పీరియడ్స్ రక్తం ముఖానికి రాసుకునే ట్రెండ్.. డాక్టర్లు ఏమంటున్నారు?

చర్మం, అందం, ఆరోగ్యం, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చర్మ సంరక్షణ - ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమృత ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ట్రెండ్స్' పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిని ప్రజలు తరచుగా అనుసరిస్తుంటారు.

అదేరీతిలో, మహిళలకు సంబంధించి ఒక విషయం ఇటీవల బాగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, రుతుస్రావం (పీరియడ్స్) రక్తాన్ని తమ ముఖానికి రాసుకుంటే 'చర్మం ప్రకాశవంతంగా మారుతుంది' అనే ఒక ప్రచారం.

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫామ్స్‌పై విదేశాల్లో కొంతమంది ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మన దేశంలో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు.

ఈ ట్రెండ్‌ను ఇన్‌ఫ్లుయెన్సర్లు 'మెన్‌స్ట్రువల్ మాస్కింగ్' అని ప్రస్తావిస్తున్నారు.

రుతుస్రావ రక్తంలో సహజంగానే రెటినాల్ అధికంగా ఉంటుందని, దాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా, కాంతిమంతంగా మారుతుందని వారు అంటున్నారు.

ఇందులో నిజమెంత? రుతుస్రావాన్ని రాసుకుంటే వాస్తవంగా ఏమవుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చర్మం, అందం, ఆరోగ్యం, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

వైద్యులు ఏం చెబుతున్నారు?

బీబీసీ తమిళ్ ఈ ట్రెండ్ గురించి డెర్మటాలజిస్ట్ దినేష్ కుమార్ ‌దృష్టికి తీసుకెళ్లింది.

'ఈ వాదన తప్పు' అని ఆయన అన్నారు.

''రుతుస్రావాన్ని చర్మం మీద వాడటం సరికాదు'' అని చెప్పారు.

‘రుతుస్రావ రక్తంతో సానుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇదేమాత్రం పరిశుభ్రమైన ప్రక్రియ కాదు.. రుతుస్రావ రక్తం మన చర్మంలోకి ఇంకదు. అందులో రోగకారక క్రిములు ఉండటానికి అవకాశం ఎక్కువ. ముఖంపై ఏమైనా గాయాలు ఉన్నా, మొటిమల్లాంటివి లేదా తెరిచిన రంధ్రాలు ఉన్నా రక్తం అందులోకి చొచ్చుకెళ్లి, తర్వాత అది దురద, మరింత చికాకును కలిగిస్తుంది’ అన్నారు డెర్మటాలజిస్ట్ దినేష్ కుమార్.

చర్మం, అందం, ఆరోగ్యం, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

రుతుస్రావ రక్తంలో ఏం ఉంటుంది?

యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. రుతుస్రావ రక్తంలో మృత కణజాలాలు ఉంటాయి.

ఫలదీకరణ జరగనప్పుడు, స్త్రీ గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం నెలవారీ చక్రంలో భాగంగా రుతుస్రావం సమయంలో రక్తంగా బయటకు వస్తుంది.

అలా రుతుస్రావ రక్తం యోని ద్వారా బయటకు వచ్చినప్పుడు, అది స్రవించే ద్రవాలు కూడా దానితో కలిసిపోతాయి.

యోనిలో సహజంగా ఉండే లాక్టోబాసిల్లన్ వంటి సూక్ష్మజీవులు కూడా పీరియడ్స్ సమయంలో రుతుస్రావ రక్తంలోకి చేరతాయని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆర్టికల్ పేర్కొంది.

అలా ఆ రక్తంలో దాదాపు 300 రకాల ప్రోటీన్లు, ఆమ్లాలు, ఎంజైమ్‌లు ఉంటాయి.

సహజంగా రుతుస్రావ రక్తం అనేది శరీరంలోని వ్యర్థ పదార్థం. టీచ్‌మన్ పరీక్ష రుతుస్రావ రక్తానికి నెగటివ్ ఫలితాలను చూపించిందని ఆ ఆర్టికల్ స్పష్టం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సౌందర్యం పెంచడానికి రక్తం ఉపయోగించవచ్చా?

రుతుస్రావ రక్తమనేది సున్నితమైన మిశ్రమమని, దాన్ని ముఖానికి పూయడం వల్ల లాభం లేకపోగా, ముఖంపై ఉండే అతి సున్నితమైన చర్మానికి హాని చేస్తుందని డాక్టర్ దినేష్ హెచ్చరించారు.

పాడైన చర్మాన్ని సరిదిద్దడానికి శరీరంలో ప్రవహించే రక్తాన్ని ఉపయోగించి చేసే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్‌పీ) థెరపీ వంటి వైద్య చికిత్సలు ఉన్నాయని ఆయన చెప్పారు.

యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆర్టికల్ ప్రకారం, పీఆర్‌పీ థెరపీలో ఒక వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేసి, ఆ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు.

ఈ చికిత్సలో ఒకటి నుంచి మూడు సెషన్ల తర్వాత, చర్మంలో తెరుచుకున్న రంధ్రాలు, ముడతలు, నల్ల మచ్చలు తొలగిపోతాయని, చర్మం తాలూకా కొల్లాజెన్ స్థాయి పెరుగుతుంది.

ఇలాంటి చికిత్సలను సరైన ఆసుపత్రుల్లో చేయించుకోవడం సురక్షితమని డాక్టర్ దినేష్ కుమార్ సూచించారు.

సూక్ష్మక్రిములతో ఎక్కువగా కలుషితమయ్యే లాలాజలం (ఉమ్ము), రుతుస్రావ రక్తం వంటి వాటిని ఏదో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని ముఖంపై ప్రయోగించవద్దని ఆయన హెచ్చరించారు.

చర్మం, అందం, ఆరోగ్యం, మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెన్‌స్ట్రువల్ కప్

'చర్మ సంరక్షణ'కు ఏం చేయాలి?

అత్యంత సున్నితంగా ఉండే మన ముఖంపై చర్మం సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ దినేష్ కుమార్ కొన్ని సూచనలు చేశారు.

  • ముఖం శుభ్రం చేసుకోవడానికి ఫేస్ వాష్/క్లెన్సర్ ఉపయోగించాలి.
  • ముఖాన్ని తేమగా ఉంచడానికి లోషన్ లేదా క్రీమ్ ఉపయోగించవచ్చు.
  • ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కనీసం ఎస్‌పీఎఫ్ 30+ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ముఖానికి రాసుకోవాలి.
  • డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్.. చర్మం తత్వాన్ని బట్టి చర్మ సౌందర్య ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
  • తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కాంతిమంతమైన చర్మాన్ని పొందడానికి ఉత్తమ మార్గాలు.

ఆరోగ్యమైన చర్మానికి ఇది సరిపోతుందని, ధ్రువీకరించని విధానాలపై ఆధారపడకూడదని ఆయన సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)