బొలీవియాలో సైనిక తిరుగుబాటు కుట్ర భగ్నం, సైనిక జనరల్ అరెస్ట్, అసలు అక్కడ ఏం జరిగింది?

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
- రచయిత, విల్ గ్రాంట్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, క్యూబా కరస్పాండెంట్, కెత్రిన్ అర్మ్‌స్ట్రాంగ్, ఇదో వాక్, బీబీసీ న్యూస్
- హోదా, బీబీసీ న్యూస్
బొలీవియా రాజధాని లపాజ్‌లో సైనిక తిరుగుబాటు కుట్ర భగ్నమైంది. లపాజ్‌లోని అధ్యక్ష భవనం దగ్గరికి సైనికులు దూసుకొచ్చిన కొన్ని గంటల తరువాత, తిరుగుబాటకు యత్నించిన నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకుముందు, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న మురిల్లో స్క్వేర్ ప్రాంతంలోకి సాయుధ వాహనాలు, దళాలు దూసుకొచ్చాయి. తరువాత వెనక్కి వెళ్లాయి.
‘‘దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునర్ నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని తిరుగుబాటుకు యత్నించిన సైనిక నాయకుడు జనరల్ జువాన్ జోస్ జునిగా అన్నారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు.
తిరుగుబాటు యత్నాన్ని బొలీవియా అధ్యక్షుడు లూయిస్ అర్సే ఖండించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
‘‘బొలీవియన్ల ప్రాణాలను తీసే తిరుగుబాటు యత్నాలను మరోసారి అనుమతించం’’ అని ఆయన అధ్యక్ష భవనం నుంచి ఇచ్చిన టెలివిజన్ సందేశంలో చెప్పారు.
ఆయన మాటలు... ప్రభుత్వానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చిన ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారుల్లో ప్రతిధ్వనించాయి.


ఫొటో సోర్స్, Reuters
కొత్త మిలటరీ కమాండర్లను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు అర్సే ప్రకటించారు. తిరుగుబాటు సైనిక నేత జనరల్ జునిగాను తొలించినట్టు వచ్చిన వార్తలను ఆయన ధృవీకరించారు.
జనరల్ జునిగాపై, ఆయన అనుచరులపై నేరాభియోగాలు మోపాలని పిలుపునిచ్చారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం నేర విచారణను ప్రారంభించింది.

ఫొటో సోర్స్, EPA
బలహీనంగా బొలీవియా ప్రభుత్వం
బొలీవియా ప్రభుత్వం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇతరులు మిలటరీ చర్య ద్వారా కాకపోయినా రాజకీయాల ద్వారానైనా అర్సే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైనది, బొలీవియా వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఎవో మోరేల్స్ మద్దతుపై అర్సే ఆధారపడొచ్చు.
తిరుగుబాటు యత్నాలకు ముగింపు పలకాలని కోరుతూ వీధుల్లోకి రావాలని తన మద్దతు దారులకు మోరేల్స్ పిలుపునిచ్చారు.
బొలీవియా మాజీ నాయకుడు జీనిన్ అనెజ్‌తోపాటు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్ సహా జనరల్ జునిగా పన్నాగాలకు వ్యతిరేకంగా, ప్రజాప్రదర్శన ప్రజాస్వామ్య సంకల్పాన్ని బలోపేతం చేయడానికి సాయపడింది.

ఫొటో సోర్స్, Reuters
సైనిక పాలన పట్ల వ్యతిరేకత
‘‘మేం మా మాతృభూమిని స్వాధీనం చేసుకోబోతున్నాం. దేశాన్ని ఒక ఉన్నత వర్గం ఆక్రమించింది. దుర్మార్గులు దేశాన్ని నాశనం చేశారు’’ అని మురిల్లో స్క్కేర్‌ను దళాలు చుట్టుముట్టిన తరువాత జనరల్ జునిగా అన్నారు.
వచ్చే ఏడాది మోరేల్స్ మళ్ళీ పోటిచేస్తే అరెస్ట్ చేస్తామని జనరల్ జునిగా టెలివిజన్‌లో హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన్ను సైనిక జనరల్ పోస్ట్ నుంచి ప్రభుత్వం తొలగించింది.
గతంలో మిత్రులుగా ఉన్న అర్సే, మోరేల్స్ ఇటీవలి కాలంలో పరస్పరం ఎదురుపడలేదు. కానీ తాజాగా జరిగిన సైనిక తిరుగుబాటు యత్నాన్ని వారిద్దరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
నిజానికి 2019లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారనే అభియోగాలపై సైనికాధికారులు అప్పుడు అధ్యక్షుడు మోరేల్స్‌ను బలవంతంగా పదవీచ్యుతుడిని చేశారు. ఆయనను మెక్సికోకు పంపేశారు.
ఎవో మోరేల్స్ 2005లో అధికారంలోకి రాకముందు ఆ ప్రాంతంలో అత్యంత రాజకీయ అస్థిరత ఉన్న దేశాలలో బొలీవియా ఒకటిగా ఉంది.
కానీ, మోరేల్స్ అధికారంలోకి వచ్చాక చాలామటుకు స్థిరత్వాన్ని తీసుకువచ్చారు.
బొలీవియాలో తిరుగుబాటు యత్నాన్ని దాని మిత్రదేశాలైన వెనిజులా, కొలంబియా ఖండించాయి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చాయి. ప్రశాంతంగా ఉండాలని అమెరికా కూడా పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి:
- యజమాని నుంచి తప్పిపోయి అయిదేళ్లుగా అడవి జింకలతో తిరుగుతున్న గాడిద
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














