రష్యా చమురు పాకిస్తాన్‌కు భారత్ నుంచి ఎందుకు వెళ్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా నుంచి పాకిస్తాన్‌కు చమురు రావడం మొదలైంది. ఈ రెండు దేశాల మధ్య ఇటీవలే లక్ష మెట్రిక్ టన్నులు చమురు కొనుగోలు ఒప్పందం కుదిరింది.
పాకిస్తాన్‌కు రష్యా చమురు చేరిన విషయాన్ని రష్యా, పాకిస్తాన్‌లు ధ్రువీకరించాయి. ఈ చమురు తమకు చౌక ధరకు లభిస్తోందని పాకిస్తాన్ చెబుతోంది. అయితే, పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపు ఇవ్వట్లేదని రష్యా అంటోంది.
పాకిస్తాన్ చమురు చెల్లింపులను చైనా కరెన్సీ యువాన్‌లో చేసింది.
రష్యా నుంచి పాకిస్తాన్ తక్కువ ధరకు చమురును పొందుతోందని గత నెలలో పాకిస్తాన్ ఇంధన మంత్రి ఖుర్రం దస్తగీర్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రష్యా చమురు పాకిస్తాన్‌కు చేరుకున్నప్పుడు, ఇదొక మంచి పరిణామం అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు.
షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, "నేను దేశానికి ఇచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేర్చాను. రష్యా నుంచి రాయితీపై లభించిన ముడి చమురు కరాచీకి చేరుకుంది. ఇది చాలా మంచి పరిణామం. శ్రేయస్సు, ఆర్థిక పురోగతి, ఇంధన భద్రత దిశగా మనం మరో అడుగు ముందుకు వేశాం’’ అని అన్నారు.
రష్యా నుంచి వచ్చిన చమురును ముందుగా భారత్‌లో శుద్ధి (రీఫైన్) చేసి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మీదుగా పాకిస్తాన్‌కు తరలించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ఓడ ఎప్పుడు వచ్చింది?
రష్యాకు చెందిన ఓ కార్గో షిప్ ద్వారా జూన్ 11వ తేదీన పాకిస్తాన్‌కు చమురు వచ్చింది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టినప్పటి నుంచి, తక్కువ ధరకు రష్యా నుంచి చమురును పొందడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
రష్యా చమురును పొందే విషయంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరచుగా భారత్‌ను ఉదాహరణగా చూపేవారు.
యుక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చరిత్రాత్మకంగా పెరిగాయి.
పాకిస్తాన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాతో లక్ష మెట్రిక్ టన్నుల చమురు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత, రష్యా నుంచి చమురు మొదటి సరుకు జూన్ 11న పాకిస్తాన్‌కు చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘దోస్తీ జిందాబాద్’’
రష్యా నుంచి పాకిస్తాన్‌కు చమురు రాకను అనేక కోణాల్లో చూస్తున్నారు.
యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా, భారత్‌ల మధ్య సంబంధాల్లో అనేక సవాళ్లు ఏర్పడ్డాయని, ఈ సమయంలోనే పాకిస్తాన్‌కు రష్యా సహకారం పెరిగిందని చెబుతున్నారు.
పశ్చిమ దేశాలు, రష్యాతో సంబంధాలలో సమతుల్యతను కొనసాగించడానికి గ్లోబల్ సౌత్ దేశాలు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా దీన్ని చూడవచ్చు.
ప్రచ్ఛన్నయుద్ధ కాలం నుంచే రష్యా, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవు. ప్రచ్ఛన్నయుద్ధంలో పాకిస్తాన్ అమెరికా కూటమిలో భాగంగా ఉంది.
గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించగానే అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాస్కో చేరుకున్నారు.
పాకిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వం కూడా రష్యాతో ఇంధన ఒప్పందానికి ప్రయత్నిస్తూనే ఉంది.
తమ దేశ అవసరాల్లో మూడోవంతు చమురును రష్యా నుంచి పొందాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి తెలిపారు.
పాకిస్తాన్ ఇప్పటి వరకు సౌదీ అరేబియా, యూఏఈ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.
పాకిస్తాన్‌తో రష్యా ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సోమవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఉర్దూలో మాట్లాడుతూ ‘‘దోస్తీ జిందాబాద్’’ అని అన్నారు.
యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చైనాతో కూడా రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి. రష్యా, చైనాల మధ్య రక్షణ సహకారం కూడా పెరుగుతోంది. రష్యా ఎక్కువగా చైనాపై ఆధారపడటం వల్ల భారత్-రష్యా సంబంధాలపై దాని ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ముందున్న సవాళ్లు
రష్యా నుంచి పాకిస్తాన్ ఎక్కువ కాలం చమురు కొనుగోలు చేయలేదని కూడా అంటున్నారు. పాకిస్తాన్ వద్ద చమురును శుద్ధి చేసే వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పైగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.
అమెరికాకు కోపం వచ్చే స్థాయిలో కూడా రష్యాతో సంబంధాలు నెరపకూడదని పాకిస్తాన్ భావిస్తోంది.
అమెరికా ఆధిపత్యంలోనే ప్రపంచ ఆర్థిక సంస్థలు ఉన్నాయి. రుణాలు తీసుకోవడానికి పాకిస్తాన్‌కు అమెరికా సహాయం కావాలి.
జీ-7 ధరల పరిమితిని దాటుకొని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని పాకిస్తాన్ అనుకోదు. యుక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో తటస్థ వైఖరిని చూపించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ, యుక్రెయిన్‌కు పాకిస్తాన్ ఆయుధాలను పంపించినట్లు చాలా నివేదికలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘రాయితీ లేదని చెప్పిన రష్యా’’
రష్యా ఇంధన మంత్రి నికోలాయ్ షుల్గినోవ్ చేసిన ప్రకటన పాక్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
పాకిస్తాన్ యువాన్లలో రష్యాకు చమురు చెల్లింపులు చేసిందని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.
ఒక మిత్రదేశానికి సంబంధించిన కరెన్సీలో చెల్లింపులు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్‌కు చమురు ఎగుమతులు ప్రారంభించినట్లు రష్యా ఇంధన మంత్రి నికోలాయ్ షుల్గినోవ్ ధ్రువీకరించారు.
పాకిస్తాన్‌కు చమురు కొనుగోళ్లలో ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని రష్యా ఇంధన మంత్రి కూడా నొక్కిచెప్పినట్లు రష్యా, అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
‘‘పాకిస్తాన్‌కు చమురు ఎగుమతులు మొదలయ్యాయి. కానీ, పాకిస్తాన్‌కు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదు. ఇతర కొనుగోలుదారులకు ఇస్తున్న ధరలకే పాకిస్తాన్‌కు కూడా చమురును విక్రయిస్తున్నాం. ఇటీవలే ఒక చమురు ఓడ పాకిస్తాన్‌కు వెళ్లింది. త్వరలోనే పాకిస్తాన్‌కు మరిన్ని ఓడల్లో చమురు వెళ్తుంది’’ అని నికోలాయ్ అన్నారు

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో శుద్ధి అయిన చమురు యూఏఈ ద్వారా పాకిస్తాన్‌కు చేరుకుందా?
పాకిస్తాన్‌కు పంపిణీ అయిన చమురును గుజరాత్‌లో ఉన్న రిఫైనరీలో శుద్ధి చేసినట్లు భారతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఆంగ్ల వార్తాపత్రిక ది ట్రిబ్యూన్ ప్రకారం, గత ఆదివారం కరాచీకి చేరుకున్న రష్యా చమురును గుజరాత్‌లోని భారతీయ రిఫైనరీలో శుద్ధి చేశారు. అయితే, భారత్- పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్తతలను పరిగణనలోకి తీసుకుని ఈ చమురును యూఏఈ ద్వారా పాకిస్తాన్‌కు చేరవేశారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది.
చమురును యూఏఈ గుండా పంపించడం ద్వారా భారత్‌కు కోపం రాకుండా చూసుకోవాలని రష్యా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
పాకిస్తాన్‌కు రష్యా పంపిన చమురు రూట్ మ్యాప్‌ను షిప్పింగ్ పెట్టుబడిదారు, విశ్లేషకులు ఎడ్ ఫిన్లే రిచర్డ్‌సన్ ట్విటర్‌లో పంచుకున్నారు.
‘‘మొదట రష్యా నుంచి చమురు భారత్‌కు చేరింది. అక్కడి నుంచి యూఏఈకి చేరుకుంది. యూఏఈ నుంచి పాకిస్తాన్‌కు పంపించారు’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత్ నుంచి నేరుగా వచ్చిన కార్గోను పాకిస్తాన్ స్వీకరించదు. కాబట్టి ఈ రష్యన్ చమురును యూఏఈ ద్వారా పంపించారు.
పాకిస్తాన్‌కు చమురును తీసుకెళ్లిన ఓడ, యూఏఈలోని ఒక రిజిస్టర్డ్ కంపెనీకి చెందినది.
రష్యా నుంచి లక్ష టన్నుల చమురు కొనుగోలుకు పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికి 45 వేల టన్నుల చమురు పాకిస్తాన్‌కు చేరుకోగా, 55 వేల టన్నులు ఇంకా చేరాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, యూఏఈలు లబ్ధి పొందుతున్నాయా?
రష్యా, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన చమురు ఒప్పందంతో భారత్, యూఏఈలు మధ్యవర్తిత్వ ప్రయోజనం పొందుతున్నాయని పాకిస్తానీ విలేఖరి వకాస్ అన్నారు.
“భారత్‌కు బ్యారెల్‌కు 52 డాలర్ల చొప్పున రష్యా చమురును విక్రయించింది. భారత్, యూఏఈ లమధ్య ఒక పార్టీ ఇదే చమురును ఒక ధరకు కొనుగోలు చేసి అమ్మింది. తర్వాత దాన్ని పాకిస్తాన్‌కు బ్యారెల్‌కు 69 డాలర్ల చొప్పున విక్రయించారు. దీనివ్లల భారత కొనుగోలుదారుకు బ్యారెల్‌కు కనీసం 17 డాలర్లు అందాయి’’ అని వకాస్ రాశారు.
“పాకిస్తాన్‌కు ఈ ఒప్పందం వల్ల కేవలం లాలీపాప్‌లు మాత్రమే దక్కుతున్నాయి. ఎన్నికల ముందు చమురు ధరలను తగ్గించడానికి దీన్నొక సాకుగా చెప్పొచ్చు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, పాకిస్తాన్ రెండింటికీ లాభమా?
ఈ చమురు ఒప్పందాన్ని రష్యా, పాకిస్తాన్ రెండు దేశాలకు లాభదాయకంగా చూస్తున్నారు.
రష్యా చమురు ఎగుమతులపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో రష్యా చమురు విక్రయాల కోసం కొత్త మార్కెట్‌ను అన్వేషిస్తోంది.
చమురు కొనుగోళ్ల పరంగా పాకిస్తాన్, రష్యాకు పెద్ద మార్కెట్ అవ్వొచ్చు.
మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. రష్యా నుంచి చమురును పొందడం పాకిస్తాన్‌కు కొత్త అవకాశంగా మారవచ్చు.
పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుది. విదేశీ మారక నిల్వల్లో అత్యధిక భాగం చమురు కొనుగోలు కోసం ఖర్చు చేస్తుంది.
రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలు ఆదా చేసుకోవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఫ్రాన్స్: తప్పుడు ప్రకటనలతో ఫాలోయర్లను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా అడ్డుకట్ట వేశారంటే....
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














