మలేసియా: సింక్‌హోల్‌లో పడిపోయిన తెలుగు మహిళ గాలి విజయలక్ష్మి జాడ ఏమైంది,అధికారులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Prasanth
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ న్యూస్
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఫుట్‌పాత్ కుంగడంతో, మురుగుకాల్వలో పడి గల్లంతైన తెలుగు మహిళ గాలి విజయలక్ష్మి కోసం జరుగుతున్న గాలింపు యత్నాలకు 8వరోజు ఆటంకం ఏర్పడింది.
ఆమెను వెదికేందుకు ఇంకా డైవర్లను మోహరించడం ‘చాలా ప్రమాదకరమని’ అక్కడి అధికారులు చెబుతున్నారు.
48 ఏళ్ల విజయలక్ష్మి కోసం వారం రోజులుగా 110 మంది రెస్క్యూ సిబ్బంది పగలు రాత్రీ తేడా లేకుండా గాలిస్తున్నారు.
గాలింపు చర్యలు మొదలుపెట్టిన తొలి 17 గంటల్లో ఆమె చెప్పులు మాత్రమే దొరికాయి. ఇప్పటివరకు ఆమె జాడ కోసం చేసిన ప్రయత్నాలు ఎటువంటి ఫలితమూ ఇవ్వలేదు.
స్థానిక కాలమానం ప్రకారం,శుక్రవారం ఉదయం 4 గంటలకు ఒక డ్రైనేజీ ద్వారా లోపలికి వెళ్లిన ఇద్దరు డైవర్లు బలమైన నీటి ప్రవాహాలు,దట్టమైన వ్యర్థాల తాకిడిని ఎదుర్కొన్నారని అగ్నిమాపక, రెస్క్యూశాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, EPA
కాంక్రీట్ బ్లాకుల్లా వ్యర్థాలు
లోపలకు వెళ్లిన ఇద్దరు డైవర్లలో ఒకరు అగ్నిమాపక సిబ్బంది కాగా మరొకరు డ్రైనేజీ సిబ్బంది. లోపల చాలా ఇరుకుగా ఉండటంతో వారిద్దరూ పాకుతూ వెళ్ళాల్సి వచ్చిందని ఫైర్ అండ్ రెస్క్యూ శాఖ డైరెక్టర్ జనరల్ నోర్ హిషమ్ మొహమ్మద్ చెప్పారు.
‘‘లోపల కాంక్రీట్ బ్లాకుల్లా మారిపోయిన వ్యర్థాలను తొలగించడం చాలా కష్టంగా, దాదాపు అసాధ్యంగా అనిపించింది. ఎనిమిది మంది సిబ్బంది వాటిని తాళ్లతో లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు’’ అని ఆయన విలేఖరులతో చెప్పారు.
లోపల చీకటి కారణంగా ఏమీ కనిపించలేదని, భారీ వర్షంతో మరింత ఇబ్బంది పడ్డామని విజయలక్ష్మిని వెదుకేందుకు డ్రైనేజీలోకి దిగిన డైవర్లు చెప్పారు.
‘‘సింక్‌హోల్ లోపలికి వెళుతున్నప్పుడు చాలా భయమేసింది. కానీ, ఒక ఫైర్‌ఫైటర్‌గా అది నా బాధ్యత. అందుకే భయాన్ని పక్కనపెట్టి దేవుడిపై భారం వేసి లోపలికి వెళ్లాను’’ అని స్థానిక వార్తా పత్రిక ‘సిమర్ హరియాన్’తో ఫైర్‌ఫైటర్ అలీమదియా బుక్రీ తెలిపారు.
‘‘లోపల అంతా కటిక చీకటిగా ఉంది. డ్రైనేజీలో ఏముంటుందో మీకు చెప్పనవసరం లేదు. మానవ వ్యర్థాలు, ఇతర చెత్తతో అది నిండిపోయి ఉంది’’ అని మరో డైవర్ ‘ది స్ట్రెయిట్ టైమ్స్’ వార్తా సంస్థకు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
గుడికి వెళుతూ..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలి విజయలక్ష్మి తన కుటుంబంతో కలిసి, కౌలాలంపూర్‌లోని ఓ ఆలయానికి జలాన్ మస్జీద్ ఇండియా వీధిలో నడిచి వెళుతుండగా, ఆమె కాళ్ళ కింద ఫుట్‌పాత్ ఒక్కసారిగా కుంగిపోయి 26 అడుగుల లోతున్న సింక్‌హోల్‌లో పడిపోయారు.
తర్వాత అధికారులు ఆ సింక్‌హోల్ చుట్టూ తవ్వేందుకు యంత్రాలు తీసుకువచ్చారు. అండర్‌గ్రౌండ్‌లోని డ్రైనేజీ పైపుల్లో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి రోబో కెమెరాలతో పాటు స్నిపర్ డాగ్‌లను ఉపయోగించారు.
వాటర్ జెట్స్,ఐరన్ హుక్, తాళ్లను ఉపయోగించి లోపలి వ్యర్థాలను తొలగించేందుకు ప్రయత్నించారు.
అధికారులు అండర్‌గ్రౌండ్‌లోని వ్యర్థాల సాంద్రతలో మార్పులను పరిశీలించేందుకు, ఘటనా ప్రదేశంలో భూమిలోకి చొచ్చుకుపోయే ఒక రాడార్ పరికరాన్నిమంగళవారం (27.08.2024)నాడు పంపించారు.
సింక్‌హోల్‌కు సమీపంలోని ఒక ఆఫీసు భవనం దిగువన డ్రైనేజీలో 15మీటర్ల మేర పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.
మానవ వ్యర్థాలు, టైర్లు, వెంట్రుకలు, పేరుకుపోయిన వంటనూనె వ్యర్థాలతో డ్రైనేజీ బాగా పూడుకుపోయిందని వార్తా కథనాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, EPA
వీసా గడువు పెంపు
గాలింపు కొనసాగుతున్నందున జలాన్ మస్జీద్ ఇండియా వీధిలోని కొన్ని ప్రాంతాలను మూసివేశారు.
మామూలుగా ఈ ప్రాంతం పర్యటకులతో కిటకిటలాడుతుంటుంది. ఈ ఘటనతో అక్కడ గత కొన్ని రోజులుగా రాకపోకలు తగ్గాయి. అమ్మకాలు 50 నుంచి 70 శాతం వరకు పడిపోయాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
మలేసియా ప్రభుత్వం, విజయలక్ష్మి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న ఆమె కుటుంబీకులకు ఒక నెలపాటు వీసా గడువును పొడిగించింది. వారంతా కిందటి శనివారమే భారత్‌కు రావాల్సి ఉంది.
విజయలక్ష్మి కుటుంబానికి గౌరవ సూచకంగా కౌలాలంపూర్ సిటీ హాల్ జాతీయ దినోత్సవాలను రద్దు చేసింది.
సింక్‌హోల్‌లో మహిళ పడిపోయిన ఘటన మలేసియాలో భయాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. అక్కడ సింక్‌హోల్ ఎలా ఏర్పడిందంటూ చాలా మంది మలేసియన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ‘‘ఇంటిగ్రిటీ ఆడిట్’’ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల కలయిక వల్ల సింక్‌హోల్ ఏర్పడి ఉండొచ్చని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు మినరల్స్ అండ్ జియోసైన్సెస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Prasanth
విజయలక్ష్మి కుప్పం మహిళ
గాలి విజయలక్ష్మి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందినవారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని అనిమిగానిపల్లెలో ఆమె నివసిస్తున్నారని స్థానిక సీనియర్ జర్నలిస్ట్ ప్రశాంత్ బీబీసీ తెలుగుకు చెప్పారు.
విజయలక్ష్మి ఆమె భర్త బాలయ్య కుమారుడు సూర్యతో కలిసి మలేసియాకు వెళ్లారు.
" విజయలక్ష్మి కోసం అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ లభించలేదు. 23వ తేదీ రాత్రి 12 గంటలదాకా వెదికిన మలేసియా అధికారులు తరువాత గాలింపు నిలిపివేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మలేసియాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విజయలక్ష్మి కోసం మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టినా నిన్నటితో ఆపేశారని మాకు తెలిసింది."అని విజయలక్ష్మి సమీప బంధువు అనిమిగానిపల్లి మాజీ ఉపసర్పంచ్ ఆర్ముగం బీబీసీ తెలుగుకు చెప్పారు.
(తిరుపతి నుంచి బీబీసీ తెలుగు ప్రతినిధి నంగా తులసీ ప్రసాద్ రెడ్డి అదనపు ఇన్‌పుట్స్‌తో)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














