దీవిలో 80 ఏళ్ల బామ్మను మర్చిపోయి బయలుదేరిన క్రూయిజ్ షిప్, చివరకు ఆమె ఏమయ్యారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లనా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గ్రేట్ బ్యారియర్ రీఫ్‌లోని ఓ ద్వీపంలో క్రూయిజ్ షిప్ మర్చిపోయి వదిలేసి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలు సుజానే రీస్ కోసం వెతుకుతున్న ఆస్ట్రేలియా అధికారులకు ఆమె మృతదేహం లభించింది.
కోరల్ అడ్వెంచరర్ క్రూయిజ్ షిప్‌లో తన తోటి ప్రయాణికులతో కలిసి, కైర్న్స్‌కు ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిజార్డ్ ద్వీపంలో హైకింగ్ కోసం రీస్ శనివారం వెళ్లారు.
కానీ, ఎండ ఎక్కువగా ఉండటంతో ఆమె విశ్రాంతి తీసుకోవాలని భావించి ఆ గ్రూపు నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది.
తర్వాత ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణికులంతా తిరిగి వచ్చారా లేదా అన్నది చూసుకోకుండానే సిబ్బంది క్రూయిజ్‌ను బయలుదేరదీశారు. తర్వాత లెక్క చూసుకుంటే ఒకరు లేరన్న విషయం తేలడంతో క్రూయిజ్‌ను తిరిగి ఐలాండ్ తీసుకొచ్చి వెతికారు. కానీ ఫలితం లేకపోయింది.
‘‘కనీస జాగ్రత్త, కామన్‌సెన్స్ లేకుండా వ్యవహరించడం వల్ల ఇదంతా జరిగింది’’ అని ట్రావెల్ ఏజెన్సీ వైఖరిపై మృతురాలి కుమార్తె కేథరిన్ విమర్శలు చేశారు.

అసలేం జరిగింది?
న్యూసౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన సుజానే రీస్, క్రూయిజ్ షిప్‌లో ఆస్ట్రేలియా వ్యాప్తంగా 60 రోజులపాటు సాగే టూర్ ప్లాన్‌ను ఎంచుకున్నారు. గత వారం ఈ షిప్ కైర్న్స్ నుంచి బయలుదేరింది.
వేల డాలర్లు ఖర్చయ్యే ఈ టూర్‌లో యాత్రికులకు క్రూయిజ్ షిప్ ప్రయాణం, దీవులలో డేట్రిప్, హైకింగ్, స్నోర్కెలింగ్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి.
కుక్స్ లుక్ అనే శిఖరం ఎక్కే ట్రెక్కింగ్ టీమ్‌లో సుజానే చేరారు. కానీ, సగంలోనే ఆమె అలసిపోయినట్లు తెలిసింది.
‘‘బాగా ఎండగా ఉండటం వల్ల మా అమ్మ అలసిపోయి అనారోగ్యం పాలైనట్లు మాకు పోలీసులు చెప్పారు. ఎలాంటి తోడు ఇవ్వకుండా తిరిగి క్రూయిజ్ షిప్ దగ్గరకు వెళ్లమని ఆమెను పంపించేశారు. తర్వాత ఆమె వచ్చారా లేదా అని చూసుకోకుండానే క్రూయిజ్‌ను బయలుదేరదీశారు’’ అని సుజానే కూతురు కేథరీన్ అన్నారు.
‘‘ఈ పరిణామాల మధ్యలోనే మా అమ్మ చనిపోయి ఉంటుంది’’ అని కేథరిన్ అన్నారు.
సూర్యాస్తమయం సమయంలో ద్వీపం నుంచి ఓడ బయలుదేరింది. కానీ ఆ మహిళ కనిపించడం లేదని కొన్ని గంటల తర్వాత.. సిబ్బంది గ్రహించడంతో ఆమె కోసం తిరిగి ద్వీపానికి వచ్చింది.
ఆమెను వెతికేందుకు ఓ పెద్ద సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టిన అధికారులకు, ఆపరేషన్‌ను నిలిపేయాల్సిందిగా ఆదివారం తెల్లవారుజాముకు ఆదేశాలు వచ్చాయి. వారికంటే ముందే చేరుకున్న హెలీకాప్టర్ సిబ్బందికి ఆమె మృతదేహం కనిపించడంతో సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు.
ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ (ఏఎంఎస్‌ఏ) చెప్పింది. డార్విన్‌కు నౌక చేరుకున్నాక, నౌకలోని సిబ్బందిని విచారిస్తామని తెలిపింది.
ప్రయాణికులలో ఒక మహిళ కనిపించడం లేదని నౌక కెప్టెన్ శనివారం రాత్రి 11 గంటల స్థానిక సమయం (05:00 జీఎంటీ)లో మొదటిసారిగా అప్రమత్తం చేశారని ఏఎంఎస్ఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ కేసు గురించి దర్యాప్తు చేసేందుకు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని అధికారులు తెలిపారు. వాణిజ్య నౌకల్లో ప్రయాణికులు, సిబ్బంది భద్రతను తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Coral Expeditions
'హెలికాప్టర్ వెతుకుతుంటే చూశాను'
సదరు మహిళ కుటుంబాన్ని తమ సిబ్బంది సంప్రదించారని, ఈ విషాద సమయంలో ఆమెకు తాము మద్దతుగా ఉంటున్నామని కోరల్ ఎక్స్‌పీడిషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఫిఫీల్డ్ చెప్పారు.
"ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. జరిగిందానికి మేం చాలా చింతిస్తున్నాం. మహిళ కుటుంబానికి మా సహకారం ఉంటుంది" అని ఫిఫీల్డ్ చెప్పారు.
శనివారం అర్ధరాత్రి ఆ ద్వీపంలోని నడక మార్గంలో స్పాట్‌లైట్‌ను ఉపయోగించి, ఓ హెలికాప్టర్ వెతుకుతుండడాన్ని తాను చూసినట్లు గతవారం ద్వీపం దగ్గర్లో సెయిలింగ్ చేసిన ట్రాకి అయిరిస్ అనే మహిళ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(ఏబీసీ)తో తెలిపారు.
దాదాపు ఏడుగురు టార్చిలైట్లు పట్టుకుని ద్వీపంలో వెతికేందుకు వెళ్లారని ఆమె చెప్పారు.
కానీ, ఆదివారం ఉదయం హెలికాప్టర్ వచ్చి మృతదేహాన్ని కనుగొనడంతో.. స్థానిక కాలమానం ప్రకారం 3:00 గంటల ప్రాంతంలో వాళ్లు వెతకడం ఆపేశారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతో ఖర్చు పెట్టి ట్రిప్‌కు వచ్చిన బామ్మ
"స్వర్గంలాంటి ఈ ప్రదేశంలో ఈ విషాదం జరగడం చాలా బాధాకరం. ఇది జరగకపోయి ఉంటే ఆమెకిది చాలా సంతోషకరమైన సమయం అయ్యేది" అని అయిరిస్ అన్నారు.
కోరల్ అడ్వెంచరర్ క్యాటర్స్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ పడవలో 46 మంది సిబ్బందితో పాటు 120 మంది అతిథులు ప్రయాణించొచ్చు.
ఆస్ట్రేలియా తీరంలోని మారుమూల ప్రాంతాల్లోకి వీరిని తీసుకువెళ్లడమే ఈ సంస్థ ఉద్దేశం. అక్కడి నుంచి చిన్న పడవల్లో ప్రయాణికులను డే ఎక్స్‌కర్షన్స్‌కు తీసుకువెళ్తారు.
ఈ మహిళ మృతిపై పంచనామా నిర్వహించేందుకు ఓ అధికారిని నియమిస్తున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













