యాజిదీ మహిళను బానిసగా మార్చి, భర్తతో అత్యాచారం చేయించేందుకు ప్రయత్నించిన భార్యకు 9 ఏళ్ల జైలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, కాథ్రీన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపులో చేరి, ఒక యాజిదీ తెగకు చెందిన మహిళను బానిసగా మార్చుకోవడం సహా, పలు నేరారోపణలతో ఒక జర్మన్ మహిళకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష పడింది.
మానవత్వాన్ని మరిచి వ్యవహరించడంతోపాటు, విదేశీ మిలిటెంట్ గ్రూపుల్లో సభ్యత్వం పొందినందుకు ఆమెను దోషిగా తేల్చింది జర్మనీ న్యాయస్థానం.
37 ఏళ్ల వయసున్న నాడైన్ కె. అనే మహిళ, సిరియా, ఇరాక్‌లలో నివసించిన కాలంలో యాజిదీ తెగకు చెందిన యువతిని మూడేళ్లపాటు వేధించినట్లు జర్మనీలోని కొబ్లెంజ్ నగరంలోని కోర్టు నిర్ధరించింది.
ఆ యువతిని తీవ్రంగా హింసించడంతోపాటు, ఆమెపై అత్యాచారం చేసేందుకు తన భర్తను ఎగదోసేదని నాడైన్ పై ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేసింది.
‘‘యాజిదీ తెగ మత విశ్వాసాలను తుడిచి పెట్టడం అనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆకాంక్షను నిజం చేయడానికి ఆమె చేసిన ప్రయత్నం ఇది’’ అని జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
యాజిదీలపై అఘాయిత్యాలు
ఐఎస్ మిలిటెంట్లు 2014లో ఇరాక్‌లోని యాజిదీ తెగ ప్రజలు నివసించే ప్రాంతంతోకి చొరబడ్డారు. ఈ ఘటనను ‘మారణహోమం’ గా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.
మతం మారాలని, లేదంటే తమ చేతిలో చచ్చిపోవాలంటూ హెచ్చరించి, తమ మాట వినని 12 సంవత్సరాలలోపు పిల్లలు అనేకమందిని ఐఎస్ తీవ్రవాదులు హత్య చేశారు.
దాదాపు 7,000 మంది మహిళలను, బాలికలు బానిసలుగా మార్చి తీవ్రమైన వేధింపులకు గురి చేశారు.
అలా యాజిదీ తెగపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో నాడైన్ ఒకరు. భర్తతో కలిసి ఉత్తర ఇరాక్ నగరం మోసూల్‌లో ఉన్న కాలంలో ఆమె బాధితురాలిని బానిసగా వాడుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
2016 నుంచి ఆ బాధిత మహిళ వారికి బానిసగా కొనసాగింది.
20 ఏళ్ల వయసున్న ఈ బాధితురాలిని, ఐఎస్‌లో ఏడాదిపాటు శిక్షణ పొందడానికి సిరియా వెళ్లి తిరిగి వస్తూ తమతోపాటు తీసుకొచ్చారు నాడైన్, ఆమె భర్త .
2019 మార్చిలో, నాడైన్‌ను ఆమె కుటుంబాన్ని సిరియాలోని కుర్దు దళాలు బంధించాయి. ఆమెను స్వదేశం జర్మనీకి పంపడంతో అక్కడ ఆమెను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ మేం ఆమెను వేధించలేదు’
తాము యాజిదీ యువతిని వేధించామన్న ఆరోపణలను నాడైన్, ఆమె భర్త ఖండించారు. ఆ యువతికి తాము ఎంతో సహాయం కూడా చేశామని చెప్పారు.
2019లో బానిసత్వం నుంచి విడుదలైన బాధితురాలు కోర్టు విచారణకు హాజరై సాక్ష్యం చెప్పారు. బుధవారం నాటి తీర్పును కూడా ఆమె విన్నారు.
ఇలాంటి నేరాలకు పాల్పడిన వారందరికీ శిక్షపడుతుందని తన క్లయింట్ ఆశిస్తున్నట్లు ఆమె లాయర్ మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాజిదీలను వేధించిన వారిపై కేసులు
యాజిదీలను చంపడం, వేధించడంలాంటి ఆరోపణల కింద అనేకమంది మాజీ ఐఎస్ సభ్యులను జర్మనీలో విచారించారు.
2021 అక్టోబర్‌లో ఒక మహిళకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది జర్మనీ కోర్టు. ఆమె, ఆమె భర్త కలిసి తాము బానిసగా తెచ్చుకున్న యాజిదీ యువతిని హత్య చేశారన్నది వారిపై ఉన్న ఆరోపణ
ఈ తీర్పు వెలువడిన నెల రోజుల తర్వాత, యాజిదీలపై ఐఎస్ తీవ్రవాదులు జరిపే వేధింపులను ‘మారణహోమం’గా గుర్తిస్తూ తొలిసారి ప్రపంచస్థాయి తీర్పును వెలువరించింది జర్మనీ కోర్టు.
ఇవి కూడా చదవండి:
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














