విజయవాడ ఎయిర్‌పోర్ట్: ప్రైవేట్ క్యాబ్ సేవల విషయంలో అధికారులది రోజుకో తీరు, ప్రయాణికులు బేజారు

- రచయిత, శంకర్ వడిశెట్టి,
- హోదా, బీబీసీ కోసం
విజయవాడ ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణీకులతో దోబూచులాడుతున్నారు.
ప్రైవేటు క్యాబ్ సర్వీసుల విషయంలో పూటకో నిబంధన పెడుతుండటంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇటీవల ఓ ప్రయాణీకుడు ఏకంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం అన్ని క్యాబ్‌లను అనుమతిస్తున్నారు.
అయితే, ఇది తాత్కాలికమేనంటూ ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. పదే పదే ఇలా నిర్ణయాలు మారుస్తూ ప్రయాణీకులతో దోబూచులాడుతున్న తీరు విమర్శలకు కారణమవుతోంది.

ప్రైవేటు ఆపరేటర్ పెత్తనం
విజయవాడ ఎయిర్ పోర్టులో క్యాబ్ కావాలంటే ప్రయాణీకుల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు.
సొంత వాహనమైతే అనుమతిస్తారు. కానీ, ప్రైవేటు క్యాబ్ బుక్ చేసుకుంటే ఎయిర్ పోర్టులోకి అనుమతించరు.
హర్షిణి కార్ ట్రావెల్స్ పేరుతో ఓ సంస్థ అధీకృత ఎయిర్ పోర్ట్ ట్రావెల్ ఆపరేటర్ అంటూ చెప్పుకుంటోంది.
ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే వారి డెస్క్ ఉంటుంది. అక్కడ ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన ప్రాంతం చెబితే ఫిక్స్‌డ్ రేట్ ఉంటుంది. ఆ డబ్బు చెల్లించి, కారు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
హర్షిణి ట్రావెల్స్ వసూలు చేసే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓలా, ఊబర్ సర్వీసులు వసూలు చేసే దానితో పోలిస్తే 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. దాంతో ఈ వసూళ్ల వ్యవహారంపై పలు అభ్యంతరాలు వచ్చాయి.
పలువురు ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని మీద గతంలో బీబీసీ కథనం కూడా రాసింది. ప్రయాణీకుల సంఘం తరుపున ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంలో మార్పు రాలేదు
"చాలా సమస్యగా ఉంటుంది. అంతా వాళ్లిష్టం. తమకు నచ్చిన రేటు పెడతారు. దానిని చెల్లించాల్సిందే. మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఉండదు. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోకి రావడానికి విజయవాడ క్యాబ్ ఆపరేటర్ వసూళ్లు చాలా ఎక్కువ. అయినా అధికారులు స్పందించరు. గతంలో నేను ఎయిర్ పోర్ట్ అథారిటీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేదు" అంటూ వినియోగదారుల ఫోరం ప్రతినిధి హెచ్. రామకృష్ణ బీబీసీకి తెలిపారు.
ఈ సమస్య మీద ఫోరంలో కేసు వేయాలని ఆలోచిస్తుండగా మళ్లీ కొంత కాలం అన్ని క్యాబ్ లను అనుమతించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నానని ఆయన అన్నారు.

కొంతకాలం అనుమతించినప్పటికీ...
బీబీసీ కథనం, పలువురి ఫిర్యాదుల తర్వాత విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో కాంట్రాక్ట్ సంస్థగా చెప్పిన కార్ ఆపరేటర్‌తో పాటుగా ఇతర వాహనాలను కూడా అనుమతించారు.
గత ఏడాది ఆగస్టులో బీబీసీలో కథనం వచ్చిన తర్వాత కొన్ని వారాల పాటు ఓలా, ఊబర్ ఆపరేటర్లకు చెందిన క్యాబ్‌లను ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతించారు. దాంతో ప్రయాణీకులు తమకు నచ్చిన వాహనాన్ని, రేటు మాట్లాడుకుని వెళ్లేందుకు వీలు దక్కింది.
అది కొద్దికాలం పాటు మాత్రమే అమలైంది. మళ్లీ స్వల్ప వ్యవధిలోనే అధికారులు హర్షిణి సంస్థకు చెందిన వాహనాలు తప్ప ఇతరులకు అనుమతి లేదంటూ నిలిపివేశారు.
మళ్లీ ఇతర పైవేట్ క్యాబ్‌లన్నీ ఎయిర్ పోర్ట్ మెయిన్ గేట్ బయటే నిలిపుకోవాల్సి వచ్చేది. కొంతకాలంగా ఎయిర్ పోర్ట్ బయట ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో క్యాబ్ డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది. అంతేగాకుండా ఎయిర్ పోర్ట్‌లో దిగి బయట వరకు నడిచి రావాల్సిన ప్రయాణీకులు మరిన్ని అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చేది
"మేం పుణేలో ఉంటాం. మా ఊరు పెద అవుటపల్లి వెళ్లాడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలే ఓలా క్యాబ్ బుక్ చేసేవారు. తీరా ఎయిర్ పోర్ట్ లోనికి దానిని అనుమతించకపోవడంతో లగేజీ తీసుకని బయట వరకు నడిచివచ్చిన అనుభవం మాకుంది. అలా ఎందుకు చేస్తారో తెలీదు. అధికారులను అడిగితే సొంత వెహికల్ మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. ఏ ఎయిర్ పోర్టులో కూడా అలాంటి నిబంధన లేదు. అయినప్పటికీ ఆపేసేవారు" అని ప్రయాణికురాలు పి. అనురాధ తెలిపారు.
అన్ని వాహనాలు అనుమతించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

మళ్లీ ఇప్పుడు అందరికీ...
వారం క్రితం వరకు బయటి నుంచి వచ్చే ప్రైవేట్ క్యాబ్‌లను కేవలం డ్రాపింగ్ వరకు మాత్రమే టెర్మినల్ వరకూ అనుమతించేవారు.
ఎవరినైనా పికప్ చేసుకోవాలంటే మాత్రం కేవలం సొంత వాహనాలు లేదా హర్షిణి ట్రావెల్స్ కి చెందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేది.
కానీ, ఇటీవల జరిగిన ఓ ఘటన తర్వాత ప్రస్తుతం తాత్కాలికంగా హర్షిణి సంస్థను సస్పెండ్ చేసినట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు మళ్లీ నాలుగు రోజులుగా అన్ని వాహనాలు ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ స్థలంలో నిలుపుకునే అవకాశం వచ్చింది. అయితే ఇది ఎన్నాళ్లు అనేది మాత్రం చెప్పేందుకు ఎయిర్ పోర్ట్ అధికారులు నిరాకరిస్తున్నారు.
కేవలం ఒక్క ఆపరేటర్‌ని మాత్రమే అనుమతించి, మిగిలిన క్యాబ్ డ్రైవర్లందరినీ రోడ్డు మీద నిల్చోవాలని చెప్పడం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులోనూ లేదని అడిగితే, దీనిపై స్పందించడానికి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు నిరాకరించారు.
"ఇప్పుడు అన్ని వాహనాలు అనుమతిస్తున్నారు. ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ అధికారులు ఆలోచించాలి. ఓసారి టెండర్‌లో కాంట్రాక్ట్ తీసుకున్నారని చెబుతారు. ఇంకోసారి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆదేశాల మేరకు ప్రయాణీకుల రక్షణ కోసమే ఇలాంటి నిర్ణయం అని చెబుతుంటారు. కానీ మా క్యాబ్ డ్రైవర్లకు, ఎయిర్ పోర్ట్ సిబ్బందికి చాలాసార్లు తగాదా జరిగింది. అన్ని సర్వీసులను లోపలికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని" విజయవాడకు చెందిన ప్రైవేట్ క్యాబ్ ఆపరేటర్ కె. శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.
రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి నిబంధనలు తీసుకురావడంలో హర్షిణి సంస్థ ప్రయోజనాలే కారణమని ఆయన ఆరోపించారు.

మా సర్వీసులకే అవకాశం
ఎయిర్ పోర్టులో అన్ని క్యాబ్‌లను అనుమతించే అంశంపై విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులను బీబీసీ సంప్రదించింది. కానీ వారు మాత్రం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులను సంప్రదించాలంటూ సలహా ఇచ్చి తాము స్పందించబోమని తెలిపారు.
ఇటీవల దిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకురాలి బిల్లు విషయంలో ట్రావెల్స్ సంస్థ ప్రతినిధులు వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లిందని పేరు చెప్పేందుకు సిద్ధపడని ఓ ఉద్యోగి తెలిపారు.
ఏఏఐ నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా హుటాహుటిన ఆ సంస్థ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం హర్షిణి సంస్థ డెస్క్ మూసివేశారు. బోర్డులు కూడా తొలగించారు. గతంలో హర్షిణి ట్రావెల్స్‌కి మాత్రమే అనుమతిస్తున్నట్టు ఉన్న బోర్డుల స్థానంలో అందరికీ అవకాశం ఇచ్చామంటూ బోర్డులు అధికారికంగా వెలిశాయి. దీనిపై హర్షిణి సంస్థ ప్రతినిధుల వాదన భిన్నంగా ఉంది.
"మేము ఏఏఐకి కాంట్రాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. అది చెల్లించి మళ్లీ వారం తర్వాత మా సేవలను అందుబాటులోకి తెస్తాం. మళ్లీ మేమే అన్ని క్యాబ్‌లు ఆపరేట్ చేస్తాం" అంటూ ఆ సంస్థకు చెందిన నర్రా మణి బీబీసీకి తెలిపారు.
అయితే ఎయిర్ పోర్ట్ అధికారులు లైసెన్స్ ఫీజు పేరుతో ఒక సంస్థను మాత్రమే అనుమతించి, ప్రయాణీకుల నుంచి అధిక వసూళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రస్తుతం సడలించిన నిబంధనలు కొనసాగించి అందరికీ అవకాశం ఉండేలా చూడాలని క్యాబ్ డ్రైవర్లు, ప్రయాణీకులు కూడా కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














