‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, కైరిన్ జేమ్స్
- హోదా, బీబీసీ కల్చర్
హాలీవుడ్ వార్ ఫిల్మ్ ‘‘ద కోవెనంట్’’ ఈ ఏడాది విడుదలైంది. దీనికి గై రిచీ దర్శకత్వం వహించారు.
ఇది ఒక భారీ యాక్షన్ సినిమా. ఈ సినిమాను చూస్తే మీరు యుద్ధం అనుభూతిని పొందొచ్చు.
2018లో అఫ్గానిస్తాన్‌లో మోహరించిన ఒక అమెరికా సార్జెంట్ జాన్ కిన్లీ పాత్రను ఈ సినిమాలో జేక్ గిల్లెన్‌హాల్ పోషించారు. జాన్ కిన్లీ ప్రాణాన్ని ఒక అఫ్గాన్ గైడ్ అహ్మద్ (దార్ సలీం) రక్షిస్తారు.
అమెరికా సైనికుడికి సహాయం చేసినందుకు అహ్మద్‌ను, అతని కుటుంబాన్ని తాలిబాన్లు టార్గెట్‌గా చేసుకున్నారని తన దేశం వెళ్లాక కిన్లీకి తెలుస్తుంది. అతన్ని రక్షించడానికి కిన్లీ తిరిగి అఫ్గానిస్తాన్‌కు వెళ్తారు.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తోనే ఈ సినిమాను తీశారు. అయితే, అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా యుద్ధాన్ని తెర మీద చూపించడానికి చేసిన ప్రయత్నాల్లో ఒకటి. 2021లో ఆఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరిగి వచ్చాయి.
వియత్నాం నుంచి అమెరికా వైదొలిగిన కొద్దికాలానికే 'డీర్ హంటర్' (1978), 'అపోకలిప్స్ నౌ' (1979) వంటి కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి.
గతంలో కంటే ఈ కాలంలో సినీ పరిశ్రమ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అమెరికా ఈ అంశంపై రాజకీయంగా చాలా విభేదిస్తోంది.
అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికాలోని రాజకీయ పార్టీలతో సహా అందరికీ భిన్న అభిప్రాయాలు ఉన్నట్లు ఇటీవలి ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్‌లో తేలింది.
అయితే, అమెరికా చరిత్రలో ఆఫ్గానిస్తాన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ, అక్కడి ప్రజలకు ఇది కీలక అంశం కాదు.
9/11 ఘటన తర్వాత తీవ్రవాదులను ఏరేయాలనే లక్ష్యంతో అమెరికా సైన్యం 2001లో ఆఫ్గానిస్తాన్‌లో ప్రవేశించింది. కానీ, ఇతర ప్రపంచ సంఘర్షణల నేపథ్యంలో అంటే ఇరాక్ యుద్ధం, ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ అంశం వెనుకబడింది.
అయితే, 'ది కోవెనంట్' సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది.

ఫొటో సోర్స్, Alamy
అఫ్గానిస్తాన్‌పై సినిమా
బైడెన్ ప్రభుత్వం రెండు వారాల కిందటే ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా దళాల ఉపసంహరణ, దేశాన్ని విడిచి వెళ్ళే ప్రయత్నంలో కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది అఫ్గాన్ పౌరుల మధ్య తొక్కిసలాటపై ఈ రిపోర్టు వివరిస్తుంది.
అమెరికా, బ్రిటిష్ బలగాలు దేశాన్ని విడిచిపెట్టిన కొన్ని వారాల్లోనే అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రజల హక్కులపై, ముఖ్యంగా మహిళలపై తాలిబాన్లు పరిమితులు విధించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్గాన్ శరణార్థుల సంక్షోభం ఏర్పడింది.
ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని 'ది కోవెనంట్' సినిమాను గై రిచీ తీశారు. అయితే ఈ సంక్షోభంపై రూపొందించిన, లేదా అమెరికన్ సైనికులకు అఫ్గాన్ గైడ్‌లు సహాయపడటం అనే ఇతివృత్తంపై వచ్చిన మొదటి సినిమా ఇదే కాదు.
నిజానికి, ఈ సినిమాతో పాటు ‘‘కాందహార్’’ మరో సినిమా కూడా చర్చల్లో నిలిచింది. అమెరికాలో మే 26న కాందహార్ విడుదలైంది.
గెరార్డ్ బట్లర్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం, ఒక సీఐఏ ఉద్యోగి తన సహాయకుడితో కలిసి అఫ్గానిస్తాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోవడం అనే నేపథ్యంగా సాగుతుంది.
‘‘మనల్ని రక్షించడానికి ఎవరూ రారు’’ అని బట్లర్ చెబుతుండటం ఈ సినిమా ట్రైలర్‌లో కనిపిస్తుంది. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒకరికోసం ఒకరు పోరాడతారని ఈ డైలాగ్ ద్వారా తెలుస్తుంది.
2021-22లో, సీబీఎస్ నెట్‌వర్క్ 'ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏఐ' అనే కామెడీ సిరీస్‌ను రూపొందించింది.
2016లో ‘విస్కీ టాంగో ఫాక్స్‌ట్రాట్’’ అనే కామెడీ సినిమాలో టీనా ఫే నటించారు. ఇందులో అఫ్గాన్ గైడ్ పాత్రలో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ ఓబోట్ నటించారు.
అయితే, ‘‘ద కోవెనంట్’’ సినిమాను మరింత రియలిస్టిక్‌గా తీశారు.
చాలా కాలంగా యుద్ధ నేపథ్యంలో సినిమా తీయాలని అనుకున్నట్లు రిచీ చెప్పారు.
"నేను అఫ్గానిస్తాన్ గురించి చాలా కథలు విన్నాను. ప్రతీ కథ ఎంత భయానకంగా ఉంటుందో అంతే స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
యుద్ధ నేపథ్యంలో వచ్చే ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Alamy
కథ వెనుక నిజం
ఈ సినిమాకు కొన్ని వాస్తవిక ఘటనలు కూడా ఆధారంగా మారాయి. సినిమా చివర్లో 300 మంది అఫ్గాన్ పౌరులు మరణించారని, అమెరికాకు సహాయం చేసేందుకు వేలమంది అఫ్గాన్లు తాలిబాన్‌ల నుంచి వాళ్లు రహస్యంగా జీవించాల్సి వచ్చిందని చెప్పారు.
ఇందులో చాలా వరకు నిజం ఉందని 2017-18 మధ్యకాలంలో కాబూల్‌లోని అమెరికా మిషన్‌కు డిప్యూటీ చీఫ్‌గా పని చేసిన అన్నే ఫోర్‌జీమర్ బీబీసీ కల్చర్‌తో అన్నారు.
‘‘అప్పటికి ఈ డేటా పాతబడింది. కానీ, ఐక్యరాజ్య సమితి, కొన్ని స్వతంత్ర మానవ హక్కుల సంఘాలు ఇలాంటి ఘటనలను నివేదించాయి’’ అని ఫోర్‌జీమర్ వెల్లడించారు.
ఇందులో ఇంకో విశేషం ఏంటంటే కిన్లీ, అహ్మద్ మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ను అన్నే స్వయంగా అనుభవించారు కూడా.
‘‘ఇరవై సంవత్సరాలపాటు అఫ్గాన్ గైడ్లు, పోలీసులు, సైన్యం, ఇతర అధికారులతో సన్నిహితంగా పని చేసిన సైనికులు, దౌత్యవేత్తల మధ్య భావోద్వేగ బంధం ఏర్పడింది. ‘ది కోవనెంట్’ లాంటి సినిమాలు ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తాయి’’ అన్నారామె.
అహ్మద్‌కు అమెరికా వీసా ఇవ్వడంలో అధికారులు, నిబంధనలు అడ్డుపడినట్లు ఈ సినిమాలో చూపిస్తారు. తద్వారా అతను దేశం విడిచి వెళ్లేలోపు తాలిబాన్‌లు అతన్ని గుర్తించి పట్టుకునే అవకాశం పెరుగుతుంది.
దీంతో అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కిన్లీ ఒక ఆర్మీ అధికారితో ‘‘మేం అతని కుటుంబానికి ఆశ్రయం ఇస్తామని ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు అతని మెడకు తాడు కట్టి, కాళ్ల కింద స్టూల్ లాగేస్తున్నాం’’ అని అరుస్తాడు.
అయితే, రాజకీయాలు, సినిమా డైలాగుల విషయం పక్కనబెడితే, అఫ్గాన్ గైడ్స్‌కు వాగ్దానం చేసిన అమెరికా ఇమ్మిగ్రేషన్ వీసాల లిస్టు చాలా పెద్దగానే ఉందని ఎన్జీవోలు, నిపుణులు గుర్తు చేస్తూనే ఉన్నారు.
ఇక మరో సినిమా మాథ్యూ హీన్‌మాన్ నిర్మించిన ‘రెట్రోగ్రేడ్’ ఆస్కార్ కోసం షార్ట్‌లిస్ట్ అయింది. అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లడానికి కొన్నాళ్ల ముందు నుంచి ఈ సినిమా కోసం అమెరికా సైన్యంతో ప్రత్యేకంగా కెమెరా సిబ్బందిని ఏర్పాటు చేశారు మాథ్యూ హీన్‌మాన్. ‘‘మేం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాం. ధన్యవాదాలు మిత్రులారా’’ అని ఒక అధికారి అఫ్గాన్ ప్రజలతో అనడం వీరు చిత్రీకరించిన వీడియోలో కనిపిస్తుంది.
1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధం నుంచి 1998 నాటికి సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ వంటి సినిమాల వరకు యుద్ధం చాలా గొప్పది అన్న భావనలో సినిమాలు నిర్మితమయ్యాయి. కానీ, 1975లో వియత్నాం యుద్ధం ముగిసే సమయానికి, అమెరికా అక్కడికి వెళ్లడం తప్పు అనే భావన మొదలైంది. ఆ తర్వాతనే 1986 నాటి ప్లటూన్ లాంటి సినిమాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Alamy
రాజకీయాలను పక్కన పెడుతున్నారు
ఇరాక్, అఫ్గానిస్తాన్‌ల మీద వచ్చిన సినిమాలు ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయాలను పక్కనబెట్టి కేవలం సైనికుల వీరత్వాన్ని కీర్తించడానికి నిర్మించారు. ఇది యుద్ధానికి అసలు కారణాలను వెతకకుండా తప్పించుకోవడం లాంటిది.
2005లో వచ్చిన వచ్చిన జార్‌హెడ్ అనే సినిమా 1990ల నాటి గల్ఫ్ యుద్ధం ఆధారంగా నిర్మించారు. ఇందులో ఒక సైనికుడు తన సహచరుడితో ‘‘ఇప్పుడు మనం ఇక్కడున్నాం అంతే. మిగతా విషయాలను మర్చిపో’’ అంటాడు. ఈ డైలాగ్ కూడా యుద్ధ మూలాలపై వినిపించే ప్రశ్నలను తప్పించే మార్గం.
అఫ్గానిస్తాన్ యుద్ధం ఆధారంగా నిర్మించిన మరో చిత్రం అవుట్ పోస్ట్‌లో వినిపించే ‘స్వేచ్ఛ ఉచితంగా రాదు’ అనే డైలాగ్ కూడా ఇలాంటిదే. సినిమా మొత్తంలో రాజకీయపరమైన డైలాగ్ ఇదొక్కటే. అది కూడా చాలా అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సైనికుల ధైర్య సాహసాలపై మాత్రమే దృష్టి పెట్టారు.
యుద్ధాన్ని చూపించే సినిమాలపై ఆకర్షణకు కారణం హింసే అంటారు డేవిడ్. ఆయన తన పుస్తకం 'ది ఫాటల్ అలయన్స్: సెంచరీ ఆఫ్ వార్ ఆన్ ఫిల్మ్' నవంబర్‌లో ప్రచురితమైంది. ఆయన సినిమా చరిత్రకారుడు, విమర్శకుడు కూడా.
‘‘యుద్ధానికి వ్యతిరేకంగా సినిమాలు తీయరు. అసలు ఈ సినిమాలు తీసేది హింసను, హత్యలను ఆసక్తికరంగా చూపించడానికే’’ అని బీబీసీ కల్చర్‌తో డేవిడ్ అన్నారు.
సహ్రా కరిమి దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘హవా, మర్యం, అయేషా’ సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
వివిధ రంగాలకు చెందిన ముగ్గురు అఫ్గాన్ గర్భిణుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
బీబీసీ కల్చర్‌తో సహ్రా కరిమి మాట్లాడుతూ, “ఈ కథ, కాబూల్‌లో అమెరికా సైనిక పాలన ముగియడానికి రెండు నెలల ముందు కాలానికి సంబంధించినది. మనకు కలలు, కష్టాలు ఉంటాయి. భద్రతరీత్యా పరిస్థితులు బాగా లేనప్పటికీ, కొత్త ఆశతో రోజును మొదలుపెడుతున్నాం అని ప్రపంచానికి చెప్పాలనుకున్నాం.
హాలీవుడ్ దర్శకులు ఆఫ్గానిస్తాన్ కథను ప్రత్యేకంగా, ఆసక్తికరంగా చూపిస్తారు. కానీ, అది వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఇక్కడ ‘బాధితులు- రక్షకుడు’ అనే ఫార్ములా కాకుండా, చెప్పాల్సింది ఇంకా చాలా ఉంటుంది’’ అని అన్నారు.
ఇక స్థానిక భాషా చిత్రాలకు డిస్ట్రిబ్యూషన్ అవకాశం లేకపోవడంతో అవి కనుమరుగైపోతుంటాయి. కరిమి నిర్మించిన సినిమా కమ్ డాక్యుమెంటరీ అఫ్గాన్ ఉమెన్ బిహైండ్ ది వీల్ (2009) ఇలాగే వెలుగులోకి రాలేదు. మరో అఫ్గాన్ మహిళా దర్శకురాలు రోయా సాదత్ సినిమా ఎ లెటర్ టు ది ప్రెసిడెంట్ (2003) పరిస్థితి కూడా అదే.
ఇవి కూడా చదవండి:
- బాపట్ల టెన్త్ విద్యార్థి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు, ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి?
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- అమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














