రష్యా ఊపిరి కాసేపు ఆగిపోయేలా చేసిన వాగ్నర్ 'ప్రైవేట్ ఆర్మీ' చీఫ్ ఎందుకు వెనక్కి తగ్గారు... 24 గంటల పాటు అసలేం జరిగింది?

రష్యాలో 24 గంటల పాటు అల్లకల్లోలం సృష్టించిన వాగ్నర్ బాస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో తన బలగాలతో కలిసి ఉన్న యెవ్‌గెనీ ప్రిగోజిన్(ఫైల్ ఫోటో)
    • రచయిత, పౌల్ కిర్బీ
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన కిరాయి సైనికుల నేత యెవ్‌గెనీ ప్రిగోజిన్, 24 గంటల పాటు ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించారు. మాస్కోవైపుకి తన సాయుధ దళాలను పంపి, వ్లాదిమిర్ పుతిన్ అధికారంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఘాటుగా స్పందించారు.

కొందరు రష్యన్లు సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారని, దేశానికి వెన్నుపోటు పొడిచారని ఆయన తన మాజీ స్నేహితుడిని ఉద్దేశించి విమర్శించారు.

శనివారం ముగిసే సమయానికి ప్రిగోజిన్ తాను చేపట్టిన ఈ తిరుగుబాటు నుంచి వెనక్కి తగ్గారు.

రష్యాలో కొన్ని ప్రాంతాలను మోహరించిన తన సైనికులందరూ వాటిని ఆపివేసి, తిరిగి సైనిక స్థావరాలకు వచ్చేయాలని ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.

‘’24 గంటల్లో మాస్కోకి 200 కి.మీల వరకు వెళ్లగలిగాం. ఈ సమయంలో మా సాయుధ దళాలకు చెందిన ఒక్కరి నెత్తుటి చుక్క కూడా కిందకి పడలేదు’’ అని ప్రిగోజిన్ అన్నారు.

రష్యాలో ఈ 24 గంటల అల్లకల్లోలం, మనకు తెలియని విషయాలు ఇక్కడ చూద్దాం..

యెవ్‌గెనీ ప్రిగోజిన్

ఫొటో సోర్స్, CONCORD PRESS SERVICE

ఫొటో క్యాప్షన్, యెవ్‌గెనీ ప్రిగోజిన్

వాగ్నర్ బాస్ తిరుగుబాటుకు ప్రణాళికలు రచిస్తున్నారా?

ప్రిగోజిన్ తన లక్ష్యం సైనిక తిరుగుబాటు కాదని, న్యాయం కోసం చేస్తున్న కవాతు అని సమర్థించుకున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఈ అల్లకల్లోలం చాలా త్వరగానే సద్దుమణిగింది.

యుక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా సైన్యంలో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ నెలలు తరబడి కీలక పాత్ర పోషించారు.

ఆయన కిరాయి సైనిక గ్రూప్ వాగ్నర్ ఈ యుద్ధం కోసం వేలాది మందిని నియమించుకుంది.

ముఖ్యంగా రష్యాలోని జైళ్లలో ఉన్న వారిని యుద్ధానికి ఎంపిక చేసుకుంది.

యుద్ధానికి నేతృత్వం వహిస్తున్న రష్యా మిలిటరీ చీఫ్‌లతో ప్రిగోజిన్ చాలా కాలంగా వ్యతిరేకత చూపుతున్నారు.

అది ఇప్పుడు తిరుగుబాటుగా మారింది.

జూలై 1 కల్లా తన కమాండ్ విధానంలోకి ఆయన బలగాలను తీసుకురావాలని కోరుతూ ఈ తిరుగుబాటు లేవనెత్తారు.

ఆక్రమిత ఈస్ట్రన్ యుక్రెయిన్‌ నుంచి సరిహద్దు మీదుగా రోస్తోవ్-ఆన్-డాన్‌లోకి వాగ్నర్ బలగాలు ప్రవేశించాయి.

ఆ తర్వాత వొరొనెజ్ నగరం మీదుగా మాస్కో వైపుకి కదిలాయి.

యుక్రెయిన్‌‌తో రష్యా 16 నెలలుగా చేస్తున్న యుద్ధంలో నిర్ణయాత్మక సమయం ఇది.

కానీ, వాగ్నర్ కాన్వాయ్ ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి.

బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేశారని తెలిసింది.

అయితే ఇదంతా వినడానికి సాధారణంగా ఉన్నా, ఒకవేళ క్రెమ్లిన్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తే యుద్ధంలో, రష్యా దేశంలో ప్రిగోజిన్ పాత్రకు ఇదొక ముగింపు కావొచ్చు.

ప్రస్తుతం ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్తున్నారని, ఆయన ఎలాంటి నేరపూరిత అభియోగాలను ఎదుర్కోరని రష్యా అధికారిక వర్గాలు చెప్పాయి.

తన సైనికులపై ఎలాంటి చర్యలు లేకుండా క్షమాభిక్ష వాగ్ధానాన్ని ప్రిగోజిన్ పొందారు.

అయితే, ఇదంతా ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా జరిగిందా? కనీసం ఒక్క సైనిక హెలికాప్టర్‌ని కూడా కూల్చకుండా ముగిసిపోయిందా? అన్నది అస్పష్టంగానే ఉంది.

యెవ్‌గినీ ప్రిగోజిన్ - పుతిన్‌కు కుడివైపు ఉన్న వ్యక్తి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యెవ్‌గినీ ప్రిగోజిన్, పుతిన్‌

వాగ్నర్ వర్సెస్ రష్యా సైనిక నేతలు

వాగ్నర్ సైనికులకు తగినంత కిట్, ఆయుధ సామగ్రిని సరఫరా చేయడంలో సైన్యం విఫలమవడంతో యుద్దాన్ని దగ్గరుండి నడిపిస్తున్న రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, సాయుధ దళాలు చీఫ్ వాలెరి గెరాసిమోవ్‌లపై వాగ్నర్ గ్రూప్ చీఫ్ తీవ్రమైన విమర్శలు చేస్తుండేవారు.

రక్షణ మంత్రి కాంట్రాక్ట్‌లపై సంతకం చేసేలా యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తోన్న అన్ని కిరాయి గ్రూప్‌లు ముందుకు రావాలని రక్షణ మంత్రి ఆదేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించడంతో, ప్రిగోజిర్ ఈ తిరుగుబాటుకి పాల్పడ్డారు.

తన గ్రూప్ ఈ కాంట్రాక్ట్‌లపై సంతకాలు చేయదని తెలిపారు. దీన్ని ఆయన తనకు ఎదురైన సవాలుగా తీసుకున్నారు.

యుద్దంపై వారి సమర్థనలు అన్నీ అబద్ధమని, కేవలం ఒక చిన్న గుంపు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రజలను, అధ్యక్షుడిని మోసం చేసే సాకుగా ప్రిగోజిన్ ఆరోపించారు.

యుక్రెయిన్‌లో తమ బలగాలను లక్ష్యంగా చేసుకుని రష్యా సైన్యం దాడులు చేసిందని ప్రిగోజిన్ ఆరోపించారు.

అయితే దానిపై సాక్ష్యాలను అందించడంలో ఆయన విఫలమయ్యారని, మిలిటరీ ఆ వాదనలు తిరస్కరించింది.

అయితే "న్యాయం కోసం కవాతు" జరుగుతోందని ప్రిగోజిన్ శుక్రవారం ప్రకటించారు.

‘‘మా వద్ద 25,000 మంది బలం ఉంది. మా బలగమంతా దేశంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలుసుకునేందుకు వెళ్తుంది‘ అని ప్రిగోజిన్ అన్నారు. చేరాలనుకునే వారు ఎవరైనా తమలో చేరవచ్చని పిలుపునిచ్చారు.

అధ్యక్షుడు పుతిన్‌ అధికారానికి లొంగిపోవాలని, ఈ తిరుగుబాటు నుంచి వెనక్కి తగ్గాలని యుక్రెయిన్‌లోని డిప్యూటీ కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ జనరల్ సెర్గీ సురోవికిన్, ప్రిగోజిన్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే, శనివారం ఉదయానికి ప్రిగోజిన్ మనుషులు రోస్టోవ్-ఆన్-డాన్‌కి చేరుకున్నారు.

"యుద్ధం ప్రారంభమైన స్థలం, సైనిక ప్రధాన కార్యాలయాన్ని మేం మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం.’’ అని ప్రకటించారు.

నగర కేంద్రంలోని వారి సైనిక బలగాలున్న వీడియోలు విడుదలయ్యాయి.

‘‘సైనిక ప్రధాన కార్యాలయం లోపల మేం ఉన్నాం’’ అని శనివారం ఉదయం ఆయన ప్రకటించారు.

‘‘ఎలాంటి కాల్పులు జరపకుండానే’’ తాము దీన్ని నియంత్రణలోకి తీసుకున్నామని చెప్పారు.

వాగ్నర్ చీఫ్‌పై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ క్రిమినల్ కేసు పెట్టింది.

కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రవేశపెట్టి రాజధాని మాస్కో ప్రాంతాన్ని హైఅలర్ట్‌లో పెట్టింది.

వ్లాదిమిర్ పుతిన్
ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

పుతిన్ టెలివిజన్ ప్రసంగం

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు నిమిషాల పాటు రష్యా అధికారిక ఛానల్‌లో ప్రసంగించిన వ్లాదిమిర్ పుతిన్, ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు.

‘‘మనం ఎదుర్కొంటుంది కచ్చితంగా దేశద్రోహమే’’ అని అన్నారు.

వాగ్నర్ చీఫ్ పేరును ప్రస్తావించకుండా మాట్లాడిన పుతిన్, సైనిక తిరుగుబాటు వెనుక ఉన్న వారు రష్యాకు ద్రోహం చేశారని, వారికి కచ్చితంగా సమాధానం చెబుతామని అన్నారు.

తమ విషయంలో పుతిన్ పొరపడ్డారని, తామంతా దేశభక్తులమని వెంటనే ప్రిగోజిన్ స్పందించారు. దేశ ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఖండించారు.

ప్రిగోజిన్ ఎప్పుడూ అధ్యక్షుడిపై తన కోపాన్ని నేరుగా ప్రకటించలేదు.

కానీ "హ్యాపీ గ్రాండ్ ఫాదర్" అనే ఆయన వ్యంగ్య ప్రకటనలు పరోక్ష విమర్శలుగా విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

"ఈ తాత పూర్తి స్టుపిడ్"గా మారితే రష్యా ఎలా గెలవగలదని గత నెలలో ప్రిగోజిన్ విమర్శించారు.

సాయుధ వాగ్నర్ వాహనాలు వొరొనెజ్ ప్రాంతం గుండా పైకి వెళ్లి, అక్కడి నుంచి ఉత్తరాన ఉన్న లిప్స్టెక్‌కి కదిలాయి.

వొరొనెజ్‌లో ఎయిర్‌స్ట్రయిక్‌తో ఇంధన డిపోకి మంటలు అంటుకున్నాయి. అయితే, ఇదెలా జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ప్రిగోజిన్ బలగాలు దాడికి దిగిన ప్రాంతం
ఫొటో క్యాప్షన్, ప్రిగోజిన్ బలగాలు దాడికి దిగిన ప్రాంతం

పుతిన్ అధికారానికి సవాలు

సైనిక తిరుగుబాటుగా చెబుతున్న అన్ని వాదనలు అసంబద్ధమైనవని ప్రిగోజిన్ అంటున్నారు.

యుక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధాన్ని తాము సవాలు చేయడం లేదన్నారు.

అలాగే అధ్యక్షుడి నాయకత్వానికి ప్రత్యక్ష సవాలైతే కాదన్నారు.

తన సైనిక డిమాండ్లను నెరవేర్చకపోతే మాస్కో వైపు వెళతానని ప్రిగోజిన్ హెచ్చరించారు.

వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలతో కొన్ని గంటల పాటు నియంత్రణ కోల్పోయిన నేతగా వ్లాదిమిర్ పుతిన్ కనిపించారు.

శనివారం సాయంత్రం పుతిన్ మరో సన్నిహితుడు, బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో వచ్చిన తర్వాత వీరి మధ్య ఒక సంధి కుదిరింది.

ప్రిగోజిన్ రష్యా వదిలి బెలారస్ బయలుదేరారు.

వాగ్నర్‌పై, ఆయన దళంపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా హామీలు లభించాయి. కారులో రోస్తోవ్ నుంచి వెళ్లిపోయారు.

దీంతో వాగ్నర్ సేనలకు ప్రాసిక్యూషన్ నుంచి విముక్తి లభించింది.

కావాలనుకున్న వారు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, Reuters

పుతిన్‌కు ఎదురుదెబ్బ అనుకోవాలా?

రోజంతా అల్లకల్లోల పరిస్థితుల మధ్య ఒక దేశ అధ్యక్షుడు గడిపారు. ప్రిగోజిన్ దెబ్బకు ఆయన చాలా బలహీనంగా మారిపోయారు.

పరిస్థితులు ప్రమాదకరంగా మారే సమయంలో బెలారస్ నేతపై ఆధారపడాల్సి వచ్చింది.

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న కారణంతో 2020లో నిరసనకారులు దేశాన్ని స్తంభింపజేసినప్పుడు, లుకషెంకోకి రష్యా మద్దతుగా నిలిచింది.

తనని ఘోరంగా అవమానించారని యుక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు.

పుతిన్ నాయకత్వానికి ప్రత్యామ్నాయాన్ని ప్రస్తుతం రష్యన్లు చూశారని కొందరు అంటున్నారు. కొన్ని గంటల పాటు అదొక అరాచకం లాగా కనిపించింది.

ఆయనకు చెందిన 25,000 మంది బలాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు మిలటరీ ఒక మార్గాన్ని కనుగొంది.

ఎట్టకేలకు 24 గంటల్లోగా రష్యాలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితులు బెలారస్ నేత సాయంతో సద్దుమణిగాయి.

వీడియో క్యాప్షన్, పుతిన్ అధికారంపై ప్రశ్నలు లేవనెత్తిన వాగ్నర్ తిరుగుబాటు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)