కాలు కట్ చేసి మహిళను కాపాడారు.. ఎయిర్‌పోర్టు ట్రావెలేటర్‌లో ఇరుక్కుపోవడంతో ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జి, జోయెల్ గింటో, థాన్యారత్ డోక్సోన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ విమానాశ్రయంలోని ట్రావెలేటర్‌లో ప్రయాణికురాలు ఇరుక్కుపోవడంతో ఆమె కాలు తొలగించాల్సి వచ్చింది.
ట్రావెలేటర్‌లో కాలు ఇరుక్కుపోవడంతో ఆమెను బయటికి తీయడం సాధ్యం కాలేదు.
దీంతో రెస్క్యూ బృందం ఆమె కాలు కట్ చేసి బయటికి తీశారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
శస్త్రచికిత్స జరిగిన తర్వాత కుటుంబసభ్యులు షాక్‌కు గురైనట్లు, ఆమె మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందినట్లు ఆమె కుమారుడు కిట్ కిత్తిరత్తనా చెప్పారు.
గురువారం ఉదయం 57 ఏళ్ల ఆ ప్రయాణికురాలు థాయ్‌లాండ్‌లోని డాన్ ముయాంగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అనంతరం విమానం వద్దకు ట్రావెలేటర్ మీద వెళుతుండగా సూట్‌కేస్ తగిలి జారిపడటంతో కాలు ఇరుక్కుపోయిందని స్థానిక మీడియా తెలిపింది.
తన తల్లికి జరిగింది ఆందోళన కలిగిస్తోందని కిట్ కిత్తిరత్తనా ఫేస్‌బుక్‌లో రాశారు.
"ఆపరేషన్‌కు ముందు, తర్వాత మేం ఆమెతో మాట్లాడవలసి వచ్చింది. ఆమె ముఖం, మాటల్లో ధైర్యం ప్రదర్శించినప్పటికీ, అకస్మాత్తుగా కాలు కోల్పోయినందున ఆమె గుండె పగిలిపోయిందని మాకు తెలుసు" అని కిట్ కిత్తిరత్తనా తెలిపారు. .
"మేం ఆమె కాలుని మునుపటిలా పని చేయించలేం. ఆమె జీవితాన్ని తిరిగి తీసుకురాలేం" అని చెప్పారు.

ఫొటో సోర్స్, DON MUEANG INTERNATIONAL AIRPORT
సూట్‌కేసు చక్రాలు ఊడిపోవడంతో..
ట్రావెలేటర్‌లో ఎడమ కాలు కూరుకుపోయి కూర్చున్న మహిళ ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
ఆమె పక్కనున్న గులాబీ రంగు సూట్‌కేస్‌కు రెండు చక్రాలు ఊడిపోయాయి. ట్రావెలేటర్ చివరలో ఉండే పసుపు రంగు ప్లేట్స్ పగిలిపోయి కనిపించాయి.
ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు యాజమాన్యం తెలిపింది.
కాలు కోల్పోయిన మహిళకు నష్టపరిహారం, వైద్య ఖర్చులు భరించనున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని విమానాశ్రయ డైరెక్టర్ కరంత్ థానకుల్జీరపట్ గురువారం విలేకరులతో అన్నారు.
2025 నాటికి పాత ట్రావెలేటర్లను తొలగించి, కొత్తవి అందుబాటులోకి తీసుకురావాలని గత కొద్దిరోజులుగా ఎయిర్‌పోర్టు యాజమాన్యం యోచిస్తోందని, ఇప్పుడు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని అన్నారు.
1996 నుంచి ఈ ట్రావెలేటర్ పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- బైజూస్: రాకెట్లా దూసుకెళ్లిన ఈ కంపెనీ ఎందుకింతలా పతనమైంది?
- నిర్మలా సీతారామన్: 'ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబులు వేశారు'
- అనుప్‌గిరి గోసైన్: ఈ నగ్న నాగా సాధువు ఒక 'భయంకర' యుద్ధ వీరుడు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం... కోటి మందికి ఉచితంగా ఇంటర్న్‌షిప్
- తూర్పు గోదావరి: ‘అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.. విగ్రహాన్ని తొలగించి తహసీల్దార్ ఆఫీసులో పడేశారు’














