దక్షిణాఫ్రికా టూర్‌కు అవకాశం దక్కని అక్షర్ పటేల్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు పంపిన సందేశం ఏమిటి?

అక్షర్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్షర్ పటేల్ (ఫైల్ ఫోటో)

‘స్పిన్నర్లే విన్నర్లు’ అనే మాటను మరోసారి రుజువు చేస్తూ ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కలిసి భారత్‌కు విజయాన్ని సాధించి పెట్టారు.

ఈ గెలుపుతో, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది.

శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు.

నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి, ట్రావిస్ హెడ్‌ది సహా మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

త్వరలో జరుగనున్న దక్షిణాఫ్రికా పర్యటనకు నవంబరు 30న ప్రకటించిన భారత టీ20 జట్టులో అక్షర్ పటేల్‌కు చోటు దక్కలేదు. అయితే మరుసటి రోజే అంటే డిసెంబరు 1న తన ‘మ్యాచ్ విన్నింగ్’ బౌలింగ్‌తో అతడు సత్తా చాటాడు.

అక్షర్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాయంతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పుడు తన బౌలింగ్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించానని అక్షర్ పటేల్ చెప్పాడు.

ఒత్తిడిలో అక్షర్‌ పటేల్ బౌలింగ్ అద్భుతం: సూర్య

ఒత్తిడిలో అక్షర్‌ పటేల్ బౌలింగ్ చేయడాన్ని తాను ఇష్టపడతాను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు. ఒత్తిడిలో అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడంటూ మెచ్చుకున్నాడు.

గాయంతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పుడు తన బౌలింగ్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించానని మ్యాచ్ తర్వాత అక్షర్ పటేల్ చెప్పాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాక అతను మాట్లాడుతూ- ‘‘నేనింటి దగ్గర ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. ఈ రోజు నాదైన రోజు. నా బలమేమిటో దానికే కట్టుబడి ఉండాలని బలంగా నమ్మాను. ఈ పొట్టి ఫార్మాట్‌లో మానసికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. నా బౌలింగ్‌కు వైవిధ్యాన్ని జోడించడానికి ప్రయత్నించాను’’ అని తెలిపాడు.

అక్షర్ పటేల్ ప్రస్తుత భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో ఇప్పటిదాకా మొత్తం ఐదు వికెట్లు తీశాడు. విశాఖపట్నంలో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో 32 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. తిరువనంతపురంలో రెండో టీ 20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. గువాహటిలో మూడో టీ20లో 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.

రింకూ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రింకూ సింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేశాడు.

ఆసీస్‌పై ఆది నుంచి భారత్ ఆధిపత్యం

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచే భారత్ తన ఆధిపత్యాన్ని చూపించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో మ్యాచ్‌తోనే సిరీస్‌ను పట్టేయాలనుకున్నా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి అడ్డుగోడలా నిలబడి మూడో మ్యాచ్‌ను ఇండియా నుంచి లాగేసుకున్నాడు.

రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇందుకు బదులుగా ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది.

తొలుత రవి బిష్ణోయ్ ప్రమాదకరమైన జోస్ ఫిలిప్ప్‌ను ఔట్ చేసి, ఇండియాను పోటీలోకి తెచ్చాడు. తరువాత అక్షర్ పటేల్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ హీరో ట్రావిస్‌హెడ్‌ వికెట్ తీశాడు.

అప్పటికే చాహర్ ఓవర్‌లో 22 పరుగులు (4, 4, 0, 6, 4, 4) కొట్టిన ట్రావిస్ హెడ్ మంచి ఊపు మీదున్నాడు.

కేవలం 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను అతడు ఆడిన 16వ బంతికి అక్షర్ బోల్తా కొట్టించాడు. తరువాత ఆరోన్ హార్డే, బెన్ మెక్ డెర్మాట్ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

చివరి ఐదు ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో మాథ్యూ షార్ట్, కెప్టెన్ మాథ్యూ వేడ్ ఆసీస్‌ను గట్టెక్కించేలా కనిపించినా, భారత బౌలర్లు వారి ఆటలు సాగనివ్వలేదు.

ఆసీస్ చివరి రెండు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి వచ్చింది. 19వ ఓవర్‌లో ముకేశ్‌ కుమార్ కేవలం తొమ్మిది పరుగులే ఇవ్వడంతో భారత విజయం దాదాపు ఖాయమైపోయింది.

అటు రింకూ సింగ్, ఇటు జితేశ్ శర్మ

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోరు చేస్తుందని భావించినప్పటికీ 174 పరుగులకే పరిమితమైంది. ఆరంభం అదిరినప్పటికీ చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు.

తొలుత యశస్వి జైస్వాల్ 28 బంతుల్లో 37 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఒక దశలో ఇండియా 5.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. అయితే 13 పరుగుల తేడాతో వరుసగా మూడు వికెట్లు పడడంతో కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్(8), సూర్యకుమార్ యాదవ్(1) విఫలమయ్యారు.

దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను రింకూ సింగ్‌ తీసుకున్నాడు.

రుతురాజ్‌తో కలిసి అతడు 48 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు.

తరువాత రింకూతో జత కలిసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మ వచ్చీరాగానే బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 19 బంతుల్లో ఒక ఫోరు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.

అయితే చివర్లో ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల భారత స్కోరు మందగించింది.

భారత్ విజయంపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందిస్తూ ,‘‘టాస్ ఓడటం తప్ప మ్యాచ్‌లో మిగిలినదంతా సాఫీగా సాగింది. మా కుర్రాళ్ళు బాగా ఆడారు. కుర్రాళ్లు భయం లేకుండా ఆడాలన్నదే మా ప్రణాళిక. చివరి ఓవర్లలో యార్కర్లు వేసి, ఏం జరుగుతుందో చూడాలనుకున్నాం’’ అని వ్యాఖ్యానించాడు.

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తాము తడబడ్డామని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)