అలెక్సీ నావల్నీ: పుతిన్‌ విమర్శకులకు దశాబ్దాలపాటు జైలు శిక్షలు తప్పవా?

అలెక్సీ నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జైలు గోడల మధ్య అలెక్సీ నావల్నీ

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ దశాబ్దాల పాటు జైలులోనే ఉండేలా తీవ్రవాదం అభియోగాలపై సరికొత్త విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది.

పెరోల్ ఉల్లంఘన, మోసం, కోర్టు ధిక్కారం కింద ఇప్పటికే ఆయనకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం నావల్నీ జైలులో ఉన్నారు.

రాజకీయ ప్రోద్భలంతోనే 2021లో అరెస్టు చేసి జైలులో పెట్టారని నావల్నీ, ఆయన మద్దతుదారులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తూర్పు మాస్కోకి 250 కి.మీల దూరంలో ఆయన్ను అరెస్టు చేసిన పీనల్ కాలనీలో ఆయనపై తాజాగా విచారణ మొదలవుతుంది.

ఆయన తీవ్రవాద నెట్‌వర్క్‌ను సృష్టించారని,టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థికంగా సాయం చేశారనే ఆరోపణలతో పాటు ఇప్పటికే పలు రకాల అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు.

ఈ అభియోగాల వల్ల తన జైలు శిక్షా కాలం 30 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉందని నావల్నీ చెబుతున్నారు.

అలెక్సీ నావల్నీ

ఫొటో సోర్స్, ILYA AGEEV

ఫొటో క్యాప్షన్, ప్రయాణానికి ముందు నావల్నీతో ఇల్యా అగీవ్ తీసుకున్న సెల్ఫీ

ఎవరీ అలెక్సీ నావల్నీ

47 ఏళ్ల అలెక్సీ నావల్నీ రష్యా ప్రతిపక్షంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు బద్ధ వ్యతిరేకి. దశాబ్దానికి పైగా రష్యాలో అధికారంలో ఉన్న పుతిన్ పార్టీ అవినీతిని బట్టబయలు చేశారని ఆయనకు పేరుంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రష్యా వ్యాప్తంగా నిరసనలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించగలిగే సత్తా రష్యా ప్రతిపక్ష నేతగా కేవలం నావల్నీకే ఉంది.

2020 ఆగస్టులో నావల్నీపై విషప్రయోగం జరిగింది. దీనికోసం నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.

ఆయన సైబీరియా నుంచి మాస్కో తిరిగివస్తుండగా విమానంలో స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం ఆయన్ను అత్యవసరంగా జర్మనీకి తరలించారు.

నావల్నీ చావు అంచుల వరకూ వెళ్లివచ్చారు. జర్మనీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో 2021లో నావల్నీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ కుట్ర ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు.

రష్యా అధికారులు మాత్రం తమ ప్రమేయాన్ని ఖండించారు.

జర్మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించారనే కారణంతో మొదట రెండున్నర ఏళ్లు ఆయన్ను జైలులో ఉంచారు.

ఆ తర్వాత మోసం, కోర్టు ధిక్కారం కింద అదనంగా మరో తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించారు.

ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోన్న సమయంలో తాజాగా ఆయనపై ఈ కేసు విచారణ ప్రారంభమైంది.

యుక్రెయిన్‌ ఆక్రమణను ప్రారంభించిన ఏడాది తర్వాత, చాలా మంది ప్రముఖ ప్రతిపక్ష నేతలను మాస్కో బహిష్కరించింది.

జైలులో ఉంటూనే ఈ నేరాలన్నింటిన్ని చేశారని ఆరోపిస్తూ ప్రాసిక్యూటర్లు 3,828 పేజీలతో ఆరోపణలను రూపొందించారని నావల్నీ చెప్పారు.

తనపై అసలు ఏ విషయంపై ఆరోపణలు చేస్తున్నారో కనుక్కోవడం అసాధ్యమని నావల్నీ చెప్పారు.

తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం, ప్రజల్లో తీవ్రవాద కార్యకలాపాలను చొప్పించడం, నాజీ భావాజలాన్ని పునరుద్ధరించడం వంటి నేరాలపై నావల్నీపై కేసులు దాఖలు చేశారు.

గత తొమ్మిదేళ్లుగా నావల్నీ జైల్లోనే ఉన్నారు. ఆయన జీవిత కథ ఆధారంగా చిత్రీకరించిన 'నావల్నీ' సినిమా ఈ ఏడాది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.

నావల్నీ ప్రధాన రాజకీయాస్త్రం 'యాంటీ-కరప్షన్ ఫౌండేషన్' (ఎఫ్‌బీకే) సంస్థ. ఇది బహిర్గతం చేసిన పలు అంశాలను ఆన్‌లైన్‌లో లక్షల మంది వీక్షించారు.

2021లో రష్యా ప్రభుత్వం ఎఫ్‌బీకేను అతివాద సంస్థగా పేర్కొంది. నావల్నీపై అవినీతి కేసులు వేసింది. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అవినీతి ఆరోపణలని నావల్నీ చాలాసార్లు ఖండించారు.

నావల్నీ సహచరులు పలువురు భద్రతాధికారుల ఒత్తిడికి లొంగిపోయారు. ఎఫ్‌బీకే మాజీ హెడ్ ఇవాన్ జ్దానోవ్, ఎఫ్‌బీకేలో ప్రముఖ లాయర్ లియుబోవ్ సోబోల్ సహా కొందరు విదేశాలకు పారిపోయారు. రష్యావ్యాప్తంగా నావల్నీ కార్యాలయాల అధిపతుల్లో చాలా మంది దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

నావల్నీ కుడి భుజం లియోనిడ్ వోల్కోవ్ కూడా 2019లో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటూ రష్యా విడిచి పారిపోయారు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యాలో స్వతంత్ర మీడియా చానళ్లన్నీ విదేశాలకు

యుక్రెయిన్ యుద్ధం మొదలు రష్యాలో స్వతంత్ర మీడియా చానళ్లన్నీ విదేశాలకు పయనమయ్యాయి. మెడుజా, నోవాయా గెజిటా, టీవీ రైన్ లాంటి చానెళ్లకు సొంత దేశంలో చోటులేకపోయింది. ఎఖో మాస్క్వీ లాంటి రేడియో స్టేషన్లూ మూతబడ్డాయి.

లెక్కలేనంత మంది వ్యాఖ్యాతలు దేశం నుంచి పారిపోయారు. సీనియర్ జర్నలిస్ట్ అలెగ్జాండర్ నెవ్జోరోవ్ పై "విదేశీ ఏజెంట్" అని ముద్రవేశారు.

రష్యా ఆర్మీకి వ్యతిరేకంగా "నకిలీ" వార్తలను ప్రచారం చేస్తున్నరన్న అభియోగం మోపారు. ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు.

కేసులు మోపడానికి, అరెస్ట్ చేయడానికి ప్రముఖులే కానక్కర్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సామాన్య ప్రజలకైనా శిక్షలు తప్పవు.

2023 మార్చిలో డిమిత్రి ఇవనోవ్ అనే గణిత విద్యార్థి టెలిగ్రాంలో యుద్ధ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు ఎనిమిదిన్నరేళ్ల జైలుశిక్ష విధించారు. మళ్లీ 'ఆర్మీకి వ్యతిరేకంగా నకిలీ వార్తల' చట్టం కింద అభియోగాలుమోపారు.

అలెక్సీ మోస్కలెవ్ అనే వ్యక్తి యుద్ధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ రెండేళ్ల జైలుశిక్ష వేశారు.

ఆయన 13 ఏళ్ల కూతురు స్కూల్లో యుద్ధ వ్యతిరేక నినాదంతో ఒక బొమ్మ వేసింది. దాని ఆధారంగా దర్యాప్తు జరిపి మోస్కలెవ్‌ను జైల్లో పెట్టారు.

తనకు ప్రత్యర్థులే లేకుండా చేయడానికి పుతిన్‌కు రెండు దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు ఆయన్ను సవాలు చేసేవారే లేరు. అదే పుతిన్ ప్రణాళిక అయితే, అది ఫలించినట్టే.

వీడియో క్యాప్షన్, యుద్ధంలో చనిపోయిన రష్యన్ సైనికుల మరణాలపై రష్యా తప్పుడు లెక్కలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)