ఎల్ సాల్వడార్: ‘అదో ఘోరమైన జైలు, నా కొడుకు బతికి ఉన్నాడో లేదో తెలీదు’ అని ఆ తల్లి ఎందుకు బాధపడుతున్నారు?

ఫొటో సోర్స్, Natalia Alberto
- రచయిత, విల్ గ్రాంట్
- హోదా, సెంట్రల్ అమెరికా కరెస్పాండెంట్
హొసె డువాల్ మాతా బతికి ఉంటే మాత్రం ఆయన అత్యంత దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి.
26 ఏళ్ల హొసెను తక్షణమే విడుదల చేయాలని ఆ దేశ న్యాయ వ్యవస్థ రెండుసార్లు ఆదేశించినా, నేర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అధికారులు ఆయన్ను రెండు సంవత్సరాలకు పైగా ఎల్ సాల్వడార్ జైలులో ఉంచారు.
ఎల్ సాల్వడార్‌లోని సెకోట్ జైలు ప్రపంచంలోని అత్యంత ఘోరమైన జైళ్లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రస్తుతం హొసె అక్కడ బతికి ఉన్నారో లేదో ఆయన తల్లికి తెలియదు.
ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం, భద్రతా మంత్రిత్వ శాఖ, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు నయీబ్ బుకెలె సహా సాల్వడార్ ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువచ్చింది.
అయితే, విచారణ జరుపుతామని అధికారులు హామీ ఇచ్చినా, నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అసలేం జరిగింది?
ఏప్రిల్ 2022లో, హొసె స్వగ్రామం లానోరియాలో తన ఇంటికి వెళుతుండగా, సైనిక బలగాలు ఆయన్ను అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా నేర ముఠాల అణచివేతలో భాగంగా అధ్యక్షుడు బుకెలె ఈ బలగాలను ఏర్పాటు చేశారు.
ఎల్ సాల్వడార్ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితిలో భాగంగా రాజ్యాంగ హక్కులను రద్దు చేశారు. దీంతో పోలీసులు అనుమానం ఉన్న ఎవరినైనా నిర్బంధించవచ్చు.
ఇలా రెండేళ్లలో 3 వేలమంది పిల్లలతో సహా దాదాపు 70 వేలమందిని అరెస్టు చేశారు. వీరిలో చాలామందికి నేరముఠాలతో ఎలాంటి సంబంధం లేదని న్యూయార్క్‌లోని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ అంటోంది.
తాను ఎప్పుడూ ఏ ముఠాలో లేనని హొసె చెప్పినా, భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.
"వాడి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు తీసుకురమ్మని పోలీసులు నాకు చెప్పారు. నేను నా కొడుకు హైస్కూల్ డిప్లొమా, అతని భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించిన రశీదులు, అతని స్వభావం గురించి యజమాని ఇచ్చిన డిక్లరేషన్‌ను సంపాదించాను." అని ఆమె బీబీసీకి వివరించారు.
కానీ ఆమె ప్రయత్నాలేమీ ఫలించలేదు.
ఒకేసారి చేపట్టిన విచారణలో 350 మందికి పైగా ఇతర నేరస్తులతో కలిపి హొసె డువాల్‌ను విచారించారు.
ప్రారంభంలో ఆరు నెలల శిక్ష విధించి, ఆ తర్వాత దాన్ని నిరవధికంగా పొడిగించారు. తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. హొసెను తక్షణమే విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించాక, తన కుటుంబం వచ్చి తనను తీసుకువెళుతుందని ఎదురు చూస్తుండగా, అదే ఆరోపణలపై హొసెను మళ్లీ అరెస్టు చేశారు.
విడుదల కానున్న ఖైదీలను తిరిగి అరెస్టు చేయడం ఏకపక్ష చర్య, అక్రమ నిర్బంధం, చాలా ప్రమాదకరమని ఎల్ సాల్వడార్ మానవ హక్కుల సంస్థ, క్రిస్టోసల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోవా బుల్లక్ అన్నారు.
జూన్ 2023లో, మరో న్యాయమూర్తి కూడా హొసెను వదిలేయాలన్న మునుపటి నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ, ఇది జరిగిన ఏడాది తర్వాత కూడా ఆయన కటకటాల వెనుకే ఉన్నారు.

ఫొటో సోర్స్, Lissette Lemus / BBC
సెకోట్ జైలుకు బదిలీ
తన కొడుకు సమాచారం కోసం మార్సెలా చేస్తున్న అభ్యర్థనలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు. దీంతో హొసె కుటుంబం ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఇంటర్-అమెరికన్ కమిషన్‌లో కేసు దాఖలు చేసింది.
హొసెను నిర్బంధించడానికి ‘‘చట్టపరమైన, స్పష్టమైన కారణాలు లేవు’’ అని సాల్వడార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
మొదట్లో మార్సెలా తన కొడుకును బంధించిన ఇజాల్కో జైలుకు ప్రతివారం ఆహారాన్ని తీసుకువెళ్లేవాళ్లు.
జైలులో ఇచ్చే రేషన్ సరిపోదేమోననే ఉద్దేశంతో ఆమె ఈ పని చేసేవారు. గత ఏడాది జూన్‌లో హొసెను సెకోట్‌కు బదిలీ చేశారని గార్డులు ఆమెకు చెప్పారు.
నేరాలపై యుద్ధం చేస్తానని చెప్పుకునే ఆ దేశాధ్యక్షుడు బుకెలె ఈ సెకోట్ జైలును నిర్మించారు. టెర్రరిజం డిటెన్షన్ సెంటర్ అయిన సెకోట్ జైలు అత్యంత భద్రత కలిగిన జైలు.
ఖైదీలు కనీసం సూర్యకాంతి కూడా చూడలేరని దేశాధ్యక్షుడు బుకెలె తరచూ అంటుండేవారు.

ఫొటో సోర్స్, Reuters
బుకెలె మద్దతుదారులు ‘నేర ముఠాలపై ఉక్కు పిడికిలి’ అని దీనిని ప్రశంసిస్తున్నారు. విమర్శకులు మాత్రం దీనిని మానవ హక్కులపై మచ్చగా, ప్రపంచంలోని అత్యంత కఠినమైన జైళ్లలో ఒకటిగా భావిస్తున్నారు.
గుండు గీసి, ఒళ్లంతా పచ్చబొట్లు ఉన్న ఖైదీలను ఇక్కడికి పంపుతున్న చిత్రాలను బుకెలె ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది.
సెకోట్ జైలు ఏర్పాటును పదేపదే సమర్థించేవారు బుకెలె.

ఫొటో సోర్స్, Reuters
ముఠాల అణచివేతకు ప్రశంసలు
ఎల్ సాల్వడార్‌లో నేర ముఠాల అణిచివేత చాలా ప్రజాదరణ పొందింది. గతంలో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్న భయపడేవారు. ఇప్పుడు చాలా ప్రాంతాలు భద్రతా దళాల నియంత్రణలో ఉన్నాయి. భయం లేకుండా జీవిస్తున్నామని అక్కడి ప్రజలు కూడా అంటున్నారు.
ఈ సమస్యను వేగంగా పరిష్కరించినందుకు, ముఠాలను కఠినంగా అణచివేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
ప్రెసిడెంట్ నయీబ్ బుకెలె ఫిబ్రవరిలో దాదాపు 90% ఓట్లను సాధించి, భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు.
రెండోసారి ఎన్నికైన బుకెలెను,‘‘అన్యాయంగా నిర్బంధించిన వాళ్లని విడుదల చేయడంపై దృష్టి సారిస్తారా?’’ అని ఒక సమావేశంలో బీబీసీ ప్రశ్నించింది.
దీనికి జవాబుగా ఆయన, తమ భద్రతా దళాలు రెండు తప్పులు మాత్రమే చేశాయని, ఇప్పటికే సుమారు 7,000 మందిని విడుదల చేశారని అన్నారు.
బీబీసీ ఆయనకు హొసె డువాల్ మాతా కేసు గురించి ప్రత్యేకంగా చెప్పగా, సమావేశం తరువాత ప్రభుత్వాధికారులు బీబీసీ ప్రతినిధిని న్యాయమూర్తుల విడుదల ఉత్తర్వుల కాపీలను అడిగారు.
కొన్ని రోజుల తర్వాత, ఆయన ఆంతరంగిక సభ్యుడు ఒకరు రెండోసారి సమాచారాన్ని అభ్యర్థించగా, బీబీసీ మళ్లీ వాటిని ఆయనకు పంపింది.
ఈ కేసు గురించి అనేక సందర్భాలలో ఉపాధ్యక్షుడు ఫెలిక్స్ ఉల్లోవాతో బీబీసీ నేరుగా మాట్లాడింది. మరికొన్ని రోజుల్లో హొసె విడుదలవుతారని ఏడాది కిందట ఫెలిక్స్ ఉల్లోవా బీబీసీతో అన్నారు.
నిజానికి, ఆ సమయంలో హొసెను తన కుటుంబానికి తెలీకుండా సెకోట్‌కు బదిలీ చేశారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, నెలల తరబడి అభ్యర్థించిన తర్వాత, సెకోట్‌లో ప్రవేశించడానికి బీబీసీని అనుమతించారు. అయితే ఖైదీలతో మాట్లాడటానికి లేదా నిర్దిష్ట కేసుల గురించి అధికారులను అడగడానికి అనుమతి దొరకలేదు.
ప్రస్తుతం హొసె తల్లి మార్సెలాకు రెండేళ్ల నుంచి కుమారుడు జైలులో ఉన్నట్లు కానీ, జీవించి ఉన్నట్లు కానీ ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. జైలులో హొసె చనిపోయి ఉండొచ్చని ఆమె అనుమానిస్తున్నారు.
"నేనెప్పుడూ అదే ఆలోచిస్తూ, బాధపడుతుంటాను. ఏడవడం తప్ప వేరేమి చేయలేను.” అని ఆమె బీబీసీతో అన్నారు.
తన కొడుకు ఇంకా బతికే ఉంటాడని, ఆయన విడుదల అవుతాడనే ఆశతోనే జీవిస్తున్నానని ఆమె అన్నారు.
“దేవుడిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను చేయగలిగింది అదొక్కటే." అన్నారామె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














