తెలంగాణ: పులులు, మనుషుల మధ్య సంఘర్షణకు పరిహారం ముగింపు పలకగలదా

టైగర్

ఫొటో సోర్స్, SANTOSH KUMAR

ఫొటో క్యాప్షన్, తాడోబా-అంధారి (మహారాష్ట్ర) టైగర్ రిజర్వ్‌లో పులులు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

పులుల వంటి అడవి జంతువుల దాడి ఘటనల్లో బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెంచింది.

తెలంగాణ అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పరిహారాన్ని పెంచుతూ G.O.Ms.No. 114 విడుదల చేసినా, అది అమలు కాలేదు.

కొత్త విధానం ప్రకారం.. వన్యప్రాణుల దాడిలో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తారు.

తీవ్రంగా గాయపడి శాశ్వత శారీరక వైకల్యానికి గురైతే చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. అలాగే, 75 వేల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లిస్తారు.

స్వల్ప గాయాలైన వారికి లక్ష రూపాయలకు మించకుండా చికిత్స ఖర్చులు, 10 వేల తక్షణ ఆర్థిక సహాయం చేస్తారు.

పశువులు మరణిస్తే స్థానిక మార్కెట్ ధర ఆధారంగా గరిష్ఠంగా 50 వేల రూపాయల వరకూ ఇస్తారు.

జింకలు,లేళ్లు, అడవి పందుల వంటి వాటి వల్ల పంటలు పాడైన సందర్భంలో... సాధారణ పంటలకైతే ఎకరానికి 7,500 రూపాయలు, ఉద్యాన పంటలకు గరిష్ఠంగా 50 వేల రూపాయలు చెల్లిస్తారు.

సంబంధిత అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాత, ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా పరిహారం చెల్లించాలని జీవోలో స్పష్టం చేశారు.

చిరుత పులి

ఫొటో సోర్స్, SANTOSH KUMAR

ఫొటో క్యాప్షన్, చిరుత పులి

వన్య ప్రాణుల దాడిలో పశువులు మరణించిన సమయంలో 48 గంటల్లోగా సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించాలి.

ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పశువులు, మేకలు, గొర్రెల లాంటి వాటికి ఈ పరిహారం వర్తించదు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఆ పైన ర్యాంక్ అధికారి దానిని నిర్ధరించాల్సి ఉంటుంది.

వన్యప్రాణుల దాడిలో మనుషులు చనిపోతే 48 గంటల్లోగా ఘటనా స్థలంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, లేదా ఎస్సై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్షన్ జరగాలి. అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్థాయి అధికారి పోస్టుమార్టం సర్టిఫికెట్ ఇవ్వాలి.

అయితే, చనిపోయిన వ్యక్తి అటవీ జంతువులను దాడికి ప్రేరేపించి ఉండకూడదు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందుతుంది.

వ్యవసాయ, హార్టికల్చర్ పంటల విషయంలో జరిగిన నష్టాన్ని రెండు రోజుల్లోపు ఫోటోలు, పట్టాదారు పాస్ పుస్తకంతో సంబంధిత ఎఫ్ఆర్వోకు అర్జీ పెట్టుకోవాలి.

ఆక్రమిత అటవీ భూముల్లో వేసిన పంటలకు ఎలాంటి పరిహారం ఇవ్వరు.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేస్తారు.

టైగర్

ఫొటో సోర్స్, SANTOSH KUMAR

ఫొటో క్యాప్షన్, తాడోబా-అంధారి (మహారాష్ట్ర) టైగర్ రిజర్వ్‌లో పులులు

పులులు, మనుషుల మధ్య సంఘర్షణ

ఇటీవలి కాలంలో జనావాసాల్లో వన్యప్రాణులు రావడం, రక్షిత అటవీ ప్రాంతాల్లో మనుషుల కార్యకలాపాలు పెరిగాయి.

జనావాసాల్లో కోతుల సంచారం సాధారణమైపోయింది.

మనుషుల మధ్యకు పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు వస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి.

ఇలా, జనం మధ్యకు అటవీ జంతువులు వచ్చిన పలు సందర్భాల్లో స్థానికంగా నివసించే ప్రజలు, అటు ఇతర జీవాలు ప్రాణాలను కోల్పోవడమో, గాయపడడమో జరుగుతోంది.

అటవీశాఖ రికార్డుల ప్రకారం, తెలంగాణలో పులి, ఎలుగుబంటి, చిరుతపులి, అడవి పందుల వంటి జంతువులు మనుషులపై దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి.

దీంతో అడవి జంతువులపై మనుషుల ప్రతిదాడులు, ఒక్కో సందర్భాలలో వేట కూాడా ఉంటున్నాయి.

ముఖ్యంగా, అంతరించే పోయే జాబితాలో ఉన్న పులులకు ఇది ప్రమాదకరంగా మారుతోంది.

టైగర్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఇటీవల మహారాష్ట్రలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన పులి

2019- 2021(జూన్ వరకు) మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 108 మంది పులుల దాడిలో చనిపోగా, అందులో తెలంగాణలో ఇద్దరు, మహారాష్ట్రలో 56 మంది ఉన్నారు.

ఈ మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మరణాలు రికార్డ్ కాలేదు.

మరోవైపు గత మూడేళ్ల వ్యవధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

టైగర్

ఫొటో సోర్స్, SANTOSH KUMAR

ఫొటో క్యాప్షన్, తాడోబా టైగర్ రిజర్వ్‌లో టైగర్స్

మరోవైపు 2012-2022 మధ్య పదేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో మొత్తం 1,062 పులులు చనిపోయాయి.

ఇందులో 193 పులులు వేటగాళ్ల చేతిలో, మరో 44 పులులు అసహజ పరిస్థితుల్లో మరణించాయి.

మరో 95 పులుల చావుకు కారణాలు ఇప్పటికీ తెలియలేదు.

ఈ రిపోర్ట్‌ను గమనిస్తే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పులి మరణాలు జరిగినట్టుగా స్పష్టం అవుతోంది.

ఈ మూడు నెలల్లో మొత్తం 348 పులులు చనిపోయాయి. కేవలం 2021 లోనే తెలంగాణలోని ములుగు, కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో 4 పులులు మరణించాయి.

‘టైగర్ మరణాల్లో బయటకు రానివే ఎక్కువ’ అని హైదరాబాద్ కు చెందిన స్వచ్చంద సంస్థ ‘ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ’ అధ్యక్షుడు మీర్జా కరీం బేగ్ అన్నారు.

ఆదివాసీలు

ఫొటో సోర్స్, Praveen shubham

ఫొటో క్యాప్షన్, గూడెం సమీపంలో అడవిలో ఆదివాసీలు

‘ప్రతి దాడులు’

పులుల దాడుల్లో నష్టం జరిగినప్పుడు ప్రజలు వాటి మీద తిరిగి దాడులు చేస్తున్నారని అటవీ అధికారులు చెబుతున్నారు.

‘‘పులి దాడిలో తమ వారిని, పశువులను కోల్పోయిన వారు పులికి వేరే రకంగా హాని చేసే పరిస్థితులు ఉంటాయి. వేటాడిన పులి సాధారణంగా ఆ తర్వాతి రోజు కూడా మిగిలిన కళేబరం దగ్గరికి వస్తుందని తెలిసి దానిపై పురుగుల మందు చల్లుతారు. అది తిన్న పులి మరణిస్తుంది.

ఇలాంటివి చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అటవీశాఖ నష్టపరిహారం రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారి సిరిపురం మాధవరావు బీబీసీతో అన్నారు.

అయితే, తమ పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఇస్తున్న నష్ట పరిహారంతో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువగా ఉన్న నేపథ్యంలో అడవి జంతువులపై ప్రతి దాడులు లేకుండా చూడడం సవాల్‌గా మారుతోంది.

ప్రస్తుతం మహారాష్ట్రలో వన్యప్రాణుల దాడిలో మరణించిన కుటుంబాల సభ్యులకు రూ.20 లక్షలు, శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.5 లక్షలు, పశువులను కోల్పోయిన వారికి స్థానిక మార్కెట్ రేటు ప్రకారం గరిష్ఠంగా 70 వేల రూపాయల పరిహారం అందుతోంది.

ఆదివాసీలు

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM

ఫొటో క్యాప్షన్, అటవీ ప్రాంతంలోని గూడెంలో ఆదివాసీ పశువుల కాపరి

‘పరిహారం ఆలస్యం కావడం సమస్యగా మారుతోంది’

మరోవైపు ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు చేరడంలో ఏళ్ల తరబడి జాప్యం అవుతోంది.

సరైన సమయంలో ఎక్స్‌గ్రేషియా అందక పోవడం స్థానికులు, వన్యప్రాణుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటకపోవడానికి ఒక ప్రధాన కారణం అవుతోందని వన్యప్రాణి సంరక్షణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

‘అటవీ ప్రాంతంలోకి మనుషుల ఎంట్రీని పూర్తిగా నివారించాలి. వంట చెరకు కోసం వెళ్లే వారికి ఉచిత వంట గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. పరిహారం అందించే విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి లో ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ఇద్దరు బాధితుల పరిహారం విషయంలో గతంలో పనిచేశాం. ఈ పరిస్థితి మారాలి’ అని ఎన్జీవో ప్రతినిధి మీర్జా కరీం బేగ్ అన్నారు.

టైగర్

ఫొటో సోర్స్, PRAVEEN SHUBHAM

ఫొటో క్యాప్షన్, తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్

'తీవ్రంగా గాయపడ్డ వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం అటవీ శాఖకు బిల్లులు పెట్టాలి. ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఫారెస్ట్ అధికారులు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా కాకుండా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కు ఏర్పాట్లు వారే స్వయంగా చేయాలి’ అని మీర్జా బేగ్ అభిప్రాయ పడ్డారు.

2020 నవంబర్ నెలలో కుమ్రంభీము ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివార్లలో చేనులో పత్తి ఏరుతున్న సమయంలో పసుల నిర్మల (15) అనే ఆదివాసీ బాలిక పులి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. పరిహారం త్వరగానే అందినప్పటికీ ఇతర బెనిఫిట్స్ అందించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి.

‘నిర్మల కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. ఆ ఇంటిని కట్టి ఇవ్వమని అధికారులు నన్ను కోరారు. అయితే అప్పటికే గ్రామంలో వేసిన రోడ్లు, ఇతర అభివృద్ది కార్యక్రమాల బిల్లులు రాలేదు. ఆ ఇల్లు కడితే బిల్లు ఏ శాఖ ఇస్తుందో అన్న క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇల్లు నిర్మించలేదు’ అని కొండపల్లి సర్పంచ్ ‘సంగు’ బీబీసీతో అన్నారు.

అడవి పందుల సంఖ్య పెరిగి మా పంటలను పాడుచేస్తున్నాయి. మా ప్రాంతంలో ఎలుగుబంట్ల దాడుల భయం ఉందని సంగు చెప్పారు.

టైగర్

ఫొటో సోర్స్, Praveen shubham

ఫొటో క్యాప్షన్, అడవిని ఆనుకుని ఉన్న చేనులో పనిచేస్తున్న ఆదివాసీ మహిళ

పరిహారం అందివ్వడంలో ఆలస్యాన్ని నివారిస్తే వన్యప్రాణులు, స్థానికుల మధ్య సహజీవన ప్రమాణాలు పెరుగుతాయి.

ఈ విషయంలో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ చూపితే, ఈ దిశగా మంచి ఫలితాలు వస్తాయని మాధవ రావ్ అభిప్రాయపడ్డారు.

మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు జిల్లాల పరిధిలో పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువుల దాడుల తీవ్రత ఉంది.

‘ప్రతీకార చర్యలు నివారించేందుకే బాధితులకు సంతృప్తికరమైన ఎక్స్‌గ్రేషియా మహారాష్ట్రలో ఉంది. ప్రమాదకర గాయాలైన వారికి, శాశ్వత వైకల్యం పొందిన వారికి ఇచ్చే నష్టపరిహారం పెంచాలి’ అని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని అటవీశాఖ అధికారి బీబీసీతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)