సందేశ్‌ఖాలీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంటలు రేపుతున్న ద్వీపం, తృణమూల్ నేతలు లైంగికంగా వేధించారని వందల మంది మహిళలు ఎందుకు ఆరోపించారు

పశ్చిమ బెంగాల్ మహిళ

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC

    • రచయిత, అమితాబ్ భట్టసాలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోని సుందర్‌బన్ ప్రాంతంలోని సందేశ్‌ఖాలీ ద్వీపానికి చేరుకోవడానికి కాళింది నది ఒక మార్గం. నదికి అవతలి వైపున ధామాఖలి ఘాట్ నుంచి పడవలో సందేశ్‌ఖాలీకి వెళ్లాల్సి ఉంటుంది.

చొరబాటు ఆరోపణలతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అరెస్టు చేసిన కొంతమంది పురుషులు, మహిళలతో కొన్ని సంవత్సరాల క్రితమే నేను (అమితాబ్ భట్టసాలీ) మాట్లాడాను.

ఆ సాయంత్రం, సరిహద్దు దాటి మూడు పడవల్లో వచ్చిన 150 మందికి పైగా బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ పట్టుకుంది. ధామాఖాలీ ఒడ్డు నుంచి నదికి అవతల ఉన్న సందేశ్‌ఖాలీ కనిపిస్తుంది.

అయితే, మొన్నటి వరకు నిశ్శబ్ధంగా ఉన్న ఈ ద్వీపం ఇపుడు భారత రాజకీయాల్లో అత్యంత ప్రధానాంశంగా నిలుస్తోంది.

కొన్ని వారాల క్రితం ఈ ద్వీపంలో మహిళలు నిర్వహించిన భారీ నిరసన జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది.

మహిళలు తమ చేతుల్లో కర్రలు, చీపుర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. షాజహాన్ షేక్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఈ ముగ్గురు నేతలు, వారి సహచరులు చాలాకాలంగా స్థానిక ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మహిళలు ఆరోపించారు.

తమను లైంగిక వేధించారని, తమ వ్యవసాయ భూములను బలవంతంగా ఆక్రమించారని కూడా ఆరోపించారు.

శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా షాజహాన్ షేక్ పరారీలో ఉన్నారు. అందువల్ల ఈ ఆరోపణలపై వారి స్పందన దొరకలేదు.

ఈ ఆరోపణలు చేస్తున్న మహిళలంతా ఎవరు? ఎక్కడుంటున్నారు? అనే ప్రశ్నకు సందేశ్‌ఖాలీ మార్కెట్‌లోని ఓ దుకాణదారు సమాధానమిచ్చారు.

''సందేశ్‌ఖాలీలో దాదాపు ప్రతి వ్యక్తి ఈ ఆరోపణ చేస్తున్నారని, ఏ ప్రాంతానికి వెళ్లినా గత కొన్నేళ్లుగా ఎలాంటి దారుణాలు జరిగాయో వింటారు'' అని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మహిళల నిరసన

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC

వంట కోసమంటూ తీసుకెళ్లేవారు

కొద్ది దూరంలో రోడ్డుపక్కన వెదురును కోస్తూ కొందరు పురుషులు, మహిళలు కనిపించారు. అయితే, వారు కెమెరాను చూసి మాట్లాడటానికి నిరాకరించారు.

మీడియాలో ముఖాలు కనిపిస్తే తమపై దాడి జరుగుతుందనే భయం ఉందని, ఇంతకు ముందు అలా మీడియాతో మాట్లాడిన వారిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఓ మహిళ అన్నారు.

అయితే కొంతసేపటికి ఓ మహిళ తన ముఖాన్ని దాచుకొని, మాట్లాడేందుకు అంగీకరించారు.

"వారు పీఠా-పులి (బియ్యం పిండిలో ఖోయాను కలిపి తయారుచేసే బెంగాల్ ప్రత్యేక వంటకం) చేయడానికి మహిళలను తీసుకువెళ్లేవారు. వాళ్ల ఇళ్లలో అమ్మలు, చెల్లెళ్లు లేరా? పీఠా-పులి తయారు చేసే వారే లేరా? పీఠా-పులి చేయడానికి అందమైన మహిళలను ఎందుకు తీసుకెళ్లారు? కొన్నిసార్లు పీఠా-పులి తయారు చేసే సాకుతో, మరికొన్నిసార్లు పిక్నిక్‌లో మాంసం, అన్నం వండాలని, కొన్నిసార్లు పార్టీ మీటింగ్ పేరుతో పిలిచేవారు. ఈ పిలుపులకు నిర్ణీత సమయమంటూ లేదు" అని అన్నారు.

కాసేపటి తర్వాత మరో మహిళ మాట్లాడుతూ ‘‘సాయంత్రం 7, రాత్రి 9, 10, 11 గంటల వరకు ఫోన్‌ చేసేవారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయానికి పిలిస్తే తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చేది. ఒకవేళ ఎవరైనా వెళ్లకపోతే మరుసటి రోజు ఇంట్లోని పురుషులను కొట్టేవాళ్లు" అని తెలిపారు.

మరో వ్యక్తి కెమెరా నుంచి పక్కకు తిరిగి "ఒకవేళ ఇవాళ మీటింగ్ ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకెళ్లేవారు. అందమైన యువతులను మాత్రమే లోపలికి తీసుకెళ్లేవారు. పిల్లలు, వృద్ధులను బయట కూర్చోబెట్టేవారు. అందమైన మహిళలను లోపలికి తీసుకెళ్లి తలుపులు వేసేవారు. లోపల ఏం జరిగిందో చెప్పలేం అని అన్నారు.

లోపల మహిళలకు ఏం జరిగింది? అనే ప్రశ్నపై ఈ అవమానకరమైన విషయం ఎలా చెప్పాలని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

‘అక్కడ మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం గురించి ఎవరైనా మహిళ లేదా బాలిక మాట్లాడగలరా? పోలీసుల దగ్గరికి వెళితే, ఆ నేతల వద్దకే వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలనేవారు’ అని మరో మహిళ అన్నారు.

కాగా, సందేశ్‌ఖాలీలోని వివిధ గ్రామాలను సందర్శించిన తర్వాత లైంగిక వేధింపులకు గురైనట్లుగా ఏ మహిళా వచ్చి మాతో చెప్పలేదు.

పశ్చిమ బెంగాల్‌లో మహిళల నిరసన

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC

'సామూహిక అత్యాచారం'

ఈ ఆరోపణలపై మొదట్లో చాలామందికి అనుమానాలుండేవి. సోషల్ మీడియా ఇంతలా అందుబాటులో ఉన్నా మహిళలపై అఘాయిత్యాల విషయం ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సందేశ్‌ఖాలీలో ఆందోళనల తర్వాత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘ఆ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థ ఉంది. ఏడెనిమిదేళ్ల క్రితం అక్కడ అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతం సున్నితమైనది. మేం సరస్వతీ పూజ రోజున అంతా కంట్రోల్‌లోకి తీసుకున్నాం. లేకపోతే పరిస్థితి మరొలా ఉండేది" అని తెలిపారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి డాక్టర్‌ జిష్ణుబసు స్పందిస్తూ ‘అక్కడ మా సంస్థ అంత శక్తిమంతంగా ఉంటే ఇంత అమానుషమైన పని ఎవరైనా చేసి ఉండేవారా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

నిరసన ప్రారంభమైన రెండు వారాల తర్వాత, ఇద్దరు మహిళలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ సందేశ్‌ఖాలీని సందర్శించారు.

సందేశ్‌ఖాలీలో చాలామంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు, తనకు స్వయంగా రెండు అత్యాచారాల ఫిర్యాదులు అందాయని శర్మ చెప్పారు.

అంతకుముందు మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన రహస్య వాంగ్మూలంలో తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ తెలిపారు.

పశ్చిమ బెంగాల్

ఫొటో సోర్స్, Shahjahan Shaikh

ఫొటో క్యాప్షన్, షాజహాన్ షేక్

షాజహాన్, శిబు, ఉత్తమ్‌ల నేపథ్యమేంటి?

షాజహాన్, శివ ప్రసాద్ హజ్రా ఇద్దరూ పశ్చిమ బెంగాల్​లోని నార్త్ 24-పరగణాస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సభ్యులు.

జిల్లా పరిషత్‌లోని మత్స్య, పశుసంవర్ధక విభాగానికి షాజహాన్ చీఫ్​గా ఉన్నారు.

వారిద్దరూ సందేశ్‌ఖాలీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు బ్లాక్ అధ్యక్షులు. ఉత్తమ్ సర్దార్ అతని సహచరుడు.

కానీ షాజహాన్ షేక్ ఈ ప్రాంతానికి ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు సీపీఎంలో ఉన్నారు. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సందేశ్ ఖాలీ

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC

ఫొటో క్యాప్షన్, భూములను షాజహాన్ బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి.

భూములు లాక్కున్నారంటూ ఫిర్యాదులు

ఒకప్పుడు చేపల చెరువులో కూలీగా, వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసిన షాజహాన్ షేక్‌కు ప్రస్తుతం రాజ భవనాల వంటి మూడు ఇళ్లు, 17 వాహనాలు, అనేక చేపల చెరువులు, రెండు ఇటుక బట్టీలతో సహా భారీగా ఆస్తి ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

గత జనవరిలో ఆయన పేరు తొలిసారిగా మీడియాలో ప్రముఖంగా కనిపించింది. పశ్చిమ బెంగాల్ రేషన్ కుంభకోణంలో అరెస్టైన మాజీ ఆహార మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌తో షాజహాన్‌కు పరిచయం ఉంది.

జ్యోతిప్రియ అరెస్టు తర్వాత ఈడీ బృందం జనవరి 5న షాజహాన్ షేక్ ఇంటిపై దాడులు చేసింది. అయితే, ఆ రోజు వందలాది మంది అక్కడికి వచ్చి, ఈడీ అధికారులను, కేంద్ర బలగాల సిబ్బందిని, వారితోపాటు వచ్చిన జర్నలిస్టులనూ అక్కడి నుంచి తరిమికొట్టారు. అప్పటి నుంచి షాజహాన్ షేక్ పరారీలో ఉన్నారు.

ఇదే సమయంలో తమ వ్యవసాయ భూములను షాజహాన్ బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, ప్రభుత్వ అధికారుల వద్ద కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు.

షాజహాన్ షేక్, అతని సన్నిహిత తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సామాన్య ప్రజల నుంచి చాలా ఆస్తిని లాక్కున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

భూమిని బలవంతంగా ఆక్రమించారంటూ సందేశ్‌ఖాలీ ప్రజలు సామూహిక పిటిషన్‌ దాఖలు చేశారు.

మేం ఒక ప్రాంతంలో అధికారులను కలిశాం. అయితే, చాలామంది బాధితులు తమ భూమి పత్రాలతో అక్కడికి చేరుకున్నారు.

సందేశ్‌ఖాలీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శిబు కోళ్ల ఫారానికి ప్రజలు నిప్పు పెట్టారు.

తృణమూల్, బీజేపీలు ఏమంటున్నాయి?

తృణమూల్ కాంగ్రెస్ ఒక వ్యవస్థీకృత పార్టీ. దానికి బలమైన ఆర్గనైజేషన్ ఉంది, దీని ద్వారా గ్రౌండ్ లెవల్ సమాచారం మొత్తం పార్టీ అగ్ర నాయకత్వానికి చేరుతుంది. మరోవైపు పోలీసు, నిఘా విభాగాలూ ఉన్నాయి.

అయితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు సందేశ్‌ఖాలీ ప్రజలను చాలాకాలంగా చిత్రహింసలకు గురిచేస్తే, ఆ సమాచారం అగ్ర నాయకత్వానికి ఎందుకు చేరలేదు? చేరితే, పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్నను ఆ పార్టీ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తిని బీబీసీ అడిగింది.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'పదేళ్లుగా ఈ ఘటనలు జరిగితే ఏ వ్యక్తి కూడా ఫేస్‌బుక్‌లో ఎలాంటి పోస్ట్ రాయలేదు లేదా ఫిర్యాదు చేయలేదేం' అని తెలిపారు.

ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీపీఎం నేత నిరపద సర్దార్‌, బీజేపీ నేత వికాస్‌సింగ్‌‌లు పదేళ్ల నుంచి కేసులు పెట్టి ఉండవచ్చు కదా? ఇప్పటివరకు ఎందుకు బయటకు చెప్పలేదు? అని ప్రశ్నిస్తున్నారు.

'ఎవరైనా బలవంతంగా భూమిని ఆక్రమించినట్లయితే, దానిపై ఫిర్యాదు చేయడానికి వ్యవస్థ అందుబాటులో ఉంది. పోలీసులు విచారిస్తారు'' అని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మతతత్వ శక్తులు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తాయని, బెంగాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయని, ఎన్నికల్లో ప్రతిసారీ ఇదే జరుగుతుందని అరూప్ చక్రవర్తి ఆరోపిస్తున్నారు.

సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అణచివేత గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని కోరుకోవడం లేదని, స్థానిక మహిళల పరిస్థితిని దేశం ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కీయా ఘోష్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ ఆడపిల్లల కష్టాలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

''తాము తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతుదారులమని మహిళలు స్వయంగా చెబుతున్నారు. ఇంత చేసినా వంటల తయారీ పేరుతో పార్టీ ఆఫీసుకు పిలిపించి వారిని వినోదం కోసం వాడుకుంటుంటే, ఇంతకంటే అవమానం ఏముంటుంది? " అన్నారు.

సందేశ్‌ఖాలీ అంశం జాతీయ మీడియాలో కవరేజీ చేయడం, సోషల్ మీడియాలో బీజేపీ నేతల రెగ్యులర్ పోస్ట్‌ల కారణంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది.

ప్రస్తుతం సందేశ్‌ఖాలీలో కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వాటిని చూస్తుంటే ఇటీవలే పెట్టినట్లు కనిపిస్తోంది.

సందేశ్‌ఖాలీ అంశాన్ని బీజేపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ వివాదంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు, పోలీసుల మధ్య ప్రతిరోజూ వాగ్వాదాలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు టీవీలు, సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, NURPHOTO

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

ఒత్తిడిలో తృణమూల్ కాంగ్రెస్

సందేశ్‌ఖాలీ ఘటన లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లో పడేసే విషయమే.

గత రెండేళ్లలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు, మంత్రులు వివిధ అవినీతి కేసుల్లో అరెస్టయ్యారని రాజకీయ విశ్లేషకులు విశ్వజ్యోతి భట్టాచార్య చెప్పారు.

''నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని టీఎంసీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ ఈసారి స్థానిక పార్టీ నాయకులపై స్థానిక ప్రజలే ఆరోపణలు చేశారు. అందుకే టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. దీనితో పాటుగా కేంద్ర కమిషన్ బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ తొలిసారిగా ఇటువంటి వ్యతిరేకత, సవాలును ఎదుర్కొంటోంది" అని భట్టాచార్య తెలిపారు.

పార్టీ, పాలనా యంత్రాంగం నష్టనివారణ కసరత్తు ప్రారంభించినట్లు సందేశ్‌ఖాలీ ఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇద్దరు మంత్రులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

ప్రతి ప్రాంతంలోనూ పురుషులు, మహిళల నుంచి వివరాలు తీసుకుంటున్నారు.

భూకబ్జా ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ గ్రామాన తిరుగుతూ విచారణ చేస్తున్నారు.

ప్రతి గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ కూడా గ్రామంలో ఒక రాత్రి గడిపారు. బ్యాటరీతో నడిచే రిక్షాలో ద్వీపం అంతటా ప్రయాణించారు.

శుక్రవారం సందేశ్‌ఖాలీలో తాజా కలకలం, తృణమూల్ కాంగ్రెస్ స్థానిక నాయకుడిపై దాడి తర్వాత, డీజీపీ మళ్లీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సందేశ్‌ఖాలీ ఘటన ఎన్నికలపై ప్రభావం చూపనుందో లేదో కొన్ని నెలల తర్వాతే తేలనుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)