గాంధీ కుటుంబం గురించి అమేఠీ, రాయబరేలీ ప్రజలు ఏమంటున్నారు... వారు అక్కడ పోటీ చేయాలంటున్నారా, వద్దంటున్నారా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ
    • రచయిత, అనంత్ జణాణే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాంధీ-నెహ్రూ కుటుంబంలోని సభ్యులు గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయబరేలి నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ వస్తున్నారు. పలు రకాల ప్రాజెక్టులను అందించి, ఈ ప్రాంతాలను తమ కంచుకోటగా మార్చుకుని అక్కడి ప్రజలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు.

కానీ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ రెండుసార్లు మాత్రమే అమేఠీ వచ్చారు.

ప్రస్తుతం ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ రాయబరేలీ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లున్నాయి. కాంగ్రెస్ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే రాయబరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. 403 సీట్లున్న అసెంబ్లీలో కేవలం ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు.

ఈ లెక్కలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనమైన స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా భావిస్తున్న అమేఠీ, రాయబరేలీ నుంచి ఎంపీగా ఎవరైనా గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు 2024 ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న దానిపై పలు ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

అమేఠీ, రాయబరేలీకి చెందిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం. ఆ సమయంలో బీబీసీతో అక్కడి స్థానికులు పంచుకున్న విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం..

సునీత కోరి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సునీత కోరి

‘‘మా అన్న వెనక్కి తిరిగి చూడలేదు’’

‘భారత్ జోడ్ న్యాయ్ యాత్ర’ ఫిబ్రవరి 19న అమేఠీకి చేరుకున్నప్పుడు, రాహుల్ గాంధీ ‘నేను ప్రేమతో అమేఠీకి వచ్చాను. ఇక్కడ ప్రేమ అనే బంధం ఉంది. అందుకే, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని ప్రసంగించారు.

2008లో కూడా రాహుల్ గాంధీ అమేఠీకి చెందిన దళిత మహిళ సునీత కోరి కుటుంబంతో ఇలాంటి బంధాన్నే ఏర్పరచుకున్నారు. ఆమె ఇంట్లో భోజనం చేసి, ఆ రాత్రి వారి కుటుంబంతోనే పూడి గుడిసెలో ఉన్నారు.

రాహుల్ గాంధీతో తమ కుటుంబానికి బలమైన సంబంధాలున్నాయని సునీత భావించారు.

కానీ, సునీతా కోరి ఇల్లు ఒక రోజు అకస్మాత్తుగా దగ్ధమైంది. మూడున్నర ఏళ్ల తర్వాత ఆమె భర్త మదన్ లాల్‌ను కాంగ్రెస్ ఉద్యోగం నుంచి తీసేసింది. ఆ తర్వాత సునీత, ఆమె భర్త ఎన్ఆర్ఈజే కార్మికులుగా పనిచేయడం ప్రారంభించారు.

‘‘ఎలాగో అలా మేం మా పిల్లల్ని పెంచుతున్నాం. మా అన్న(రాహుల్ గాంధీ) తిరిగి మా వైపు చూడలేదు. తన చెల్లి చేతులతో భోజనం చేసినప్పుడు, ఆయన తిరిగి వెనక్కి చూడాలి కదా. కానీ, ఈ రోజు వరకు తిరిగి చూడలేదు’’ అని చెబుతూ సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాహుల్ గాంధీ సునీత కోరి ఇంటికి వెళ్లినప్పుడు, ఆ విషయం వార్తాపత్రికల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఆ సమయంలో దళితుల పట్ల రాహుల్ గాంధీ కపట ప్రేమ చూపిస్తున్నట్లు మాయవతి విమర్శలు చేశారు.

ప్రస్తుతం సునీత కోరి అమేఠీలోని తన గ్రామాన్ని విడిచిపెట్టి, రాయబరేలీలోని బచ్‌రావన్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అక్కడే ఉన్న ఒక సిమెంట్ కర్మాగారంలో సునీత కోరి భర్త మదన్ లాల్ నెలకు రూ.15 వేల జీతానికి పనిచేస్తున్నారు.

‘‘మేం నిజమే పేదవారం, కానీ హృదయపరంగా కాదు’’ అని సునీత కోరి అన్నారు.

అంటే, అమేఠీ నుంచి రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేయాలని సునీత కోరి కోరుకుంటున్నారా? అని అడగా.. ‘‘మా సోదరుడు పోరాడాలని మేం కోరుకుంటాం. మేం మద్దతు ఇస్తాం. ఆయన కోసం ఏం చేయాల్సి అది చేస్తాం. ఆయన తన చెల్లిని మర్చిపోవచ్చు. కానీ, మా అన్నను మేం మర్చిపోలేం’’ అని సునీత అన్నారు.

ఎన్నికల సమయంలో, ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయమని అడుగుతారు, లేదంటే ఎవరూ ఏమీ అడగరు అని అన్నారు.

రామ్ ఖేలావన్
ఫొటో క్యాప్షన్, రామ్ ఖేలావన్

‘‘మెల్లమెల్లగా ప్రజలు మర్చిపోతారు’’

అమేఠీలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు ఎదురుగా 55 ఏళ్ల రామ్ ఖేలావన్ చౌహాన్ ఒక పాన్ దుకాణం నడుపుతున్నారు. ఈ కర్మాగారాన్ని అమేఠీలో ఎంపీగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ 1982లో ప్రారంభించారు.

‘‘రాజీవ్ గాంధీ ఈ కర్మాగారం ప్రారంభించినప్పుడు, మేం ఈ దుకాణం పెట్టాం. మేం సంపాదించే ఈ రెండు పైసలతోనే మేం తినగలుగుతున్నాం’’ అని చెప్పారు.

అమేఠీలో రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర చేస్తున్న సమయంలోనే మేం రామ్ ఖేలావన్‌ను కలిశాం. 2019లో 50 వేల ఓట్లకు పైగా తేడాతో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత, 2022లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు రాహుల్ గాంధీ తిరిగి అమేఠీ వచ్చారు.

రెండేళ్ల వరకు రాహుల్ గాంధీ అమేఠీ రాకపోవడాన్ని మేం రామ్ ఖేలావన్‌ను ప్రశ్నించినప్పుడు, ‘‘అవును ఇది చింతించాల్సిన విషయమే. ఒకవేళ ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు గడిస్తే, ప్రజలు మెల్లమెల్లగా మర్చిపోతారు కదా? ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం లేదు. మేం ఆయన్ను కలవడం లేదు. సమస్య గురించి మీకు ఏం చెప్పకపోతే, ప్రజల సమస్య ఏంటన్నది మీకెలా తెలుస్తుంది? ఒకవేళ మీకు సమస్య గురించి తెలియకపోతే, మీరెలా సిద్ధమవుతారు?’’ అని ప్రశ్నించారు.

కానీ, గాంధీ కుటుంబం వల్లనే అమేఠీలో హెచ్ఏఎల్ కర్మాగారం ఎదుట దుకాణం పెట్టుకున్న మీరు అలా ఎలా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారని అడగగా?.. ‘‘అవును ఇది ఒకే, కానీ మీరు తిరుగుతూ ఉంటేనే కదా, జ్ఞాపకశక్తి మిగిలి ఉంటుంది’’ అని రామ్ ఖేలావన్ చెప్పారు.

ఓంకార్ నాథ్ పాండే

‘అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తను, కానీ ఇప్పుడు బీజేపీకి ఓటేస్తా’

రామ్ ఖేలావన్ చౌహాన్ పక్కనే చిన్న గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నారు ఓంకార్ నాథ్ పాండే. రాజీవ్ గాంధీ హెచ్ఏఎల్ కర్మాగారం ఏర్పాటు చేయడం వల్లనే తను కూడా దుకాణాన్ని తెరిచినట్లు చెప్పారు.

అంతకుముందు తాను కాంగ్రెస్ కార్యకర్తనని, కానీ గత ఎన్నికల్లో ఎందుకు బీజేపీకి ఓటేయాల్సి వచ్చిందో వివరించారు.

‘‘మా కుటుంబ సభ్యులు బీజేపీకి ఓటేసేవారు. మేం కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకే ఓటేసేవాళ్లం. కానీ, ఇప్పుడెవరూ అడగడం లేదు. గత ఐదేళ్లుగా ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడం లేదు. బూత్ లెవల్‌లో ఒక సంస్థ ఉంది. అది కూడా క్రియాశీలకంగా లేదు. పై స్థాయిలో ఉన్న వారు, కింద స్థాయిలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు’’ అని చెప్పారు.

బీజేపీ పాలనలో అమేఠీలో రహదారులు మెరుగైనట్లు ఓంకార్ నాథ్ చెబుతున్నారు. ‘‘అభివృద్ధి పనులు పెరిగాయి. అంతకుముందు రోడ్లపై గుంతలు ఉండేవి. కానీ, ఇప్పుడు కొత్తగా రహదారులను ఏర్పాటు చేశారు. బీజేపీ అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు. గాంధీ కుటుంబ అభివృద్ధి కేవలం అమేఠీకి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైంది. రాష్ట్రంలో అప్పుడు ఎలాంటి పనులు ఉండేవి కావు’’ అని చెప్పారు.

రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అమేఠీ నుంచి మళ్లీ గెలుపొందుతారా? అన్న ప్రశ్నకు.. ‘‘గెలుపు అనేది కచ్చితమైనది కాదు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా, రాజీవ్ గాంధీ ప్రభావం ఇంకా ఉంది. ప్రజలు ఓటేస్తారు. గెలుపొందడం లేదా ఓడిపోవడం ఆ తర్వాత సంగతి’’ అని ఓంకార్ చెప్పారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, SANJAY GANDHI HOSPITAL

ఫొటో క్యాప్షన్, సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన ఇందిరా గాంధీ

‘మాకు బీజేపీపై కోపం ఉంది’

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1982లో 350 పడకలతో సంజీవ్ గాంధీ హాస్పిటల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆ ఆస్పత్రి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది.

సోనియా గాంధీ అధినేతగా ఉన్న ట్రస్టు ద్వారా ఈ ఆస్పత్రి నడుస్తోంది. గత సంవత్సరం ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగా ఒక రోగి చనిపోయారన్న ఆరోపణలు రావడంతో, సెప్టెంబర్ 18న యోగి ప్రభుత్వం ఈ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేసింది. దీంతో, మెడికల్, వైద్య సేవలన్ని స్తంభించిపోయాయి.

2008లో రాయబరేలీలో రైల్ కోచ్ కర్మాగారానికి స్థలాన్ని పొందే విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో, మాయవతి ప్రభుత్వాన్ని సోనియాగాంధీ సవాలు చేశారు. అభివృద్ధి కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పారు. కానీ, అమేఠీ కొన్ని రోజుల పాటు మూసివేసినప్పుడు, గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఆస్పత్రి సౌకర్యాలను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, మళ్లీ ఆ ఆస్పత్రి తెరుచుకుంది. కానీ, ఇప్పటికీ ఆ ఆస్పత్రిపై ఆధారపడి జీవిస్తున్న వారు, బీజేపీపై కోపంతో ఉన్నారు.

‘‘అమేఠీలో మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఇది. కేవలం మాకు బీజేపీపై మాత్రమే కోపం ఉంది. వారు మాకేం ఇవ్వడం లేదు. ఒకవేల నాలుగు కేజీల ఆహార ధాన్యాలను ఇస్తున్నాం కదా అని బీజేపీ చెబితే, మా భూమి నుంచి 40 కిలోల ఆహారాన్ని వారు తీసేసుకుంటున్నారు. విచ్చలవిడిగా జంతువులు మా పొలాల్ని మేసేస్తున్నాయి’’ అని మెడికల్ దుకాణం నడుపుతున్న అశోక్ కుమార్ మిశ్రా అన్నారు.

హర్‌కేశ్ పాండే
ఫొటో క్యాప్షన్, హర్‌కేశ్ పాండే

‘ప్రజల్ని కలవకపోతే, కచ్చితంగా ఓడిపోతారు’

వచ్చే ఎన్నికల్లో అమేఠీ నుంచి గాంధీ పోటీ చేయాలని అశోక్ కుమార్ మిశ్రా దుకాణానికి సమీపంలో ఆస్పత్రి ఎదుట నివసిస్తున్న హర్‌కేశ్ పాండే అన్నారు.

‘‘రాహుల్ గాంధీ వస్తారు. కానీ, ప్రజల్ని కలవరు. ఇక్కడ ఉండరు. లోపలికి వచ్చి, వెళ్లిపోతారు. ఎందుకు ఇక్కడ ఉండటం లేదో నాకు తెలియదు. ఇక్కడ ఇంతమంది మహిళలు నిల్చున్నారు. కానీ, ఆగలేదు. అలానే వెళ్లిపోయారు. ఆగాల్సింది కదా’’ అని హర్‌కేశ్ పాండేకు పక్కనే కూర్చుని ఉన్న మరో దుకాణందారుడు ఓం ప్రకాశ్ అన్నారు.

అమేఠీలో రాహుల్ గాంధీ ఓడిపోవడానికి కారణాలేంటి అని ఓం ప్రకాశ్‌ని అడగగా?, ‘‘ప్రజల్ని కలవకపోతే, మీరు కచ్చితంగా ఓడిపోతారు’’ అని చెప్పారు.

రాయబరేలీ కాంగ్రెస్ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, రాయబరేలీ కాంగ్రెస్ కార్యాలయం

‘మా అమేఠీ కొడుకు ఆయన’

అమేఠీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బహరింగ ప్రసంగాన్ని వినడానికి కాంగ్రెస్ మహిళా కార్యకర్త పూలమతి కూడా వచ్చారు. అమేఠీలో ఓడిపోయినా, అక్కడి నుంచే రాహుల్ గాంధీ పోటీ చేయాలని అన్నారు. ‘‘కొన్నిసార్లు ఎలాంటి పంటలు పండవు. ఆ సమయంలో వ్యవసాయం ఆపేస్తామా? పంట వేయడం ఆపం కదా. మళ్లీ పంట వేస్తాం. ఆయన మా అమేఠీ బిడ్డ’’ అని చెప్పారు.

‘‘ప్రియాంక గాంధీని రాయబరేలీ నుంచి, రాహుల్ గాంధీని అమేఠీ నుంచి ఎంపీగా మేం చూడాలనుకుంటున్నాం’’ అని రాయబరేలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ మహిళా బ్లాక్ చీఫ్ గుడియా చెప్పారు.

కాంగ్రెస్ కార్యకర్త రామ్ సేవక్
ఫొటో క్యాప్షన్, ఒకప్పటి కాంగ్రెస్ కార్యకర్త రామ్ సేవక్

‘నా దేహమంతా కాంగ్రెస్ కోసమే అంకితం, కానీ... ’

ఇందిరా గాంధీ సమయం నుంచి రాయబరేలీలో కాంగ్రెస్ కార్యకర్తగా 77 ఏళ్ల రామ్ సేవక్ పనిచేస్తున్నారు. ఆయన రాయబరేలీలో పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇందిరా గాంధీ సమయంలో రాయబరేలీకి ప్రస్తుతమున్న పరిస్థితులకు మధ్య తేడాను ఆయన వివరించారు. ‘‘ఇందిరాగాంధీకి రాయబరేలీ ప్రజలతో కుటుంబ సంబంధాలుండేవి. ఆమెకు చాలా మంది ప్రజలు వ్యక్తిగతంగా తెలుసు’’ అని చెప్పారు.

గాంధీ కుటుంబంతో రాయబరేలీ ప్రజలకు సంబంధాలు మారాయా? ‘‘వారికి రాయబరేలీతో భావోద్వేగ సంబంధాలున్నాయి. మాకు కూడా వారెంటే అంతే అభిమానం. కానీ, మా మాధ్య అలాంటి సంబంధాలు, మా వ్యక్తిగత జీవితాన్ని వారితో పంచుకోవడం లేదా మాకు ఏదైనా కావాలంటే, వారిని కలవడం లేదా వారితో మాట్లాడటం ఇప్పుడు కుదరడం లేదు. ప్రస్తుతం ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు’’ అని రామ్ సేవక్ చెప్పారు.

పాత కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇలా జరుగుతుందా? అని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఎవరికీ కూడా అంత ఆత్మాభిమానం ఉండటం లేదు’’ అని అన్నారు.

అయితే, గాంధీ కుటుంబం ఈ విషయాన్ని గుర్తించలేదా? అని ప్రశ్నించగా.. ‘‘లేదు, వారు ఈ పరిస్థితుల మధ్య పెరగలేదు. వారికెలా తెలుస్తుంది? నేను ఒకవేళ సైకిల్ తొక్కితే, నాకు సైకిల్ తొక్కేటప్పుడు కలిగే బాధ తెలుస్తుంది. ఇతర బాధను అర్థం చేసుకోగలను. నా కొడుకు కారులో ప్రయాణిస్తే, అతనికి సైకిల్ తొక్కే వారి బాధెలా తెలుస్తుంది? వారు ఆలోచించాలి. వారు సమయం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే, అది అంత తెలివైన నిర్ణయం కాదు’’ అని రామ్ సేవక్ చెప్పారు.

‘‘కానీ, నా దేహమంతా కాంగ్రెస్‌కే అంకితం. నాకున్న శక్తి అంతా, వారికోసమే’’ అని అన్నారు.

రాయబరేలీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
ఫొటో క్యాప్షన్, రాయబరేలీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

‘మీ ఎంపీలు రారు అని విపక్ష పార్టీలు కూడా అంటున్నాయి’

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాయబరేలీకి చేరుకున్న రోజు మేం కూడా వచ్చినట్లు రాయబరేలీ రసూల్పూర్ గుండాకు చెందిన గ్రామ పెద్ద ప్రదీప్ కుమార్ వర్మ చెప్పారు.

‘‘రాహుల్ గాంధీ వస్తున్నట్లు ఆయన ప్రచార మీడియా ప్రజలకు తెలుసు. కానీ, గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియదు’’ అని అన్నారు.

గాంధీ కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు రసూల్పూర్ గుండా గ్రామం నుంచి వచ్చిన రామ్ కృపాల్ చౌధరి చెప్పారు.

‘‘ప్రజలకు గాంధీ కుటుంబం కావాలి. రాబోయే ఎన్నికల్లో నేటికి కూడా, రాయబరేలీ నుంచి ప్రియాంక లేదా రాహుల్ పోటీ చేస్తే, ఆ గాలితోనే గెలుస్తారు. ఎంపీ అయిన తర్వాత సోనియా గాంధీ రాలేదు. కానీ, ప్రియాంక, రాహుల్ గాంధీ రావాల్సి ఉంది. కానీ, వారు రాలేదు. పరిస్థితులు ఏంటన్నది వేరే విషయం. కానీ, వారు రావాలి. పార్టీలు కూడా మీ ఎంపీలు రావడం లేదని అంటున్నారు’’ అని రామ్ కృపాల్ చౌదరి అన్నారు.

ఇంకా, "ఇప్పటికీ ఆలస్యం కాలేదు. రాయబరేలీ నుంచి గెలవాలంటే, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టాలి. ప్రజలు కూడా వారితో కలవాలనుకుంటున్నారు, వారిపై ఏదో తెలియని అభిమానం ఉంది" అని అన్నారు.

సోనియా గాంధీ కూడా తమ గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షలు ఇచ్చారని రసూల్పూర్ గుండాకు చెందిన కమలాకర్ వర్మ చెప్పారు.

‘‘పార్టీకి కట్టుబడి ఉన్న కార్యకర్తలను మీరు పక్కన పెడితే, మీకు కావాల్సినట్లు ఆర్గనైజేషన్ ఉండదని అన్నారు.

ఆరోగ్య కారణాల వల్ల రాయబరేలీకి సోనియా గాంధీ రాలేకపోతున్నారు. "మేడం వయసు, ఆరోగ్య సమస్యలతో రాలేకపోతున్నారన్నది వాస్తవమే. కానీ, ఎవరైనా ఒకరు రాయబరేలీ రావాల్సి ఉంద"ని కమలాకర్ వర్మ చెప్పారు. గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా రావాలి. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)