టాటా గ్రూప్: రతన్ టాటా మరణం తరువాత ఈ దిగ్గజ గ్రూపులో విభేదాలకు కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యాపార దిగ్గజ సంస్థ టాటా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఈ గ్రూపును రతన్ టాటా ఆధునికత, సాంకేతికత వైపు నడిపారు. ఇప్పుడు ఆయన మరణించిన ఏడాది తరువాత ఆ గ్రూపును అనేక సంక్షోభాలు చుట్టుమట్టాయి.
టాటా గ్రూపు ఉప్పు నుంచి ఉక్కు దాకా అనేక పరిశ్రమలను నడుపుతోంది. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్), టెట్లీ టీ వంటి బ్రిటిష్ బ్రాండ్లను సొంతం చేసుకుంది. అలాగే ఆపిల్ కోసం భారత్‌లో ఐఫోన్లనూ తయారుచేస్తోంది. కానీ ఇప్పుడీ గ్రూపు మరోసారి అంతర్గత కలహాలలో చిక్కుకుంది.
గడిచిన కొన్ని నెలలుగా ట్రస్టీల మధ్య జరుగుతున్న బోర్డు రూమ్ వార్, ఆ గ్రూపు అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. ఈ పరిణామంతో 2016లో సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు రేగిన చట్టపరమైన వివాదాల్లాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది.
దిల్లీలోని కొందరు మంత్రులు వీరి మధ్య తాత్కాలికంగా ఓ ఒప్పందం కుదిర్చినట్టుగా కనిపిస్తోందని, అయితే రతన్ టాటాకు సన్నిహితుడు, టాటాబోర్డు ట్రస్టీ మెహ్లీ మిస్త్రీని కంపెనీ నుండి తొలగించారని విస్తృతంగా మీడియా కథనాలు వెలువడ్డాయి.ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడంలేదు.
మిస్త్రీ తొలగింపుపై వచ్చిన కథనాల గురించి బీబీసీ టాటా ట్రస్టు స్పందన కోరింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
‘విస్తరణ’సమయంలోనే విభేదాలా?
ప్రస్తుత టాటా గ్రూపు పోరును ‘‘పరిష్కారం కాని పాత వ్యవహారాలు మరోసారి తెరమీదకి రావడం’’గా పేర్కొన్నారు టాటా గ్రూపు ప్రస్థానంపై పుస్తకం రాసిన యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ప్రొఫెసర్ మిర్చియా రయాను.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే టాటాలో తుది నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది? అలాగే టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్టులు వ్యాపార నిర్ణయాలలో ఎంత ప్రభావం చూపగవు?
టాటా గ్రూపు నిర్మాణం ఇతర సంస్థలతో పోల్చితే చాలా భిన్నమైనది. ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ మార్కెట్‌లో లిస్టింగ్ కానీ సంస్థ అయినప్పటికీ , దాని వాటాలు దాతృత్వ సంస్థ టాటా ట్రస్ట్స్ వద్ద ఉన్నాయి.
దీనివల్ల గ్రూపుకు పన్ను, నియంత్రణపరమైన ప్రయోజనాలు లభించాయి. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం లభించింది.
కానీ లాభాపేక్ష లేని ట్రస్టు లక్ష్యాలు, వాణిజ్య ప్రయోజనాలు కలగలసి ఉండటం వల్ల పాలనాపరమైన చిక్కులు కూడా ఏర్పడ్డాయని నిపుణులు చెబుతారు.
ఇక తాజా విభేదాలు టాటా గ్రూప్‌కు భారీ వ్యాపార ఒత్తిళ్లు ఎదురవుతున్న వేళ వచ్చాయి. ఒకవైపు ఈ సంస్థ సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్తరంగాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు 2021లో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఎయిరిండియాను పునరుద్ధరించే పనిలో ఉంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తరువాత ఆ పని మరింత కష్టంగా మారింది.
మరి తప్పు ఎక్కడ జరిగింది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
టాటా గ్రూపులో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలపై ఆ సంస్థ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
కానీ బోర్డు నియామకాలు, నిధుల ఆమోదం, టాటా గ్రూపుకు చెందిన 26 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల హోల్డింగ్ సంస్థ, 328 బిలియన్ డాలర్ల మార్కెట్ కాపిటలైజేషన్ ఉన్న టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయలా లేదా అనే అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలు పొడసూపినట్టు వివిధ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
టాటా గ్రూప్‌కు సన్నిహితంగా ఉండే ఒక వర్గం, పేరు వెల్లడించకూడదనే షరతుతో బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, టాటా సన్స్ వ్యూహాత్మక నిర్ణయాల్లో ఎక్కువ ప్రభావం చూపాలన్న కొంతమంది ట్రస్టీల ఆకాంక్షే ఈ వివాదానికి ప్రధాన కారణం. ప్రస్తుతం టాటా ట్రస్టులకు టాటా సన్స్ బోర్డులో ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు.
‘‘టాటా ట్రస్టుల ప్రతినిధులకు కంపెనీ ప్రధాన నిర్ణయాలపై వీటో హక్కు ఉంది, కానీ నిజానికి వారిపాత్ర పర్యవేక్షణ వరకే పరిమితం. వారికి ఎటువంటి నిర్ణయాధికారం లేదు," అని ఆ వర్గం తెలిపింది. "అయితే ఇప్పుడు కొంతమంది ట్రస్టీలు వ్యాపార నిర్ణయాలపై ప్రత్యక్ష నియంత్రణ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
మరో వివాదాస్పద అంశం ఎస్‌పీ గ్రూప్‌కు సంబంధించినది. టాటా సన్స్‌లో 18% వాటా కలిగినఅతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్ ఎస్‌పీ గ్రూప్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాలనే పట్టుదలతో ఉంది. ఎస్‌పీ గ్రూపు ఈ ప్రయత్నాన్ని ముందుకు తెస్తుండగా, టాటా ట్రస్టీలు అందుకు వ్యతిరేకంగా ఉన్నారు.
‘‘కంపెనీ పబ్లిక్ అయితే, ట్రస్టుల నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్తు దార్శనికత బలహీనపడుతుందనే భయం ఉంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభదశలోనే ఉన్నవేళ అది టాటా సన్స్‌ను మార్కెట్ ఒత్తిళ్లకు గురిచేస్తుంది ’’ అని ఆ వర్గం తెలిపింది.
కానీ ఎస్పీ గ్రూప్ మాత్రం ఈ పబ్లిక్ లిస్టింగ్‌ను 'నైతిక, సామాజిక అవసరంగా’ పేర్కొంది, ఇది టాటా షేర్‌హోల్డర్లకు విలువను సృష్టిస్తుందని, కంపెనీలో పారదర్శకత, పరిపాలనా ప్రమాణాలు మెరుగుపరచడంలో సహాయపడుతుందని వాదిస్తోంది.
బీబీసీ అడిగిన వివరమైన ప్రశ్నలకు టాటా సన్స్ , టాటా ట్రస్టులు గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఈ వివాదం టాటా గ్రూపు ఎదుర్కొంటున్న నిజమైన డోలాయమాన స్థితిని ప్రతిబింబిస్తోందని ప్రొఫెసర్ మిర్చియా రయాను అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
పబ్లిక్ లిస్టింగ్ వివాదం..
టాటా సన్స్ పబ్లిక్ కంపెనీగా మారడమనేది యూరప్, అమెరికా వంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఇటీవల కాలంలో అవలంబిస్తున్న ధోరణికి విరుద్ధంగా ఉంది. అక్కడ అనేక సంస్థలు స్థిరత్వం, సుస్థిరత కోసం ‘ఫౌండేషన్ ఓనర్‌షిప్’ వైపు మళ్లుతున్నాయి. ఇందుకు ఆ కంపెనీలు టాటా గ్రూపునే స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి.
"ప్రైవేట్, లేదా కుటుంబ యాజమాన్య కంపెనీలు బాహ్య పర్యవేక్షణకు తక్కువ లోబడి ఉంటాయి. దీని వల్ల అంతర్గత విభేదాలు మరింత పెరిగి సంస్థ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉంది’’ అని ప్రొఫెసర్ రయాను హెచ్చరించారు.
ఈ వివాదం ఇప్పటికే టాటా గ్రూప్ పరిపాలనా ప్రమాణాలపై సందేహాలను రేకెత్తించిందని, అలాగే భారత్ లోని అత్యంత గౌరవనీయ వ్యాపార సమూహాల్లో ఒకటైన టాటా గ్రూపు బ్రాండ్ ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం చూపిందని ప్రచారకర్త దిలీప్ చెరియన్ అన్నారు. ఆయన గతంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీతో కలిసి పనిచేశారు.
ఇది ఇటీవల టాటా ప్రతిష్ఠపై వచ్చిన వరుస దెబ్బల్లో మరొకటి మాత్రమే అని చెరియన్ బీబీసీతో అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, అలాగే సెప్టెంబర్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్‌పై జరిగిన సైబర్ దాడి, ఇవన్నీ బ్రిటన్‌లో ఆ కంపెనీ కార్ల ఉత్పత్తిని 70 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేర్చాయని గుర్తుచేశారు.
అదనంగా, గ్రూప్‌కి సగం ఆదాయం తెచ్చే ఫ్లాగ్‌షిప్ కంపెనీ టీసీఎస్ కూడా సొంత సమస్యలతో పోరాడుతోంది. భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపు, రిటైల్ దిగ్గజం మార్క్స్ అండ్ స్పెన్సర్‌తో బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ రద్దు ప్రస్తుతం ఆ కంపెనీ ముందున్న అతిపెద్ద సమస్యలు.
సంక్షోభాలు కొత్త కాదు
‘‘ఈ బోర్డు గదుల రాజకీయాలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి’’ అని చెరియన్ అన్నారు. "దీనివల్ల షేర్ మార్కెట్ పనితీరుపై ఆందోళన మాత్రమే కాదు, పెట్టుబడిదారుల మధ్య 'టాటా గ్రూప్‌లో తుది నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది?' అనే సందేహం కూడా మరింత పెరుగుతుంది’’ అన్నారు.
ఈ పరిస్థితుల్లో, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలం పొడిగించినట్టు సమాచారమందింది.
‘‘చైర్మన్ తన పని తాను చేసుకుపోవచ్చు. ఎందుకంటే ఇది బోర్డు అంతర్గ విభేదం కాదు, ట్రస్టీల మధ్య వివాదం మాత్రమే. కానీ ఇది ఆయనకు అవసరం లేని దృష్టి సారింపు’’అని టాటా సన్స్‌కు దగ్గరగా ఉన్న వర్గం ఒకటి తెలిపింది.
అయితే సంక్షోభాలను ఎదుర్కోవడం టాటాలకు కొత్తేమీ కాదు. 1990లలో రతన్ టాటా గ్రూప్‌ను ఆధునీకరించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర అంతర్గత విభేదాలు ఎదుర్కొన్నారు. సైరస్ మిస్త్రీ తొలగింపు సంగతి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది.
కానీ ఈసారి పరిస్థితి మునుపటి కంటే భిన్నంగా ఉందని ప్రొఫెసర్ రయానూ అంటున్నారు.
‘‘ఆ సమయంలో తక్కువ పనితీరు కనబరిచిన గ్రూప్ కంపెనీలను టీసీఎస్ నిలబెట్టింది. అంతకుముందు ఆ పాత్రను టాటా స్టీల్ పోషించింది’’ అని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం టీసీఎస్ వ్యాపార నమూనా మార్పు దశలో ఉండటం, గ్రూప్ మొత్తం ఆదాయంలో దాని వాటా తగ్గుతుండటంతో, ఇలాంటి 'ఆధారపడదగిన' కంపెనీ ఇప్పుడు కనిపించడం లేదు. ఇది గ్రూప్‌కు అంతర్గత విభేదాలను ఎదుర్కోవడం మరింత క్లిష్టంగా మారుస్తోంది.
‘‘ఇది తాత్కాలికంగా అస్థిరత, నష్టాన్ని కలిగించవచ్చు. కానీ దీని ఫలితంగా ఒక కొత్త, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా నిర్మాణం ఏర్పడే అవకాశం కూడా ఉంది," అని ప్రొఫెసర్ రయానూ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














