కోతి పిల్లలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారు.. బీబీసీ ఇన్వెస్టిగేషన్‌లో బయపడిన దారుణమైన ఇంటర్నేషనల్ బిజినెస్

కోతులు
    • రచయిత, జోయెల్ గుంటర్, రెబెకా హెన్స్‌చ్కే, అస్టుడెస్ట్రా అజెంగ్రాస్ట్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మకాక్ జాతి కోతిపిల్లలను క్రూరంగా హింసించి వీడియో తీస్తారు. దాన్ని గ్రూపులో సభ్యులందరికీ పంపిస్తారు. వాళ్లు దాన్ని చూస్తూ ఆనందిస్తారు.

బీబీసీ ఏడాది పాటు జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో ఇలాంటి అనేక దారుణాలు బయటపడ్డాయి.

ఈ టార్చర్ గ్రూపుల్లో అమెరికా నుంచి ఇండోనేషియా వరకు అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్లు ఉన్నారు.

ఇదొక వ్యాపార వలయం. ఇండోనేషియాలో ముఠాలు పొడవు తోక ఉండే మాకాక్ కోతిపిల్లలను పట్టుకుని హింసిస్తాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల నుంచి డబ్బులిచ్చి మరీ ఈ హింస వీడియోలు తెప్పించుకుంటున్నారు.

ఇది మొదట యూట్యూబ్‌లో మొదలైంది. తరువాత ఈ గ్రూపులు టెలిగ్రామ్‌కు మారాయి.

ప్రస్తుతం పోలీసులు ఈ కస్టమర్ల వేటలో పడ్డారు. చాలామందిని అరెస్ట్ చేశారు కూడా.

హెచ్చరిక: ఈ కథనంలో మనసును కలచివేసే అంశాలు ఉండవచ్చు.

వీడియో క్యాప్షన్, కోతులను హింసిస్తూ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి సొమ్ము చేసుకుంటున్న గ్యాంగులు

బీబీసీ అండర్‌కవర్ ఆపరేషన్

ఈ టార్చర్ గుంపులను బయటపెట్టేందుకు బీబీసీ ఒక అండర్‌కవర్ ఆపరేషన్ చేపట్టింది.

టెలిగ్రాంలో ఒక ప్రధానమైన టార్చర్ గ్రూపులో బీబీసీ జర్నలిస్టులు మారు పేర్లతో చేరారు. అక్కడ వందలాది మంది చేరి హింస పద్ధతులను చర్చిస్తారు. ఎవరికి తోచిన వికృతమైన ఆలోచనలను వారు పంచుకుంటారు. ఇండోనేషియా, ఇతర ఆసియా దేశాల్లో ముఠాలకు పని అప్పగిస్తారు.

వారి లక్ష్యం ఒకటే.. పొడవాటి తోక గల మకాక్ కోతులను చిత్రహింసలు పెట్టి వీడియోలు తీయడం. ఒక్కోసారి హింసించి చంపేస్తారు కూడా.

ఇండోనేషియాలో కోతులను చిత్రహింసలు పెట్టే ముఠాలనూ, అమెరికాలో ఈ వీడియోల పంపిణీదారులు, కొనుగోలుదారులనూ బీబీసీ ట్రాక్ చేసింది. అంతర్జాతీయ చట్టాల ద్వారా వీరికి శిక్షపడే ప్రయత్నాలు చేసింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 మంది వ్యక్తులపై విచారణ జరుగుతోంది.

వీరిలో బ్రిటన్‌లో నివసిస్తున్న ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

వీళ్ళని కిందటి ఏడాది పోలీసులు అరెస్ట్ చేసి, విచారణలో విడుదల చేశారు. అమెరికాలోని ఒరెగాన్‌లో ఒక వ్యక్తిపై గతవారం నేరం నమోదైంది.

'ది టార్చర్ కింగ్'

ఫొటో సోర్స్, JOEL GUNTER/BBC

ఫొటో క్యాప్షన్, ది టార్చర్ కింగ్'

'కోతులను ఎలా హింసించాలో గ్రూపులో చర్చిస్తారు'

మైక్ మెకార్ట్నీ అమెరికాలో కీలకమైన వీడియో డిస్ట్రిబ్యూటర్. తెరపై ఆయన పేరు 'ది టార్చర్ కింగ్'. ఈ టార్చర్ గ్రూపుల గురించి బీబీసీతో మాట్లాడడానికి ఆయన అంగీకరించారు. తొలిసారి టెలిగ్రాంలో టార్చర్ గ్రూపులో చేరినప్పుడు ఎదురైన అనుభవాలను వివరించారు.

"వాళ్లకు అక్కడ ఓ పోల్ పెడతారు. సుత్తితో కొట్టి హింసించాలా? కటింగ్ ప్లైయర్ వాడాలా? అంటూ ఆప్షన్లు ఇస్తారు. దానికి అనుగుణంగా ఒక వీడియో విడుదల అవుతుంది. నేను చూసిన అత్యంత క్రూరమైన వీడియో అది" అని చెప్పారు మెకార్ట్నీ.

మెకార్ట్నీ అంతకుముందు మోటార్‌సైకిల్ గ్యాంగ్‌లో ఉండేవారు. కొంతకాలం జైల్లో ఉన్నారు. తరువాత ఈ కోతులను హింసించే ముఠాలో చేరారు. టెలిగ్రాంలో దీనికి సంబంధించిన వివిధ గ్రూపుల్లో చేరి హింస వీడియోల పంపిణీదారుడిగా మారారు.

"డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బుకు దీనికి తేడా లేదు. డ్రగ్ మనీ మురికి చేతులనుంచి వచ్చింది. ఈ డబ్బు రక్తం అంటిన చేతుల నుంచి వస్తుంది" అన్నారు మెకార్ట్నీ.

మరో ఇద్దరు కీలక అనుమానితులను కూడా బీబీసీ గుర్తించింది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విచారిస్తోంది.

ఒకరు అలబామాకు చెందిన 40లలో ఉన్న స్టేసీ స్టోరీ అనే మహిళ. గ్రూపులో ఆమె పేరు 'శాడిస్టిక్'. మరొకరు, 'మిస్టర్ ఏప్ ' అన్న పేరుతో కనిపించే రింగ్ లీడర్. భద్రత కారణాల దృష్ట్యా ఆయన అసలు పేరును గోప్యంగా ఉంచుతున్నాం.

మిస్టర్ ఏప్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "నాలుగు కోతోలను చంపానని, అనేక కోతులను హింసించానని" ఒప్పుకున్నారు. "అత్యంత క్రూరమైన" వీడియోలు తయారుచేయమని ముఠాలను చెప్పినట్టు అంగీకరించారు.

స్టోరీ ఫోన్‌ను డీహెచ్ఎస్ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకు అందులో వందల కొద్దీ టార్చర్ వీడియోలు కనిపించాయి. కొన్ని దారుణమైన వీడియోలను ఆమె కొనుగోలు చేశారన్న ఆధారాలూ దొరికాయి.

శాడిస్టిక్

విస్తుపోతున్న పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టోరీ ఈ నెలలో కూడా టార్చర్ గ్రూపులో యాక్టివ్‌గా కనిపించారు.

జనవరిలో అలబామాలో బీబీసీ ఆమెను కలిసినప్పుడు, తన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడడానికి ఇష్టపడలేదు.

ప్రస్తుతం డీహెచ్ఎస్ అయిదుగురు కీలక వ్యక్తులపై దర్యాప్తు జరుపుతోంది. వారిలో మిస్టర్ ఏప్, స్టేసీ స్టోరీ, మైక్ మెకార్ట్నీ ముఖ్యలు. వీళ్ల నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడవచ్చు.

డీహెచ్ఎస్ విచారణకు నాయకత్వం వహిస్తున్న స్పెషల్ ఏజెంట్ పాల్ వోల్పెర్ట్ మాట్లాడుతూ, ఈ రకమైన నేరప్రవృత్తిని చూసి దిగ్భ్రాంతి చెందామని చెప్పారు.

"ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడాతారా అని ఆశ్చర్యం వేసింది. ఈ విచారణలో భాగమైన అటార్నీలు, లాయర్లు, పోలీసులు అందరూ విస్తుపోయారు. ఇది నిజంగా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే అంశమే" అన్నారాయన.

"ఈ వ్యాపారంలో ఉన్న వాళ్లెవరూ తప్పించుకోలేరు. ఏదో ఒకరోజు కచ్చితంగా పట్టుకుంటాం" అని చెప్పారు.

ఇండోనేషియాలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెప్ యాది నూరుల్ హిక్మా అనే వ్యక్తిపై జంతు హింస, రక్షిత జాతిని విక్రయించారన్న అభియోగాలతో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎం అజిస్ రస్జన అనే మరో వ్యక్తికి జంతుహింస అభియోగంపై ఎనిమిది నెలలు శిక్షపడింది.

కోతులను టార్చర్ పెట్టడం

ఫొటో సోర్స్, ED OU/BBC

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా షేర్ అవుతున్న హింస వీడియోలు

టెలిగ్రాంలో, ఇప్పుడు ఫేస్బుక్‌లో కూడా కోతులను హింసిస్తున్న వీడియోలు దొరుకుతున్నాయి.

ఈ వీడియోలను షేర్ చేస్తున్న కొన్ని గ్రూపులను బీబీసీ కనిపెట్టింది. కొన్ని గ్రూపులలో 1,000 మందికి పైగా సభ్యులు ఉన్నారు. చాలా ఘోరమైన వీడియోలు షేర్ చేస్తున్నారు.

"చాలా దారుణమైన కంటెంట్ ఉన్న వీడియోలు చూశాం. ఇంతకుముందు అవి రహస్యంగా ఉండేవి. ఇప్పుడు బాహాటంగా ఫేస్బుక్‌ లాంటి వేదికల్లో షేర్ అవుతున్నాయి" అని యానిమల్ ఛారిటీ యాక్షన్ ఫర్ ప్రైమేట్స్ సహ వ్యవస్థాపకురాలు సారా కైట్ చెప్పారు.

కాగా, బీబీసీ తమ దృష్టికి తీసుకొచ్చిన గ్రూపులను తొలగించినట్టు ఫేస్బుక్ తెలిపింది.

"జంతు హింసకు సంబంధించిన కంటెంట్‌ను మా వేదికపై అనుమతించం. అలాంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తాం" అని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

టార్చర్ వీడియోలను తయారుచేసేందుకు పురికొల్పే వ్యక్తులను శిక్షించడానికి బ్రిటన్‌ చట్టాలను సులభతరం చేయాలని కైట్ కోరారు.

యూట్యూబ్‌ కూడా జంతు హింస ఉన్న కంటెంట్‌కు తమ వేదికపై చోటులేదని బీబీసీకి తెలిపింది. అలాంటి వీడియోలు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

"ఈ ఏడాదిలోనే వేలకొద్దీ వీడియోలను తొలగించాం. మా సంస్థ గ్రాఫిక్ పాలసీలకు విరుద్ధంగా, హింసతో కూడిన కంటెంట్ పోస్ట్ చేసిన అనేక చానెళ్ళను తొలగించాం" అని యూట్యూబ్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

టెలిగ్రాం కూడా దీనిపై స్పందించింది. తమ సంస్థ "వినియోగదారుల గోప్యత, భావప్రకటనా స్వాతంత్ర్యం వంటి మానవ హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది" అని పేర్కొంది. కానీ, తమ మోడరేటర్లు ప్రయివేటు గ్రూపులను కంట్రోల్ చేయలేరని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)