో లంచ్ టైమ్ హడావిడి మొదలైంది.
నిజానికి వారంతా ఫిలిప్పీన్స్‌లోని మాయోన్ అగ్ని పర్వతానికి సమీపంలోని ఒక గ్రామంలో ఉండాల్సిన వారు. కానీ, ఇప్పుడు గుడారాలలో ఆశ్రయం పొందుతున్నారు.
ఫిలిప్పీన్స్‌లోని ఆల్బే ప్రావిన్స్‌కు చెందిన వేలాది మంది చాలా కాలంగా ఇలా చిన్నచిన్న గుడారాలలో ఉంటున్నారు. దీనికి కారణం మాయోన్ అగ్నిపర్వతం.
జీవితమంతా మాయోన్ నీడలో గడిపిన వారికి వారాలు, నెలల తరబడి సహాయ కేంద్రాల్లో బతకడం అలవాటుగా మారింది.
మానెట్ ఆక్సాల్స్, తన చిన్న కిరాణ దుకాణాన్ని కూడా ఈ గుడారానికి తరలించారు.
40 ఏళ్ల మానెట్ ఆక్సాల్స్, తన జీవితకాలంలో అయిదుసార్లు షెల్టర్లలో నివసించారు.
వారం రోజుల క్రితమే ఆమె ఈ గుడారానికి వచ్చారు. మాయోన్ అగ్నిపర్వతం త్వరలోనే శాంతిస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అది శాంతిస్తే తమ కుటుంబం మళ్లీ తమ ఊరికి వెళ్లిపోవచ్చని ఆమె భావిస్తున్నారు.
"మేం పేదవాళ్లం. మా గ్రామాన్ని పూర్తిగా వదిలేయలేం’’ అని బీబీసీతో ఆమె చెప్పారు.
గినోబాటన్ అనే పట్టణం నుంచి వారు ఆశ్రయం కోరుతూ ఈ గుడారాలకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆమె అయిదేళ్ల కూతురు జ్వరంతో ఉన్నారు.
‘‘మా ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. మాయోన్ పేలుళ్లు మాత్రమే మాకున్న ప్రధాన సమస్య. అది ప్రకృతి వైపరీత్యం. మా గ్రామాన్ని తాత్కాలికంగా విడిచి వెళ్లడం తప్ప మేమేం చేయలేం’’ అని ఆమె చెప్పారు.
అగ్నిపర్వతం నుంచి వెలువడే బూడిదను నిరంతరం పీల్చడం వల్ల తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని ఆమె ఆందోళన చెందారు.
షెల్టర్‌లో నీటి కొరతతో పాటు విద్యుత్ కోతలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
"వీటిని భరించడం తప్ప మేమేం చేయగలం?" ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, BBC/VIRMA SIMONETTE
'పర్వతం నుంచి పడే రాళ్లను చూసి భయపడలేదు'
మరొక షెల్టర్‌లో నివసించే బెంజమిన్ నాసోల్ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. గ్రామంలో వదిలేసి వచ్చిన పందుల ఫారమ్ గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు. ప్రతీ రాత్రి తన గ్రామమైన కమాలిగ్‌లో వెళ్లి అక్కడ కొన్ని గంటల పాటు గడుపుతారు. తన పశువులను దొంగల నుంచి కాపాడుకోవడంతో పాటు వాటికి ఆహారం ఏర్పాటు చేయడం కోసం ఆయన రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు.
"నేను ఈ పనికి అలవాటు పడిపోయాను’’ అని 53 ఏళ్ల బెంజమిన్ బీబీసీతో చెప్పారు. మయోన్ అగ్ని పర్వత బిలం నుంచి వచ్చే రాళ్లను చూసి తాను భయపడలేదని ఆయన తెలిపారు. తన జీవితంలో ఆయన మూడోసారి షెల్టర్‌లో నివసిస్తున్నారు.
"అలసిపోయినా, ఆరోగ్యంగా లేకపోయినా కూడా గ్రామానికి వెళ్లి అక్కడి బాధ్యతలను చూసుకోవాలి. అవి పూర్తి చేసి మళ్లీ ఇక్కడి పునరావాస కేంద్రంలోని గుడారాలకు రావాలి. ఇక్కడే నా కుటుంబం ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
మాయోన్ బిలం వద్ద తరచుగా భూకంపాలు, రాక్‌ఫాల్‌లను శాస్త్రవేత్తలు గమనించారు. మాయోన్ మరింత చురుకుగా మారిందని జూన్ ప్రారంభంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు సంభావ్యతను కొలిచే పరికరంపై మాయోన్ విస్ఫోటన స్థాయి లెవల్ 3 వద్ద ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
దీనర్థం, మాయోన్ అగ్నిపర్వతం నెమ్మదిగా విస్పోటం చెందుతోంది.
కొండపై ఉన్న అబ్జర్వేటరీ నుంచి అగ్నిపర్వత శాస్త్రవేత్త పాల్ అలానిస్ మాయోన్‌ను పర్యవేక్షిస్తున్నారు. దాన్నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా హెచ్చరికలను ఆయన జారీ చేస్తారు. ఆ హెచ్చరికల ఆధారంగా ఆ ప్రాంతం నుంచి ఎంత మంది ఖాళీ చేయాల్సి ఉంటుందో నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, BBC/ VIRMA SIMONETTE
ఏప్రిల్ నుంచి కదులుతోంది
జూన్ 8న లెవెల్ 3 హెచ్చరికలను ప్రకటించినప్పుడు, 13,000 మందికి పైగా ప్రజలను షెల్టర్లకు తరలించారు. తర్వాతి రోజుల్లో మరింత మందిని ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు పంపించారు.
కంటికి కనిపించని వాటిని గుర్తించడం కోసం, భూగర్భంలో కదలికలను కొలవడానికి అలానిస్ సిస్మోమీటర్‌ను వాడతారు.
2018లో చివరిసారిగా లావా ఉబికింది. అప్పుడు మాయోన్ బిలం మీద లావా గోపురంలా పేరుకుపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ గోపురం పైకి కదులుతోంది. మాయోన్ చురుగ్గా మారుతుందని చెప్పడానికి ఇదే సంకేతం అని ఆయన వివరించారు.
గత వారం అబ్జర్వేటరీలో చాలా ఆందోళన నెలకొంది.
"ఏ సమయంలోనైనా, అగ్నిపర్వతం బద్దలు కావొచ్చు. ప్రజలను అక్కడ నుంచి బయటకు తీసుకురావాలి’’ అని బీబీసీతో అలానిస్ అన్నారు.
అగ్ని పర్వత శాస్త్రవేత్తల మరో పని ఏంటంటే, మాయోన్‌లో ఏం జరుగుతుందో ప్రాంతీయ గవర్నర్, విపత్తు ప్రతిస్పందన అధికారులకు వివరించాలి. తద్వారా వారు తదనుగుణంగా సన్నద్ధం అవుతారు.
నెమ్మదిగా కదిలే లావా ప్రవాహాలు రెండు విషయాలను సూచిస్తాయని అలానిస్ అన్నారు. ఒకటేమో, విస్ఫోటనం చెందడానికి తగినంత వేడివాయువు అగ్నిపర్వతంలో లేకపోవడం. రెండోది, కరిగిన శిలల వల్ల మార్గం మూసుకుపోయి వేడి వాయువు ఉపరితలంపైకి వెళ్లకుండా నిరోధించడం.
"ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఇతర కారణాలను అన్వేషించాలి. ఇప్పటికిప్పుడే వాటి గురించి నేనేం చెప్పలేను. ప్రస్తుతానికైతే, అగ్నిపర్వతం ఎప్పుడు పేలుతుందో అంచనా వేసే సాంకేతికత అందుబాటులో లేదు" అని ఆయన చెప్పారు.
ఫిలిప్పీన్స్‌లో 24 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC/ VIRMA SIMONETTE
'దశాబ్దాలుగా అగ్నిపర్వతాన్ని చూస్తున్నా'
గిన్నిస్ రికార్డుల ప్రకారం, మాయోన్ ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన శంఖాకార అగ్నిపర్వతం.
బిలం మీద భగభగ మండే ఎర్రటి లావా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
డేంజర్ జోన్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం తప్పనిసరి. అయితే, తమ ఇళ్లను విడిపెట్టడానికి నిరాకరించేవారు కూడా ఉన్నారు. అందులో 72 ఏళ్ల రోజర్ అసిలో కూడా ఒకరు.
గినోబాటన్ గ్రామస్థులను షెల్టర్లకు తరలించే లారీలో ఎక్కకుండా అసిలో ఒక చెట్టు వెనుక దాక్కున్నారు.
దశాబ్దాలుగా అగ్నిపర్వతాన్ని చూస్తున్నానని, అది ఎప్పుడు పేలుతుందో తెలుసుకునే జ్ఞానం తనకు ఉన్నట్లు అసిలో చెప్తారు. అసిలో బాగోగులు చూసేందుకు ఆయన కుమారుడు కూడా అక్కడే ఉండిపోయారు.
తన రెండు పందులను చూసుకోవడానికి ఇష్టపడతానని అసిలో చెప్పారు. అవి తన స్నేహితునికి చెందిన పశువులని, వాటి సంరక్షణ కోసం ఫీజు కూడా చెల్లించాడని ఆయన తెలిపారు.
రాత్రి వేళ్లలో తన ఇంటి వెలుపల వెదురు బెంచ్‌పై కూర్చుని మెరుస్తున్న లావా ప్రవాహాలను చూస్తానని ఆయన చెప్పారు.
"అగ్నిపర్వతం చిమ్ముతున్న లావాను చూసిన ప్రతిసారీ, అది ఆగిపోవాలని నేను ప్రార్థిస్తాను’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














