టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం'పై ఏమంటున్నారు...

ఫొటో సోర్స్, ALAN ESTRADA
- రచయిత, ఫెలిపే లాంబియాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టైటానిక్ అవశేషాలను చూసేందుకు సముద్రపు లోతుల్లోకి 4,000 మీటర్లు డైవ్ చేయడం ఇప్పటివరకు చాలా తక్కువ మంది మాత్రమే చేసిన పని.
గత ఆదివారం టైటానిక్‌ను చూడటానికి ఐదుగురితో వెళ్లిన జలాంతర్గామి అదృశ్యమైంది.
మెక్సికన్ యూట్యూబర్, నటుడు అలాన్ ఎస్ట్రాడాను టైటానిక్ దగ్గరకు తీసుకెళ్లే ఈ జలాంతర్గామి రెండేళ్ల క్రితం ఆకర్షించింది.
దీంతో టైటానిక్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాన్ తన యూట్యూబ్ ఛానెల్ ‘అలాన్ అరౌండ్ ది వరల్డ్’తో ప్రసిద్ధి చెందారు.
‘ఈ పర్యటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేం తీసుకుంటున్న రిస్క్ గురించి పూర్తిగా తెలుసు’ అని బీబీసీతో అలాన్ గుర్తుచేసుకున్నారు.
“ఈ జలాంతర్గామి ప్రయాణం ప్రమాదకరమని నాకు తెలుసు. జలాంతర్గామి సముద్రం లోతుల్లో ఉన్నప్పుడు దెబ్బతింటే ఏమవుతుందో కూడా తెలుసు. అయినా, ఇది సురక్షితం కాదని నేను ఎప్పుడూ భావించలేదు’ అని ఆయన తెలిపారు.
సముద్రంలో ఇలాంటి ప్రయాణాల గురించి అలాన్ కరోనా సమయంలో తెలుసుకున్నారు.
ఆ సమయంలో అలాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పరిధి దాటి కొత్తగా ఏదైనా చేయడానికి మార్గాలను వెతుకుతున్నారు.
అతను జలాంతర్గామి ప్రయాణం గురించి పరిశోధించారు. తన కోసం స్పాన్సర్లను సంపాదించారు.
ఆ తర్వాత 2021లో అలాన్ ట్రిప్ కోసం అప్లై చేసి కోటి రూపాయలు చెల్లించారు.

ఫొటో సోర్స్, PA Media
మొదటి ప్రయత్నం విఫలం
అయితే, 2021 జూలైలో అలాన్ మొదటి ప్రయత్నం విఫలమైంది. అతను మరో ముగ్గురు ప్రయాణికులు, పైలట్ స్టాక్‌టన్ రష్ (ఓసింగేట్ కంపెనీ అధ్యక్షుడు, సబ్‌మెర్సిబుల్ బిల్డర్)తో కలిసి నీటిలోకి దిగాడు.
సాంకేతిక సమస్యల కారణంగా సముద్రయానం ప్రారంభమైన కొద్దిసేపటికే తిరిగి ఉపరితలంపైకి వచ్చింది ఆ జలాంతర్గామి.
ఏడాది తరువాత ఇతర సిబ్బంది, ప్రయాణికులతో అలాన్ మళ్లీ బయలుదేరారు. ఈసారి అలాన్ యాత్ర విజయవంతమైంది.
ప్రయాణానికి ముందు, అలాన్ ఒక పత్రంపై సంతకం చేయాల్సి వచ్చింది.
అట్లాంటిక్ మహాసముద్రం దిగువన ఉన్న టైటాన్ సబ్‌మెర్సిబుల్ వంటి ప్రయోగాలలో ప్రమాదం జరిగితే నిర్వాహక కంపెనీకి సంబంధం లేదని, ప్రయాణికులదే బాధ్యత అని ఉంది.
"మీరు జరిగే అన్ని విషయాలను జాగ్రత్తగా చదవండి. విమానం ఎక్కడం కూడా ప్రమాదమే. ఇది మామూలుగా అనిపించినా ప్రాణాలకు ప్రమాదం. అయితే మునిగిన టైటానిక్‌ను చూడటం ఆనందంగా ఉందని దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారు చెప్పారు" అని అలాన్ గుర్తుచేశారు.
"ఇది చాలా కారణాల వల్ల అద్భుతమైనది. చాలా తక్కువ మంది మాత్రమే చాలా లోతుకు వెళ్లారు. మునిగిపోయిన ఓడను చూడటం ప్రత్యేకం. మీరు చలనచిత్రాలు, డాక్యుమెంటరీలలో చాలాసార్లు చూసిన చిత్రం మీ ముందు ఉంది'' అని అన్నారు.
జలాంతర్గామిలో ప్రయాణం ఎలా ఉంటుంది?
జలాంతర్గామిలో ప్రయాణం మొదట్లో రాకెట్ ప్రయోగంలా అనిపిస్తుందని అలాన్ వివరించారు.
“నిజాయితీగా చెప్పాలంటే, జలాంతర్గామి యాత్ర ప్రత్యేకమైనదేం కాదు. మీరు క్యాప్సూల్ లోపల ఉన్నారు. ఇది క్లాస్ట్రోఫోబియా ఉన్న ఎవరైనా ఊహించలేనిది. ఇంకేం లేదు. అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే టైటానిక్ శిథిలాల ముందు ఉండటం'' అని తెలిపారు.
కార్బన్ ఫైబర్, టైటానియంతో తయారైన జలాంతర్గామిలో తిరగడానికి ఎక్కువ స్థలం ఉండదు.
ఈ జలాంతర్గామి 6.7 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఇందులో ఐదుగురి కోసం 96 గంటల వరకు సరిపడేంత ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణానికి మొత్తం 8 గంటల సమయం పడుతుంది.
సముద్రంలోకి 4 వేల మీటర్లు వెళ్లడానికి రెండు గంటలు, టైటానిక్‌ని చూడటానికి 4 గంటలు, తిరిగి రావడానికి 2 గంటల సమయం పడుతుంది.

ఫొటో సోర్స్, ALAN ESTRADA
జలాంతర్గామి నుంచి మనుషులు బయటికి రావొచ్చా?
జలాంతర్గామి లోపల ఉన్నప్పుడు అలాన్ దానిని నడిపారు. దీనిని వైర్‌లెస్ వీడియో గేమ్ కంట్రోలర్‌లా కనిపించే పరికరం ద్వారా నియంత్రిస్తారు.
"జలాంతర్గామిని నియంత్రించడం చాలా సులభం. దీన్ని ముందుకు, వెనుకకు, పైకి కిందికి తిప్పవచ్చు. అయితే, ఆ చీకటి ప్రదేశంలో కమ్యూనికేషన్, నావిగేషన్ సిస్టమ్స్ సహాయంతో టైటానిక్ అవశేషాలను చేరుకోవడం కష్టం.'' అన్నారు అలాన్.
తన సందర్శన సమయంలో అలాన్ తన వీడియోలలో ఒకదానిలో చూపిన విధంగా మునిగిపోయిన ఓడను చేరుకునేముందు అలాన్ టైటానిక్ చలనచిత్రంలోని కొంత భాగాన్ని కూడా చూశారు.
కాగా, జలాంతర్గామిని లోపలి నుంచి తెరవడం సాధ్యపడదు.
బయటి నుంచి కొన్ని ప్రత్యేక ఉపకరణాల సహాయంతో మాత్రమే తెరుస్తారు.
అందుకే బయటి వారి సాయం లేకుండా ప్రయాణికులు బయటకు రాలేరు.
''వారు చేయగలిగిందేమీ లేదు. రెస్క్యూ కోసం వేచి ఉండటమే. వారు నిరంతరం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నా'' అని తెలిపారు అలాన్.
ఈ పర్యటన కోసం ఖర్చు పెట్టిన డబ్బు కారణంగా ఇది "అత్యంత వివాదాస్పదమైనది" అని తనకు తెలుసునని అంటున్నారు.
"ఈ రకమైన ప్రయాణం ధనవంతులకు చెందినదిగా కొంతమంది భావిస్తారు.ఈ విధంగా సముద్రపు లోతులలో పరిశోధన కొనసాగాలని నేను, నేను కలిసిన శాస్త్రవేత్తలు నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది చాలా విలువైనది'' అని చెబుతున్నారు అలాన్.
జలాంతర్గామిలో ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది కనుగొంటారని అలాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
"చివరికి ఇది ఒక చీకటి అధ్యాయం, దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
- మధ్యధరా సముద్రం: ‘‘చేపలకు వల వేస్తే మనుషుల శవాలు వస్తున్నాయి. భయమేస్తోంది’’
- జోషీమఠ్: కుంగిపోతున్న ఈ నగరానికి మహాభారతానికి ఏంటి సంబంధం?
- సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
- ‘సలాం హారతి’ పేరు మార్పు వివాదం ఏమిటి? హిందూ దేవాలయాల్లో టిప్పు సుల్తాన్ దీన్ని ప్రవేశపెట్టారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















