ప్రిగోజిన్, వాగ్నర్ గ్రూప్: ఇది తిరుగుబాటేనా? పుతిన్ పీఠాన్ని కదిలించగలరా?

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిగోజిన్
    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌‌తో రష్యా 16 నెలలుగా చేస్తున్న యుద్ధంలో నిర్ణయాత్మక సమయం ఇది. వ్లాదిమిర్ పుతిన్ అధికారంపై ఉండే పట్టుకు వాగ్నర్ తిరుగుబాటు ఒక సవాలు.

ఈ నేపథ్యంలో వాగ్నర్ చీఫ్ యెవ్‌గోనీ ప్రిగోజిన్ దేశద్రోహానికి పాల్పడ్డారని, సాయుధ తిరుగుబాటు చేశారని, ఇది దేశానికి వెన్నుపోటు అని పుతిన్ ఆరోపించారు.

మరోవైపు రష్యాలోని అత్యంత ప్రముఖులలో ఒకరైన ఒకరైన ప్రిగోజిన్ తన లక్ష్యం సైనిక తిరుగుబాటు కాదని న్యాయం కోసం చేస్తున్న కవాతు అని సమర్థించుకున్నారు.

ఏం జరుగుతోంది?

యుక్రెయిన్‌, రష్యా యుద్దంలో ప్రిగోజిన్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా రష్యన్ జైళ్ల నుంచి వేలాది మందిని వాగ్నర్ మెర్సినరీ బృందంలో చేర్చుకున్నారు.

యుద్ధానికి నేతృత్వం వహిస్తున్న రష్యా మిలిటరీ చీఫ్‌లతో ప్రిగోజిన్ చాలా కాలంగా వ్యతిరేకత చూపుతున్నారు, అది ఇప్పుడు తిరుగుబాటుగా మారింది.

వాగ్నర్ దళాలు ఆక్రమిత తూర్పు యుక్రెయిన్ నుంచి దక్షిణ రష్యా నగరమైన రోస్టోవ్-ఆన్-డాన్‌లోకి ప్రవేశించాయి. దాని సైనిక స్థావరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

పరిస్థితి క్లిష్టంగా ఉందని, అయితే రష్యాను రక్షించడానికి చేయాల్సిన అన్నీ చేస్తానని ప్రజలకు అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, Reuters

సైనిక నాయకత్వానికి సవాల్..

సైనిక తిరుగుబాటుగా చెబుతున్న అన్ని వాదనలు అసంబద్ధమైనవని ప్రిగోజిన్ అంటున్నారు.

వాగ్నర్ సైనికులకు తగినంత కిట్, ఆయుధ సామగ్రిని సరఫరా చేయడంలో సైన్యం విఫలమవడంతో యుద్దాన్ని దగ్గరుండి నడిపిస్తున్న రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, సాయుధ దళాలు చీఫ్ వాలెరి గెరాసిమోవ్‌లకు వాగ్నర్ తిరుగుబాటు ప్రత్యక్ష సవాలుగా మారింది.

ఇప్పటివరకైతే ఇది తిరుగుబాటు కాదు, ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు.

కానీ ఇది రష్యా అగ్ర సైనికులను పడగొట్టే ప్రయత్నం, ఇది అధ్యక్షుడి అధికారానికి సవాలు లాంటిది.

ఇపుడు మొత్తం మాస్కో ప్రాంతం "కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ పాలన" కింద ఉంది. అక్కడ ప్రధాన ఈవెంట్‌లు రద్దయ్యాయి.

"మాకు 25,000 మంది ఉన్నారు. కావాల్సిన ప్రతి ఒక్కరూ మాతో చేరండి" అని ప్రిగోజిన్ పిలుపునిచ్చారు. ఇది అధ్యక్షుడిని బెదిరించలేదు, అయితే సైనిక నాయకత్వానికి ఇది సవాలు విసురుతోంది.

తన బలగాలను సరిహద్దు మీదుగా రోస్టోవ్‌లోకి తరలించి, అక్కడి మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని ప్రిగోజిన్ చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇద్దరూ పారిపోయారని చెబుతున్నారు.

యెవ్‌గినీ ప్రిగోజిన్ - పుతిన్‌కు కుడివైపు ఉన్న వ్యక్తి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యెవ్‌గినీ ప్రిగోజిన్ - పుతిన్‌కు కుడివైపు ఉన్న వ్యక్తి

పుతిన్ స్నేహితుడే వాగ్నర్ చీఫ్

అధ్యక్షుడు పుతిన్‌కు ప్రిగోజిన్ చాలాకాలంగా సన్నిహిత మిత్రుడిగా ఉన్నారు. పుతిన్ నేతృత్వంలో మొదట సంపన్న వ్యాపారవేత్తగా, తరువాత వాగ్నర్ చీఫ్‌గా మారారు.

తూర్పు యుక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో వాగ్నర్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఇది నెలల తరబడి కొనసాగింది, అయితే పూర్తిగా స్వాధీనం కాలేదు.

యుక్రెయిన్‌లో యుద్ధానికి ఫిరంగుల కొరతపై మిలిటరీ ఉన్నతాధికారులను నిందిస్తూ గ్రాఫిక్ వీడియోలు, సోషల్ మీడియా రాంట్స్‌తో రష్యా సైన్యం వైఫల్యాలను ప్రిగోజిన్ బయటపెట్టారు.

ప్రిగోజిన్ ఎప్పుడూ అధ్యక్షుడిపై తన కోపాన్ని నేరుగా ప్రకటించలేదు.

కానీ "హ్యాపీ గ్రాండ్ ఫాదర్" అనే ఆయన వ్యంగ్య ప్రకటనలు పరోక్ష విమర్శలుగా విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

"ఈ తాత పూర్తి స్టుపిడ్"గా మారితే రష్యా ఎలా గెలవగలదని గత నెలలో ప్రిగోజిన్ విమర్శించారు.

యుద్దంపై వారి సమర్థనలు అన్నీ అబద్ధమని, కేవలం ఒక చిన్న గుంపు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ప్రజలను, అధ్యక్షుడిని మోసం చేసే సాకుగా ప్రిగోజిన్ ఆరోపించారు.

అప్పటి నుంచి పరిస్థితులు చాలా వేగంగా మారాయి.

యుక్రెయిన్‌లో తన మనుషులపై సైన్యం దాడి చేసిందని ప్రిగోజిన్ ఆరోపించారు. అయితే దానిపై సాక్ష్యాలను అందించడంలో ఆయన విఫలమయ్యారని, మిలిటరీ ఆ వాదనలు తిరస్కరించింది.

అయితే "న్యాయం కోసం కవాతు" జరుగుతోందని ప్రిగోజిన్ శుక్రవారం ప్రకటించారు.

ఆయన 25,000 మంది బలం కేవలం "వ్యూహాత్మక రిజర్వ్" మాత్రమేనని, మొత్తం సైన్యం, దేశం వారి వ్యూహాత్మక రిజర్వ్‌గా చూస్తున్నారు.

అధ్యక్షుడు పుతిన్‌కు లొంగిపోవాలని యుక్రెయిన్‌లోని డిప్యూటీ కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ జనరల్ సెర్గీ సురోవికిన్ ప్రిగోజిన్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే ఉదయానికి ప్రిగోజిన్ మనుషులు రోస్టోవ్ చేరుకున్నారు. "మేం [సైనిక] ప్రధాన కార్యాలయంలో ఉన్నాం" అని ప్రకటించారు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, Reuters

ప్రిగోజిన్‌కు రష్యాలో ప్రజల మద్దతు?

ఇది యుక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి లేదా అధ్యక్షుడి నాయకత్వానికి ప్రత్యక్ష సవాలైతే కాదు.

కానీ పుతిన్ ఐదు నిమిషాల టెలివిజన్ వీడియోలో నిశ్చయాత్మకంగా, రాజీపడకుండా మాట్లాడటం తీవ్రతను పెంచేదే.

రోస్టోవ్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసి, తన సైనిక డిమాండ్లను నెరవేర్చకపోతే మాస్కో వైపు వెళతానని ప్రిగోజిన్ హెచ్చరించారు.

ఇప్పటివరకు ఆయుధాల కోసం మాత్రమే రష్యా సైనిక నాయకత్వంతో పోరాడిన ఆయన ఇప్పుడు ఆ నాయకత్వాన్నే అధీనంలోకి తీసుకుంటామంటున్నారు.

ప్రిగోజిన్‌కు రష్యాలో గణనీయమైన ప్రజా మద్దతు ఉంది. ఆయన సవాలు పుతిన్ పట్టించుకోనప్పటికీ, యుక్రెయిన్‌లోని వాగ్నర్ సైనికులపై ఆధారపడిన రష్యన్ మిలిటరీకి ఇది సంక్షోభం లాంటిది.

మరోవైపు ఇది పుతిన్ నాయకత్వాన్ని పరీక్షించే క్షణం, ఇది ఎలా ముగుస్తుందో ఇపుడే చెప్పడం తొందరపాటే అవుతుంది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)