పగలు ఇలా చేస్తే మీ మెదడు బాగా పనిచేస్తుందట!

స్వల్ప నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాడెంట్

పగటిపూట కునుకు తీస్తే మెదడుకు ఎంతో మంచిదని యూనివర్సిటీ కాలేజీ లండన్ రీసెర్చర్లు కనుగొన్నారు. ఇలా నిద్రపోయే వారి మెదడు 15 క్యూబిక్ సెంటీమీటర్ల పెద్దదిగా ఉంటుందని ఈ పరిశోధకుల బృందం నిరూపించింది.

అంతేకాక, ఇలాంటి వారిలో వయసు మీద పడటాన్ని కనీసం మూడు నుంచి ఆరేళ్ల వరకు ఆలస్యం చేస్తుందని తెలిపింది.

అలాగని గంటల తరబడి నిద్రపోవడం కూడా సరికాదని, అర్ధగంట కంటే తక్కువ సేపు మాత్రమే కునుకు తీస్తూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.

చాలా మంది వృత్తిపరమైన జీవితాల్లో పగటి పూట నిద్ర అనేది చాలా కష్టం.

ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

‘‘ప్రతి ఒక్కరూ రోజులో కొద్దిసేపు పాటు కునుకు తీయడం వల్ల ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందగలరని మేం సూచిస్తున్నాం’’ అని డాక్టర్ విక్టోరియా గార్‌ఫీల్డ్ తెలిపారు.

ఇంతకుముందు ఎప్పుడూ ఈ విషయాన్ని కనుగొనలేదని డాక్టర్ విక్టోరియా వివరించారు. అంతేకాక, ఇవి ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాయన్నారు.

మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పెరుగుదలకు నిద్ర అనేది ఎంతో అవసరం. ఒక వయసుకు వచ్చాక నిద్ర అనేది అంత కామన్‌గా ఉండదు.

కానీ, పదవీ విరమణ తర్వాత లేదా వయసు మళ్లాక పగటి పూట నిద్రపోవడమన్నది పెరుగుతుంది. 65 ఏళ్లు పైబడిన 27 శాతం మంది ప్రజలు పగటి పూట నిద్ర పోతూ ఉంటున్నారు.

చాలా మందికి బరువు తగ్గడం లేదా వ్యాయామం చేయడమనేది చాలా కష్టం. కానీ, దానితో పోలిస్తే నిద్ర పోవడమన్నది చాలా తేలికైన పని అని గార్‌ఫీల్డ్ చెప్పారు.

వయసు పెరుగుతున్న కొద్ది సహజంగా మన మెదడు తగ్గుతూ వస్తోంది.

కానీ, అల్జీమర్స్ వంటి వ్యాధులను నిరోధించేందుకు పగటి పూట నిద్ర సాయపడుతుందా? అన్న దానిపై ఇంకా అదనపు పరిశోధన చేయాల్సి ఉంది.

డెమెన్షియా (బ్రెయిన్ ఫంక్షన్‌ను తగ్గించే వ్యాధి) అనే దానిపై పోరాడేందుకు మాత్రం మెదడు ఆరోగ్యకరంగా ఉండటం ఎంతో అవసరం. ఈ వ్యాధి వల్ల నిద్ర కూడా చాలా వరకు పాడవుతుంది.

నిద్రపోవడం

ఫొటో సోర్స్, Getty Images

నిద్ర లేమి అనేది ఇన్‌ఫ్లేమేషన్‌కు దారితీసి, కాలక్రమంలో మన మెదడు దెబ్బతినేందుకు కారణమవుతుందని పరిశోధకులు చెప్పారు.

అలాగే, మెదడు కణాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.

‘‘నిద్ర లేమి కారణంగా తలెత్తే న్యూరోడీజనరేషన్‌ నుంచి మనల్ని రక్షించేందుకు పగటిపూట నిద్ర సాయపడుతుండొచ్చు’’ అని రీసెర్చర్ వాలెంటినా పాజ్ చెప్పారు.

పనిలో ఉన్నప్పుడు నిద్రపోవడానికి అవసరమయ్యే సౌకర్యవంతమైన స్థలాన్ని వెతుక్కోవడమే కాకుండా, మెదడును చురుకుగా ఉంచుకునేందుకు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు డాక్టర్ గార్‌ఫీల్డ్ చెప్పారు.

‘‘నిజం చెప్పాలంటే, కొద్ది సేపు కునుకు తీయడం కంటే 30 నిమిషాలు వ్యాయామం చేసేందుకు నేను వెచ్చిస్తాను. కానీ, ఇక నుంచి నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. మా అమ్మకి కూడా ఈ పని చేయాలని చెబుతాను’’ అని గార్‌ఫీల్డ్ తెలిపారు.

కొంచెం సేపు కునుకు తీయడంపై అధ్యయనం చేయడం సవాలుతో కూడుకున్నది.

ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుండొచ్చు. లేదంటే రివర్స్ కూడా జరుగుతుండొచ్చు. మీకు అలసటగా ఉన్నప్పుడు, కాస్త ఎక్కువ సేపే నిద్ర పోవాల్సి ఉంటుంది.

నిద్రపోవడం

ఫొటో సోర్స్, Getty Images

స్వల్ప నిద్ర అనేది ప్రయోజనకరమని నిరూపించేందుకు రీసెర్చర్లు స్పష్టమైన టెక్నిక్‌ను వాడారు.

మనం పుట్టినప్పుడు ఉండే జన్యు సంకేతం డీఎన్‌ఏను వాడుతూ ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

40 నుంచి 69 ఏళ్ల మధ్యలో ఉన్న 35 వేల మంది డేటాను ఈ టీమ్ సేకరించింది. యూకే బయోబ్యాంక్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని చేపట్టింది. స్వల్ప నిద్ర పోయే వారి, పగటి పూట అసలు కునుకు తీయని వారి జన్యువులు పోల్చి చూసింది.

ఈ ఫలితాలను స్లీప్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. నిద్రపోయే వారి మెదడు 15 క్యూబిక్ సెంటీమీటర్ల పెద్దదిగా ఉంటుందని, అంతేకాక, వీరిలో వయసు పెరగడాన్ని 2.6 నుంచి ఆరున్నరేళ్ల వరకు ఆలస్యం చేస్తుందని తెలిపింది.

ఈ అధ్యయనంలో మొత్తం బ్రెయిన్ వాల్యూమ్స్ 1,480 క్యూబిక్ సెంటీమీటర్లు.

‘‘వీకెండ్లలో కొద్దిసేపు పాటు పగటి పూట నిద్ర పోవడాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. ఇది సోమరితనంగా భావించాల్సినవసరం లేదని ఈ అధ్యయనం నాకు చెబుతుంది. ఇది నా మెదడును కాపాడుతుందేమోనని నాకు అనిపించేలా చేసింది’’ అని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరా, బ్రిటీష్ న్యూరోసైన్స్ అసోసియేషన్‌కి చెందిన ప్రెసిడెంట్ ప్రొఫెసర్ తారా స్పైర్స్ జోన్స్ చెప్పారు.

మెదడు చిన్నదే కానీ, బ్రెయిన్ వాల్యూమ్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఈ ఆసక్తికరమైన అధ్యయనంలో వెల్లడైందని ఆమె చెప్పారు.

మెదడు ఆరోగ్యకరంగా ఉండేందుకు నిద్ర అనేది ఎంతో అవసరమని ఈ డేటా చెబుతుంది.

అయితే, పగటి పూట ఎక్కువ సేపు నిద్ర పోవడంపై రీసెర్చర్లు నేరుగా పరిశోధన చేపట్టలేదు. కానీ, ఈ నిద్రను అర్ధగంటకు తగ్గించుకోవాలని సైన్స్ సూచిస్తోందని తెలిపారు.

ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర అంటే ఏమిటి ?

ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.

ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు.

అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా అంటారు.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

నిద్రలేమితో అనారోగ్యం

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యపై డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

ఊబకాయం సమస్య నానాటికి పెరుగుతుండటంతో నిద్రలేమి సమస్య తీవ్రమౌతుందని ప్రముఖ బ్రిటన్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గై లెస్జినర్ తెలిపారు.

నిద్రలేమికి 'కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ' అంటే.. ఆలోచనా, ప్రవర్తనా విధానాన్ని మార్చే చికిత్సే పరిష్కారమని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనా విధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యమని అంటున్నారు.

వీడియో క్యాప్షన్, మెదడు చురుగ్గా పని చేయాలంటే ఏం తినాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)