భారత్ X దక్షిణాఫ్రికా: 20 బంతులు కూడా ఆడలేకపోయిన 8 మంది టీమిండియా బ్యాటర్లు.. పట్టుమని 15 నిమిషాలు క్రీజ్‌లో నిలవలేదు

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత్ తొలి టెస్టు సిరీస్ నెగ్గే అవకాశం పోయింది.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇక, రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భారత్ గెలిచే అవకాశం లేదు.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలింగ్‌కు ఎదురు నిలవలేకపోయింది.
రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.
టెస్టు ఫార్మాట్‌లో బ్యాటర్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోతారు. వందలకొద్ది బంతుల్ని ఎదుర్కొంటారు.
కానీ, గురువారం నాటి ఆటలో భారత ఆటగాళ్లలో ఎనిమిది మంది కనీసం 20 బంతుల్ని కూడా ఎదుర్కోలేకపోయారు. అరగంట కూడా క్రీజులో నిలవలేదు.
ఆరుగురు ఆటగాళ్లు అయితే 10 బంతుల్లోపే అవుటయ్యారు. దాదాపు పది నిమిషాల్లోనే వీళ్ల ఆట ముగిసింది.
భారత బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోవడం, మన బ్యాటర్లు ఆడలేకపోయిన పిచ్ మీద దక్షిణాఫ్రికా తేలిగ్గా ఆడటం, భారత పేసర్లు తేలిపోవడం వెరసి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముగిసిన టెస్టుల్లో అత్యంత తక్కువ సమయంలో (షార్టెస్ట్ కంప్లీటెడ్ టెస్ట్) పూర్తయిన టెస్టుగా ఈ మ్యాచ్ నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీ మినహా
సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బోల్తా పడింది.
గురువారం నాటి మూడో రోజు ఆటలో ప్రత్యర్థికి పూర్తిగా లొంగిపోయింది.
భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ప్రతిఘటించలేకపోయారు.
సఫారీ బౌలర్ల బౌన్స్‌ను ఎదుర్కొంటూ కోహ్లీ ఒక్కడే 82 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 76 పరుగులు చేశాడు.
శుభ్‌మన్ గిల్ (37 బంతుల్లో 26; 6 ఫోర్లు) తక్కువ పరుగులే చేశాడు.
మిగతా బౌలర్లలంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులే చేయగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
అంతకుముందు ఇదే పిచ్ మీద దక్షిణాఫ్రికా బ్యాటర్లు సాధికారికంగా ఆడారు.
ఓవర్‌నైట్ స్కోరు 256/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా గురువారం చివరి 5 వికెట్లతో 42.4 ఓవర్ల పాటు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది.
తొలి సెషన్ మొత్తం దక్షిణాఫ్రికా ఆటనే సాగింది. ఉదయం సెషన్లో ఏకంగా 136 పరుగులు చేసింది.
మూడో రోజు ఆటలో సఫారీలు చివరి 5 వికెట్ల సహాయంతో 152 పరుగులు చేశారు.
మరోవైపు, భారత రెండో ఇన్నింగ్స్ 34.1 ఓవర్లకే ముగిసింది. పది మంది కలిసి 131 పరుగులే చేయగలిగారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 140తో అతను ఇన్నింగ్స్ కొనసాగించాడు.
మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మార్కో జెన్సన్ 147 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 84 పరుగులతో నిలిచాడు.
కోయిట్జి (19) రాణించాడు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు దక్కించుకున్నాడు.
మొహమ్మద్ సిరాజ్ 2, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలా ఓ వికెట్ సాధించారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. దీంతో వారికి 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 67.4 ఓవర్లలో 245 పరుగులే చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్నింగ్స్ ఎలా కూలిందంటే
163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన భారత్‌ను సఫారీ పేసర్లు కట్టడి చేశారు.
భారత తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లతో కూల్చిన కగిసో రబడ, రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్ తీసి దెబ్బకొట్టాడు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున టెస్టులో అరంగేట్రం చేసిన నండ్రీ బర్గర్ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
యశస్వీ జైస్వాల్ (5)తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ (4), రవిచంద్రన్ అశ్విన్ (0), సిరాజ్ (4)లను బర్గర్ అవుట్ చేశాడు.
యశస్వీ అవుటయ్యాక గిల్, కోహ్లీ జతయ్యారు.
వీరిద్దరూ బౌండరీలు బాదడంతో పరుగులు వేగంగా వచ్చాయి. కానీ, జెన్సెన్ బౌలింగ్‌లో గిల్ అవుటవ్వడంతో భారత్ 52 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయింది.
కోహ్లీ పోరాడుతుండగా మరోవైపు నుంచి శ్రేయస్ అయ్యర్ (6), రాహుల్, అశ్విన్, శార్ధుల్ వికెట్లను వెంటవెంటనే పడగొడుతూ దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పట్టు బిగించింది.
అదే జోరులో మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










