ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు.

బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కంపెనీకి 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్పగించింది. పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్ 23న రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ, ఆ తర్వాత ఆయా ప్రభుత్వాల ప్రకటనలకు తగినట్లుగా అడుగులు పడలేదు.

2019 ఫిబ్రవరి 7న బందరు పోర్టు నిర్మాణ పనుల్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. మేకావారిపాలెంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. దానికి ముందే మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయటం, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించటం, డీపీఆర్‌లు సిద్దపరచడం, తదితర పనులు పూర్తిచేశారు.

అలాగే రైతుల నుంచి పట్టా భూములు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 200 కోట్లు కేటాయించారు. దాంతో పాటుగా 2025 నాటికి రూ.12 వేల కోట్ల వ్యయంతో ఈ ఓడరేవును నిర్మిస్తామని చంద్రబాబు 2019 ఫిబ్రవరిలో ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది.

2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం, నవయుగతో చేసుకున్న బందరు పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో కన్సార్షియం ఏర్పాటు చేసి పోర్టు నిర్మాణం చేపడతామని ప్రకటించింది. దానికి అనుగుణంగా డెవలపర్ కి ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది.

చంద్రబాబు హయంలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పోర్టుని అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు వేయగా దానిని 800 ఎకరాలకు పరిమితం చేస్తున్నట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు 2019 లోనే ప్రకటించారు.

రూ. 5,835 కోట్ల వ్యయంతో మూడేళ్లలో బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని 2020లో ప్రకటించారు. కానీ రెండేళ్లు గడిచినా నేటికీ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాలేదు.

నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ. 4745 కోట్లను మారిటైమ్ బోర్డు ద్వారా రుణం సేకరిస్తామని వెల్లడించారు. డీపీఆర్ ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కూడా ఆయన తెలిపారు.

వరుసగా ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు చేసినప్పటికీ బందరు పోర్టు విషయంలో ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)