ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...

ఫ్రాన్స్ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నార్బెర్టో పరేడెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పారిస్‌ నగరపు శివార్లలో ఒక పోలీస్ అధికారి నహెల్ అనే యువకుడిని కాల్చి చంపిన తర్వాత మొదలైన అల్లర్లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

అనేక హింసాత్మక ఘటనలు జరుగుతుండగా, పోలీసులు వాటిని అణచివేసే క్రమంలో వందలమందిని అరెస్టు చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసు దళాలను రంగంలోకి దించినా అలర్లు ఆగడం లేదు.

శనివారం రాత్రి మార్సెయిల్ నగరంలో నిరసనలు అత్యంత హింసాత్మకంగా కనిపించాయి. ఇక్కడ నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నట్లు వీడియో ఫుటేజీలలో కనిపించింది.

శనివారం నాడు 427మందిని అరెస్టు చేశామని ఆ దేశ హోంమంత్రి గెరాల్డ్ డర్మానిన్ ప్రకటించారు. ఆదివారంనాటికి ఈ అరెస్టుల సంఖ్య 700 చేరింది.

శుక్రవారం రాత్రికి 1,300 మందికి పైగా, గురువారం రాత్రి 900 మందికి పైగా అరెస్టులు జరిగాయి.

ప్రజలు శాంతంగా ఉండాలంటూ సాకర్ ప్లేయర్ ఎంబాపే లాంటి సెలబ్రిటీలు, పలువురు అధికారులు విజ్జప్తులు చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు.

నహెల్‌ను కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని హత్యా నేరం ఆరోపణలపై అరెస్టు చేశారు. అయినా, ఫ్రాన్స్‌లో నిరసనలు మాత్రం చల్లారడం లేదు.

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న ఈ అల్లర్లకు దారి తీసిన ప్రధానమైన మూడు కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నహెల్

ఫొటో సోర్స్, Getty Images

1. నహెల్ ఎవరు?

అల్జీరియన్ మూలాలున్న యువకుడు. స్థానిక వార్తాపత్రిక లే పారిసియన్ ప్రకారం, నాంటెర్రెలోని వియక్స్‌పాంట్ జిల్లాలో నివసించే మౌనియా అనే మహిళ ఏకైక సంతానం అతడు.

నహెల్ విద్యాభ్యాసం అంత సజావుగా సాగలేదని తెలుస్తోంది. ఎలక్ట్రీషియన్‌గా శిక్షణ పొందేందుకు సమీపంలోని సురెస్నెస్‌ పట్టణంలోని ఒక కాలేజీలో చేరాడు. తర్వాత పిజ్జా డెలివరీ మ్యాన్‌గా కూడా పని చేస్తున్నాడు.

‘‘నహెల్ అందరితో కలిసిపోయేవాడు. తాను చేస్తున్న పనిలో రాణించాలని కోరుకునేవాడు. మాదకద్రవ్యాలు, అక్రమ వ్యవహారాలు లేదా నేరాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు’’ అని జెఫ్ ఫ్యూచ్ అనే వ్యక్తి లే పారిసియన్ పత్రికకు చెప్పారు. ఆయన నహెల్ రగ్బీ ఆడే క్లబ్‌ ప్రెసిడెంట్.

తన చుట్టు పక్కల ప్రాంతాల వారు అతన్ని ఎంతో ఇష్టపడే వారని నహెల్‌ లాయర్లు చెప్పారు. తన కొడుకే తనకు సర్వస్వమని నహెల్ తల్లి మౌనియా అన్నారు.

నహెల్‌కు ఎలాంటి నేర చరిత్ర కూడా లేదని అతని లాయర్లు స్పష్టం చేశారు. పోలీసులను చూసి భయపడి పారిపోయే వ్యక్తి కూడా కాదన్నారు.

అయితే, అతను మరణించిన కొన్ని గంటల తర్వాత, నాంటెర్రె ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అతను తరచూ పోలీసులతో వాదనకు దిగేవాడని, కారు తనిఖీలకు ఒప్పుకునే వాడు కాదని, లీగల్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌కు అతను పరిచితుడేనని ఆ ప్రకటనలో ఉంది.

కారును ఆపాలని ఆదేశించినా ఆపనందుకే అతనిపై కాల్పులు జరిగాయని కాల్పులు జరిపిన పోలీసు చెప్పారు. మోటారు సైకిళ్లపై వస్తున్న ఇద్దరు వ్యక్తులపైకి అతని వాహనం దూసుకుపోయిందని పోలీసు వర్గాలు చెప్పాయి.

అతని హత్యకు సంబంధించి సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రసారం అవుతున్న వీడియోను ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ధృవీకరించింది. ఇందులో ఇద్దరు పోలీసులలో ఒకరు, కారు స్టార్ట్ అవుతుండగా, డ్రైవర్‌కు గురిపెట్టి పాయింట్‌ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపినట్లుగా ఉంది.

‘‘అతని తల మీద కాల్చబోతున్నారు’’ అని ఆ వీడియోలో ఎవరో వ్యక్తులు అనడం వినిపిస్తుంది. అయితే, ఆ మాటలు ఎవరివి, ఎవరి గురించి చెప్పినవి అన్నది నిర్ధరణ కాలేదు. ఛాతిపై కాల్చిన కొద్దిసేపటికే నహెల్ మరణించాడు.

హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 38 ఏళ్ల పోలీసు అధికారిని విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

2. జాత్యహంకారం, పోలీసుల క్రూరత్వం

గత ఏడాది ట్రాఫిక్ చెకింగ్‌ల దగ్గర రికార్డు స్థాయిలో 13 మరణాలు నమోదైనట్లు తేలింది. ఇది ఫ్రాన్స్‌లో పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తించింది.

ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఇలా మరణించిన రెండో వ్యక్తి నహెల్. రెండు వారాల కిందట పశ్చిమ ఫ్రాన్స్‌లోని ఒక పట్టణంలో 19 ఏళ్ల డ్రైవర్ ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా అధికారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసులు కాల్చిచంపారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, కౌన్సిల్ ఆఫ్ యూరోప్ వంటి సంస్థలు ఇటీవల ఫ్రెంచ్ భద్రతా దళాలు "ఎల్లో షర్ట్స్" వంటి పోలీసు బృందాలు పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై క్రూరంగా ప్రవర్తించాయని, పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

నహెల్ మరణంతో ఈ విమర్శలు మరింత పదునెక్కాయి.

నహెల్ మరణించిన మూడు రోజుల తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై ఫ్రాన్స్‌కు ఒక విజ్జప్తి చేసింది. పోలీసు బలగాలలో జాత్యహంకార ధోరణులను తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరింది.

"చట్టాల అమలు సమయంలో జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రదర్శించడం అనే సమస్యను తక్షణం పరిష్కరించాల్సిన సమయం వచ్చింది’’ అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమీషన్ ప్రతినిధి రవీనా శందాసాని అన్నారు.

నిరసన ప్రదర్శనలను అడ్డుకునే క్రమంలో పోలీసులు హింస, బలప్రయోగాలను తగ్గించి, చట్టబద్ధంగా వ్యవహరించాలని, వివక్షను ప్రదర్శించరాదని శందాసాని ఫ్రెంచ్ అధికారులను కోరారు.

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Reuters

3. శివారు ప్రాంతాల సమస్య

నహెల్ మరణం ఫ్రాన్స్‌లోని నిరంతరం వివక్షకు గురయ్యే శివారు ప్రాంతాల ప్రజల ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టింది.

"ఈ కమ్యూనిటీలలో నివసించే వ్యక్తులు జాతీయ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ వలసదారులు. నిరుద్యోగంలో జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ" అని మోంటైగ్నే ఇన్‌స్టిట్యూట్ కోసం రాసిన ఓ వ్యాసంలో ఐయోనా లెఫెబ్వ్రే పేర్కొన్నారు.

బాన్లీయూస్ అని పిలిచే ఈ శివారు ప్రాంతాలు తరచు నహెల్ వంటి ఘటనలపై నిరసనలకు వేదికలుగా మారాయి.

2005లో పారిస్ శివారు ప్రాంతమైన క్లిచి-సౌస్-బోయిస్ ప్రాంతంలో ఇలాంటి గొడవే జరిగింది. 15, 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ముస్లిం యువకులు పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించి, విద్యుదాఘాతానికి గురై మరణించారు.

అప్పటి ఆందోళనపై స్పందించిన నాటి ఫ్రెంచ్ హోం మినిస్టర్ నికోలస్ సర్కోజీ (తర్వాత అధ్యక్షుడు కూడా అయ్యారు), ఈ ప్రదర్శనలను మురికి ప్రదర్శనలుగా అభివర్ణించారు.

2017లో థియోడోర్ లుహాకా అనే యువకుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ మరో శివారు ప్రాంతం సీన్-సెయింట్-డెనిస్‌‌లో కూడా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు కూడా మళ్లీ శివారు ప్రాంతంలోనే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

నహెల్ మరణం తర్వాత నాంటెర్ ప్రాంతం వంతు వచ్చింది.

‘‘ఈ ఆందోళనలలో పాల్గొంటున్న చాలామంది యువకులు నహెల్ వయసు వారే. తమ ఈడు కుర్రవాడు హత్యకు గురి కావడంతో వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని తమలో ఒకడిగా భావించడం వల్లే నిరసన ఇంత తీవ్రంగా ఉంది’’ అని లే మోండే వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఫాబియన్ ట్రూంగ్ పేర్కొన్నారు.

"ఈ పరిసరాల్లోని కుర్రకారుపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ పేదరికం, అభద్రత ఎవరూ కాదనలేని పచ్చి నిజాలు. అందుకే ఈ ఆగ్రహం" అన్నారాయన.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)