బ్లాక్ యాక్స్: ప్రపంచంలోని పోలీసులంతా వేటాడుతున్న ముఠా

ఫొటో సోర్స్, Interpol
- రచయిత, చార్లీ నార్త్‌కాట్
- హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ
పశ్చిమాఫ్రికాలో అత్యంత భయం కలిగించే క్రిమినల్ నెట్‌వర్క్స్‌లో ఒకటైన ‘బ్లాక్ యాక్స్’ ముఠా ఆట కట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా పోలీస్ యూనిట్లు చేతులు కలిపాయి.
బ్లాక్ యాక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పోలీస్ యూనిట్లన్నీ వరుసగా కోవర్ట్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.
‘ఆపరేషన్ జాకల్-3’ పేరుతో చేపట్టిన మిషన్‌లో భాగంగా పోలీస్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య 21 దేశాల్లో దాడులు జరిపారు.
అంతర్జాతీయ పోలీస్ ఏజెన్సీ ఇంటర్‌పోల్ సమన్వయంతో ఈ మిషన్ సాగింది.
బ్లాక్ యాక్స్, దానికి సంబంధించిన ఇతర సంస్థలతో సంబంధాలున్న 300 మందిని అరెస్టు చేశారు.
నైజీరియాకు చెందిన బ్లాక్ యాక్స్ క్రైమ్ నెట్‌వర్క్‌కు ఈ ఆపరేషన్ పెద్ద ఎదురుదెబ్బని ఇంటర్‌పోల్ తెలిపింది. అయితే నైజీరియా నేర వ్యవస్థకు అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయని ఇంటర్‌పోల్ హెచ్చరించింది.
బ్లాక్ యాక్స్ ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పడానికి కెనడా అధికారులు ఒక సంచలనాత్మక ఉదాహరణ ప్రస్తావించారు.
బ్లాక్ యాక్స్‌కు సంబంధమున్న ఒక మనీ ల్యాండరింగ్ స్కీమ్‌ను 2017లో కెనడా అధికారులు ఛేదించారు. దాని విలువ 500 కోట్ల డాలర్ల (సుమారు రూ. 41 వేల కోట్లు) కన్నా ఎక్కువే.
‘‘వాళ్లు చాలా నిర్మాణాత్మకంగా, పద్ధతి ప్రకారం నేరాలు చేస్తారు’’ అని ఇంటర్‌పోల్ ఆర్థిక నేరాలు, అవినీతి వ్యతిరేక సెంటర్ సీనియర్ అధికారి అయిన టోమొనోబు కయా చెప్పారు.
‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ ఆర్థిక మోసాలు, ఇతర తీవ్రమైన నేరాలకు ప్రధాన బాధ్యత బ్లాక్ యాక్స్‌తో పాటు అలాంటి ఇతర సంస్థలదే’ అని 2022 నివేదికలో ఇంటర్‌పోల్ తెలిపింది.

ఫొటో సోర్స్, Interpol

దొంగల్లో ఉన్నత విద్యావంతులు
డబ్బు బదలాయింపు సాఫ్ట్‌వేర్‌లో ఆవిష్కరణలు, క్రిప్టో కరెన్సీ వంటి కోట్ల రూపాయల ఆన్‌లైన్ కుంభకోణాలకు పాల్పడిన ఇలాంటి గ్రూపుల చేతుల్లోకి వెళ్లాయని కయా చెప్పారు.
‘‘సిండికేట్ అవుతున్న ఈ నేరగాళ్లు కొత్త టెక్నాలజీని తొలి దశలోనే అందిపుచ్చుకుంటున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా, చాలా తేలిగ్గా డబ్బు అక్రమ పద్ధతిలో తరలించడానికి టెక్నాలజీలో వస్తున్న సరికొత్త మార్పులు అనువుగా ఉంటున్నాయి’’ అని ఆయన తెలిపారు.
‘ఆపరేషన్ జాకల్-3’లో భాగంగా కొన్నాళ్లుగా 30 లక్షల డాలర్లు(సుమారు 25 కోట్ల రూపాయలు) విలువైన అక్రమాస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 700కి పైగా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయగలిగారు.
బ్లాక్ యాక్స్ సభ్యుల్లో చాలా మంది యూనివర్శిటీ విద్యను అభ్యసించిన వారే. అయితే స్కూల్లో చదువుకునే రోజుల్లోనే వాళ్లు ఈ గ్రూపులో చేరిపోయారు.
బ్లాక్ యాక్స్‌కు రహస్య నేర వ్యవస్థ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం, హత్యలు వంటి నేరాలకు పాల్పడుతోంది ఈ గ్రూప్.
సైబర్ నేరాలు.. వ్యక్తులను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, వసూళ్లు వంటివే బ్లాక్ యాక్స్‌కు అతిపెద్ద ఆదాయవనరు.
అరెస్టులతో అడ్డుకట్ట వేయగలరా?
అనేక దేశాల్లో జరిపిన దాడుల్లో బ్లాక్ యాక్స్‌కు చెందిన డజన్లమందిని, ఇతర గ్యాంగ్‌ల సభ్యులను అరెస్టు చేశారు.
వారు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడులు, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం ఇంటర్‌పోల్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
విస్తృత నిఘా సమాచార వ్యవస్థ ఏర్పాటుచేయడానికి, ఆ సమాచారం మొత్తం వివిధ దేశాల్లో ఉన్న 196 మంది ఇంటర్‌పోల్ అధికారులకు అందించడానికి వీలు కలిగింది.
ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక అరెస్టులు జరిగాయి. అయితే పశ్చిమాఫ్రికాలో వేళ్లూనుకున్న నేరవ్యవస్థను రూపుమాపడానికి ఇవి సరిపోవన్నది కొందరు నిపుణుల అభిప్రాయం.
క్రిమినల్ గ్రూపుల కార్యకలాపాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా..ఆయా గ్రూపులను నిర్మూలించడంపై దృష్టిపెట్టాలని సెక్యూరిటీ స్టడీస్ సంస్థ పశ్చిమాఫ్రికా ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ ఒలువోల్ ఓజ్‌వేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Interpol
‘నేరస్థులు, రాజకీయ నేతల కుమ్మక్కు’
నైజీరియాలో ఇటీవలి వారాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఆఫ్రికాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నైజీరియా ఒకటి.
కానీ 8 కోట్ల 70 లక్షల మంది నైజీరియన్లు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని ప్రపంచబ్యాంక్ తెలిపింది.
బ్లాక్ యాక్స్‌లో ఎక్కువ నియామకాలు జరుగుతున్న దేశం నైజీరియా.
నైజీరియాలోని తమ ప్రధాన అధికారులు, పోలీసు అధికారులతో ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఇంటర్‌పోల్ తెలిపింది. అయితే బ్లాక్ యాక్స్ ముఠా సభ్యులతో స్థానిక అధికారులు, నాయకులు కుమ్మక్కవడం ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయని చెప్పింది.
‘‘బ్లాక్ యాక్స్ సభ్యులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నవారు రాజకీయ నేతలు’’ అని డాక్టర్ ఓజ్‌వేల్ చెప్పారు.
దేశంలో పాలనాపరమైన లోపంతో ప్రజలు పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
ఇంటర్‌పోల్‌కు చెందిన ‘ఆపరేషన్ జాకల్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ఐర్లండ్‌లో బ్లాక్ యాక్స్‌తో సంబంధాలున్న 1,000 మందిని పోలీసులు గుర్తించారు. మోసాలు, సైబర్ నేరాలకు పాల్పడ్డ వందలమందిని అక్కడ అరెస్టు చేశారు.
‘‘ఇప్పుడు ల్యాప్‌టాప్‌లతో బ్యాంకు దోపిడీలు జరుగుతున్నాయి. చాలా అధునాతన సాంకేతిక పద్ధతిలో చేస్తున్నారు’’ అని జీఎన్ఈసీబీ డిటెక్టివ్ సూపరింటెండెంట్ క్రయాన్ చెప్పారు.
బ్లాక్ యాక్స్ మనీ లాండరింగ్ కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీ కీలకంగా మారిందని 2023 నవంబరులో ఐరిష్ పోలీస్ ఆపరేషన్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల్లో ఉపయోగిస్తున్నారు.
టెక్నాలజీతో ఇంటర్‌పోల్ వేట
ఈ లావాదేవీల నిగ్గు తేల్చడానికి ఇంటర్‌పోల్ తన కొత్త సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందుకోసం గ్లోబల్ రాపిడ్ ఇంటర్‌వెన్షన్ ఆఫ్ పేమెంట్స్ సిస్టమ్(ఐ-జీఆర్ఐపీ)ను ప్రారంభించింది.
ఈ వ్యవస్థ ద్వారా ఇంటర్‌పోల్ వ్యవస్థలో భాగంగా ఉన్న దేశాల్లో ఆ సంస్థ ఊహించలేనంత వేగంగా బ్యాంక్ అకౌంట్లను స్తంభింపచేయగలుగుతోంది. సింగపూర్ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ కుంభకోణానికి జరిగిన ప్రయత్నాన్ని ఐ-జీఆర్ఐపీని ఉపయోగించి అడ్డుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ యాక్స్, ఇతర పశ్చిమాఫ్రికా సిండికేట్లకు సంబంధించిన సమాచారం ఒక చోట చేర్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















