తన వీపు తానే గోక్కుంటున్న ఆవు.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

Cow astonishes scientists with rare use of tools, Veronika

ఫొటో సోర్స్, Antonio J Osuna Mascaró

ఆస్ట్రియా దేశంలోని ఓ ఆవు చేస్తున్న పనులు చూశాక శాస్త్రవేత్తలు పశువులు ఏమేం చేయగలవు అనే విషయంలో పునరాలోచనలో పడ్డారు.

వెరోనికా అనే పేరున్న ఆవు తన చుట్టూ ఉండే కొన్ని పరికరాలను ఉపయోగిస్తున్న తీరు, అందులో దాని నైపుణ్యం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.

శాస్త్రవేత్తలు ఇంతవరకు అనుకున్న స్థాయి కంటే ఆవులకు మరింత సామర్థ్యం ఉందని వియెన్నాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

ఆస్ట్రియాలోని గ్రామీణ ప్రాంతంలోని ఓ కొండ సమీపంలోని గ్రామంలో ఉన్న వెరోనికా అనే ఆవు తనకు దొరికే కర్రలు, రేకులు, చీపుర్లు వంటివి ఉపయోగించి తన వీపు తానే గోక్కుంటోంది.

ఈ విషయం ఆనోటాఈనోటా పడి చివరికి ఆస్ట్రియా రాజధాని వియెన్నాలోని 'యానిమల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్స్'కు చేరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
veronika

ఫొటో సోర్స్, Antonio J Osuna Mascaró

దాంతో వారు ఆ ఆవును గమనించగా అది ఒకే పరికరం/పనిముట్టును వేర్వేరు పనులకు వేర్వేరు రకాలుగా ఉపయోగించడం.. ఒకవైపు నుంచి ఒకరకంగా మరోవైపు నుంచి ఇంకోరకంగా ఉపయోగిస్తున్నట్లు తేలింది.

ఈ ఆవు తన వీపుపై రుద్దుకోవాలనుకున్నప్పుడు పొడవాటి బ్రష్‌కు ఒక భాగంతో... కడుపు కింద రుద్దాలనుకున్నప్పుడు బ్రష్‌కు ఉన్న మెత్తని భాగం ఉపయోగించడాన్ని పరిశోధకులు గుర్తించారు.

జంతు ప్రపంచంలో ఇలాంటివి అక్కడక్కడా కనిపించినా.. ఆవులు వంటి పశువులు ఇలా చేయడం మాత్రం ఇంతవరకు రికార్డ్ అయిన దాఖలాలు లేవంటున్నారు వియన్నాకు చెందిన పరిశోధకులు.

వియన్నాలోని యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ మెడిసన్‌కు చెందిన డాక్టర్ ఆంటోనియో ఒసూనా మాట్లాడుతూ.. ఆవులు ఇలా పరికరాలను ఉపయోగిస్తాయని అనుకోం.. అందులోనూ ఇలా వేర్వేరు పనులకు వేర్వేరుగా ఉపయోగిస్తాయని అస్సలు అనుకోం. ఇంతవరకు ఇలాంటివి చింపాజీలలోనే రిపోర్ట్ అయ్యాయి' అని చెప్పారు.

Chimpanzee

ఫొటో సోర్స్, Getty Images

మనుషులు కాకుండా ఇతర జంతువుల విషయానికొస్తే చింపాంజీలు మాత్రమే అనేక రకాలుగా పరికరాలు ఉపయోగించిన దాఖలాలున్నాయి.

మనుషులతో పాటు 10 వేల ఏళ్లుగా ఆవులు కలిసి నివసిస్తున్నప్పటికీ అవి ఇలా పరికరాలు ఉపయోగించడం రికార్డ్ కావడమనేది ఇదే ప్రథమం అంటున్నారు వియన్నా శాస్త్రవేత్తలు.

ఆవులు మనం అనుకున్న కంటే స్మార్ట్ అని.. వెరోనికాయే కాకుండా ఇతర ఆవులకూ అవకాశం వస్తే ఇలాంటి పరికరాలు ఉపయోగించగలవని అంటున్నారు.

కాగా వెరోనికాను పెంచుతున్న ఆర్గానిక్ ఫార్మర్ 'విట్గర్ వీజెల్' తన ఆవు చేస్తున్న పనులపై మాట్లాడుతూ.. తన ఆవు చూపుతున్న అసాధారణ నైపుణ్యాలు నేచురల్ వరల్డ్ విలువను ప్రజలు గుర్తించేలా చేయాలని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)