ట్రావిస్ హెడ్: భారత్ ప్రపంచ కప్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ ఆస్ట్రేలియన్ కథేంటి?

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ కప్ ఫైనల్లో 120 బంతుల్లో137 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్‌లు ఉన్నాయి.
    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ట్రావిస్‌ హెడ్- భారత క్రికెట్ అభిమానులకు రికీ పాంటింగ్‌లా గుర్తుండిపోయే ఆస్ట్రేలియా ఆటగాడు.

ఎదురులేని తన బ్యాటింగ్‌తో ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ట్రావిస్ హెడ్.

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుది పోరులో 120 బంతుల్లో అతడు 137 పరుగులు చేయగా, అందులో 15 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఫైనల్లో అతడే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’.

ప్రపంచ కప్‌ ఫైనల్లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరువాత సెంచరీ చేసిన మూడో ఆస్ట్రేలియన్‌గా ట్రావిస్ హెడ్ రికార్డుల్లోకెక్కాడు.

అతడు వేలికి గాయం కావడంతో, ఈ ప్రపంచ కప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చి, న్యూజీలాండ్‌‌పై సెంచరీతో సత్తా చాటాడు.

కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయంలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. చేజింగ్‌లో 48 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండు వికెట్లు కూడా తీసిన అతడే, సెమీ ఫైనల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ ఆడిన ఆటను గుర్తుకు తెస్తూ ట్రావిస్ హెడ్ 2023 ఫైనల్లో చెలరేగిపోయాడు. అందులో పాంటింగ్ 140 పరుగులు చేశాడు.

ఆదివారం ఇండియా నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లను మొదట్లో భారత పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ కుదురుకోనీయలేదు. 47 పరుగులకే మూడు వికెట్లు తీశారు.

కానీ, అక్కడి నుంచి హెడ్, మార్నస్ లబుషేన్ 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి లక్ష్యం దిశగా సాగిపోయారు. మరో రెండు పరుగుల దూరంలో ఆస్ట్రేలియా విజయం ఉందనగా హెడ్ అవుటయ్యాడు.

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాయం వల్ల ఈ ప్రపంచ కప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు ట్రావిస్ హెడ్ దూరమయ్యాడు.

మైక్ హస్సీ స్థానంలోకి ట్రావిస్ హెడ్

ట్రావిస్ హెడ్ 1993 డిసెంబరు 29న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జన్మించాడు.

ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదట్లో ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లలో మిడిలార్డర్‌లో ఆడుతుండేవాడు. రైట్‌హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కూడా. జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు కూడా హెడ్ మిడిలార్డర్ బ్యాటరే.

మైకేల్ హస్సీ(మైక్ హస్సీ) రిటైర్ అయ్యాక ఆ స్థానం ఎవరితో భర్తీ చేయాలా అని ఆస్ట్రేలియా క్రికెట్ తర్జనభర్జన పడింది. అనేక మందిని ఆ స్థానంలో పరీక్షించింది. కానీ వారెవరూ ఎక్కువ కాలం నిలవలేకపోయారు. అయితే ట్రావిస్ హెడ్ ఈ లోటు భర్తీ చేసేవాడిలా కనిపించాడు.

ఇండియాతో జరిగిన టీ-20 సిరీస్‌కు హెడ్‌ను ఎంపిక చేశారు. నిజానికి హెడ్‌ను 2016 టీ20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేయలేదు కానీ, అతడు సెలెక్టర్ల కళ్ళలోనే ఉన్నాడు.

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు హెడ్ కీలకంగా మారాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాట్‌తో మెరిశాడు. అయితే 2017 మొదట్లో మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా ఓపెనర్ అవతారమెత్తాడు. తరువాత 2018 చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నా అతను ఓపెనర్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడమే కాకుండా మరో భాగస్వామి డేవిడ్ వార్నర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే, ఈ ప్రయోగం తరువాత కూడా హెడ్ కొన్నాళ్ళపాటు మిడిలార్డర్‌లోనే ఆడాడు. అయితే కొంత కాలానికి 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ల్లో హెడ్ వెనుకబడ్డాడు. దీంతో అతనిని 2019 ప్రపంచ కప్‌కు సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అప్పట్లో షాన్‌మార్ష్, మార్కస్ స్టోయినిస్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో అతన్నిపక్కనపెట్టేశారు.

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ఉన్న ట్రావిస్ ఓపెనర్‌గా రావడం 2017లో మొదలైంది.

భారత్‌పై టెస్ట్ చాంపియన్‌షిప్ గెలుపులోనూ...

2021-23 యాషెస్ సిరీస్‌లో ట్రావిస్ హెడ్ 357 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

భారత్‌పై ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ గెలవడంలోనూ హెడ్ కీలక పాత్ర పోషించాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో 163 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా కూడా ఎంపికయ్యాడు.

మళ్లీ ఇలాంటి అద్భుత ప్రదర్శనను రిపీట్ చేస్తూ, ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

మొత్తం మీద వన్డేలలో 63 మ్యాచ్‌లలో 60 ఇన్నింగ్స్‌లు ఆడిన ట్రావిస్ హెడ్ 2,256 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇతని అత్యధిక స్కోరు 152 పరుగులు.

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది: ట్రావిస్ హెడ్

ఆదివారం ఫైనల్ ముగిశాక ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, “ఇది అద్భుతమైన రోజు. ఇందులో నేను భాగమైనందుకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’’ అని చెప్పాడు.

‘‘నేను ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూడటం కంటే, ఆడటమే మంచిదని అనుకున్నాను (వేలికి గాయం కారణంగా ట్రావిస్ హెడ్ తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత జట్టులోకి వచ్చాడు). ఇన్నింగ్స్‌లో నేను కొంత ఆందోళనకు గురయ్యాను. మార్నస్ లబుషేన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి, ఒత్తిడిని తగ్గించాడు. జట్టుకు ముందు వరుసలో ఉండి, విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది” అని అతడు తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)