తొమ్మిదేళ్లుగా తిండి పెడుతున్న మనిషిని చంపేసిన సింహం

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, బెసిలియో రుకాంగ, మన్సూర్ అబుబాకర్
- హోదా, బీబీసీ న్యూస్
పశ్చిమ ఆఫ్రికాలో నైజీరియా యూనివర్సిటీలోని జంతు ప్రదర్శనశాలకు చెందిన ఒక సంరక్షకుడిని ఒక సింహం చంపేసింది.
సుమారు తొమ్మిదేళ్లుగా ఆయన సంరక్షిస్తున్న సింహాల్లో ఇది ఒకటి.
ఒబాఫెమి అవోలోవో యూనివర్సిటీ(ఓఏయూ)లోని జంతు ప్రదర్శనశాలకు ఒలాబోడ్ ఒలావుయి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించే వారు.
ఆయన సింహాలకు ఆహారం పెట్టే సమయంలో ఒక సింహం ఒలావుయిపై దాడి చేసి చంపేసినట్లు యూనివర్సిటీ తన ప్రకటనలో తెలిపింది.
తన సహోద్యోగులు కూడా ఆయన్ను కాపాడలేకపోయారని, అప్పటికే ఒలావుయిని సింహం తీవ్రంగా గాయపరిచిందని యూనివర్సిటీ చెప్పింది.
ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా క్యాంపస్‌లో పుట్టిన సింహాలను ఆయనే సంరక్షిస్తున్నారు.
కానీ, దురదృవశాత్తు సింహాలకు ఆహారం పెట్టే సమయంలో ఒక మగ సింహం ఆయనపై దాడి చేసి, చంపేసినట్లు యూనివర్సిటీ అధికార ప్రతినిధి అబియోడున్ ఒలార్వాజు చెప్పారు. సింహం ఎందుకు దాడి చేసిందో తమకు తెలియదన్నారు.
నైజీరియా నైరుతి ప్రాంతంలోని ఒసున్ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీ ఉంది. సింహం దాడికి సంబంధించిన ఫోటోలను నైజీరియన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వెటర్నరీ టెక్నాలజిస్ట్ మృతికి యూనివర్సిటీ నివాళి అర్పించింది. యూనివర్సిటీ ప్రతినిధులు ఒలావుయి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
ఈ ప్రమాదం తీవ్ర విచారకరమైనదని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అడెబాయో సిమియన్ బామైర్ చెప్పారు.
ఈ దాడి మానవ తప్పిదం వల్లే జరిగిందని విద్యార్థుల సంఘం నాయకుడు అబ్బాస్ అకింరేమి ఒక నైజీరియా వార్తాపత్రికకు చెప్పారు. సింహాలకు ఆహారం పెట్టిన తర్వాత జూ సంరక్షకుడు తలుపుకు తాళం వేయడం మర్చిపోవడంతోనే ఈ దాడి జరిగిందన్నారు.
ఈ ప్రమాదం దురదృష్టశాత్తు జరిగిందని, ఒలావుయి ఎంతో మంచిగా, వినయంగా ఉండేవారని చెప్పారు. తాము జంతుప్రదర్శన శాలకు వెళ్లినప్పుడు ఆయనెంతో అప్యాయంగా పలకరించే వారని, దగ్గరుండి అన్నీ చూపించేవారని తెలిపారు.
ఈ ప్రమాదం దురదృష్టకరమని, మరిన్ని సురక్షిత చర్యలు అవసరమని ఉత్తర నైజీరియాలోని కానో జంతుప్రదర్శనశాలలో 50 ఏళ్లకు పైగా పనిచేస్తూ సింహాలకు ఆహారం పెడుతున్న అబ్బా గండు చెప్పారు.
ఈ ప్రమాదం తను సింహాలకు ఆహారం పెట్టే విషయంపై ఎలాంటి ప్రభావం చూపదని, తాను చనిపోయే వరకు వాటికి ఆహారం పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన 1971 నుంచి సింహాలకు ఆహారం పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- మూత్రాన్ని బకెట్లలో పట్టుకుని ప్రజలు దంతాలు, దుస్తులు శుభ్రం చేసుకునే రోజుల్లో దానిపై పన్ను వేసిన రోమన్ చక్రవర్తులు... అసలేమిటీ చరిత్ర?
- ఇస్లామిక్ చరిత్రలో అత్యంత తెలివైన అందాల మహరాణి జైనబ్... ఆమెను 'జాదూగర్' అని ఎందుకు అనేవారు?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
- అస్సాం: స్థానిక ముస్లింల సర్వే అంటే 'మియా ముస్లింలు' ఎందుకు భయపడుతున్నారు?
- మూడ్ బాగుండాలంటే మీరు చేయాల్సిన 6 పనులివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














