మొంథా: మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటిన తుపాను

మొంథా తుపాను తీరాన్ని దాటింది. మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీనపడనుందని అర్ధరాత్రి వెలువరించిన బులిటెన్‌లో వెల్లడించింది. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


అంతకు ముందు, మొంథా తుపాను తీరం దాటుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
తుపాను ప్రభావం గురించి భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. మొహాపాత్ర ఇంగ్లీషు న్యూస్ చానెల్ ఎన్డీటీవీతో మాట్లాడారు.
"తుపాను ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంటుంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు మీద ఉంటుంది. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి" అని అన్నారు.

ఏపీలో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 95 ప్రాంతాల్లో తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

‘ప్రజలు బయటకు రావద్దు’
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 23 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా రావచ్చని తెలిపింది.
మరోవైపు తమిళనాడపై కూడా ఈ తుపాను ప్రభావం ఎక్కువగానే ఉంది. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
విశాఖపట్నంగుండా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే, వాతావరణ పరిస్థితులు మెరుగైన తర్వాత ట్రాక్‌లను పరిశీలించి వాటిని పునరుద్దరిస్తామని ప్రకటించింది.

విమాన సర్వీసులకు అంతరాయం
తుపాను కారణంగా విజయవాడ కేంద్రం దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసులను నిలిపివేశారు.
వాతావరణంలో సమస్యల కారణంగా తమ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడవచ్చని, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ముందు విమాన రాకపోకలకు సంబంధించి వెబ్‌సైట్‌ను చూడాలని ఇండిగో ప్రకటించింది.
ఇటు తెలంగాణలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారి జీఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














