ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలు.. విద్యార్థుల ఒత్తిడిని తగ్గిస్తాయా? కొత్తగా వచ్చే సవాళ్లేంటి?

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మరో ఏడాదిలో మీ అబ్బాయో లేదా అమ్మాయో పదో తరగతి గానీ, 12వ తరగతిలోకి రాబోతున్నారా? మీరే పది లేదా 12వ తరగతిలోకి వస్తున్నారా? అయితే, ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

దేశంలో పది, 12 తరగతుల బోర్డు పరీక్షల వి‌ధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా మారబోతుంది.

విద్యార్థులు వార్షిక పరీక్షలు రెండుసార్లు రాసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

2025-26 విద్యా సంవత్సరం నుంచి పది, ఇంటర్ బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

ఇటీవల చత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఆయన మాట్లాడుతూ పరీక్షల వి‌ధానంలో మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

రెండుసార్లు నిర్వహించిన పరీక్షలలో బెస్ట్ స్కోర్(ఉత్తమ మార్కులు)ను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థికి ఉంటుందని చెప్పారు.

మారబోతున్న పరీక్షల విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పరీక్షల విధానంలో ఉన్న సందేహాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం.

కొత్త పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

బోర్డు పరీక్షలను 2023లో 38.82 లక్షల మంది రాశారు. ఈ ఏడాది దాదాపు 39 మంది లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరు కానున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

ఏటా 10, 12వ తరగతుల విద్యార్థులకు డిసెంబరులోనే సిలబస్ పూర్తమవుతుంది.

జనవరి, ఫిబ్రవరిల్లో రెండు సార్లు అధికారికంగా ప్రీ బోర్డు పరీక్షలు జరుగుతుంటాయి. ఇది కాకుండా అనధికారికంగా స్కూల్ స్థాయిలో మరోసారి ప్రీ బోర్డు పరీక్షలుంటాయి. తర్వాత మార్చి, ఏప్రిల్‌ల్లో బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంటారు.

‘‘ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రీ బోర్డు పరీక్షలలో ఒకదాన్ని నూతన విధానంలోకి మార్చే వీలుంటుందని భావిస్తున్నాం. అప్పుడు ఒకే ప్రీ బోర్డు పరీక్ష ఉంటుంది. రెండు సార్లు బోర్డు పరీక్షలు ఉంటాయి. పూర్తి సిలబస్‌కు ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయలో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు.

ప్రస్తుతం పూర్తి సిలబస్‌తో అకడమిక్ ఇయర్ చివర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

భవిష్యత్తులో పరీక్షలను సెమిస్టర్ విధానంలోకి తీసుకురావాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతిపాదించింది.

పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులు రెండు సార్లు పరీక్షలు రాయాలా?

అలా ఏం కాదు. అది విద్యార్థుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

ముందుగా నిర్వహించిన పరీక్షల్లో బాగా రాయలేదనుకుంటే లేదా మళ్లీ చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చనుకుంటేనే రెండోసారి పరీక్షలకు హాజరు కావొచ్చు. లేదంటే, ఒకసారి రాసి సరిపెట్టుకోవచ్చు.

అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బోర్డు నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్లు జరుగుతూ ఉంటాయి.

ఆ పరీక్షల్లో విద్యార్థులు మార్కులు పెంచుకోవాలనుకుంటే, మళ్లీ రాసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సీబీఎస్ఈ సహా దేశంలోని పలు బోర్డుల్లో మాత్రం అలాంటి విధానం లేదు.

రెండుసార్లు పరీక్షలతో విద్యార్థులలో ఒత్తిడి తగ్గుతుందా?

‘‘విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాయడం వల్ల తమకు నచ్చిన స్కోర్ ఎంచుకునే వీలుంటుంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది’’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

ఇది ఒక విధంగా మంచిదే. ఏదైనా అనుకోని కారణాలతోనో, ఆరోగ్యం సరిగా లేకనో.. మొదటిసారి పరీక్షలకు హాజరు కాకపోయినా, సరిగా రాయలేకపోయినా రెండో అవకాశం విద్యార్థులకు ఉంటుంది.

ఈ విషయంపై భారతీయ విద్యా భవన్ మాజీ ప్రిన్సిపల్ రమాదేవి బీబీసీతో మాట్లాడారు.

‘‘గతంలో మాదిరిగా ఒకసారి అవకాశం కోల్పోతే, మళ్లీ ఏడాది ఆగాల్సిన అవసరం ఉండదు. వెంటనే మళ్లీ పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు’’ అని చెప్పారు.

చదువుకుంటున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

మొదటిసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులొచ్చి.. రెండోసారి రాసిన పరీక్షల్లో తక్కువ మార్కులొస్తే ఎలా?

అప్పుడు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే, అందులోని మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. రెండో సారి రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని దిగులు పడాల్సిన అవసరం లేదు.

నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రతిపాదనలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే, ఆ స్కోర్ తీసుకునే వీలుంటుంది.

ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుందా?

‘‘పరీక్షలనేవి విద్యార్థి నేర్చుకున్న విషయాలను తెలుసుకుని, భవిష్యత్తులో మరింత పరిజ్జానం పెంచుకునేందుకు వీలుగా ఉండాలి. సర్టిఫికేషన్ కోసం పనికొచ్చేవిగా చూడాలి. ప్రస్తుతం బోర్డు పరీక్షలు ఈ రెండు వి‌షయాలకు సరిపోలడం లేదు’’ అని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) తుది నివేదికలో నిపుణులు అ‌భిప్రాయపడ్డారు.

దీంతో, పరీక్షలనేవి బట్టీ పట్టి చదవకుండా విద్యార్థుల నైపుణ్యాలు పరీక్షించేవిగా మారనున్నాయి.

రాత పరీక్ష, ఓరల్, ప్రాక్టికల్, ఓపెన్ బుక్ పరీక్షల విధానాలు వినియోగించి పరీక్షలు పెట్టుకోవచ్చని ఎన్సీఎఫ్ కమిటీ సూచించింది.

75 శాతం మార్కులు డెమో పద్ధతి, 25 శాతం రాత పరీక్షలకు ఉండాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం ప్రశ్నాపత్రం వంద మార్కులకు కాకుండా విభజించే అవకాశం ఉంది.

పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

సబ్జెక్టుల వారీగా మార్కులు ఎంచుకునే వీలుందా?

ఉదాహరణకు మొదటిసారి రాసినప్పుడు సబ్జెక్టు – Aలో 65 మార్కులు, సబ్జెక్టు – Bలో 79 మార్కులు.. రెండో సారి రాసినప్పుడు సబ్జెక్టు – Aలో 78, సబ్జెక్టు – Bలో 72 మార్కులే వచ్చాయని అనుకుందాం.

ఇలాంటి సందర్భాల్లో ఒకసారి పరీక్షలో ఒక సబ్జెక్టు, రెండోసారి రాసిన పరీక్ష నుంచి ఇంకో సబ్జెక్టు మార్కులు ఎంచుకునేందుకు వీలుంటుందా? అన్న విషయంపై కేంద్ర విద్యా శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మిగిలిన తరగతుల విద్యార్థులకు ఆప్షన్ ఉందా?

ఏడాదికి రెండుసార్లు పరీక్షలనేవి కేవలం పది, పన్నెండు తరగతుల విద్యార్థులకే పరిమితం. మిగిలిన తరగతుల విద్యార్థులకు ఈ ఆప్షన్ ఉండదు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్నాపత్రాల సరళి మారే అవకాశం ఉందా?

ఒకే సబ్జెక్టుకు రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఒకే ప్రశ్నలు రెండుసార్లు అడిగేందుకు అవకాశం ఉండకపోవచ్చు. ప్రశ్నల సరళిలోనూ మార్పులు రానున్నాయి.

‘‘2017-18 నుంచి ఏటా ప్రశ్నాపత్రాల సరళిని సీబీఎస్ఈ మారుస్తుంది. అంతకుముందు ఐదేళ్లకోసారి మాత్రమే మోడల్ పేపర్లు మారేవి. గతంలో 30 శాతం క్రిటికల్ థింకింగ్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు అవి 50 శాతం ఉంటున్నాయి. నేరుగా సమాధానాలు రాసే ప్రశ్నలు కాకుండా విద్యార్థుల ఆలోచన సరళికి పదును పెట్టేవిగా ప్రశ్నలు ఉంటున్నాయి’’ అని హైదరాబాద్‌కు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పద్మప్రియ బీబీసీతో చెప్పారు.

దీనివల్ల మోడల్ ప్రశ్నాపత్రం తెలియక విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని ఆమె చెబుతున్నారు.

విద్యార్థులపై ఫీజుల భారం పడుతుందా?

రెండు సార్లు పరీక్షలు రాయాలనుకుంటే, రెండుసార్లు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్ష ఫీజుల భారం పడే వీలుంది.

విద్యార్థులకు మరో రూపంలో ఒత్తిడి పడనుందా?

ఒక విధంగా రెండు పరీక్షలో ఏది బాగా రాస్తే ఆ మార్కులు ఎంచుకోవచ్చనే విషయంలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతుండగా.. విద్యార్థులపై మరో రూపంలో ఒత్తిడి రానుంది.

‘‘సాధారణంగా మనిషి స్వభావం.. ఒక పెద్ద పని చేసేందుకు ఒత్తిడికి గురై ఎలాగో అలా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తాడు. మళ్లీ అదే పని వేరొక విధంగా చేయాలంటే కచ్చితంగా మరోసారి ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులు పరీక్షల విషయంలో కచ్చితంగా ఒత్తిడి ఫీలవుతారు. ఒకవేళ పరీక్షలు రెండుసార్లు రాయాలనుకుంటే, కచ్చితంగా రెండుసార్లు ఒత్తిడికి గురికావొచ్చు’’ అని రమాదేవి బీబీసీకి చెప్పారు.

ఒక సబ్జెక్టుపై వేర్వేరు రకాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రశ్నలు చర్చించుకుంటున్న విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందా?

జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్(ఎన్సీఎఫ్)ను డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ చైర్మన్‌గా ఉన్నారు.

ఎన్సీఎఫ్ తుది నివేదికను గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీబీఎస్ఈ సహా దేశ వ్యాప్తంగా 60 బోర్డుల పరిధిలో పరీక్షలు జరుగుతుంటాయి.

ఎస్ఎస్ఈ, ఇంటర్ బోర్డులనేవి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటేనే ఏడాదికి రెండుసార్లు పరీక్షలు పెట్టేందుకు సాధ్యమవుతుంది.

విద్య అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏదైనా మార్పులు, చేర్పులు చేస్తే.. వాటిని అమలు చేయడం ఆయా రాష్ట్రాల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

జాతీయ విద్యా విధానాన్ని ఇప్పటికీ చాలా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురాలేదు.

ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎఫ్ నివేదికలో ప్రస్తావించినా.. దాన్ని అమలు చేయడమనేది ఆయా రాష్ట్రాల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడితే ఈ నిర్ణయం అమల్లోకి రావొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)