ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
- రచయిత, ఆడమ్ టేలర్
- హోదా, ది కన్వర్జేషన్
మీరు సౌకర్యవంతంగా కూర్చున్నారా? ఒకసారి ఆగండి, మీరెలా కూర్చున్నారో చూసుకోండి. మీ కాళ్లు ఏం చేస్తున్నాయి? కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారా? కుడివైపు లేదా ఎడమవైపు కాళ్లు క్రాస్ చేసి కూర్చున్న వారిలో మీరు ఒకరా?
62 శాతం మంది ప్రజలు తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుంటారు. 26 శాతం ప్రజలు ఎడమవైపు క్రాస్ చేస్తుంటారు. 12 శాతం మంది ఎటు వీలైతే అటు క్రాస్ చేస్తుంటారు.
సాధారణంగా రెండు రకాల విధానాల్లో మనం చెయిర్‌లో కూర్చుంటూ, కాళ్లను ఒకదాని మీద మరొకటి వేస్తూ ఉంటాం. ఒకటి మోకాలిపై మరో మోకాలిని క్రాస్ చేయడం, రెండు చీలమండ దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం.
కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం సౌకర్యవంతమైనప్పటికీ, మీ ఆరోగ్యానికి, భంగిమకు ఇది ప్రమాదకరమా?
అయితే, దీనిపై టెస్ట్‌లు ఏం చెబుతున్నాయో మనం ఒకసారి చూద్దాం..
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలొస్తాయి. ఒకదానితో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుంది.
అంతేకాక, కాలు, మోకాలు, పాదం వంటి శరీరంలోని కింద భాగాలకు రక్తనాళాల ద్వారా జరిగే రక్త సరఫరా వేగంలో మార్పులు వస్తాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
చీలమండ దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికమవుతుంది.
దీన్ని అధిగమించేందుకు గుండె పనిచేస్తూ ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
మీ శరీరంపై ప్రభావమెంత?
క్రాస్ లెగ్స్‌తో ఒకవేళ సుదీర్ఘ కాలం, తరుచూ కూర్చుంటూ ఉంటే కండరాల పొడవు, పెల్విక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తుంటాయి.
అంతేకాక, క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చోవడంతో ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వారిలో ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
మెడ ఎముకల్లో మార్పులు రావడంతో తల భాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి.
దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ఇలా కూర్చున్నప్పుడు శరీరంలో ఒక వైపు, మరొక భాగంతో పోలిస్తే బలహీనంగా మారుతుంది.
అలాగే, పొత్తి కడుపు కండరాల్లో, వెన్నెముక కింద భాగంలో కూడా ఇదే రకమైన మార్పులను మనం చూడొచ్చు.
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల మన భంగిమలో మార్పులు వస్తాయి. ఒత్తిడి పెరుగుతుంది.
ఒకవైపు పిరుదుల కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భారం పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి, బలహీనంగా మారుతుంది.
ఎక్కువ సేపు క్రాస్ లెగ్స్‌తో కూర్చోవడం వల్ల గూని వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాక, మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలో మారే ప్రమాదముంది.
కాలు మీద కాలు వేసుకుని గంటల పాటు కూర్చోవడం వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను, ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు.
అయితే, చాలా కేసుల్లో ఇది కేవలం స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని రుజువైంది.
సాధారణంగా శరీరంలో ఉండే ఉష్ణోగ్రతల కంటే తక్కువగా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల సెల్సియస్ మధ్యలో టెస్టికల్స్(వృషణాల) ఉష్ణోగ్రతలు ఉండాలి.
కూర్చోవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్‌కి పెరుగుతాయి. అయితే, క్రాస్ లెగ్ స్థితిలో కూర్చుంటే ఈ టెస్టికల్స్ ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.
టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే, మహిళలలో, పురుషుల్లో మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన మార్పులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పురుషులతో పోలిస్తే మహిళలు తేలికగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోగలుగుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
అయితే, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కొందరికి ప్రయోజనకరమని కూడా పరిశోధనలు సూచించాయి.
ఒక కాలు కంటే మరో కాలు పొడవుగా ఉన్న వారిలో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చుంటే పొత్తి కడుపులో ఇరువైపుల పొడవు సర్దుబాటు కావడం మాత్రమే కాక, అమరికలు కూడా మెరుగుపడ్డాయని 2016లో ఒక అధ్యయనం గుర్తించింది.
క్రాస్ లెగ్ స్థితిలో కూర్చోవడం వల్ల కొన్ని కండరాల పని భారం తగ్గడాన్ని మనం గమనించవచ్చు.
ముఖ్యమైన కండారులు ఉపశమనం పొందేందుకు, అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందేందుకు ఇది సాయం చేస్తుంది.
వెన్నెముక, కాళ్ల మధ్యలో బరువును నిర్వహించే సాక్రోలియాక్ జాయింట్స్ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెప్పాయి.
అయితే, యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ప్రజలు సాధారణంగా కాలు ముడుచుకునే నేలపై కూర్చోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చెయిర్‌లో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చోవడం వల్ల వచ్చే కొన్ని సమస్యలు, ఈ విధంగా ఎక్కువ సమయం పాటు కూర్చోవడం వల్ల కూడా వస్తున్నాయా? అన్న దానిపై చాలా తక్కువ డేటానే ఉంది.
ఇప్పటికే కీళ్ల నొప్పులున్న వారితో పాటు చాలా మందికి యోగా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
అయితే, ఎంత వీలైతే అంత కాలు మీద కాలు వేసుకుని కూర్చోకుండా ఉంటే మంచిది.
కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఇతర సమస్యలకు కూడా దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చోనే జీవన విధానాన్ని అలవరపరుస్తుందని పేర్కొన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ సమయం పాటు ఒకే విధంగా కూర్చోకుండా ఉంటే మంచిది. ఎప్పుడూ చురుకుగా ఉండేలా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















