‘లేకలేక పుట్టిన కూతురు, మమ్మల్ని చంపేస్తా అంటోంది’

కట్టేసిన చేతులు, స్మార్ట్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్ష్మి పటేల్
    • హోదా, బీబీసీ గుజరాతీ

‘మా 13 ఏళ్ల కూతురు మమ్మల్ని చంపుతానంటోంది. టీ చేసుకునేటప్పుడు కిచెన్‌లో ఉన్న చక్కెరలో మందులు కలపడం, నేను బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు ప్రతి ఉదయం లిక్విడ్ చిమ్మడం, యూట్యూబ్‌లో నిత్యం హత్య ఎలా చేయాలి అనే వీడియోలు చూడటం చేస్తోంది’’ అని చెబుతూ అహ్మదాబాద్‌కి చెందిన 56 ఏళ్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు.

సాయం కోసం గుజరాత్ ప్రభుత్వ 181 హెల్ప్‌లైన్ నంబర్ ‘అభయం’కి కాల్ చేశారు.

తన బాధను చెప్పుకుంటూ వచ్చిన ఆయన, ఎలాగైనా తన కూతుర్ని మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడేయాలని కోరారు.

దాంతో హెల్ప్‌లైన్ సిబ్బంది ఆ 13 ఏళ్ల బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

2023 జూన్ 7న ఓ తండ్రి నుంచి 181 హెల్ప్‌లైన్‌కి కాల్ వచ్చింది.

‘‘నా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. నా కూతురి మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది. మీరు రావాలి, వచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలి’’ అని ఆయన అభ్యర్థించారు.

కాల్ అందుకున్న వెంటనే, 181 కౌన్సెలర్లు ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. తల్లిదండ్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 26 ఏళ్ల క్రితం వారికి పెళ్లి అయినట్లు తెలిసింది.

భర్త వయసు 56 ఏళ్లు, భార్య వయసు 46 ఏళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. కూతురికి 13 ఏళ్లు. కొడుకుకి ఏడేళ్లు.

పెళ్లైన చాలా కాలానికి వారికి కూతురు పుట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకు కొడుకు పుట్టాడు.

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

తన బాధంతా చెప్పిన తండ్రి

ఈ కేసు విషయం బీబీసీతో 181 హెల్ప్‌లైన్ కౌన్సెలర్ ఫాల్గుని పటేల్ మాట్లాడారు. ఆ తండ్రి చెప్పిన వివరాలను ఫాల్గుని బీబీసీతో పంచుకున్నారు.

‘‘మా ఇంట్లో చాలా కాలానికి పాప పుట్టడంతో మేమెంతో సంతోషించాం. కానీ, ఈ రోజు మేమే భయపడాల్సి వస్తుంది. మాకు 13 ఏళ్ల కూతురుంది. ప్రతి రోజూ మమ్మల్ని కించపరుస్తూనే ఉంటుంది. రాత్రంతా మేల్కొనే ఉంటోంది. మధ్యాహ్నం 12 గంటలకు లేస్తుంది. రోజంతా టీవీ చూస్తుంది. చెప్పకుండానే బయటికి వెళ్తుంది. మమ్మల్ని చంపుతానని బెదిరిస్తుంది’’ అని బాలిక తండ్రి ఫాల్గునికి చెప్పారు.

‘‘ఈ ఇంట్లో ఎవరూ ఉండొద్దు. నేను ఒక్కదాన్నే ఉండాలనుకుంటున్నా అని అంటోంది. గత 4 నెలలుగా అసలు స్కూల్‌కి కూడా పోవడం లేదు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతుంది. ఇంత చిన్న వయసులోనే చెడుకి ఆకర్షితురాలైంది. లాక్‌డౌన్ విధించినప్పుడు, ఆన్‌లైన్ విద్య తప్పనిసరి కావడంతో, మేం మా కూతురికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చాం’’ అని తండ్రి చెప్పారు.

తన కూతురి పరిస్థితి గురించి మరింత వివరించిన ఆ తండ్రి.. ‘‘సోషల్ మీడియా కాలంలో, మా కూతురు కూడా చెడుకి బానిసైంది. సోషల్ మీడియా ద్వారా ఇతర అబ్బాయిలతో మాట్లాడుతుంది. ఆ అబ్బాయిలను కూడా రహస్యంగా కలుస్తుంది. మా నుంచి చాలా దాచిపెడుతుంది. తెలుసుకోకూడని చాలా విషయాలను తాను తెలుసుకుంటుంది.

ఇది నాకు తెలిసిన తర్వాత కూతురి నుంచి నా భార్య స్మార్ట్‌ఫోన్ లాగేసుకుంది.

2 నెలల నుంచి ఆమె వద్ద ఫోన్ లేదు. మేం ఫోన్ తీసేసుకోవడంతో మమ్మల్ని తిట్టడం ప్రారంభించింది. మమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తుంది’’ అని ఆ తండ్రి బాధపడ్డారు.

మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలోనే ప్రేమ, డేటింగ్

2023 జూన్ 7న తానేం చేసిందో చెబుతూ మరిన్ని వివరాలు తెలిపారు.

‘‘కిచెన్‌లోని చక్కెర డబ్బాలో ఏవో మెడిసిన్లను కలిపింది.

ప్రతి రోజూ ఉదయం నేను బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు బాత్‌రూమ్‌లో లిక్విడ్‌ను చల్లుతోంది.. హత్యలు ఎలా చేయాలనే వీడియోలు యూట్యూబ్‌లో చూస్తుంది. ’’ అని ఆయన చెప్పారు.

‘‘ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్లేందుకు మేం అనుమతించకపోతే, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తుంది. ఏడేళ్ల తమ్ముడిని కొడుతుంది. చుట్టుపక్కల వారి భయానికి మేం ఈ విషయాలను ఎవరికీ చెప్పడం లేదు. కూతుర్ని బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నాం.

ఐదారు గంటల తర్వాత మళ్లీ ఇంటికి వస్తుంది. ఆమె పేరున ఈ ఇల్లు రాయమంటోంది. లేదంటే మీరందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోండి. నేను ఈ ఇంటిని అమ్మేసి, విదేశాలకు వెళ్తాను అంటోంది’’ అని తండ్రి వాపోయారు.

181 హెల్ప్‌లైన్ టీమ్ ముందు ఈ విషయాలన్ని చెబుతూ బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారని ఫాల్గుని పటేల్ తెలిపారు.

‘‘మీరు ఏదైనా చేయండి. నా కూతురికి కౌన్సెలింగ్ ఇవ్వండి. ఆమె ఏం ఆలోచిస్తుందో మీరు తెలుసుకోండి. ఆమె ఏం చేయాలనుకుంటోందో కనుక్కోండి’’ అని ఆ అమ్మాయి తల్లి కూడా వేడుకున్నారు.

వారి 13 ఏళ్ల కూతురికి కౌన్సెలింగ్ ఇచ్చే సమయంలో 181 టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంది.

‘‘గత రెండేళ్లుగా ఆమె ఒక అబ్బాయి ప్రేమలో ఉంది. సోషల్ మీడియా సైటు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ అబ్బాయి పరిచయమయ్యాడు. ఆ యాప్‌‌లో 13 నుంచి 14 అకౌంట్లు ఆమెకున్నాయి. ప్రేమ, సెక్స్ వంటి విషయాలకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తెలుసుకుంది’’ అని కౌన్సెలింగ్ టీమ్‌కి తెలిసింది.

‘‘నేను ఆ అబ్బాయికి కాల్ చేస్తాను. నేను మా అక్క వాళ్ల ఇంటికెళ్లే నెపంతో ఆ అబ్బాయిని కలిసేందుకు వెళ్లేదాన్ని. నేను ఇవన్నీ చేయకూడదని నాకు తెలియదు. నాకు మొబైల్ వచ్చిన తర్వాత నుంచి అన్నింటి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. నా ఇంటి పక్కనున్న, మా స్కూల్‌లో అక్కలు, సమాజం దీని గురించి తెలుసుకోవాలని సూచనలు ఇచ్చేవారు. అలా నేను ఆ అబ్బాయితో ప్రేమ కొనసాగించాను’’ అని ఆ పాప కౌన్సెలింగ్‌లో తెలిపింది.

కుంగుబాటు

ఫొటో సోర్స్, Getty Images

కౌన్సెలింగ్ తర్వాత ముగ్గురూ తప్పు ఒప్పుకొన్నారు

13 ఏళ్ల ఆ బాలికకు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఆమె తాను అక్కగా పిలిచే ఓ అమ్మాయి పేరు చెప్పింది. ఆమెను కూడా కౌన్సెలర్స్ పిలిపించారు. 13 ఏళ్ల ఈ బాలికతో ప్రేమలో ఉన్న ఆ అబ్బాయి, మూడేళ్ల క్రితం తనతో కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు బాలిక అక్క చెప్పింది.

వారిద్దరికీ బ్రేకప్ కావడంతో, ఆ అబ్బాయి ఈమెతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

181 టీమ్ ఆ బాలికలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత, ఆ ఇద్దరూ కూడా వారి ఇంటి పక్కనే నివసించే ఆ అబ్బాయితో కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.

181 టీమ్ ఆ అబ్బాయి ఎవరో కనుక్కొని కౌన్సెలింగ్‌కు పిలిపించింది. అబ్బాయికి కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఇద్దరితో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఈ వివరాలన్ని సేకరించిన 181 టీమ్, ముగ్గురికి కలిపి కౌన్సెలింగ్ ఇచ్చింది.

తర్వాత, వారు తమ తప్పును తెలుసుకున్నారు. తమ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు.

ఆ అబ్బాయి తన తల్లిదండ్రుల ముందు తప్పు ఒప్పుకొన్నాడు. మళ్లీ ఇలాంటి తప్పు చేయనని చెప్పాడు.

13 బాలిక కూడా తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. తన చదువుపైనే శ్రద్ధ పెడతానని వాగ్దానం చేసింది.

వారికి ఎలాంటి హాని కలిగించనని కూడా తల్లిదండ్రులకు భరోసా ఇచ్చింది.

మొబైల్ ఫోన్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

మొబైల్‌కి, సోషల్ మీడియాకు బానిస

ఇలాంటి సంఘటనే మరొకటి కూడా ఇటీవల జరిగింది.

అహ్మదాబాద్‌లో మనినాగర్ ప్రాంతంలో 20 ఏళ్ల బాలికకు గార్డియన్‌గా ఉంటోన్న ఒక ఆమె, 181 మహిళా అభయం హెల్ప్‌లైన్‌కి కాల్ చేసింది.

ఆ సంఘటన గురించి కూడా 181 టీమ్, బీబీసీకి తెలిపింది.

‘‘బీఏ మూడో ఏడాది చదువుతున్న 20 ఏళ్ల యవతి మయూరి(పేరు మార్చాం). ఈ యువతి మొబైల్‌కి బానిసైంది. రోజులో ఒక క్షణం కూడా మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వదిలిపెట్టదు. చదువుకునేందుకు కాలేజీకి వెళ్లదు.

కాలేజీ పేరుతో ఇంట్లో నుంచి బయటికి వచ్చి, స్నేహితులతో కలిసి బయటతిరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కోపడుతుంది. ఎవరి మాట వినదు. గత ఆరు నెలలుగా ఒక అబ్బాయితో సంబంధంలో ఉంది.

మొబైల్‌లో అసభ్యకరమైన వీడియోలను తీసుకుని, వాటిని బాయ్‌ఫ్రెండ్‌కి పంపుతుంది. అతనితో బయటికి వెళ్తుంది. చదువులపై ఎలాంటి శ్రద్ధ పెట్టదు. ఆమె తల్లి ఒకరోజు ఆ యువతి ఫోన్ తీసుకున్నప్పుడు వీటన్నింటిన్ని చూసింది. మయూరి చిన్నచిన్న విషయాలకే కోప్పడుతుంది.

ఈ విషయం ఆమె తండ్రికి తెలిసిన వెంటనే, అభయం సాయాన్ని ఆయన కోరారు. మయూరికి ఆమె ఉన్నతమైన భవిష్యత్ కోసం కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే, మంచి జీవితం, కుటుంబం ప్రాధాన్యాన్ని వివరించారు.

మొబైల్ ఫోన్ వాడకం

ఫొటో సోర్స్, Getty Images

‘‘పిల్లలు మొబైల్‌కి బానిసయ్యారనే కేసు సగటున ఒక్కటైనా మా విభాగానికి వస్తుంది. పిల్లలు వివిధ కారణాలతో మొబైల్‌కు బానిస అవుతున్నారు. పని ఒత్తిడి వల్ల తల్లిదండ్రులు పిల్లలకి సమయం కేటాయించలేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

కొన్ని సమయాల్లో పిల్లలు, మొండిగా తయారవుతారు. కొన్ని సార్లు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కి బానిసవుతారు. ’’ అని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ నడిపే ఎస్‌వీపీ హాస్పిటల్‌కి చెందిన సైక్రియాట్రిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ నిమేష్ పారిఖ్ చెప్పారు.

‘‘పిల్లల చేతికి ఫోన్‌ని ఇచ్చిన తర్వాత పేరెంట్స్ కాల వ్యవధిని నిర్ణయించాలి. పిల్లలు ఏం వెతుకుతున్నారు? దానిపై అప్రమత్తంగా ఉండాలి. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ ఆడేందుకు పిల్లల్ని తల్లిదండ్రులు బయటికి తీసుకెళ్లాలి. మొబైల్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలపాలి. అవసరమైతే మొబైల్ వాడకంపై పరిమితి పెట్టొచ్చు’’ అని పారిఖ్ అన్నారు.

‘‘మొబైల్‌కి బానిసైన 60 నుంచి 70 శాతం కేసుల్లో, పిల్లలు గేమ్స్‌కి అతుక్కుపోతున్నారు.

30 శాతం కేసులు ఇంటర్నెట్ సర్‌ఫింగ్ చేస్తున్నారు. 10 శాతం కేసుల్లో టీనేజర్లు పోర్న్ సైట్లు చూస్తున్నారు. ఒకవేళ వీటి నుంచి వారిని అడ్డుకోవాలని చూస్తే, బాగా కోపం పెంచుకుంటున్నారు.

కొన్ని సార్లు వారి చేతికి అందిన వస్తువులను కూడా పగలగొడుతున్నారు. 80 నుంచి 85 శాతం కేసుల్లో, పిల్లల్ని కౌన్సిలింగ్ ద్వారా వీటి నుంచి బయపడేయొచ్చు. 10 శాతం నుంచి 15 శాతం కేసుల్లో మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరమవుతుంది. యాంటీ-డిప్రెస్సెంట్ టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని పారిఖ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)