మరియం నవాజ్: పాకిస్తాన్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె

మరియం నవాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి మరియం నవాజ్‌
    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్, ఇస్లామాబాద్

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిరసనలు, బాయ్‌కాట్ మధ్య పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

మరియం నవాజ్ 2011 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు అయ్యారు.

పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి మరియం నవాజ్‌.

పాకిస్తాన్‌లోని కీలక నేతల్లో ఒకరైన మరియం నవాజ్, వివాదాస్పద రాజకీయ నాయకురాలు. ఆమె ధైర్యాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ఆ పార్టీ శ్రేణులు మెచ్చుకుంటాయి. కానీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆమెను అవినీతి, వారసత్వ రాజకీయాలకు చిహ్నంగా చూస్తారు.

మరియం నవాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి నవాజ్ షరీఫ్‌తో మరియం

రాజకీయ ప్రస్థానం...

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పెద్ద కూతురు మరియం నవాజ్.

ఆమె లాహోర్‌లో పెరిగారు. 90లలో నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఏడీసీగా పనిచేసిన ఆర్మీ అధికారిని ఆమె వివాహం చేసుకున్నారు.

షరీఫ్ కుటుంబం మతాచారాలను పాటించే సంప్రదాయిక కుటుంబం. అలాంటి నేపథ్యం ఉన్న ఆమె రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించలేదు. అందుకు ఆమె కూడా సిద్ధంగా లేరు.

అయితే, 1999 అక్టోబర్‌లో మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పుడు మరియం తండ్రి నవాజ్ షరీఫ్ జైలుపాలయ్యారు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ ఆమె సాధారణ జీవితం గడిపారు.

ఆ సమయంలో ఆమె కుటుంబంలోని మగవారినందరినీ గృహనిర్బంధంలో ఉంచారు.

అప్పుడు మొదటిసారి మరియం నవాజ్ తన తల్లితో కలిసి బహిరంగ వేదికపై కనిపించారు. తన తండ్రికి మద్దతుగా ప్రజల ముందుకొచ్చిన ఆమె, జనరల్ ముషారఫ్‌కి బహిరంగంగా సవాల్ విసిరారు.

కొద్దినెలల తర్వాత సౌదీ అరేబియా రాజు సాయంతో మరియం, ఆమె తల్లి జనరల్ ముషారఫ్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం నవాజ్ షరీఫ్ జైలు నుంచి విడుదలవడంతో పాటు బహిష్కరణ కారణంగా కుటుంబంతో సహా 2000 డిసెంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత 2007లో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్‌కు తిరిగొచ్చారు. ఈ ప్రవాస సమయంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు మరియం సిద్ధమయ్యారని కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతారు.

మరియం నవాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కొత్త ముఖ్యమంత్రి మరియం నవాజ్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

2011లో తన బాబాయి షెహబాజ్ షరీఫ్‌కు మద్దతుగా మహిళా విద్యాసంస్థలను సందర్శించినప్పుడు మరియం నవాజ్ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం మొదలైంది.

షెహబాజ్ అప్పుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి. 2013లో ఆమె సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తించారు.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న కాలమది.

దానికి దీటుగా మరియం నవాజ్ పీఎంఎల్-ఎన్ సోషల్ మీడియా సెల్‌ను ప్రారంభించారు.

ఆమె చొరవ పీఎంఎల్-ఎన్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఆమె తండ్రి మరోసారి అధికారంలోకి వచ్చి, మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు.

అయితే, 2013లో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, ఆమె తండ్రి మరియంను యూత్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చైర్మన్‌గా నియమించారు.

ఆమె నియామకాన్ని కోర్టులో సవాల్ చేయడంతో ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అనంతరం, ఆమె ప్రధాన మంత్రి ఇంటి నుంచి 'స్ట్రాటజిక్ మీడియా కమ్యూనికేషన్ సెల్'ను కొనసాగించారు.

2013 నుంచి 2017 మధ్య అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ఆమె జోక్యం గురించి మరియం విమర్శలు ఎదుర్కొన్నారు. దేశానికి అసలు ప్రధాని ఆమే అని కూడా అప్పట్లో అనేవారు.

2016లో లీకైన పనామా పేపర్లలో మరియం, ఆమె తోబుట్టువుల పేర్లు బయటపడ్డాయి. వారికి విదేశీ కంపెనీలతో రహస్య సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

వారికి బ్రిటన్‌లో ఆస్తులు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను షరీఫ్ కుటుంబం తీవ్రంగా ఖండించింది.

మరియం నవాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్‌ఖాన్ పీటీఐకి దీటుగా పీఎంఎల్-ఎన్ సోషల్ మీడియా సెల్‌ను ప్రారంభించారు

పాకిస్తాన్ కీలక నేతగా ఎలా ఎదిగారు?

ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో, 2017లో నవాజ్ షరీఫ్‌ అధికారం కోల్పోయారు.

మరియం, ఆమె తండ్రి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. మరియం నవాజ్ కూడా జైలుపాలయ్యారు. కొద్దికాలం తర్వాత ఆమెకు బెయిల్ వచ్చింది.

కానీ, ఆ సమయంలో నవాజ్ షరీఫ్ తర్వాత కీలక నేతగా తనను తాను తీర్చిదిద్దుకోవడంలో విజయం సాధించారు.

ఇమ్రాన్ ఖాన్, సైన్యం కుమ్మక్కై తమ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె విస్తృత ప్రచారం ప్రారంభించారు.

పీఎంఎల్‌ -ఎన్‌ మద్దతుదారులను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు, ‘ఓటును గౌరవించండి’ వంటి నినాదమిచ్చారు.

పార్లమెంట్ ఎన్నికల్లో మరియం పోటీ చేయలేదు కానీ, ఎన్నికల ప్రచారంలో ఆమె దూకుడు కారణంగా 2018 సాధారణ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని వైద్యం చేయించుకునేందుకు విడుదల చేసేలా ఒత్తిడి తెస్తూ విస్తృత ప్రచారం చేశారు.

అనంతరం నవాజ్ షరీఫ్ బ్రిటన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్‌కు తిరిగొచ్చారు.

ఇమ్రాన్ ఖాన్‌పైనా మరియం నవాజ్ తీవ్ర విమర్శలు గుప్పించేవారు.

మరియం నవాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లొ తండ్రి అధికారం కోల్పోయిన తర్వాత మరియం జైలు పాలయ్యారు

వారసత్వం

మరియం నవాజ్‌ను చీఫ్ ఆర్గనైజర్‌గా నియమించడమనేది పీఎంఎల్-ఎన్ విధానపరంగానూ ఆశ్రిత పక్షపాతానికొక చెత్త ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు, రచయిత జాహిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

'క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోవడంలో పీఎంఎల్ -ఎన్‌ పూర్తిగా విఫలమైందని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసింది' అని బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

"పాకిస్తాన్ రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి. ఇమ్రాన్ ఖాన్‌తో ప్రజలు విభేదించవచ్చు. కానీ ఒకటైతే సుస్పష్టం. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయనొక మోడల్‌ను అందించారు. దీనికి యువత నుంచి ప్రజాదరణ లభించింది. కానీ, పీఎంఎల్-ఎన్ ఇప్పటికీ ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేదని తెలుస్తోంది.''

ప్రస్తుతం పార్టీలోని అన్ని ఉన్నత పదవుల్లోనూ షరీఫ్ కుటుంబీకులే ఉన్నారు. పీఎంఎల్‌-ఎల్ పార్టీకి ఇప్పటికీ నవాజ్ షరీఫ్ నిజమైన బాస్.

ఇప్పుడు తన తండ్రి తర్వాత మరియం రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారారని జాహిద్ హుస్సేన్ చెప్పారు.

మరియం నవాజ్ మంచి వక్త అని, ఆమె ప్రసంగాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. అయితే, ఆమెకు ప్రజల్లో ఆదరణ పెరగడం ఆ పార్టీ నాయకుల్లోనే చాలా మందికి రుచించడం లేదు.

''సమర్థులైన నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ వారికి పార్టీ వారికి సరైన అవకాశాలు ఇవ్వలేదని ఇప్పటికీ చాలా మంది భావిస్తారు'' అని ఆయన అన్నారు.

''ఆమె తన తండ్రికి ఇష్టమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, పోరాడుతున్నారు. కానీ వారిని నాయకత్వం పరిగణనలోకి తీసుకోదు' అన్నారాయన.

బేనజీర్ భుట్టో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో. 2007లో ఒక దాడిలో ఆమె మరణించారు (పాత చిత్రం)

బేనజీర్ భుట్టోతో పోలిక

చాలా మంది పీఎంఎల్-ఎన్ మద్దతుదారులు మరియం నవాజ్‌ను ఆ దేశ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోతో పోలుస్తున్నారు.

బేనజీర్ భుట్టోను కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా, ప్రపంచమంతా ధైర్యానికి ప్రతీకగా చూస్తారు. ముస్లిం దేశాల్లో తొలి మహిళా ప్రధాన మంత్రి ఆమె.

తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను అధికారం నుంచి తప్పించిన తరువాత, ఆమె కుటుంబం చాలా దారుణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆయన్ను అప్పటి నియంత జనరల్ జియా-ఉల్ హక్ ఉరితీయించారు. అందుకే బేనజీర్ భుట్టో విమర్శకులు సైతం ఆమె వ్యక్తిగత, రాజకీయ పోరాటాన్ని గౌరవిస్తారు.

మరియం నవాజ్ కూడా ఎన్నోసార్లు బేనజీర్ భుట్టోను గౌరవప్రదంగా స్మరించుకున్నారు.

2021లో ఆమె వర్ధంతి సందర్భంగా, ఆమె స్వస్థలం లర్కానాలో జరిగిన ఒక సమావేశంలో మరియం మాట్లాడుతూ తన పోరాటం కూడా బేనజీర్ భుట్టోకి వంటిదేనని అన్నారు.

''రాజకీయంగా నాకూ బేనజీర్ భుట్టోతో అనేక సామీప్యతలు ఉన్నాయని అనుకుంటూ ఉంటా. ఆమె దేశంలోని మహిళలకు గర్వకారణం మాత్రమే కాదు, తండ్రీ కూతుళ్ల అనుబంధానికి ప్రతీక'' అన్నారు.

"ఆమె చనిపోయే వరకూ తన తండ్రి కేసు గురించి పోరాడుతూనే ఉన్నారు. పాకిస్తాన్‌ను ఏకతాటిపైకి తీసుకురావడం, పాకిస్తాన్ అభివృద్ధి విషయంలో మా నాన్న ఆశయాల కోసం అవసరమైతే నా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా నేను వెనకాడను." అన్నారామె.

అయితే స్ఫూర్తి, సారూప్యతల విషయంలో బేనజీర్ భుట్టోతో పోలిక ఉన్నప్పటికీ, తన మార్గం మాత్రం వేరని ఆమె చెప్పారు.

ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ విశ్లేషకులు మునిజె జహంగీర్ ఏకీభవించారు.

బేనజీర్ భుట్టో ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్లను మరియం కూడా ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, అన్ని విధాలుగా చూస్తే భుట్టో కంటే మరియం పరిస్థితి మెరుగేనని ఆయన అభిప్రాయపడ్డారు.

మరియం తండ్రి, ఆమె సోదరుడు, కుటుంబం ఆమెకు అండగా నిలుస్తోంది. కానీ బేనజీర్ విషయంలో అలా జరగలేదు.

70వ దశకంలో జుల్ఫీకర్ అలీ భుట్టోను అధికారం నుంచి తొలగించిన సమయంలో నియంత జనరల్ జియా ఉల్ హక్‌కు అమెరికా బహిరంగంగా మద్దతు ఇచ్చిందని మునిజె చెప్పారు.

ఆ సమయంలో మానవ హక్కులపై అవగాహన, మానవ హక్కువ సంఘాలు కూడా ఈ స్థాయిలో లేవు. ఈ సోషల్ మీడియా యుగంలో మరియం నవాజ్ గొంతుక బలంగా వినిపిస్తోంది. బేనజీర్‌కు అలాంటి అవకాశం లేదు.

ఈ విషయంలో రాజకీయ వ్యాఖ్యాత జాహిద్ హుస్సేన్ బేనజీర్ భుట్టోను చాలా గొప్పగా చూస్తారు.

బేనజీర్ భుట్టోకి మరియం నవాజ్‌కి మధ్య ఎలాంటి పోలిక లేదు, ఉండదని ఆయన వాదించారు.

నియంత జియా ఉల్ హక్ హయాంలో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, రాజకీయ నాయకురాలిగా ఆమె సామర్థ్యం, మానసిక స్థైర్యానికి మరియం నవాజ్‌తో పోలిక లేదు.

"కుటుంబం కారణంగా మరియం నవాజ్‌కు అన్నీ కలిసొచ్చాయి. కానీ, బేనజీర్ భుట్టోకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఆమె తండ్రి మరణించేనాటికి తన చదువు కూడా పూర్తి కాలేదు. ఆమె సోదరుడు కూడా భయపడి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది.'' అని జాహిద్ హుస్సేన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)