ఆదిపురుష్: వివాదాలు, ట్రోలింగ్, బ్యాన్ చేయాలనే డిమాండ్ల నడుమ రెండు రోజుల్లో రూ. 240 కోట్ల కలెక్షన్స్... కారణం ఏంటి?

ఫొటో సోర్స్, @TSERIES
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదిపురుష్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 240 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు లెక్కలు ఇంకా రాలేదు. ఈ ట్రెండ్ కొనసాగితే, మూడు రోజుల్లో రూ. 300 కోట్లు సులువుగా దాటేస్తుంది.
అయితే, చాలామంది సమీక్షకులు ఈ చిత్రానికి మంచి రేటింగ్ ఇవ్వలేదు. ఇదేకాక, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.
తొలి రెండు రోజుల వసూళ్ళను పరిగణిస్తే, బాలీవుడ్‌కి ఇది సరికొత్త రికార్డు. ఇప్పటి వరకు రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ళు రాబట్టిన బాలీవుడ్ చిత్రం 'పఠాన్'. మొదటి రెండు రోజుల్లో రూ.127 కోట్ల బిజినెస్ చేసింది. దీనితో పోల్చుకుంటే ఆదిపురుష్ చాలా ఎక్కువే రాబట్టినట్టు లెక్క.
సమీక్షకులు, ప్రేక్షకుల నుంచి విమర్శలు, నిరసనలు, డైలాగులకు వాడిన భాషపై వివాదాలు వచ్చినా జనం పెద్దఎత్తున థియేటర్లకు వెళ్తున్నారు.

ఫొటో సోర్స్, MANOJ MUNTASHIR
వివాదాస్పద డైలాగులు, సమర్థన
ఈ సినిమాలో కొన్ని డైలాగులపై వివాదాలు వస్తున్నాయి. దాంతో, వాటిని తొలగించి కొత్త డైలాగులు చొప్పిస్తామని ఆదివారం నిర్మాతలు హామీ ఇచ్చారు.
లంకా దహనానికి ముందు హనుమంతుడు, రావణుడి కొడుకు ఇంద్రజిత్‌తో చెప్పే డైలాగులపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
"నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది, దానికి రాసిన చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుకే" అంటూ ఆంజనేయుడు చెప్పే డైలాగ్ మాస్ సినిమాను తలపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సినిమాలోని మరికొన్ని డైలాగులు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఒక సన్నివేశంలో రావణుడి లంకలో ఓ రాక్షసుడు హనుమంతునితో, "ఇది మీ అత్త తోట అనుకున్నావా, గాలి తినడానికి వచ్చావా?" అన్నట్టుగా ఓ డైలాగ్ చెబుతాడు.
మరోచోట, అంగదుడు రావణాసురుడిని సవాలు చేస్తూ, "రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో. లేకపోతే ఈరోజు నిలబడి ఉన్నవాడివి, రేపు పడుకుని ఉంటావు" అంటాడు.
ఈ సినిమాలో వాడిన భాష 'అసభ్యకరంగా, అవమానకరంగా' ఉందంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషీర్ తన పనిని సమర్థించుకున్నారు.
రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “కథలు చెప్పడం మన సంస్కృతిలో ఉంది. రామాయణం చిన్నప్పటి నుంచి వింటున్న కథ. మా అమ్మమ్మ, నానమ్మలు రామాయణ కథ ఇలాగే ఈ భాషలోనే చెప్పేవారు. దేశంలోని సాధువులు, జానపదకళాకారులు నేను ఎలా రాశానో అలాగే కథలు చెప్పేవారు" అని అన్నారు.
హనుమంతుడి డైలాగుల గురించి చెబుతూ, "ఇది తప్పు కాదు. కావాలనే అలా రాశాను. ఆంజనేయుడికి రాసిన డైలాగులు చాలా ఆలోచించి రాశాను. రామాయణంలో అన్ని పాత్రలూ ఒకేలాంటి భాష మాట్లాడవు" అన్నారు.
సినిమాలో రామాయణాన్ని వేరేగా చూపించారని చాలా మంది ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. సినీ పండితులు కూడా ఇదే మాట అంటున్నారు.
“సినిమా పేరు ఆదిపురుష్. ఇది రామాయణం కాదు. దాని స్ఫూర్తితో తీసిన కథ. మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం సినిమాకు రామాయణం అనే పేరు పెట్టడం మాకు సులువైనపని" అని ఆజ్ తక్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ ముంతషీర్ అన్నారు.
సినిమా విడుదలకు ముందు ఏబీపీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ, "ప్రజలు చదివిన, విన్న, చూసిన రామాయణం సినిమాలో ఉందని" చెప్పారు.
“మేం రామాయణం నుంచి దూరంగా జరిగామా, దానిని ఆధునీకరించడానికి ప్రయత్నించామా, వేరే స్టాండ్ తీసుకున్నామా.. దీనికి సూటిగా సమాధానం చెప్పలేం. ప్రజలు చదివిన, చూసిన, విన్న రామాయణమే తప్ప ఇంకోటి కాదు" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
వివాదాల నడుమ రికార్డులు
ఆదిపురుష్ సినిమాపై ఒకవైపు ట్రోలింగ్ జరుగుతుండగా, మరోవైపు కోర్టులో పిటిషన్ దాఖలైంది.
1990లలో దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం దీనికన్నా ఎంతో నయమని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో టి-సీరీస్ భూషణ్ కుమార్ దీనిని నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేశారు.
ఆదిపురుష్‌లో రామాయణాన్ని 3-డీ సాంకేతికతతో చిత్రీకరించారు. దీనిపైనా విమర్శలు లేకపోలేదు. వీఎఫ్ఎక్స్ ద్వారా చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయని అంటున్నారు.
పాత్రల లుక్, వస్త్రధారణ విషయంలోనూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
భారీ ట్రోలింగ్, తీవ్ర విమర్శలు, పేలవమైన సమీక్షలు ఉన్నప్పటికీ, ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా ఉండదని నిర్మాతలు విశ్వసిస్తున్నారు.
ఆదిపురుష్ తొలిరోజు రూ.140 కోట్లు రాబట్టిందని, రెండో రోజు రూ.100 కోట్లు రాబట్టిందని నిర్మాత తెలిపారు.

ఫొటో సోర్స్, T SEIRES
సినిమా చుట్టూ రాజకీయాలు
ఆదిపురుష్ సినిమా చుట్టూ రాజకీయలు కూడా అల్లుకుంటున్నాయి.
ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, బీజేపీ చౌకబారు రాజకీయాల కోసం ఈ సినిమాను విడుదల చేసేందుకు అనుమతించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
సినిమాలోని వివాదాస్పద డైలాగులు, సన్నివేశాలను పునఃసమీక్షించేవరకు సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని దిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి శంకర్ కపూర్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. జాతీయ స్థాయిలో సినిమాను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ హిందూ సేన అనే సంస్థ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
"ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర" కొందరు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, T-SERIES
ఇన్ని వసూళ్ళు ఎలా రాబడుతోంది?
కొన్ని నెలల క్రితం విడుదలైన పఠాన్ సినిమాపై కూడా పలు వివాదాలు చెలరేగాయి. నిరసనలు జరిగాయి. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్లతో అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది.
ఇదే కోవలో ఆదిపురుష్ కూడా వివాదాలలో చిక్కుకుంది కానీ, విడుదలైన దగ్గర నుంచి భారీగా వసూళ్ళు చేస్తోంది.
ఈ చిత్రం పట్ల జనాల్లో కుతూహలం ఏర్పడిందని, దానికి తగ్గట్టుగా సినిమా లాభపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ట్రెండ్‌పై చిత్రనిర్మాత, బాలీవుడ్ వ్యాపార విశ్లేషకుడు గిరీష్ జోహార్‌తో బీబీసీ ప్రతినిధి సుప్రియా సోగ్లే మాట్లాడారు.
"ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రతికూల స్పందనలు వస్తున్నాయి. అంటే చాలామంది ఈ సినిమా చూస్తున్నారని అర్థం. విమర్శల ప్రభావం తొలిరోజుల్లో కనిపించదు. వివాదాలు, విమర్శలు ఇలాగే కొనసాగితే ఒక వారం దాటాక వసూళ్ళపై ప్రభావం కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.
స్టార్ పవర్
స్టార్ పవర్ కూడా ఈ సినిమాకి పనిచేసిందని గిరీష్ అభిప్రాయపడ్డారు.
"ప్రభాస్ సౌత్ ఇండియాలో పెద్ద స్టార్. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. అతని స్టార్ పవర్ కూడా ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షించింది. ఇదే కాకుండా, ఈ సినిమాపై జనాల్లో ఒక కుతూహలం ఏర్పడింది. రామాయణానికి కొన్ని మార్పులు చేసి, తమ వెర్షన్ చూపిస్తున్నామని నిర్మాతలు ముందే చెప్పారు. భారీ వ్యయంతో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. 3డీ, వీఎఫ్ఎక్స్ లాంటి సాకేతికతతో రామాయణం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి జనంలో పుట్టుకొచ్చింది" అన్నారు గిరీష్.
అలాగే, రాముడిపై ఉన్న నమ్మకం, భక్తి సినిమా తొలి రోజుల వసూళ్ళకు దోహదపడ్డాయని అన్నారు.
"భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ రామాయణంపై వచ్చిన సీరియల్ లేదా సినిమాలు చూశారు. చాలా కాలం తరువాత మళ్లీ రామాయణం తెరకెక్కింది. రామకథను కొత్తగా చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు."
పిల్లలకు సెలవులు కాబట్టి కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఆదిపురుష్ విడుదల కావడం కలిసొచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
అంతే కాకుండా, ఈ తరం పిల్లలకు తమ సంస్కృతి, సంప్రదాయాలను, ఇతిహాసాలను పరిచయం చేయడానికి ఇదొక అవకాశంగా భావిస్తూ ఉండవచ్చు.
"ఇంతకుముందు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఇప్పుడు అన్నీ చిన్నకుటుంబాలే. పిల్లలకు కథలు చెప్పేవారు కరువైపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఈ సినిమా ద్వారానైనా పిల్లలకు కథ చెప్పవచ్చని, తమ సంప్రదాయాలు, విలువలను అందించాలని కోరుకుంటుండవచ్చు. అందుకే కుటుంబసమేతంగా ఈ సినిమా చూస్తున్నారు" అన్నారు గిరీష్.
సంగీతం హిట్
బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రావడానికి ఈ సినిమా సంగీతం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
"సినిమా సంగీతం జనాన్ని ఆకర్షిస్తోంది. పాటలు బావున్నాయని అందరూ అంటున్నారు" అన్నారు గిరీష్.
అయితే, రాబోయే రోజుల్లో వసూళ్లు తగ్గవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.
"శనివారానికి వసూళ్లు కొంత తగ్గాయి. ఆదివారానికి కూడా తగ్గితే కలెక్షన్లు తగ్గుముఖం పట్టినట్టు భావించవచ్చు" అన్నారాయన.

ఫొటో సోర్స్, T-SERIES
నెగిటివ్ పబ్లిసిటీ మేలు చేసిందా?
చాలాసార్లు విమర్శకులకు నచ్చనిది ప్రేక్షకులకు నచ్చవచ్చు. ప్రేక్షకుల దృక్కోణం, విమర్శకుల దృక్కోణం వేరుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
"విమర్శకులకు సినిమా నచ్చినా జనాలకు నచ్చకపోవచ్చు. ఇలా కూడా చాలాసార్లు జరిగింది. మంచి సినిమాగా పేరొస్తుంది కానీ, డబ్బులు రావు. అలాగే, విమర్శకులకు నచ్చకపోయినా జనాలకు బాగా నచ్చవచ్చు. సినిమాకు అధిక వసూళ్ళు రావచ్చు. వివాదాలు, విమర్శల కారణంగా ఆదిపురుష్ చిత్రానికి పబ్లిసిటీ బాగా వస్తోంది. అది కూడా అధిక వసూళ్ళకు కారణం కావచ్చు" అన్నారు గిరీష్.
అయితే, చిత్రనిర్మాతలు, పంపిణీదారులు తొలి రోజుల్లో ఎక్కువ వసూళ్ళు చూపించడానికి తమ పూర్తి శక్తిని వినియోగించారని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి బీబీసీతో అన్నారు.
చాలాచోట్ల స్కూలు పిల్లలకు సినిమా చూపిస్తున్నారని అన్నారు.
సినీ విమర్శకుడు, సినిమా వ్యాపార విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి ఒకటిన్నర స్టార్ ఇచ్చారు. పేలవంగా ఉందని విమర్శించారు.
ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల తర్వాత తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ, “సినిమాకి ముందే హైప్ రావడం, అడ్వాన్స్ బుకింగ్‌లు ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి " అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















