‘స్త్రీ తన దుస్తులతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ - సెక్స్ గురించి ప్రాచీన మహిళలు ఇలా మాట్లాడుకునేవారా?

శృంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డైసీ డన్
    • హోదా, బీబీసీ కోసం

మహిళల కోణంలో ఈ పురాతన ప్రపంచం ఎలా ఉండేదనే విషయాలను ఇటీవల విడుదలైన ఒక కొత్త పుస్తకం వెల్లడిస్తోంది. మహిళా ద్వేషులైన పురుష రచయితల మూస సిద్ధాంతాలను తోసిపుచ్చుతూ, పురాతన కాలంలో సెక్స్ గురించి స్త్రీల అభిప్రాయాలు ఎలా ఉండేవనే విషయాలపై పుస్తక రచయిత డైసీ డన్ పరిశోధించారు.

క్రీస్తుపూర్వం 7వ శతాబ్దపు గ్రీస్‌ కవి సెమోనిడెస్ ఆఫ్ అమోర్గోస్ ప్రకారం, 'స్త్రీలు ప్రధానంగా 10 రకాలు. కష్టపడి పని చేసేవారు, సోమరిపోతులు, అత్యాశ కలిగిన వాళ్లు....అంటూ పలురకాలుగా వారిని వర్ణించారు.

నక్కల్లాంటి స్త్రీలు-విచిత్రంగా అందరినీ గమనిస్తుంటారు, గాడిదల్లాంటి స్త్రీలు - వ్యభిచారం చేస్తారు, కుక్కల్లాంటి స్త్రీలు-విశ్వాసం లేనివారు, పందుల్లాంటి స్త్రీలు - తిండిపోతులు.

అలాగే, తుపానులాంటి స్త్రీలు, అత్యాశ కలిగిన స్త్రీలు, కపట బుద్ధిగల స్త్రీలు, సోమరిపోతు గుర్రంలాంటి స్త్రీలు, అందవిహీనంగా ఉండే కోతిలాంటి స్త్రీలు, కష్టపడి పనిచేసే తేనెటీగ లాంటి స్త్రీలు.'' ఇలా పలు రకాలుగా స్త్రీలను అభివర్ణించారు.

ఈ జాబితాలో పేర్కొన్న స్త్రీలందరిలో, బహుశా ఆ కాలంలో స్త్రీల మీద చులకన భావంతో కావచ్చు, వ్యభిచారం చేసే మహిళలను 'గాడిద స్త్రీలు’ అని పిలిచే వారు. అలా పిలిపించుకున్న మహిళల మనసులో ఏముందన్నది మాత్రం ఒక అంతుచిక్కని రహస్యం.

పురాతన కాలానికి చెందిన కొన్ని చారిత్రక వృత్తాంతాలు స్త్రీల ఆంతరంగిక స్వభావాన్ని వెల్లడిస్తాయి.

గ్రీస్‌లో స్త్రీలు సాధారణంగా ముసుగు వేసుకుని ఉండేవారు. రోమ్‌లో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా వారిని పర్యవేక్షిస్తూ ‘సంరక్షకులు’ (సాధారణంగా తండ్రి లేదా భర్త) పక్కనే ఉండేవారు. మహిళలను వారి ఆస్తి తరహాలో జాగ్రత్తగా చూసుకునేవారు.

మరి అలాంటప్పుడు స్త్రీ కామవాంఛ కేవలం పురుషుల అభూత కల్పనేనా? లేక సాధారణంగా అనుకునే దానికంటే, ప్రాచీన కాలంలోని స్త్రీలకు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేదా?

నా కొత్త పుస్తకం 'ది మిస్సింగ్ థ్రెడ్' కోసం పరిశోధిస్తున్నప్పుడు నాకు తెలిసిందేంటంటే, ప్రాచీన ప్రపంచ చరిత్ర మహిళలు రాసి ఉన్నట్లయితే, ఆ కాలంలో సెక్స్ గురించి మహిళలు నిజంగా ఏమనుకున్నారో తెలుసుకోవడానికి మరింత శోధించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆధారాలన్నీ స్త్రీల శృంగార అలవాట్లను ఏదో ఒక దిశలో (మంచి లేదా చెడు) అతిశయోక్తితో చెప్పే అవకాశం ఉన్న పురుషులే రాశారు.

కొందరు అందులో ఎంతదూరం వెళ్లారంటే, స్త్రీని చాలా పవిత్రంగా, అసలు ఆమె మనిషే కాదనిపించేలా చేశారు.

మరికొందరు వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా, ఉద్దేశపూర్వకంగా స్త్రీలను విపరీతమైన కామ కోరికలు ఉన్నవారిగా చిత్రించారు.

ఈ వర్ణనలనుగనక మనం నమ్మితే ప్రాచీన ప్రపంచంలోని స్త్రీలందరూ అత్యంత పవిత్రులు, లేదా కామపిచ్చి కలిగిన వాళ్లనే నిర్ధరణకు వస్తాం.

అదృష్టవశాత్తూ, స్త్రీ శృంగారం గురించి లోతైన అవగాహన కలిగిన కొంతమంది సంప్రదాయ మహిళల హృదయాంతరాలను పరిశీలించే అవకాశం మనకు ఇప్పటికీ ఉంది.

బీబీసీ వాట్సాప్ చానెల్
శృంగారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో స్త్రీ వాంఛలను శక్తివంతంగా వ్యక్తీకరించారు

వ్యామోహం అంగీకారం

క్రీస్తు పూర్వం 7వ శతాబ్దపు గ్రీకు ద్వీపమైన లెస్బోస్‌లో సఫో అనే కవయిత్రి నాటి స్త్రీ దృక్పథంలో కవిత్వం రాశారు. పురుషుడితో మాట్లాడుతున్న స్త్రీని చూస్తూ ఆ స్త్రీ అనుభవించే శారీరక అనుభూతుల గురించి వివరించారు. గుండెదడ, మాటలు తడబడటం, నరాల్లో వేడిపుట్టడం, మైమరపు, చెవులలో హోరు, ఒళ్లంతా చెమటలుపట్టి చల్లగా మారడం, వణుకు, ముఖం పాలిపోవడం వంటివి కామవాంఛతో ఉన్న ఎవరికైనా సుపరిచితమే అని రాశారు.

మరొక కవితలో సఫో ఒక స్త్రీకి పూలదండ వేస్తూ ఈ మెత్తని మంచం మీద ఆమె తన కోరికను ఎలా అణచుకుంటుందో’ అని రాస్తుంది. కోరికను అణచుకోవడం గురించి అర్థం చేసుకున్న ఒక మహిళ ఆవేదన ఇది.

సఫో కవితలు ఈరోజు మనకు చాలాచోట్ల ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి. వాటిని అర్థవంతంగా చదవడం కష్టంగా ఉంటుంది.

రోమ్‌లో కూడా లింగ సంబంధమైన వస్తువులను తాయెత్తులా ఉపయోగించేవాళ్లు. అదృష్టాన్ని తెచ్చిపెడతాయని భావించే చిహ్నాల విషయంలో మహిళలు కూడా సిగ్గుపడేవారు కాదు.

పురాతన కాలంలోని మహిళలు శృంగారపరమైన వస్తువులను చూసి భయపడేవాళ్లు కాదు. కొందరిని వాటితో పాటు సమాధి చేయడం కూడా మనం చూడొచ్చు. రోమ్ ఫేమస్ కావడానికి ముందుకాలంలో, ఎట్రుస్కాన్ తెగకు చెందినవారు ఇటాలియన్ ప్రధాన భూభాగంపై ఆధిపత్యం చెలాయించారు. ఈ ప్రాంతాన్ని శృంగార దృశ్యాలతో నింపారు. అనేక కళాఖండాలు, సమాధుల్లోని విగ్రహాల అవశేషాల్లో స్రీ, పురుషులు కలిసి పడుకున్నట్లు చూడొచ్చు.

క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఇద్దరు స్త్రీ, పురుషులు ఒకరి జననాంగాలను మరొకరు తాకుతున్నట్లు ఉన్న బొమ్మను ఒక ఎట్రుస్కాన్ మహిళతో పాటు సమాధి చేశారు.

వ్యభిచారాన్ని ఎలా చూసేవారు

వ్యభిచారం గురించి తెలుసుకోవాలంటే పాంపీ వంటి పురాతన వ్యభిచార గృహాన్ని చూడాలి. దుర్భరమైన, జైలులాంటి గదుల్లో, గోడలపై విటులు రాసిన అసభ్యకర రాతల మధ్య సెక్స్ వర్కర్లు జీవించేవాళ్లు. ఆ గోడలపై తమతో లైంగిక కార్యకలాపంలో పాల్గొన్న వారి గురించి లైంగిక సుఖం కోసం వచ్చిన విటులు తమ అభిప్రాయాలు రాసేవాళ్లు.

అలాంటి స్త్రీల కష్టాలను వర్ణించే చారిత్రక కథనాలు పుష్కలంగా ఉన్నాయి.

క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఎథీనియన్ రాజకీయ నాయకుడు అపోలోడోరస్ చేసిన ఒక ప్రసంగం, ఇలాంటి మహిళల జీవితాల్లోని కష్టాల గురించి చెబుతుంది. అప్పుడప్పుడూ ఇలాంటి వారిపై పరిశోధన చేసిన వారి మాటలు వింటే అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.

క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో, ఇటలీలో నివసించే నోసిస్ అనే కవయిత్రి ఒక కళాకృతిని ప్రశంసిస్తూ, దానిని కొనడానికి అయిన ఖర్చును సెక్స్ వర్కర్ భరించిందని రాశారు. సెక్స్, ప్రేమ దేవత అయిన ఆఫ్రొడైట్ అద్భుతమైన విగ్రహాన్ని ఒక సెక్స్ వర్కర్ ఇచ్చిన డబ్బుతో నిర్మించారని నోసిస్ తెలిపారు. అలాగే, డోరిచా అని పిలిచే హెటేరా (వేశ్య లేదా ఉన్నత స్థాయి సెక్స్ వర్కర్) తను సంపాదించిన డబ్బును కళాత్మక వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు.

ఈ విషయంలో ఈ మహిళలు సెక్స్‌ను ఎలా చూశారన్నది ముఖ్యం కాదు. వాళ్లు దాని ద్వారా సంపాదించిన డబ్బును, తాము మరణించిన తర్వాత తమను గుర్తుంచుకోవడానికి లభించిన అరుదైన అవకాశంగా భావించారు.

శృంగారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్స్ సమ్మెపై అరిస్టోఫేన్స్ కామెడీ నాటకం లైసిస్ట్రాటా ప్రింటెడ్ ఎడిషన్ కోసం ఎథీనియన్ మహిళల చిత్రరూపం

పురుష రచయితల అభిప్రాయం

అయితే, మగ రచయితలకు కొన్నిరకాల పక్షపాతం ఉన్నప్పటికీ మహిళలు, సెక్స్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తారు.

క్రీస్తు పూర్వం 411లో, హాస్యనటుడు అరిస్టోఫేన్స్ 'లైసిస్ట్రాటా' అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో పెలోపొన్నెసియన్ యుద్ధం సమయంలో తమ భర్తలను శాంతి నిబంధనలకు ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఏథెన్స్‌లోని మహిళలు సెక్స్ సమ్మె నిర్వహిస్తారు. ఇది నిజంగా జరిగిన యుద్ధం. ఏథెన్స్, స్పార్టా, ఇంకా వారి మిత్రదేశాల మధ్య మూడు దశాబ్దాల పాటు జరిగింది.

ఈ నాటకంలో చాలామంది స్త్రీలు తమ ఆనందాన్ని వదులుకోవాల్సివచ్చినందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అయితే, ఒకానొక సమయంలో నాటకంలో భారీ మార్పు కనిపిస్తుంది. అరిస్టోఫేన్స్ ఇక్కడ స్త్రీ కోణం నుంచి కథను నడుపుతారు.

సమ్మెను నిర్వహించే పాత్ర లైసిస్ట్రాటా, యుద్ధ సమయంలో మహిళలకు నిజంగా ఎలా ఉంటుందో వివరిస్తారు. యుద్ధం గురించి చర్చించే అసెంబ్లీకి వాళ్లను రానిచ్చేవారు కాదు.

అలాంటి సుదీర్ఘమైన పోరాటం వల్ల వివాహితులైన మహిళలకు నరకంగా ఉంటుంది. ఇక పెళ్లికాని మహిళల సంగతి ఇంకా ఘోరం. దాని వల్ల వాళ్లు వివాహం చేసుకునే అవకాశాలనూ కోల్పోతారని పాత్రలతో చెప్పిస్తారు.

యుద్ధం నుంచి నెరిసిన జుట్టుతో ఇంటికి తిరిగి వచ్చిన పురుషులు అప్పటికీ వివాహం చేసుకోవచ్చు. కానీ కన్యల విషయంలో అలా కాదు. అప్పటికీ వారిలో చాలా మంది వివాహం చేసుకునే, సంతానోత్పత్తి చేసే వయసు దాటి పోయి ఉంటారు. ఇది స్త్రీ పురుషుల మీద యుద్ధ ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఆనాటి స్త్రీలు నిజంగా ఏం ఆలోచించారు అనడానికి ఈ నాటకం ఒక మంచి ఉదాహరణ.

గ్రీకు విషాదంలో కూడా సెక్స్ చుట్టూ స్త్రీలకు ఉన్న భయాలను మనం చూడొచ్చు. ఈడిపస్ రెక్స్‌కు అత్యంత ప్రసిద్ధి చెందిన నాటక రచయిత సోఫోక్లిస్. ఒక నాటకంలో ఒక స్త్రీ పాత్ర ద్వారా కన్య నుంచి భార్యగా మారడం ఎలా ఉంటుందో వివరిస్తారు. దీనిలో ఒక పాత్ర, తమ వ్యక్తిగత అభిప్రాయాలు, తమ భావాలు ఎలా ఉన్నా మహిళలు సమాజ ఒత్తిడికి లొంగి, దానికి తగినట్లు ప్రవర్తించాలని అంటుంది.

ఉన్నత వర్గాలలో వివాహాలు పెద్దల ద్వారా నిశ్చయించడం చాలా సాధారణం. దీనిలో వివరించినట్లు ఒక మహిళ మొదటి లైంగిక అనుభవం చాలా బాధాకరంగా ఉండొచ్చు.

శృంగారం

ఫొటో సోర్స్, British Museum

ఫొటో క్యాప్షన్, సంతానోత్పత్తి ఆచారాలను వర్ణించే బొమ్మ ఉన్న పురాతన గ్రీకు పాత్ర

పురాతనకాలం నాటి సెక్స్ చిట్కాలు

మహిళలు కొన్నిసార్లు సెక్స్ చిట్కాల్లాంటి ఆలోచనలను కాగితంపై పెట్టారు. పైథాగరస్ స్నేహబృందంలోని గ్రీకు మహిళా తత్వవేత్త అయిన థియానో (కొందరు ఆమె అతని భార్య అంటారు), ఆమె స్నేహితురాలు యూరిడైస్‌కు కొన్ని సలహాలు ఇస్తుంది. వీటిలో - ఒక స్త్రీ, తన భర్త పడక మీదకు వచ్చినప్పుడు, తన దుస్తులతోపాటు సిగ్గునూ విడిచిపెట్టాలని ఒక లేఖ రాస్తుంది.

థియానో లేఖ ప్రామాణికమైనది కాకపోవచ్చు. అయినప్పటికీ, ఆధునిక కాలంలో చాలా మంది స్త్రీలు ఒకరితో ఒకరు చెప్పుకునే వాటికి ఇది దగ్గరగా ఉంది. ఈ సలహాను పురాతన కాలంలోని మహిళలూ అనుసరించినట్లు కనిపిస్తుంది.

ఎలిఫాంటిస్ అనే గ్రీకు కవయిత్రికి స్త్రీలకు సెక్స్ చిట్కాలు ఇవ్వడం అంటే చాలా ఆసక్తి. ఆమె ఈ అంశంపై పుస్తకాలూ రాశారు. దురదృష్టవశాత్తూ ఈరోజు అవి లభించడం లేదు.

కానీ, రోమన్ కవి మార్షల్, రోమన్ కాలానికి చెందిన బయోగ్రాఫర్ సూటోనియస్‌లు ఇద్దరూ లైంగిక విషయాలపై చాలా ఆసక్తి ఉన్న టిబెరియస్ చక్రవర్తి దగ్గర ఆ కాపీలు ఉన్నాయని అంటారు.

ఆ కాలంలో సెక్స్ గురించిన అంశాలపై స్వేచ్ఛగా రాసిన మార్షల్, కాటుల్లస్ లాంటి వారిలా కాకుండా, మహిళా రచయితలు చాలా నిగూఢంగా వాటి గురించి చెప్పారు.

సల్పీషియా అనే రోమన్ రచయిత్రి, తన ప్రియుడు సెరింథస్‌కు దూరంగా పల్లెలో ఉన్నప్పుడు తన బాధను చెప్పుకుంటూ, రోమ్‌కు తిరిగి వస్తే తన బాధ తగ్గుతుందని అంటుంది. ఆమె రచనలు ఇప్పటికీ ఉన్నాయి.

ఈ స్త్రీలు తమ ఆప్తులతో సెక్స్ గురించి చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేమ, సెక్స్ దేవత అయిన ఆఫ్రొడైట్‌లాగా కర్టెన్లు మూసేసిన సమయంలో మహిళలూ కోర్కెలతో రగిలిపోయి ఉండొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)