ఏపీలో భారీవర్షాలు: కళింగపట్నం దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం

ఫొటో సోర్స్, APSDMA
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలో మీటర్ల దూరంలో, విశాఖకు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరంవైపు కదులుతోందని అధికారులు తెలిపారు.
శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.


ఫొటో సోర్స్, apsdma
సీఎం చంద్రబాబు సమీక్ష
ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాలపై సమీక్ష జరిపారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.
వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్‌ల వంటి టెక్నాలజీని విరివిగా వాడాలని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఫొటో సోర్స్, UGC
విజయవాడలో విషాదం
భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బండరాళ్లు ఇళ్లపై పడటంతో మేఘన, లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తుచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా వరద సంబంధిత ప్రమాద ఘటన జరిగింది. పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి ఒక కారు కాలువలో కొట్టుకు పోయింది.
అందులో ప్రయాణిస్తున్న రాఘవేంద్ర అనే ఉపాధ్యాయుడితోపాటు, సాత్విక్, మాన్విక్ అనే ఇద్దరు విద్యార్ధులు కూడా మరణించారు.
కొనసాగనున్న పింఛన్ల పంపిణీ
పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
రేపు సెలవు కాబట్టి ముందు రోజే పింఛన్లు ఇవ్వాలనుకున్నామని, అయితే భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచామని తెలిపారు.
వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యవచ్చని, వర్షాలు లేని ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ మామూలుగానే కొనసాగుతుందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














