నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!

మల విసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిసార్లు మలం నీళ్ళలో ఎందుకు తేలుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు నాగరాజన్ కన్నన్ ప్రయత్నించారు.
    • రచయిత, రిచర్డ్ గ్రే
    • హోదా, ఎడిటర్, బీబీసీ ఫ్యూచర్

మీ మలం మునుగుతుందా, తేలుతుందా? మీ మలం నీటిలో తేలడం ఎప్పుడైనా చూశారా?

ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తులను ఈ ప్రశ్న అడగడం చాలా ఇబ్బందికరం. అది ఈమెయిల్లో అయినా సరే. కానీ ఈ ప్రశ్న‌కు సమాధానం తెలుసుకోవాలనే ఆలోచన అమెరికాలో మిన్నెసోటాలోని రోచెస్టర్‌లోగల మయో క్లినిక్‌లో స్టెమ్ సెల్, కేన్సర్ బయాలజీ లాబొరేటరీ డైరక్టర్ నాగరాజన్ కన్నన్‌ను ఎంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వైపు మళ్ళించింది.

రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి సెల్యూలార్, మాలిక్యూర్ మెకానిజంపై రోజులో ఎక్కువ భాగం గడిపే నాగరాజన్ ఖాళీ సమయంలో మాత్రం ఓ సమస్యతో కుస్తీ పడుతుంటారు.

కొన్నిసార్లు మలం నీళ్ళలో ఎందుకు తేలుతుందన్నదే ఆ సమస్య.

దీనికి సమాధానం తెలుసుకొనే ప్రయత్నంలో నాగరాజన్- మన శరీరంలోపల ఏం జరుగుతుంది, అక్కడ జీవించే సూక్ష్మజీవులకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోగలిగారు.

మొదట్లో మలం నీళ్ళలో తేలడానికి వాటిలోని కొవ్వు కణాలు కారణమని భావించేవారు. అయితే 1970 ప్రాంతంలో మిన్నెసోటా యూనివర్సిటీలో కొంత మంది గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వరుసగా కొన్ని ప్రయోగాలు చేశారు.

39 మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేసి, వారిలో కొందరి మలాన్ని పరీక్షించారు. మలం తేలడానికి కొవ్వు కారణం కాదని, వాయువులని నిర్థరించారు.

మరింత కచ్చితంగా చెప్పాలంటే మలంలోని వాయువు పరిమాణాన్ని బట్టి అవి తేలనూ వచ్చు, లేదా ఇటుకరాయిలా మునిగిపోచ్చు.

మలంలోని గ్యాస్ పరిమాణాన్ని కుదించినట్టయితే మునిగిపోతుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ తేడాకు కారణం అపరిమితమైన మీథేన్ వాయువేనని తేల్చారు. మరో మాటలో చెప్పాలంటే అధిక అపానవాయువులన్నమాట.

సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నాగరాజన్ దృష్టి కేంద్రీకరించారు.

మన ఆరోగ్యానికి సంబంధించి ఊబకాయం నుంచి హృద్రోగాల వరకు అనేక అంశాల్లో మైక్రోబయోటా పోషిస్తున్న అపరిమితమైన పాత్రను వైద్యవిజ్ఞాన శాస్త్రం ఇటీవల సంవత్సరాల్లో కనుగొంటూ వచ్చింది.

పేగులలో పోగుపడిన అనేక లక్షల సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, ఫంగై, ఇతర సూక్ష్మజీవులు మన మలం తేలడానికి కారణం కావచ్చనే సందేహం ఆయనకు కలిగింది.

 మల విసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనం తినే ఆహారం, ధూమపానం, ఒత్తిడి, విస్తృతంగా ఔషధాల వినియోగం తదితర అంశాలు పేగుల్లో బ్యాక్టీరియాలో మార్పుకు కారణమవుతాయి.

ఎలుకల మలంపై పరిశోధనలో ఏం తేలింది?

‘‘మలం తేలడానికి ఎక్కువగా కనిపించే కారణం, మనం తిన్న ఆహారంలోని కణాలు పెద్ద ఎత్తున బ్యాక్టీరియాగా మారడమే’’ అని నాగరాజన్ చెప్పారు.

ఈ సిద్ధాంతాన్ని పరీక్షించడానికి నాగరాజన్, ఆయన సహచరులు మయో క్లినిక్‌లో ఎలుకల వ్యర్థాలను పరిశీలించారు. ఎటువంటి సూక్ష్మజీవులు లేని వ్యర్థాలను వదిలిన ఎలుకల పేగులలో సూక్ష్మజీవులు లేవు.

ఆయన బృందం కొన్ని ఎలుకలలో సూక్ష్మజీవులను ప్రవేశపెట్టిన తరువాత వాటి మలం తేలియాడటం కనిపించింది. దీంతో మలం తేలడానికి కారణమేమిటనే విషయం వారికి అర్థమైంది.

సూక్ష్మజీవులు లేని ఎలుకల మలం సాంద్రత ఎక్కువగా ఉండి మునిగిపోయేవని నాగరాజన్ చెప్పారు. దీంతో ఆయన బృందం మలం మునిగే ఎలుకలకు, మలం తేలే ఎలుకలలోని సూక్ష్మజీవులను ఇంజెక్ట్ చేశారు. దీని తరువాత ఈ ఎలుకల మలం కూడా తేలడం మొదలైంది. అంటే అవి తమ గట్ బ్యాక్టీరియాను వృద్ధి చేసుకున్నాయని పరిశోధకులు తెలుసుకున్నారు.

తరువాత మనుషుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ఎలుకల్లోకి ప్రవేశపెట్టిన తరువాత కూడా వాటి మలం తేలడం మొదలైంది. అంటే బ్యాక్టీరియా దాత ఎవరనేదానితో సంబంధం లేకుండా మలం తేలుతుందని నాగరాజన్ చెప్పారు.

దీని తరువాత ఆయన బృందం ఎలుకల నుంచి సేకరించిన మలంలోని బ్యాక్టీరియాపై విస్తృతమైన జన్యు విశ్లేషణలు చేసి వాయువుల ఉత్పత్తికి కారణమయ్యే పది రకాల బ్యాక్టీరియాలను కనుగొంది.

వీటిల్లో ఎక్కువగా ఆధిపత్యం చలాయిస్తున్నది వాయువులను విడుదల చేయడంలో సిద్ధహస్తురాలైన బాక్టీరాయిడ్స్ ఓవాటస్. ఇదే మానవ మలం నీళ్లలో తేలడానికి ఎక్కువగా కారణమవుతోంది.

మలంపై పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలుకలపై చేసిన పరిశోధనలను మనుషులకు అన్వయించేందుకు ఇంకా అధ్యయనం అవసరమని నాగరాజన్ చెప్పారు.

‘యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మలం మునుగుతోంది’

ఎలుకలపై చేసిన పరిశోధనలను, మనుషులకు అన్వయించేందుకు ఇంకా అధ్యయనం, పరిశోధనలు జరగాల్సి ఉందని, మానవుల మలం తేలడానికి, మన పేగులలో తిష్టవేసిన వివిధరకాల బ్యాక్టీరియాలలో వస్తున్న మార్పులకు సూచిక అని నాగరాజన్ నమ్ముతున్నారు.

ఇక యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మలం తేలడానికి బదులు మునిగిపోతోందని ఆయన చెప్పారు. కానీ ఎవరూ దీనిని ఇప్పటిదాకా అధ్యయనం చేసినట్టు లేరని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి అంశాలపై అధ్యయనం చేయడానికి నిధులు సమకూర్చడం అంత తేలిక కాదంటారు నాగరాజన్.

మనం తినే ఆహారం, ధూమపానం, ఒత్తిడి, విస్తృతంగా ఔషధాల వినియోగం తదితర అంశాలు మన పేగులలోని బ్యాక్టీరియాలో మార్పుకు కారణమవుతాయి.

మలంలో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా చేరడానికి కారణాలను అన్వేషించడంపై నాగరాజన్ ఆసక్తిగా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, నీళ్లపై తేలే మలం చెప్పే ఆరోగ్య రహస్యాలేంటి ?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)