డెక్కన్ క్రానికల్ పూర్వ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని ఈడీ ఎందుకు అరెస్టు చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డెక్కన్ క్రానికల్ పూర్వ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. తరువాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
ఆయనతో పాటు కంపెనీ ప్రమోటర్, ఆడిటర్ అయిన పీకే అయ్యర్, మణి ఊమెన్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.
కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో వారు అరెస్టు అయ్యారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయల అప్పుతిరిగి చెల్లించనందుకు, ఆ అప్పు కోసం తప్పుడు పత్రాలు ఇచ్చారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. మొత్తం ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
అసలేంటీ కేసు?
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కంపెనీ తన వ్యాపార అవసరాల కోసం వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది. ఆ అప్పు సక్రమంగా చెల్లించలేదు. ఆ అప్పుకోసం అధిక లాభాలు చూపించిన లెక్కలు సమర్పించారనేది ఆరోపణ.
తమ బాకీ చెల్లించడం లేదని 2013 జూలైలో కెనరా బ్యాంకు, డీసీ గ్రూపుపై ఫిర్యాదు చేసింది. 2013 జూలైలో సీబీఐ వెంకట్రామిరెడ్డిపై మొదటి చార్జిషీటు వేసింది.
ఆ తరువాత మొత్తం ఆరు చార్జిషీట్లు ఆయనపై నమోదు అయ్యాయి. కెనరా బ్యాంకుకు ఆయన 1,230 కోట్ల వరకూ చెల్లించాలని ఆ సంస్థ తన ఫిర్యాదుల్లో రాసింది.
ఈడీ ఆరోపణల ప్రకారం, మొత్తం 16 సంస్థలకు కలపి 3,600 కోట్ల రూపాయల వరకూ వెంకట్రామిరెడ్డి చెల్లించాల్సి ఉంది.
ఆయనపై సీబీఐ ఐపీసీ 420, 120 బీ, 468, 471 సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఈ కేసుల్లోనే ఆయన 2015 ఫిబ్రవరిలో మొదటిసారి అరెస్టయి తరువాత బెయిల్ పై వచ్చారు.
2020 నుంచీ ఈడీ ఆయన ఆస్తులు ఎటాచ్ చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ దాదాపు 360 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
‘‘ఆయన తీసుకున్న రుణాల్లో ఎక్కువ భాగం డెక్కన్ చార్జర్స్ నిర్వహణకు మళ్లించారని’’ ఈడీ ఆరోపించింది. అప్పు కోసం ఆదాయం పెంచి చూపించారని, ఉన్న అప్పులు దాచారన్న అభియోగాలు ఆయనపై ఉన్నాయి.
తాజాగా విచారణకు సహకరించడం లేదంటూ ఆయనను అరెస్టు చేయగా, తాను విచారణకు సహకరిస్తున్నాననీ, అయినప్పటికీ నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్టు చేశారనీ వెంకట్రామి రెడ్డి కోర్టులో వాదించారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ వెంకట్రామి రెడ్డి?
తండ్రి నుంచి వారసత్వంగా వెంకట్రామిరెడ్డికి పత్రికా వ్యాపారం వచ్చింది. ఆయన సోదరుడు వినాయక రవిరెడ్డి కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు.
డెక్కన్ క్రానికల్ పత్రికను హైదరాబాద్‌కు చెందిన తమిళుడు రాజగోపాల మొదలియార్ ప్రారంభించారు. ఆయన దగ్గర నుంచి ఆ పత్రికనునెల్లూరు జిల్లాకు చెందిన వెంకట్రామిరెడ్డి తండ్రి తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొన్నారు.
చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ఎంపీగా ఉండగానే మరణించారు. దాంతో ఆయన స్థానంలో వెంకట్రామిరెడ్డి నామినేట్ అయి రెండేళ్ల పాటూ ఎంపీగా కొనసాగారు. ఆ తరువాత రాజకీయాల్లో కొనసాగలేదు. 1993 - 1995 మధ్య వెంకట్రామిరెడ్డి ఎంపీగా ఉన్నారు.
చదువుకునే రోజుల నుంచీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రిక ఆఫీసుకు వెళ్తుండేవారు. తన హయాంలో డెక్కన్ క్రానికల్‌ను బాగా విస్తరించారు.
ఆంధ్రభూమి దిన పత్రిక, వార పత్రికలతో పాటు కొత్తగా ఏషియన్ ఏజ్ పేరుతో మరో అంతర్జాతీయ ఇంగ్లిష్ పత్రిక, ఫైనాన్షియల్ క్రానికల్ అనే వ్యాపార పత్రికలను ప్రారంభించారు.
వీటితో పాటూ ఒడిస్సీ పేరుతో బుక్స్, స్టేషనరీ, గిఫ్ట్స్ షాపుల చైన్ ప్రారంభించారు. వీటి కంటే ముందు హోటెల్స్, ఇతర వ్యాపారాల్లో కూడా ఉన్నప్పటికీ, ప్రధానంగా డెక్కన్ క్రానికలే వెంకట్రామిరెడ్డి వ్యాపారాలకు కీలకంగా ఉండేది. దాని మీదే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు.
వెంకట్రామిరెడ్డి గుర్రప్పందాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆయనకు సొంతంగా అనేక గుర్రాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటూ ఇతర రేస్ కోర్సుల్లో ఆయన గుర్రాలు పోటీల్లో పాల్గొనేవి.

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్ వ్యాపారం కొంప ముంచిందా?
వెంకట్రామిరెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి కూడా తండ్రి వ్యాపారాల్లో చురుగ్గా భాగం పంచుకున్నారు. ఒకప్పటి ఐపీల్ టీం డెక్కన్ చార్జర్స్ వ్యవహారాలు చూశారు. స్వయంగా డీసీ పత్రికలో పనిచేశారు.
నిజానికి, 2008 వరకూ వెంకట్రామిరెడ్డికి వ్యాపారాల్లో పెద్ద కుదుపులు రాలేదని చెబుతారు.
అప్పుడే, ఐపీఎల్ ప్రారంభం కావడంతో, ఆ రంగంలోకి అడుగపెట్టారాయన. డెక్కన్ చార్జర్స్ టీం ప్రారంభించారు. అక్కడ నుంచి మొత్తం మారిపోయింది.
‘‘వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. ఏ ఉద్యోగినీ తొలగించాలనే భావన ఉండేది కాదు. తెలుగు పత్రికల్లో ఎవరూ ఇవ్వనంత జీతాలు, ఇంగ్లిష్ పత్రికలతో సమాన జీతాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం జర్నలిస్ట్ వేజ్ బోర్డు అమలు చేసిన పత్రిక ఆంధ్రభూమి. సిబ్బందిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలవెన్సులన్నీ పక్కాగా ఇచ్చేవారు. కానీ, ఎప్పుడైతే ఆయన డెక్కన్ క్రానికల్ నుంచి వేరే వ్యాపారాలపైకి, ముఖ్యంగా క్రికెట్‌పైకు తన దృష్టిని మరల్చారో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయన పత్రికపై శ్రద్ధ పెట్టకపోవడంతో, పెద్ద స్థానాల్లో ఉన్న కొందరు సిబ్బంది అవినీతి చేసి ఇంకా నష్టం చేకూర్చారు’’ అని బీబీసీతో చెప్పారు ఆంధ్రభూమి పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి.
నిజానికి వెంకట్రామిరెడ్డి వ్యాపారాల్లో డెక్కన్ క్రానికల్ కింగ్ అనడం అతిశయోక్తి కాదు. ఒక నగరంలో ప్రచురితమయ్యే పత్రిక స్థాయి నుంచి ఒక దశలో దక్షిణాదిలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లిష్ పత్రికగా ఎదిగింది డీసీ.
‘‘ఆయన ఫైనాన్స్ విషయాల్లో ఇతరులపై ఆధారపడేవారు. వారంతా ఆయనను తప్పుదోవ పట్టించారు. వెంకట్రామిరెడ్డి వ్యాపార సూక్ష్మాలను పెద్దగా పట్టించుకోలేదు. అది ఆయనకు చాలా నష్టం చేసింది. లోన్లు, వాటిని మళ్లించడాలు.. ఇవన్నీ ఆయన చుట్టూ చేరిన కొందరు ఇచ్చిన తప్పుడు సలహాలు. అవే ఆయన్న దెబ్బతీశాయి’’ అని డీసీ గ్రూపు మేనేజ్మెంటులో పనిచేసిన సీనియర్ ఎగ్జిగ్యూటివ్ ఒకరు బీబీసీతో అన్నారు.
లోన్లు తీసుకోవడం, ఇతర పెట్టుబడుల వ్యవహారాల్లో వెంకట్రామిరెడ్డితో పాటూ పీకే అయ్యర్ కీలక పాత్ర పోషించారని చెబుతారు.
ప్రస్తుతం, డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలు, వాటి యాజమాన్య సంస్థ అయిన డీసీహెచ్ఎల్ సాంకేతికంగా వెంకట్రామిరెడ్డి చేతుల్లో లేదు. సమగ్ర కమర్షియల్ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది.
ఇవి కూాడా చదవండి:
- తేజస్విని రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- ఉత్తర కొరియాలో ఆకలి చావులు, తిండి లేక కొండల్లోకి వెళ్ళి ఆత్మహత్యలు
- ఉత్తరాఖండ్ వరదలు: ‘నా భార్య నా కళ్ల ముందే నదిలో కొట్టుకుపోయింది...’
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














