అనుప్‌గిరి గోసైన్: ఈ నగ్న నాగా సాధువు ఒక 'భయంకర' యుద్ధ వీరుడు

నాగ సాధువు

ఫొటో సోర్స్, BRITISH LIBRARY

ఫొటో క్యాప్షన్, నాగ సాధువు
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనుప్‌గిరి గోసైన్... ఓ భయంకరమైన కమాండర్‌. నగ్న యోధుల ప్రైవేట్ సైన్యాన్ని కాలినడకన, గుర్రాలు, ఫిరంగులతో యుద్ధభూమికి నడిపించిన వీరుడు.

నిజానికి, అనుప్‌గిరి గోసైన్ ఒక సన్యాసి. శివభక్తికి అంకితమైన వ్యక్తి. భారతదేశంలో ప్రత్యేక గౌరవం పొందే ఒక నాగ సాధువు.

నాగసాధువులు నగ్నంగా, జడలతో, బూడిద పూసుకుని కనిపిస్తారు. దేశంలో ఎంతో ఘనంగా జరుపుకునే కుంభమేళాలో వీళ్లు తరచుగా కనిపిస్తారు.

'వారియర్ అస్టిక్స్ అండ్ ఇండియన్ ఎంపైర్స్' పుస్తకం రచయిత విలియం ఆర్ పించ్ వివరణ ప్రకారం గోసైన్ ఒక యోధ సన్యాసి.

కచ్చితంగా చెప్పాలంటే నాగులకు భయంకరమైన, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారనే ఖ్యాతి ఉంది. స్పష్టమైన తేడా ఏంటంటే 18వ శతాబ్దపు నాగులు ఎక్కువగా ఆయుధాలు, క్రమశిక్షణతో ఉండేవారు.

వారిని అద్భుతమైన అశ్విక, పదాతి దళాలుగా చెబుతారని కనెక్టికట్‌ ప్రాంతంలోని వెస్లియన్ యూనివర్సిటీలో చరిత్రకారుడైన పించ్ చెప్పారు.

19వ శతాబ్దం ప్రారంభంలో ఈస్టిండియా కంపెనీ అధికారి జేమ్స్ స్కిన్నర్ 'నాగా సైనికుడి' చిత్రపటాన్ని ఏర్పాటుచేశారు.

ఈ చిత్రం గన్‌పౌడర్, మందుగుండు సామగ్రి గల పర్సు, కత్తి ఉంచడానికి లెదర్ బెల్ట్‌‌ ఉన్న వ్యక్తిని చూపిస్తోంది. చెప్పులు కూడా ఉండవు.

జుట్టు జడతో మందంగా తల చుట్టూ రక్షిత హెల్మెట్‌లా ఉంది. తన ఎడమ చేతితో పొడవాటి తుపాకి పట్టుకుని, నుదుటిపై ఒక సిందూర తిలకంతో ఉన్నారు.

"నాగాలు షాక్ ట్రూప్‌లు (యుద్దంలో ముందుగా దూకే వీరులు) , నేరుగా చేతులతో పోరాడే యుద్ధంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనుప్‌గిరి కింది వారు పూర్తి స్థాయి పదాతిదళం, అశ్వికదళ సైన్యంగా అభివృద్ధి చెందారు. వారు బలమైన ప్రత్యర్థులతో పోటీపడగలరు" అని పించ్ చెప్పారు.

1700 చివరలో అనుప్‌గిరి, ఆయన సోదరుడు ఉమ్రాగిరిలు 20 వేల కంటే ఎక్కువ మందిగల సైన్యానికి నాయకత్వం వహించారు.

18వ శతాబ్దం చివరి నాటికి ఫిరంగి, రాకెట్లను వాడే సన్యాసి సైనికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అనుప్‌గిరి

ఫొటో సోర్స్, WILLIAM PINCH

ఫొటో క్యాప్షన్, అనుప్‌గిరి

విజయవంతమైన కిరాయి సైనికుడు

రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అనుప్‌గిరిని, "భయకరమైన నాగా కమాండర్"గా అభివర్ణించారు.

అనుప్‌గిరికి 'హిమ్మత్ బహదూర్', 'గ్రేట్ కరేజ్' అనే మొఘల్ బిరుదు ఉంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర , భారతదేశంపై దాని ఆధిపత్యం ఎలా సాగిందనే దాని గురించి ఆయన చెప్పారు. మొఘల్ కమాండర్ అయిన మీర్జా నజాఫ్ ఖాన్ సైన్యం గురించి డాల్రింపుల్ రాశాడు.

ఆ సైన్యంలో అనుప్‌గిరి సైనికులు చేరారు. వారు 6,000 మంది భయంకరమైన నగ్న నాగా యోధులు. 40 ఫిరంగులతో వచ్చారు.

అనుప్‌గిరి సేవలకు గాను "గుర్రాలు, పాదాలపై 10,000 గోసైన్‌లు [సన్యాసులు], అలాగే ఐదు ఫిరంగులు, సామగ్రితో నిండిన అనేక ఎద్దుల బండ్లు, గుడారాలు, 12 లక్షల రూపాయలు " సమకూర్చారని రాశారు.

18వ శతాబ్దపు చివరిలో అత్యంత విజయవంతమైన "మిలటరీ ఎంటర్‌ప్రెన్యూర్" లేదా కిరాయి సైనికుడు అనుప్‌గిరి.

రాజులు నియమించుకున్న దాదాపు అన్ని ప్రైవేట్ సైన్యాలు ఆ రోజుల్లో కిరాయి సైన్యాలే.

అనుప్‌గిరి గురించి తెలిసిన ఒక స్థానికుడు ''ఆయన నదిని దాటేటప్పుడు రెండు పడవలలో కాలు పెట్టి, మునిగిపోతున్న పడవను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిలా ఉన్నాడు" అని చెప్పారని వారణాసి నగరంలోని న్యాయమూర్తి థామస్ బ్రూక్ పేర్కొన్నారు.

యోధుడైన సన్యాసి అందరికీ సుపరిచితుడే అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

"అనుప్‌గిరి ఎక్కువగా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే, ఆయన అవసరం ప్రతి ఒక్కరికీ ఉండేది. అందుకే, ఆయనను పొగిడేవారితో పాటు అసహ్యించుకునేవారు, తిట్టే వారు కూడా అంతే సంఖ్యలో ఉండేవారు. పోరాట దళాలు కావాలనుకున్నప్పుడు అనుప్‌గిరి ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తిగా, అవసరమైనపుడు చెడ్డ పని చేసే వ్యక్తి కూడా అనుప్‌గిరికి పేరుంది'' అని పించ్ తన పుస్తకంలో తెలిపారు.

నాగసాధువుల చిత్రం

ఫొటో సోర్స్, BRITISH LIBRARY

ఏయే యుద్దాల్లో నాగసాధువుల సైన్యం పాల్గొంది?

అనుప్‌గిరి సైన్యం అన్ని వైపులా యుద్ధాలు చేసింది.

1761లో జరిగిన పానిపట్ యుద్ధంలో అతను మొఘల్ చక్రవర్తి, అఫ్గాన్‌ల పక్షాన మరాఠాలకు వ్యతిరేకంగా పోరాడారు.

మూడేళ్ల తరువాత బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొఘల్ దళాలతో కలిసి పోరాడారు.

దిల్లీలో పర్షియన్ సాహసికుడు నజాఫ్ ఖాన్ ఎదుగుదలలో అనుప్‌గిరి కీలక పాత్ర పోషించారు.

తర్వాత మరాఠాలకు వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వారితో చేతులు కలిపారు అనుప్‌గిరి.

1803లో తన జీవిత చరమాంకంలో బ్రిటీష్ వారి చేతిలో మరాఠాల ఓటమిని కారణమయ్యారు. దిల్లీని బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకోవడంలో సహాయపడ్డాడు.

ఈ ఘటన ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రపంచం ముఖ్యంగా దక్షిణాసియాలో ఆధిపత్యం చెలాయించడానికి కారణమైందని పించ్ తెలిపారు.

"18వ శతాబ్దపు చివరలో మొఘల్, మరాఠాల క్షీణత, బ్రిటీష్ అధిపత్యాన్ని ఎంత ఎక్కువగా పరిశీలిస్తే, అంతగా అనుప్‌గిరి గోసైన్ గురించి తెలుస్తుంది" అని పించ్ చెప్పారు.

అనుప్‌గిరి ఎక్కడ పుట్టారు?

అనుప్‌గిరి 1734లో ఉత్తర భారతదేశంలోని బుందేల్‌ఖండ్‌లో జన్మించారు . అన్నయ్య, తండ్రి మరణించడంతో అనుప్‌గిరిని ఆయన తల్లి ఒక సేనాధిపతికి అప్పగించారు. దీంతో అతను తన బాల్యాన్నిసైనికులతోనే గడిపాడని పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

16వ శతాబ్దంలో ముస్లింల దాడులను నిరోధించేందుకు అనుప్‌గిరి వంటి వ్యక్తులు తమను తాము ఆయుధాలుగా చేసుకోవడానికి అనుమతి పొందారని చెబుతుంటారు.

కానీ, పించ్ పరిశీలనలో..

అనుప్‌గిరి మొఘల్ చక్రవర్తి షా ఆలంతో సహా ముస్లిం యజమానులకు సేవ చేశారు.

మరాఠాలకు వ్యతిరేకంగా 1761లో పానిపట్‌లో అఫ్గాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ పక్షాన కూడా పోరాడారు.

అనుప్‌గిరి జీవితం గురించి వివరించే కవితలు ఆయన పరివారంలోని ముస్లిం సైనికుల గురించి చెబుతాయి.

"అనుప్‌గిరి ఉన్నత కుటుంబంలో వ్యక్తిగా ఏమీ జన్మించలేదు. అయితే, ఎలా, ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు పరుగెత్తాలో ఆయనకు బాగా తెలుసు. తను కోల్పోయేది ఏమీ లేదని ప్రత్యర్థులు, మిత్రులను ఎలా ఒప్పించాలో కూడా ఆయనకు తెలుసు" అని అంటారుపించ్.

బెంగాల్, బిహార్‌పై బ్రిటిష్ అధికారాన్ని నెలకొల్పడానికి కారణమైన బాక్సర్ యుద్ధం గురించి డాల్రింపుల్ నాటకీయంగా చెబుతూ, "ఆ యుద్దంలో అనుప్‌గిరి తొడకు తీవ్రంగా గాయమైంది. దీంతో యుద్ధభూమి నుంచి తప్పించుకోవడానికి మొఘల్ చక్రవర్తి షుజా-ఉద్-దౌలాను ఒప్పించారు" అని చెప్పారు.

"ఇది మరణించే క్షణం కాదు. మేం సులభంగా గెలిచి మరొక రోజు ప్రతీకారం తీర్చుకుంటాం" అని అనుప్‌గిరి అప్పుడు చెప్పారని రాశారు.

నదికి అడ్డంగా ఉన్న పడవల వంతెన వద్దకు వెళ్లి, తను దాటాక దాన్ని నాశనం చేయమని అనుప్‌గిరి ఆదేశించారు. యోధుడైన ఆ సన్యాసి మళ్లీ పోరాడటానికి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)