ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....

మేవ గెన్నం

ఫొటో సోర్స్, ERIC FOUGERE/CORBIS VIA GETTY IMAGES

    • రచయిత, అరోర్ లాబోరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

క్యాన్సర్ మందులు, ఇతర నకిలీ ప్రోడక్ట్స్‌ కోసం తమ ఫాలోయర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఆన్‌లైన్ స్కామ్‌ల తతంగానికి ఫ్రాన్స్ బ్రేకులు వేసింది.

ఈ మోసాలను అరికట్టే విధంగా ఆ దేశం కొత్త చట్టం తీసుకొచ్చింది.

ఇక నుంచి ప్రమాదకరమైన సర్వీసులు లేదా తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు ప్రచారం చేసే ఆన్‌లైన్ కంటెంట్ సృష్టికర్తలకు ఈ కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానాలు లేదా రెండేళ్ల జైలు శిక్ష వరకు విధించే అవకాశం ఉంది.

ఫ్రాన్స్‌కు చెందిన ఆడ్రీ ఇద్దరు పిల్లల తల్లి. ఆమె ఇన్‌ఫ్లుయెన్సర్‌ల శక్తికి చాలా ఆశ్చర్యపోయారు. వారిలో కొందరు రియాలిటీ టీవీ షోలలో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ల కుట్రలు బయటపెట్టడానికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు.

" మీరు చేస్తున్నది పూర్తిగా తప్పు. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులను మీరు అలా చేయవద్దు. మోసపూరిత వెబ్‌సైట్‌ల నుంచి ప్రోడక్టులు కొనుగోలు చేయించి, ఫాలోయర్లను రిస్కులో పడేయడం కరెక్టు కాదు" అని అంటారు ఆడ్రీ.

క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయంటూ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్‌లను ఒక మాజీ రియాలిటీ టీవీ స్టార్ ప్రచారం చేయడాన్ని చూసి ఆమె తన గళాన్ని వినిపించారు.

తప్పుదారి పట్టించే, చట్టవిరుద్ధమైన ప్రకటనలను బహిర్గతం చేయడమే లక్ష్యంగా ఆమె సోషల్ మీడియా పేజీ యువర్ స్టార్స్ ఇన్ రియాలిటీ ఏర్పాటుచేశారు.

సామాన్య వ్యక్తులు ఈ స్కామ్‌ల బారిన పడకుండా నిరోధించడంలో సహాయపడేలా ఆమె సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్‌ల స్కామ్‌‌కు గురైన బాధితులు కొందరు చనిపోవడానికి కూడా ప్రయత్నించారని ఆ బాధితులకు సాయం చేయడానికి ఏర్పడిన సంస్థ ఒకటి తెలిపింది.

"చాలామంది విడాకులు తీసుకున్నారు, వారి ఇళ్లను కోల్పోయారు, ఉద్యోగం పోయింది, నిరాశలో పడ్డారు" అని ఆ సంస్థ (ఏవీఐ) ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

లూయిస్ ఆబరీ

ఫొటో సోర్స్, LOUISE AUBÉRY/INSTAGRAM

ఫొటో క్యాప్షన్, లూయిస్ ఆబెరీ

పౌరులకు ఈ చట్టం అంకితం: ఫ్రెంచ్ ఎంపీ ఆర్థర్

ఈ తప్పుడు వ్యాపార ప్రకటనల కారణంగా బాధితులలో కొందరికి దాదాపు రూ. 45 లక్షల కంటే ఎక్కువ నష్టం కలిగిందని ఫ్రెంచ్ ఎంపీ ఆర్థర్ డెలాపోర్టే అన్నారు.

ప్రజలు సగటున ఒక్కొక్కరు రూ.1.3 లక్షలు కోల్పోయారని సూచించే ఏవీఐ గణాంకాలను ఆర్థర్ ఉదహరించారు.

"ఈ స్కామ్‌ బాధితులకు, అధికారులను అప్రమత్తం చేయడానికి పనిచేసిన పౌరులకు ఈ చట్టం అంకితం" అని ఫ్రాన్స్ పార్లమెంటు ఎగువ సభలో ఎంపీ పునరుద్ఘాటించారు.

ఇది ప్రజారోగ్య సమస్య అని ఆడ్రీ బీబీసీతో అన్నారు.

"మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, పెద్ద చికిత్స లేదా మరణం నుంచి మిమ్మల్ని రక్షించగల ఏదో ఒకటి ఉందని విశ్వసిస్తారు.

ఆ కారణంగా ప్రజలు తమ చికిత్సను ఆపి, ఆ ఫుడ్ ప్రోడక్ట్ వాటిని నయం చేయగలదని భావించి పాటిస్తే, మీ చికిత్స ఆలస్యం కావొచ్చు" అని అన్నారు.

గతేడాది క్రిప్టో గౌవ్ పేరుతో ఒక యూట్యూబర్ దాదాపు 300మంది నుంచి రూ. 35 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని పార్లమెంట్ సభ్యుడు అరేలియన్ టాచే నేషనల్ అసెంబ్లీకి తెలిపారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై క్రిప్టో గౌవ్‌లో తప్పుడు సలహాలు ఇచ్చారు. వారి నిధులను తనకు అప్పగించాలంటూ ఫాలోయర్లను కోరారు. అనంతరం మోసం చేశారు.

సీపీఎఫ్ అని పిలిచే ఫ్రెంచ్ వ్యక్తిగత శిక్షణ, విద్యా పథకాన్ని మరొక స్కామ్ లక్ష్యంగా చేసుకుంది. వృత్తిపరమైన శిక్షణను పొందాలని చూస్తున్న వ్యక్తులకు ఉపయోగపడే వ్యవస్థ అది.

2021లో సీపీఎఫ్ మాదిరి నకిలీ కోర్సులను ప్రచారం చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు చెల్లించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. చెల్లింపుల విలువ రూ.386 కోట్లుగా పేర్కొంది.

పేమెంట్ చేసినా కొన్ని వస్తువులు డెలివరీ కాలేదు. కొంతమందికి హాలీడే ప్యాకేజ్ లు అందలేదు. జుట్టు రాలడానికి దారితీసే నిషేధిత పదార్థాలున్న నకిలీ షాంపులను కూడా ఇలాగే అమ్ముకున్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రశ్నిస్తే, పరువు నష్టం దావా వేస్తారు'

ఫ్రెంచ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కాంపిటీషన్, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫ్రాడ్ కంట్రోల్ 2023 జనవరిలో 60 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వారి ఏజెన్సీలపై జరిపిన అధ్యయనంలో 60 శాతం ప్రకటనలు వినియోగదారుల హక్కులను పట్టించుకోలేదని తేలింది.

" నా వరకు ఇవి మాఫియా లాంటివి" అని యూట్యూబ్‌లో ట్విచ్ షో ఏజేఏని స్థాపించిన ఆన్‌లైన్ కంటెంట్ సృష్టికర్త సామ్ జిరా అన్నారు.

తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఆయన గత రెండేళ్లుగా అవగాహన పెంచుతున్నారు. ఇది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వారి ఏజెంట్లు, టీవీ ప్రొడక్షన్ కంపెనీలకు కోపం తెప్పిస్తుంటుందని బీబీసీతో సామ్ చెప్పారు.

ఆయన చాలా ఏళ్లు ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఇంటర్వ్యూ చేశారు. కొన్ని ప్రశ్నలు అడగకూడదని, అడిగితే తాము సెలబ్రెటీ హోదా కోల్పోవాల్సి వస్తుందని కూడా ఆయనను హెచ్చరించారు.

"మిమ్మల్ని దూరంగా పెట్టి, వారి పబ్లిక్ ఇమేజ్‌ను కాపాడుకోవాలనుకుంటారు. పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని భయపెట్టడానికి, నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు" అని సామ్ అంటున్నారు.

ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో పంథాను మార్చుకుంటున్నారు.

'పెద్ద శిక్షలు రాబోతున్నాయి'

మోసపూరిత ప్రకటనలపై తాము వినియోగదారుల వ్యవహారాల విభాగం నుంచి నిషేధాన్ని ఎదుర్కొన్నామంటూ చూపే అధికారిక ప్రకటనను పోస్ట్ చేయాలని ఆరుగురిని ఆదేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

"కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు నవ్వుకుంటున్నారు. సైమన్ [మరో ఇన్‌ఫ్లుయెన్సర్‌], నేను శిక్షకు గురయ్యాం. 30 రోజుల పాటు దీన్ని పోస్ట్ చేయమని అడిగారు. కానీ ఇది చిన్న శిక్ష, పెద్ద శిక్షలు రాబోతున్నాయి" అని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్చరించారు.

మేవా గెన్నమ్, రియాలిటీ-టీవీ స్టార్ తన సొంత మేకప్ బ్రాండ్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. ఆమె కొత్త చట్టాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్లు తన 3.3 మిలియన్ల మంది ఫాలోయర్లతో చెప్పారు.

లాబియాప్లాస్టీ సర్జరీని ప్రోత్సహించడం కోసం ఆమె 2021లో ప్రకటనలు చేశారు. ఆమె ఆరోగ్య నిపుణులు కాదు కాబట్టి అలా చేయడం చట్టవిరుద్ధం.

అయితే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించరు.

లూయిస్ ఆబెరీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సొంత పర్యావరణ-బాధ్యతాయుతమైన లోదుస్తుల బ్రాండ్‌ను ప్రోత్సహిస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పదం దొంగకు పర్యాయపదంగా మారడం సిగ్గుచేటని లూయిస్ ఆబెరీ అంటున్నారు.

"ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రజల జీవితాలపై చూపే ప్రభావాన్ని ప్రజలు గ్రహించలేదని నేను అనుకోను. నాకు కృతజ్ఞతలు తెలుపుతూ చాలా సందేశాలు వస్తున్నాయి." అని అన్నారు.

ఫ్రాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొత్త చట్టం నేపథ్యంలో ఎలా ప్రవర్తిస్తారనేది ఇపుడు ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)