నీట్‌ పరీక్ష: ‘ఆ 1,563 మందికి గ్రేస్ మార్కులు రద్దు, వారికి మళ్ళీ పరీక్ష’

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమాంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేసి వారికి మళ్ళీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీం కోర్టుకు తెలిపింది.

నీట్ – యూజీ పరీక్షలను రద్దు చేయాలని, కాలహరణం కారణంగా 1,563 మందికి గ్రేసు మార్కులు కలపడం ఏకపక్షంగా ఉందంటూ దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది.

ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను జులై 8న లిస్ట్ చేస్తామని కోర్టు తెలిపింది.

గ్రేస్ మార్కులు విద్యార్థుల పరిస్థితిని తలకిందులు చేశాయని, కేవలం ప్రయత్నించని ప్రశ్నలకు మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వాలనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారని, దీనివల్ల ఆ విద్యార్థులు అసమాన ప్రయోజనం పొందారని కేంద్రం ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గుర్తించిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

గ్రేస్ మార్కులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆ 1,563 మంది విద్యార్థులు కావాలంటే గ్రేసు మార్కులు కలపని మార్కులతో కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చని, లేదంటే మరోసారి పరీక్ష రాసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ వారు మరోసారి పరీక్షకు హాజరైతే, ఆ పరీక్ష మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ న్యాయవాది చెప్పారు. ఫలితాలను జూన్ 30న వెల్లడిస్తారని. దీనివల్ల ఇప్పటికే నిర్ణయించిన జులై 6న కౌన్సెలింగ్ యథావిధిగా జరుగుతుందని తెలిపారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం గ్రేస్ మార్కుల సమస్య పరిష్కారమైందని, పేపర్ లీక్, అక్రమాలపై జులై 8న విచారణ జరుపుతామని తెలిపింది.

bbc whatsapp channel
నీట్ ఎగ్జామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు?

కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఎందుకు కలపాల్సి వచ్చిందో జూన్ 6న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది. అలాగే పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఎన్‌టీఏ ఖండించింది.

కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1,563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని, దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అందువల్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అధికారులతో చర్చించిన అనంతరం పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా పరీక్షా సమయం కోల్పోయిన విషయంలో, సుప్రీం కోర్టు సూచించిన ఫార్ములానే ఇప్పుడు కూడా వర్తింపజేసినట్లు తెలిపింది.

అందువల్లే, విద్యార్థులకు 718, 719 వంటి మార్కులు వచ్చాయి. అలా అదనపు మార్కుల కారణంగా ఆరుగురు 720 మార్కులు సాధించారని తెలిపింది. అలాగే, ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులు రావడం వల్ల మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని పేర్కొంది.

పేపర్ లీక్ వంటిదేదీ జరగలేదని ఎన్‌టీఏ కొట్టిపారేసింది.

''పరీక్ష నిర్వహణలో రాజీపడేది లేదు'' అని పేర్కొంది.

ఇతర అవకతవకలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ విధానమని, ఈసారి 30 రోజుల్లోనే పూర్తి చేయగలిగామని ఎన్‌టీఏ పేర్కొంది.

నీట్ ఎగ్జామ్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నో అనుమానాలు

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో 67 మందికి టాప్ 1 ర్యాంక్ వచ్చింది.

ఇది చాలా పెద్ద సంఖ్య. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన తర్వాతి నుంచి పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి.

వైద్య విద్యలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షే (ఎంట్రన్స్ టెస్ట్) ఈ నీట్.

నీట్‌లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు, హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు మార్కులు సాధించారు.

అయితే, ఈ వాదనలను నీట్ పరీక్ష నిర్వహించే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' ఖండించింది. పరీక్ష పేపర్ లీక్, లేదా పరీక్ష నిర్వహణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చింది. సకాలంలో పరీక్ష పేపర్ అందని కొందరు విద్యార్థులకు మాత్రమే అదనపు మార్కులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

కానీ, మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై దేశవ్యాప్తంగా పలుచోట్ల న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.

నీట్ ఎగ్జామ్

ఫొటో సోర్స్, Getty Images

టాప్ ర్యాంకులపై సందేహం

మే 5వ తేదీన నీట్ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

పరీక్ష ఫలితాలను జూన్ 14న ప్రకటించాల్సి ఉండగా, అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ప్రకటించారు. ఇదే మొదటగా అనుమానాలకు తావిచ్చిందని అంటున్నారు.

ఇదే కాకుండా, విద్యార్థులు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జూన్ 4న వచ్చిన ఫలితాల ప్రకారం, 67 మంది టాప్ స్కోర్ సాధించారు, అంటే 720కి 720 మార్కులు. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి.

2023లో ఇద్దరికి మాత్రమే 720/720 మార్కులు రాగా, 2022లో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు. ఆ ఏడాది టాపర్లు 720 మార్కులకి గానూ 715 మాత్రమే సాధించగలిగారు.

ఇక రెండోది, టాప్ స్కోర్ సాధించిన 67 మందిలో ఆరుగురు విద్యార్థులు హరియాణాలోని జఝ్ఝార్‌లోని ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాశారు. ఆ తర్వాతి 2 ర్యాంకులు కూడా అదే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

మూడో విషయం, కొందరు విద్యార్థులకు 720 మార్కులకి గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదు. ఒక్కో జవాబుకి 4 మార్కులు ఉంటాయి, ఒకవేళ అది తప్పు సమాధానం అయితే ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది.

అలాంటప్పుడు, ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి(టిక్ చేసి), ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా(టిక్ చేసినా) అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. (సరైన సమాధానం రాయనందుకు 4 మార్కులు, తప్పు సమాధానం రాసినందుకు ఒక నెగెటివ్ మార్కు కలిపి 5 మార్కులు కోల్పోతారు.)

వీటితో పాటు పేపర్ లీక్ ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే బిహార్‌లో ఇదే విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు.

ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం (ఎకనమిక్ అఫెన్సెస్ యూనిట్) ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేసింది.

ఈసారి పరీక్షలో విద్యార్థులు భారీగా మార్కులు సాధించడంతో, అర్హత సాధించాల్సిన స్కోర్ (క్వాలిఫయింగ్ స్కోర్) కూడా ఎక్కువగానే ఉంది.

గత మూడేళ్లుగా క్వాలిఫయింగ్ స్కోర్ 130 కాగా, ఈ ఏడాది అది 164కి పెరిగింది.

నీట్ ఎగ్జామ్

విద్యార్థులు, నిపుణులు ఏమంటున్నారు?

గత కొద్దిరోజులుగా విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల సందేహాలతో కూడిన ప్రశ్నలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ 'Careers360' వ్యవస్థాపకులు మహేశ్వర్ పెరీ బీబీసీతో మాట్లాడుతూ, ''మొత్తం ప్రక్రియలో చాలా తప్పులు జరిగాయి'' అన్నారు.

భారత్‌లో ఎన్నో పరీక్షలు జరుగుతున్నాయి. ''సాధారణంగా, టాప్ స్కోర్ సాధించే వారు ఒకరిద్దరు ఉంటారు. కానీ ఇది అలా కాదు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 67 మందికి టాప్ స్కోర్ వచ్చింది'' అని ఆయన అన్నారు.

అదనపు మార్కుల కేటాయింపు కూడా పారదర్శకంగా జరగలేదని ఆయన భావిస్తున్నారు. గతంలో ఫలితాలు రాకముందు ఆన్సర్ కీ విడుదల చేసే సమయంలోనే ఏ ప్రశ్నకు, ఏ కారణంతో అదనపు మార్కులు ఇవ్వనుందో ఎన్‌టీఏ కానీ, లేదా ఇతర ఏ పరీక్ష నిర్వహించే సంస్థ అయినా స్పష్టత ఇచ్చేది. ''కానీ, ఈసారి వాళ్లని ప్రశ్నించిన తర్వాతే, వారు వివరణ ఇచ్చారు'' అని ఆయన అన్నారు.

ఫలితాలు వచ్చాక 718 వంటి మార్కులు ఎలా వస్తాయని చాలా మంది ప్రశ్నించిన తర్వాత, అదనపు మార్కులు ఇచ్చినట్లు ఎన్‌టీఏ సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో(ట్వీట్) పోస్టు చేసింది.

నీట్ ఎగ్జామ్

పెరిగిన 'కటాఫ్' మార్కులు

ఒక విద్యార్థి ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించినప్పుడు 85 మార్కులు అదనంగా ఇచ్చినట్లు తెలిసిందని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ 'ఫిజిక్స్ వాలా' వ్యవస్థాపకులు అలఖ్ పాండే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే, దీనిని బీబీసీ ధ్రువీకరించలేదు.

ఈసారి కటాఫ్ స్కోర్ పెరిగింది.

''ఈసారి కటాఫ్ మార్కులు సాధించిన వారి సంఖ్య గతంతో పోలిస్తే మూడురెట్లు ఎక్కువగా ఉంది. ఇది అసాధ్యం. ఎందుకంటే, గతేడాదితో పోలిస్తే ఈసారి పేపర్ అంత సులభంగా ఏమీ రాలేదు. మోసం జరిగింది. దీనిపై మనం గళం విప్పాలి'' అని మోషన్ ఎడ్యుకేషన్ అనే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్న నితిన్ విజయ్ ఎక్స్ ఖాతాలో రాశారు.

దీని ప్రభావం విద్యార్థులపై కూడా పడింది. నీట్ పరీక్ష రాసిన దిల్లీకి చెందిన అద్విక అనే విద్యార్థిని బీబీసీతో మాట్లాడారు.

''ఇది పరీక్షపై నమ్మకం కోల్పోయేలా చేసింది'' అని ఆమె అన్నారు.

''నా స్కోర్ 600. ఈ స్కోర్‌తో నాకు దాదాపు 30 వేల ర్యాంక్ వస్తుందని ఆశించా. కానీ నా ర్యాంక్ 80 వేలు. నేను కటాఫ్ దాటలేకపోయాను'' అని అద్విక చెప్పారు.

గతంలో అయితే ఇదే స్కోర్‌తో కళాశాలలో అడ్మిషన్ వచ్చి ఉండేదని, కానీ, ఈ సంవత్సరం ఆ అవకాశం లేదని ఆమె బీబీసీతో చెప్పారు.

సకాలంలో పరీక్ష పేపర్ అందనప్పుడు అదనపు మార్కులు కేటాయించే విధానంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

''పేపర్ గంట ఆలస్యంగా ఇచ్చినప్పుడు, ఆ గంట వ్యవధిలో ఎన్ని సమాధానాలు రాయగలరు అనే దాని ఆధారంగా 100 అదనపు మార్కులు ఇస్తున్నప్పుడు, ఒకవేళ అదనపు సమయం ఇచ్చివుంటే అందులో తప్పు సమాధానాలు రాసే అవకాశం కూడా ఉండవచ్చు'' అని మహేశ్వర్ పెరి అన్నారు.

నీట్ ఎగ్జామ్

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా?

చాలా మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.

''మరోసారి పరీక్ష నిర్వహించాలి. ఒకే పరీక్ష కేంద్రంలో రాసిన ఆరుగురికి టాప్ స్కోర్ రావడం అనుమానాస్పదంగా ఉంది'' అని అద్విక అన్నారు.

మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఒక పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ మే 17న నోటీసు జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల అనంతరం ఆ పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది.

పేపర్ లీకేజీ వల్ల చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు న్యాయబద్దంగా పోటీపడే అవకాశాన్ని కోల్పోయారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని కూడా కోరింది.

ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా లేవనెత్తాయి.

నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని జూన్ 7న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ప్రస్తుతానికి గ్రేస్ మార్కులు రద్దు అయ్యాయి. ఇక పరీక్షల అక్రమాలు, అవకతవకలకు సంబంధించి జులై 8న కోర్టు విచారణ జరపనుంది. దానిని బట్టి పరీక్షలు తిరిగి నిర్వహిస్తారా లేదా అనే విషయం తేలనుంది.

వీడియో క్యాప్షన్, నీట్: హరియాణాలోని ఆ ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఆ రోజు ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)