మొసలి కడుపులో 70 నాణేలు.. ఎలా తీశారంటే

ఫొటో సోర్స్, OMAHA'S HENRY DOORLY ZOO AND AQUARIUM
అమెరికాలోని ఒక జూలో ఉన్న మొసలి కడుపులోంచి 70 నాణేలను బయటకు తీశారు.
పశువైద్యులు దాని కడుపులో నాణేలు ఉన్నట్లు గుర్తించిన తరువాత ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు.
అమెరికాలోని నెబ్రాస్కాలో ఉన్న ‘ది హెన్రీ డ్రూలీ జూ అండ్ ఆక్వేరియం’లో ఉన్న థిబోడాక్స్ అనే ఈ ‘లూసిస్టిక్ అలిగేటర్’ వయసు 36 ఏళ్లు. దీని చర్మం తెల్ల రంగులో ఉండి పాక్షిక పారదర్శకంగా ఉంటుంది. కళ్లు నీలి రంగులో ఉంటాయి.
పశువైద్యులు దీని కడుపులో ఏవో లోహపు వస్తువులు ఉన్నట్లు తొలుత గుర్తించారు. అవి నాణేలని తరువాత తేల్చారు. వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించారు.
జూకి వచ్చే సందర్శకులు మొసలి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి నాణేలు విసిరినప్పుడు సిబ్బంది వాటిని తొలగించేలోగానే ఆ మొసలి వాటిని మింగేసి ఉంటుందని జూ అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, OMAHA'S HENRY DOORLY ZOO AND AQUARIUM
శస్త్రచికిత్స తరువాత మొసలి కోలుకుందని, ఇప్పుడు అది తన ఎన్‌క్లోజర్‌లోకి వచ్చేసిందని చెప్పారు.
జూలో ఉన్న నీటి మడుగుల్లోని నాణేలు విసరొద్దని సందర్శకులను అధికారులు కోరారు.
థిబోడాక్స్ సహా జూలోని 10 మొసళ్లకు వైద్యులు రక్త పరీక్షలు చేశారు. థిబోడాక్స్ కడుపులో నాణేలున్నట్లు గుర్తించిన తరువాత వెంటనే దానికి సర్జరీ చేసి తొలగించారు.
‘ట్రైనర్ సహాయంతో థిబోడాక్స్‌కు మత్తు మందు ఇచ్చాం. ఆ తరువాత శస్త్రచికిత్స చేసి దాని కడుపులోని నాణేలు తొలగించాం’ అని అసోసియేట్ వెటర్నేరియన్ క్రిస్టినా ప్లూగ్ ఒక ప్రకటనలో చెప్పారు.
‘నోట్లో ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టి పూర్తిగా తెరిచాం. కాయిన్స్ తీయడానికి వీలుగా శస్త్రచికిత్స పరికరాలు కడుపులోకి పంపించాం. దాని కంటే ముందు చిన్న కెమేరాను మొసలి కడుపులోకి పంపించాం. అది కాయిన్స్‌ను బయటకు తీయడంలో మాకు సహాయపడింది’ అని వైద్యులు చెప్పారు.
‘మొసలి కడుపులోని అన్ని నాణేలను తొలగించినట్లు ఎక్స్ రే సహాయంతో నిర్ధరించుకున్నాం. ఈ ప్రక్రియ తరువాత మొసలి పూర్తిగా కోలుకుంది’ అని జూ సిబ్బంది చెప్పారు.
మొసలి కడుపులో నాణేలు తీయడం అనేది సాధారణ విషయం కాదని, ఇది అరుదైన ప్రక్రియని జూలోని యానిమల్ డైరెక్టర్ టేలర్ యా చెప్పారు.
నాణేల వల్ల జంతువులకు ఎంత ప్రమాదమో ప్రజలు అర్థం చేసుకోవాలని, నాణేలే కాకుండా వాటికి హాని కలిగించే ఇతర పదార్థాలనూ అవి తినేసే ప్రమాదం ఉందని క్రిస్టినా అన్నారు.
సందర్శకులు నాణేలు వంటివి విసిరినప్పుడు ఎప్పటికప్పుడు సిబ్బంది వాటిని తొలగిస్తారని, కానీ సిబ్బంది వాటిని క్లీన్ చేసేలోగానే ఇలా జరిగిందని జూ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?
- చిలీ: ‘నరకం అంటే ఏంటో మాకు భూమ్మీదే కనిపిస్తోంది’ అని స్థానికులు ఎందుకు అంటున్నారు?
- పాంప్లెట్ ఫిష్: సత్పతి తీరంలో ఈ చేపలు ఎందుకు తగ్గిపోయాయి? అలా చేస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితి వస్తుందా?
- ఒక్కో కప్ప రూ.83 వేలు.. 130 కప్పలను విమానంలో తరలించేందుకు యత్నించిన మహిళ
- షార్క్ ఎటాక్: యువతి కాళ్లను కొరికేసి లాక్కెళ్లడానికి ప్రయత్నించిన సొరచేప
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














