నరేంద్ర మోదీ: అమెరికా కూటమిలో లేకుండానే ఆ దేశానికి భారత్‌ను దగ్గర చేసిన క్రెడిట్ మోదీదేనా

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైట్‌హౌస్‌కు ఘన స్వాగతం పలికిన తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ‘‘అమెరికా, భారత్ సంబంధాలు ప్రపంచానికి అత్యంత ముఖ్యమైనవి’’ అన్నారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంతో ఉన్న స్నేహ సంబంధాల గురించి మాట్లాడిన బైడెన్ "చరిత్రలో మా బంధం అత్యంత బలమైనది, ఒకరికొకరు దగ్గరయ్యాం, ఇద్దరం డైనమిక్‌గా ఉన్నాం" అని అన్నారు.
ఈ విషయంలో బైడెన్ మరీ అతిశయోక్తిగా ఏమీ మాట్లాడలేదని అమెరికా సంస్థ ‘ది విల్సన్ సెంటర్’కు చెందిన మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు.
‘‘ఈ పర్యటనతో రెండు దేశాల సంబంధాలలో మార్పు వచ్చిందని స్పష్టమైంది. తక్కువ సమయంలోనే ఈ బంధం చాలా దృఢమైన బంధంగా మారింది’’ అన్నారు.
చైనాతో దిగజారుతున్న సంబంధాలను బ్యాలన్స్ చేసేందుకు అమెరికా భారత్‌ను మరింత దగ్గరకు తీసుకుంటోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన పట్టును పటిష్టం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది.
ఇటీవలికాలం వరకు భారత్, అమెరికా మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏమీ లేవు.
2005లో అణు ఒప్పందం ఒక మైలు రాయి కాగా, ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు సవ్యంగా సాగలేదు. ఈ ఒప్పందం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత అణు రియాక్టర్ల కొనుగోలును నిషేధిస్తూ భారత దేశం చట్టం చేసింది.
‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్: ది ఇండియా-యూఎస్ స్టోరీ’ అనే కథనం రాసిన రచయిత్రి సీమా సిరోహీ రెండు దేశాల మధ్య సంబంధాలపై మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-అమెరికాల మధ్య సంబంధాలలో నిబద్ధత లోపించిందని సీమా సిరోహీ అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మెరుగయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా భారతదేశానికి సంబంధించిన వ్యవహారాలలో మెరుగైన మార్గాలను అనుసరించాలని తన అధికార యంత్రాంగానికి సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు
మోదీ పర్యటనను మరింత మెరుగ్గా, ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునేలా చేయడానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసిందని సిరోహి చెప్పారు. రక్షణ-పారిశ్రామిక సహకారం, సాంకేతిక సమస్యలు ఈ పర్యటనలో అగ్రస్థానాన్ని ఆక్రమించాయి.
- జనరల్ ఎలక్ట్రిక్, భారత ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారతదేశంలో యుద్ధ విమానాల కోసం ఇంజిన్‌లను తయారు చేయనున్నాయి.
- భారతదేశం జనరల్ అటామిక్స్ నుండి ఎంక్యూ-9బీ డ్రోన్లను కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం విలువ 300 మిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లు). దీనితో పాటు, భారతదేశంలో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ డ్రోన్‌లను భారత్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఇది ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా' క్యాంపెయిన్‌కు అనుగుణంగా ఉంటుంది.
- భారత్ కొంటున్న ఆయుధాల్లో అమెరికా ఆయుధాలు కేవలం 11 శాతమే. రష్యా నుంచి 45 శాతం ఆయుధాలను కొంటుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
- ‘‘చైనాను ఎదుర్కోవడానికి భారత దేశాన్ని సైనికంగా మరింత సమర్ధవంతంగా మార్చడమే అమెరికా లక్ష్యం’’ అని కుగెల్‌మాన్ చెప్పారు.
- భారత్‌ను సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అమెరికన్ చిప్ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ భారతదేశంలో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 6700 కోట్ల కు పైగా పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల వేలాది ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
- సెమీకండక్టర్లను తయారు చేసే అమెరికన్ కంపెనీ లామ్ రీసెర్చ్ భారతదేశంలో 6000 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇస్తుంది. ఇది కాకుండా, సెమీకండక్టర్ తయారీ యంత్రాలను అతిపెద్ద తయారీదారుగా ఉన్న అప్లైడ్ మెటీరియల్స్ కూడా సుమారు రూ. 3278 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
‘‘ఇదంతా భవిష్యత్తు వ్యవహారం. మున్ముందు ఉత్తమమైన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భవిష్యత్ అవకాశాలను మెరుగుపరుచుకోవడం గురించి రెండు దేశాలు మాట్లాడుతున్నాయి’’ అని సిరోహి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా, అమెరికా సంబంధాల్లో ఎత్తుపల్లాలు
బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి ఎత్తుపల్లాలు మొదలయ్యాయి.
అమెరికాతో స్నేహంపై భారత్ నుంచి సరైన చొరవ కనిపించ లేదు. దీనికి కారణం...ప్రపంచంలో భారత్‌కు భిన్నమైన ముద్ర ఉండటమే.
జవహర్‌లాల్ నెహ్రూ అలీన విధానం భారతదేశంపై స్థిరమైన ముద్ర వేసింది. దీని ప్రకారం భారత్ ఎప్పుడూ ఒకపక్షం ఉండాలని కోరుకోదు. ఏ ప్రపంచ సూపర్ పవర్‌కు భాగస్వామిగా ఉండాలనుకోదు.
అయితే, నరేంద్ర మోదీ కూడా ఈ విధానాలను పూర్తిగా వదిలిపెట్టలేదు. ‘‘వ్యూహాత్మక సహకారం’’ అనే విదేశాంగ నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఇంతకు ముందులా కాకుండా ఒక భిన్నమైన భారతదేశానికి మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఆర్థికంగా, భౌగోళికంగా చాలా కీలకమైంది. భారత్-అమెరికా సంబంధాలను ఆయన మనఃస్ఫూర్తిగా అంగీకరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డోనల్డ్ ట్రంప్‌లతోనూ మోదీ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు.
అలా అని, భారతదేశం ‘‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’’ని వదులుకోలేదు. రష్యాను భారత్ విమర్శించాలని వాషింగ్టన్ కోరుకుంటోంది. కానీ, భారత్ ఆ పని చేయలేదు.
కానీ, ఈ విషయంలో బైడెన్ ప్రభుత్వం నిరాశ పడలేదు. ఎందుకంటే ‘‘ఇది యుద్ధాల యుగం కాదు’’ అని రష్యాను నేరుగా ప్రస్తావించకుండా మోదీ పలుమార్లు మాట్లాడారు.
అలాగే, యుక్రెయిన్‌కు సహాయం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ తరచూ నొక్కి చెప్పారు. అదే విధంగా చైనా పేరు ప్రస్తావించకుండానే, స్వతంత్ర ఇండో పసిఫిక్ ప్రాంతం గురించి మోదీ పలుమార్లు మాట్లాడుతున్నారు. ఇది అమెరికాకు సంతోషం కలిగించే విషయమే.

ఫొటో సోర్స్, Getty Images
విభేదాల పరిష్కార ప్రయత్నం
"రెండు దేశాల సైన్యాలు కలిసి పనిచేస్తున్నాయి. యుద్ధ నౌకలకు ఇంధనం నింపుకోవడానికి ఒకరి కేంద్రాలను మరొకరు ఉపయోగించుకోడానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. సంయుక్తంగా మిలిటరీ ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. భారత్‌ను అమెరికాకు మరింత దగ్గర చేసిన క్రెడిట్ మోదీకే దక్కుతుంది’’ అని కుగెల్‌మాన్ అన్నారు. పూర్తిగా అమెరికా కూటమిలో లేకుండానే శక్తివంతమైన దేశానికి దగ్గరయ్యే వ్యూహాన్ని మోదీ అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు.
టారిఫ్‌ల విషయంలో భారత్-అమెరికాల మధ్య విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ హయాంలో వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రెండు దేశాలు టారిఫ్‌ల సమస్యతో సహా ఆరు వేర్వేరు వాణిజ్య విభేదాలను పరిష్కరించుకుంటామని ప్రకటించాయి.
అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. భారతదేశంలో పెరుగుతున్న మధ్య తరగతి ఒక పెద్ద మార్కెట్. ఇది చైనా స్థానాన్ని ఆక్రమిస్తూ అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారాలని కోరుకుంటుంది.
ప్రపంచంలోని చాలా కంపెనీలు, దేశాలు భారత్ మీద ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే వారు ప్రపంచ సప్లయ్ చైన్‌ను చైనా నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నారు.
అయితే మోదీ, బీజేపీ హయాంలో భారతదేశంలో ‘ప్రజాస్వామ్య తిరోగమనం’ కొనసాగుతోందని అమెరికాలో కొందరు విమర్శించారు. భారత్‌లో మైనారిటీల భద్రత గురించి మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలు చేశారు.
‘‘డెమోక్రటిక్ పార్టీలోని కొందరు ప్రగతిశీలవాదులు భారత్‌లో పరిణామాల పట్ల కొంత అసహనంగా ఉన్నారు. కానీ, చైనా కారణంగా, భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవడాన్ని వాస్తవికవాదుల, మధ్యేవాదులు సమర్థిస్తున్నారు’’ అని సిరోహి అన్నారు.
అందుకే రెండు పక్షాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు పలు ఒప్పందాలు జరిగాయి. ‘‘అంటే ఇప్పుడు అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి, మంచి ఫ్రెండ్’’ అని సిరోహి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















