జేఎన్.1: ‘చలికాలంలో కరోనా, ఇతర వైరస్‌లు పెరుగుతాయి’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఏమని హెచ్చరించింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫిలిప్పా రాక్సీ
- హోదా, హెల్త్ రిపోర్టర్
కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ జాతికి చెందిన ఒక సబ్ వేరియంట్‌కు ఉన్న వేగంగా వ్యాప్తి చెందే గుణం కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దాన్ని ‘‘ఆసక్తికర వేరియంట్’’గా అభివర్ణించింది.
భారత్, చైనా, యూకే, అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో జేఎన్.1 అనే కరోనా సబ్ వేరియంట్‌ను గుర్తించారు.
ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతానికి ప్రజలకు పెద్దగా ముప్పు ఉండదని, దీన్నుంచి రక్షించుకోవడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఈ చలికాంలో కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తరార్థగోళంలో ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ వంటి శ్వాసకోశ వైరస్‌లతో పాటు న్యుమోనియా కేసుల పెరుగుదల ఉంది.
కోవిడ్‌కు కారణమయ్యే వైరస్ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది కొత్త వేరియంట్ల పుట్టుకకు దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒమిక్రాన్ వేరియంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం పాటు విస్తృతంగా వ్యాపించింది.
జేఎన్.1తో సహా ఒమిక్రాన్‌తో సంబంధమున్న ఇతర ఆసక్తికర వేరియంట్లను డబ్ల్యూహెచ్‌వో ట్రాక్ చేస్తోంది. నిజానికి ఇతర వేరియంట్లు పెద్ద ఆందోళనకరంగా లేవు.
కానీ, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జేఎన్.1 వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, జేఎన్.1 ఇప్పుడు అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్.
ప్రస్తుతం ల్యాబ్‌లో విశ్లేషించిన కోవిడ్ పాజిటివ్ పరీక్షల్లో 7 శాతం జేఎన్.1 కేసులు ఉన్నట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పింది.
జేఎన్.1తో పాటు ఇతర వేరియంట్లపై అందుబాటులో ఉన్న మొత్తం డేటాను పర్యవేక్షించడాన్ని కొనసాగిస్తామని ఏజెన్సీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చలికాలం ప్రభావం
అన్ని రీజియన్లలో జేఎన్.1 వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇది ఉద్భవించిన బీఏ.2.86 వేరియంట్‌తో పోల్చితే జేఎన్.1 వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో అదనపు మ్యుటేషన్ ఉండటం వల్ల ఇలా జరుగుతుండొచ్చు.
‘‘ఈ వేరియంట్ వల్ల సార్స్ కోవ్-2 (కరోనా వైరస్) కేసుల్లో పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. ముఖ్యంగా చలికాలాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతాయని అంచనా’’ అని డబ్ల్యూహెచ్‌వో రిస్క్ అసెస్‌మెంట్ తెలిపింది.
జేఎన్.1కు వ్యాక్సీన్ల నుంచి ఎంత రక్షణ పొందవచ్చనే అంశంపై ఇంకా పరిమిత అధారాలే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
మునుపటి వేరియంట్ల కంటే ఈ వేరియంట్‌తో ప్రజలు అధిక అనారోగ్యానికి గురైనట్లు చెప్పే నివేదికలు లేవు.
ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావంపై ఇంకా చాలా అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్‌ఫెక్షన్లు, తీవ్ర రోగాల నివారణకు డబ్ల్యూహెచ్‌వో చేసిన సూచనలు
- రద్దీగా, మూసినట్లు ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించండి
- దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కవర్ చేయండి
- తరచుగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి
- కోవిడ్, ఫ్లూ వ్యాక్సినేషన్లు తీసుకోవాలి
- అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి
- ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధరణ పరీక్షలు చేసుకోవాలి
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














