కూతుళ్ల పీరియడ్స్ సమయంలో నాన్నల సాయం.. ఈ జాబితాలో మీరూ ఉన్నారా?

పీరియడ్స్, తండ్రులు, అవగాహన

ఫొటో సోర్స్, Shutterstock

    • రచయిత, యాస్మిన్ రూఫో
    • హోదా, బీబీసీ న్యూస్

16 ఏళ్ల హెలెన్‌కి మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు, ఇంట్లో ఆమె తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే తన కూతురుకి అవసరమైన సాయం చేశారు.

యువతతో పీరియడ్స్ గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు ఆ అనుభవం లేకపోతే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ తన తండ్రి ఎప్పటినుంచో ఈ విషయం గురించి మాట్లాడేవారని, ఏం జరుగుతుందో, ఎలా ఎదుర్కోవాలో ముందుగానే వివరించేవారని. అందుకే, మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు తాను భయపడలేదని, మామూలుగానే అనిపించిందని హెలెన్ చెప్పారు.

"ఆ అనుభవం నిజంగా ఎలా ఉంటుందో, అది జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నాన్నలు పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కానీ వారు అర్థం చేసుకుని సలహా ఇవ్వగలరు. దాని గురించి మాట్లాడగలరు" అని ఆమె అంటున్నారు.

అయినా సరే, నెలసరి గురించి మాట్లాడటం ఇప్పటికీ చాలా మందికి అసౌకర్యంగా, మొహమాటంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా, ఆ విషయంపై మాట్లాడటం లేదా పిల్లలకు వివరించడం అనే బాధ్యత ఎక్కువగా తల్లులపైనే ఉంటోంది.

హెలెన్ తండ్రి జాన్ ఆడమ్స్, నెలసరి చుట్టూ ఉన్న అనవసరమైన అపోహలు, సిగ్గు, వంటి భావాలను సవాల్ చేస్తూ ముందుకొస్తున్న తండ్రులలో ఒకరు. ఇటువంటి తండ్రులు పెరుగుతూ ఉండటం, ఈ విషయం పై దృష్టికోణం మారుతుందనడానికి నిదర్శనం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాన్‌కు 12 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటూ వారిని చూసుకునేవారు.

అయితే తాను మాట్లాడిన కొంతమంది ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలతో నెలసరి గురించి మాట్లాడటానికి సంకోచిస్తామని, అది చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పారని జాన్ తెలిపారు.

"పిల్లలు స్కూల్‌లో నేర్చుకుంటారని మాత్రమే వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం, ఇది టీచర్ల బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులది కూడా" అని ఆయన అన్నారు.

జాన్ తన ఇద్దరు కుమార్తెలతో నెలసరి సమయంలో వారికి ఎదురయ్యే అనుభవాలు, వచ్చే నొప్పి స్థాయి, అలాగే ఉపయోగించగల శానిటరీ ఉత్పత్తుల గురించి మాట్లాడారు.

"పురుషులు కొన్నిసార్లు తొందరపడి మాట్లాడవచ్చు, కానీ వాళ్లకు ఆ సామాజిక మొహమాటం, సిగ్గు లేదా భయం ఉండదు. అందుకే వారు విషయాన్ని చాలా సూటిగా మాట్లాడతారు" అని ఆయన బీబీసీ రేడియో5 లైవ్ టైమ్ ఆఫ్ ది మంత్‌ కార్యక్రమంలో చెప్పారు.

"నేను ఈ విషయంలో నిపుణుడిని కాదని అంగీకరిస్తున్నా. కానీ నా భార్యతో, అమ్మతో మాట్లాడాను. అలాగే పుస్తకాలు, ఆన్‌లైన్లో చూసి నాకు కావాల్సిన సమాచారం సేకరించాను" అని ప్రస్తుతం విద్యా రంగంలో పనిచేస్తున్న జాన్ అన్నారు.

జాన్ దృష్టిలో నెలసరి అనేది సిగ్గుపడే విషయం కాదు. అది ఆరోగ్యానికి సంబంధించిన సహజమైన అంశం. తండ్రులు ఈ విషయంపై మాట్లాడటాన్ని కొందరు ఇప్పటికీ వింతగా లేదా అసౌకర్యంగా భావించినా, "పిల్లలకు అండగా ఉండటం, వారు ఎప్పుడైనా వచ్చి మాట్లాడగలిగేలా ఉండటం చాలా ముఖ్యం" అని ఆయన చెబుతున్నారు.

కడుపునొప్పి

‘ఎదుర్కోవాల్సిందే’

రాయ్.. తన భార్య క్యాన్సర్‌తో మరణించిన తర్వాత ఒంటరిగానే కూతురిని పెంచుతున్నారు.

కూతురుకి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పటినుంచే తనతో నెలసరి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు రాయ్. ఏం జరుగుతుందో, దానికి ఎలా సిద్ధం కావాలో వివరించే పుస్తకాలను కూతురితో కలిసి చదివి, ఆ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్పారు.

"మొదట్లో ఆమె ముఖంలో రంగులుమారాయి. కానీ మేం దాని గురించి మాట్లాడుకున్నాం" అని ఆయన చెప్పారు.

తర్వాత రాయ్ తన కుమార్తెకు ప్యాడ్‌ను చూపించి, దాన్ని లోదుస్తులపై ఎలా అతికించాలో చూపించారు.

అలాగే, "నువ్వు ఒకసారి వేసుకుని చూడు, నీకు తెలుస్తుంది" అని ఆమెకు సూచించారు.

"నేను నా కుమార్తెను జీవితానికి సిద్ధం చేస్తున్నాను. అందులో నెలసరి, సెక్స్, బాయ్‌ఫ్రెండ్‌లు, సంబంధాలు, ఇవన్నీ భాగమే. ఇవన్నీ కష్టమైన విషయాలే, వీటిని తప్పించుకోవడం సాధ్యం కాదు, ఎదుర్కోవాల్సిందే" అని ఆయన అన్నారు.

చాలామంది మహిళలు తమ మొదటి నెలసరి గురించి బహిరంగంగా చర్చించి ఉండకపోవచ్చు.

పీరియడ్ పావర్టీని (నెలసరి సమయంలో అవసరమైన వస్తువులు అందకపోవడాన్ని) నివారించేందుకు పనిచేస్తున్న "హేయ్ గర్ల్స్" అనే లాభాపేక్షలేని సంస్థలో ఉద్యోగిగా ఉన్న హన్నా రౌట్లెడ్జ్, తన మొదటి నెలసరి అనుభవాన్ని ఇప్పటికీ అసౌకర్యంగా గుర్తు చేసుకుంటారు.

"నాకు 10 ఏళ్ల వయసులోనే పీరియడ్స్ మొదలయ్యాయి" అని ఆమె చెప్పారు. "నేను చదివిన స్కూల్‌లో ఎలాంటి సదుపాయాలు లేవు, ప్యాడ్‌లు వేయడానికి కనీసం డస్ట్‌బిన్ కూడా ఉండేది కాదు" అని ఆమె అన్నారు.

హేయ్ గల్స్, శానిటరీ ప్యాడ్స్

ఫొటో సోర్స్, Hannah Routledge

ఫొటో క్యాప్షన్, "ప్యాడ్స్ ఫర్ డాడ్స్ కార్యక్రమం తండ్రులు తమ కుమార్తెలతో నెలసరి గురించి సులభంగా మాట్లాడేందుకు సహాయపడే సమాచారం, సూచనలు అందిస్తుంది" అని హన్నా రౌట్లెడ్జ్ చెబుతున్నారు.

హే గర్ల్స్ సంస్థ 2019లో "ప్యాడ్స్ ఫర్ డాడ్స్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం తండ్రులు తమ కుమార్తెలతో నెలసరి గురించి తొలిసారి మాట్లాడేటప్పుడు సహాయపడే ఉచిత మార్గదర్శకాలు, సమాచారం అందిస్తుంది.

"ఈ కార్యక్రమం ఉద్దేశం తండ్రులు, తల్లిదండ్రుల్లో నెలసరి గురించి ఉన్న సిగ్గు, అపోహలను తొలగించడం" అని ఆమె వివరించారు.

"దీనికోసం పెద్ద పెద్ద చర్చలు అవసరం లేదు. చిన్న చిన్న మాటల్లోనే మాట్లాడండి, ఇంట్లో అవసరమైన వస్తువులు సిద్ధంగా ఉంచండి, ముఖ్యంగా పిల్లలకు అండగా ఉండండి" అని ఆమె చెప్పారు.

"తల్లిదండ్రులు తమ కుమారులతో కూడా నెలసరి గురించి మాట్లాడటం, వారికి అవగాహన కల్పించడం చాలా అవసరం" అని హన్నా సూచించారు.

తన ఆరేళ్ల కుమారుడు బాత్రూమ్‌లో టాంపాన్(నెలసరి సమయంలో వాడే వస్తువు) చూసినప్పుడు, ఆయనతో నెలసరి గురించి మాట్లాడడం ప్రారంభించారు మహిళల ఆరోగ్య నిపుణురాలైన డాక్టర్ నిఘత్ అరిఫ్.

‘‘ఇది అమ్మ వాడేది, ఎందుకంటే అమ్మకు రక్తస్రావం అవుతుంది' అని నేనతనికి చెప్పాను’’ అని డాక్టర్ నిఘత్ అరిఫ్ చెప్పారు.

"మొదట అతనికి భయంగా అనిపించింది, కానీ ఇది గాయం కాదు, ప్రతి మహిళకూ ప్రతి నెల ఇలా జరుగుతుంది, ఇది సహజమైన విషయం" అని ఆమె వివరించారు.

"ఇప్పుడిప్పుడే నెలసరి గురించి ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోంది. మా నాన్నలో కూడా ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఒకప్పుడు ఆయన ఇలాంటి విషయాలను పూర్తిగా దాటవేసేవారు, మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నారు. తన మనవరాళ్లకు ఏదైనా అవసరం ఉన్నా, లేదా వాళ్లు ఆ విషయం గురించి మాట్లాడాలనుకున్నా, ఆయన నిరభ్యంతరంగా వింటారు, అర్థం చేసుకుంటారు" అని హన్నా ఆనందంగా చెబుతున్నారు.

మహిళలు, ఉద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

పని ప్రదేశాల్లో సిగ్గుపడే భావం తగ్గించడం

తల్లిదండ్రులు తమ పిల్లలతో యుక్తవయస్సు గురించి మాట్లాడే విషయంలో తరచుగా రెండు రకాల ధోరణులు కనిపిస్తాయని ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేసే కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ క్రిస్టీన్ ఎకెచి మాట్లాడుతూ,

"చాలామంది సింగిల్ మదర్స్ తమ కుమారులతో ప్యూబర్టీ, యవ్వనం, సురక్షితమైన సెక్స్ గురించి మాట్లాడకుండా వాళ్లను ఎవరూ ఆపడంలేదు. అదే విధంగా తండ్రులు కూడా తమ కుమార్తెలతో ఇలాంటి విషయాలపై మాట్లాడడంలో తప్పేం లేదు" అని డాక్టర్ క్రిస్టిన్ ఎకేచి చెప్పారు.

ఇంట్లో ఓపెన్‌గా మాట్లాడుకోవడం పెరిగితే మరిన్ని మంచి మార్పులు వస్తాయని డాక్టర్ ఎకేచి అన్నారు. అవగాహన ఉన్న తండ్రులు కేవలం మంచి తల్లిదండ్రులే కాకుండా, వర్క్ ప్లేస్‌లో కూడా మంచి సహచరులు, నాయకులుగా మారుతారు అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇది ఉద్యోగ స్థలాల్లో నెలసరి గురించి ఉన్న సిగ్గు, అపోహలు తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, మహిళలకు అవసరమైన సదుపాయాలు, మద్దతు, అవగాహన పెరగడంతో మెన్‌స్ట్రువల్ ఈక్విటీ మెరుగుపడుతుంది.

"అన్నిటికంటే ముఖ్యంగా ఇది తండ్రి, కుమార్తె మధ్య బంధాన్ని మరింత బలంగా చేయడానికి అద్భుతమైన మార్గం" అని ఆమె అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)