మేకలు అడవుల్లో మంటలు చెలరేగకుండా చూసుకుంటాయా... ఎలా?

ఫొటో సోర్స్, EMPICS
- రచయిత, లుసి షెరిఫ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
అడవుల్లో కార్చిచ్చులు రేగడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సార్లు అరణ్యాల్లో ఎగసిన మంటలు రోజుల తరబడి పెరుగుతూనే ఉంటాయి. అయితే, అడవులు నిప్పంటుకోకుండా చూసే ప్రాచీన సంప్రదాయం ఒకటుంది. అదేమిటో వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
అదేమంటే, మేకలతో ఈ మంటలు రాకుండా చూడడం. ఇది సాధ్యమా? లాస్ ఏంజిల్స్ అడవుల్లో మేకలు మేపుతున్న దృశ్యాలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. దీనికీ, అడవులు అంటుకోకుండా చేయడానికీ ఏమైనా సంబంధం ఉందా? వీటికి ఈ కథనంలో జవాబులు తెలుసుకుందాం.
సూర్యకాంతిలో మెరిసే స్పష్టమైన నీరు పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోంది. పైన ఆకాశం నీలం రంగులో మెరుస్తుంది. కంటిచూపు మేరలో గోదుమ వర్ణం ఇసుక తీరాలు కనిపిస్తున్నాయి. కొండపై నుంచి కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తూ ఒక మేకల మంద గడ్డి మేస్తోంది. లాస్‌ఏంజిల్స్‌లో ఈ దృశ్యాలు చాలా సాధారణం.
ఇవి కేవలం మేకలు మాత్రమే కాదు, అడవులు కాలిపోకుండా కాపాడేందుకు కాలిఫోర్నియా ప్రయోగిస్తున్న సరికొత్త రహస్య ఆయుధాలు కూడా.
రాష్ట్రవ్యాప్తంగా పచ్చిక బయ్యళ్లలో ఉన్న గడ్డిని మేపేందుకు ఈ మేకల మందను తీసుకొచ్చారు.
‘‘మేం వెళ్లే ప్రతి చోటా మాకు మంచి స్వాగతం లభిస్తుంది’’ అని మేకల కాపరి మైఖెల్ చోయ్ అన్నారు.
కార్చిచ్చులను అదుపులోకి తీసుకొచ్చే మేకల మందల కంపెనీని చోయ్ నడుపుతున్నారు. ఇది చోయ్ కుటుంబ వ్యాపారం.
గడ్డివాములను, పచ్చికబయ్యళ్లను శుభ్రపరిచేందుకు నగర సంస్థలకు, పాఠశాలలకు, ప్రైవేట్ క్లయింట్లకు చోయ్ కుటుంబం ఈ మేకలను అమ్ముతోంది.
చోయ్ కంపెనీ వద్ద 700 మేకలున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి మరిన్ని మేకలను పెంచాల్సి ఉంది ఈ కంపెనీ.
‘‘పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన పెరుగుతుందని నేను అనుకుంటున్నాను.
చెత్త మొక్కలను తొలగించి, మంటల నుంచి అడవులను కాపాడేందుకు ఉపయోగించే విధానాలపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది. అందుకే, వీటికి భారీ డిమాండ్ వస్తోంది. రోజురోజుకి ఈ డిమాండ్ పెరుగుతోంది’’ అని చోయ్ అన్నారు.
1980 నుంచి కాలిఫోర్నియా పెద్ద ఎత్తున చెలరేగుతున్న కార్చిచ్చులకు కేంద్రంగా మారింది.
2021లో కాలిఫోర్నియా అనూహ్యమైన కార్చిచ్చు ప్రమాదాలను ఎదుర్కొందని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్, ది స్టేట్ ఫైర్ కంట్రోల్ కంపెనీ(కాల్‌ఫైర్) తెలిపింది.

ఫొటో సోర్స్, LUCY SHERRIFF
ఒకసారి అంటుకున్న మంటలతో 9,60,000 ఎకరాల అడవులు కాలిపోయాయి. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి వర్షాలు అడవులను కాపాడాయి.
కాలిఫోర్నియాలో 2022 కార్చిచ్చు సీజన్‌ను మధ్యస్థమంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏడాది 3 లక్షల ఎకరాలకు పైగా అడవులు కాలిపోయాయి.
కాలిఫోర్నియాలో ఈ ఏడాది ఆగస్ట్ నెల కాస్త చల్లగా, తడి వాతావరణాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, 5 లక్షల ఎకరాలకు మంటలు అంటుకుని, నలుగురు వ్యక్తులు మరణించారు.
మారుతున్న వాతావరణ మార్పులు మరింత వేడి, ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇవి కార్చిచ్చు ప్రమాదాలను, వాటి తీవ్రతను పెంచుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
చనిపోయిన చెట్లు, పొదలు పెరుగుతూ ఉంటే, పెద్ద ఎత్తున ప్రమాదకరమైన కార్చిచ్చులకు ఇవి కారణంగా మారతాయని పరిశోధనలు తెలిపాయి.
సాంప్రదాయ భూ నిర్వహణలో మనుషుల ద్వారా చెట్ల పొదలు పెరగకుండా కత్తిరించడం, ఎండిన చెట్లను తొలగించడం, చెత్త మొక్కలను ఏరివేయడం వంటివి చేసే వారు.
కానీ, కంపెనీలు, నగర మున్సిపల్ అధికారులు మాత్రం భవిష్యత్‌లో సుస్థిరమైన, చౌక విధానాల కోసం చూస్తున్నారు. దీనిలో ఒకటే మేక మందలను పెట్టి ఎండిపోయిన చెట్లను, పచ్చిక బయ్యళ్లను మేపిస్తున్నారు.
‘‘పొదలు మేపేందుకు కాలిఫోర్నియాలో, మధ్యధరా ప్రాంతంలో మేకలు చాలా ఉపయోగకరంగా మారాయి’’ అని ఇడాహో యూనివర్సిటీకి చెందిన ఎకాలజీ ప్రొఫెసర్ కరెన్ లాంచ్‌బాగ్ చెప్పారు.
మేకలు, గొర్రెల మందలను మేపడం ద్వారా కార్చిచ్చు ప్రమాదాల నుంచి అడవులను కాపాడవచ్చా? అనే అంశంపై ఆయన అధ్యయనం చేశారు. గడ్డిని మేపేందుకు మాత్రమే వీటిని పెంచుతున్నట్లు తెలిపారు.
ఇతర జంతువులతో పోలిస్తే మేకల నోళ్లు సన్నగా ఉంటాయి. ఎండిపోయిన ఆకులను, పొదలను ఇవి తేలిగ్గా తినేయగలవు.
‘‘ఆ మేకలు తమ కాళ్లపై నిల్చుని వాటి దవడలు, నాలుక ద్వారా 6.7 ఎత్తులో ఉన్న ఆకులను, చెట్లను అందుకుని తినగలుగుతాయి. ప్రమాదకరమైన పదార్థాలను నిర్వీర్యం చేసుకునే సామర్థ్యం వాటికుంటుంది. దీంతో విషపూరితమైన చెట్లను ఇవి తింటాయి’’ అని లాంచ్‌బాగ్ చెప్పారు.
కార్చిచ్చు ప్రమాదాలను తగ్గించేందుకు సరికొత్త విధానంగా మేకలను వాడే భూస్వాములు, నగర అధికారులు పెరుగుతున్నారని లాంచ్‌బాగ్ చెప్పారు.
ఎండిపోయిన మొక్కలను తొలగించాలని, 4 అంగుళాలకు గడ్డిని తగ్గించాలని ప్రజలను ఆదేశిస్తూ.. కాలిఫోర్నియా నగరం కార్చిచ్చు ప్రమాదాల సన్నద్ధత మార్గదర్శకాలను విడుదల చేసింది.
మేకలు ఈ పనులను సహజంగా, సత్వరంగా, తేలిగ్గా చేపట్టనున్నాయి.
అత్యంత వేడిమి గల ప్రదేశాల్లో కూడా గడ్డిని మేసేందుకు మేకలు వెళ్లగలవు. మనుషులు వెళ్లి చెట్లను, ఎండిపోయిన ఆకులను, పొదలను తొలగించడానికి కష్టమైన ప్రదేశాల్లోకి, కొండలపైకి మేకలు వెళ్లేందుకు ఎలాంటి సమస్య ఉండదు.
‘‘మేకలు సహజంగానే పైకి ఎక్కగలవు. ఎలాంటి కష్టం లేకుండా కొండలను ఇవి ఎక్కుతాయి. మనుషులు వెళ్లడానికి వీలులేని ప్రాంతాలకు కూడా ఇవి తేలిగ్గా వెళ్లగలవు. దేనినైనా ఇవి తింటాయి’’ అని మేకల పెంపకందారి చోయ్ అన్నారు.
లాస్‌ఏంజిల్స్ కౌంటీలోని గ్లెండాలే పట్టణంలో మౌంట్ వెర్దుగో కొండ ప్రాంతాల్లో 300 మేకలను పెట్టి మేపించారు. రెండు వారాల కాలంలో 14 ఎకరాలను ఇవి శుభ్రం చేశాయి.
కార్చిచ్చులకు అత్యంత ఎక్కువ ప్రమాదకరమైన ప్రాంతంగా ఈ నగరం ఉంది.
అడవులకు నిప్పంటుకోకుండా నిర్మూలించేందుకు 2018 నుంచి చోయ్ మేకలను వాడటం మొదలు పెట్టినట్లు గ్లెండాలే అగ్నిమాపక విభాగానికి చెందిన వృక్షసంపద నిర్వహణ ఇన్పెక్టర్ పాటీ ముండో చెప్పారు.

ఫొటో సోర్స్, CITY OF WEST SACRAMENTO
ఇళ్లకు, భూములకు మధ్య బఫర్ జోన్లను ఏర్పాటు చేయడమే వీటి ఉద్దేశ్యం. ఇలా చేయడం ద్వారా కార్చిచ్చు ప్రమాదాలు నెలకొన్నప్పుడు, వాటి ప్రమాదాన్ని తగ్గించవచ్చు లేదా నిరోధించవచ్చు.
ఈ బఫర్ జోన్లు కార్చిచ్చుల నుంచి ఇళ్లను కాపాడగలవు. 60 వేలకు పైబడిన జనాభా ఉన్న రాష్ట్రాల్లో కార్చిచ్చు ప్రమాదాల నుంచి ఇళ్లను కాపాడేందుకు బఫర్ జోన్లు కీలకంగా మారుతున్నాయి.
కార్చిచ్చు నివారణ చర్యల్లో భాగంగా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వాటిని తగ్గించేందుకు, పర్యావరణ సహిత విధానంగా 2013 నుంచి మేకల మందను వాడుతున్నట్లు వెస్ట్ శాక్రమెంటో నగరానికి చెందిన పార్క్ ఆపరేషన్స్ సూపరిటెండెంట్ జాసన్ పౌపోలో చెప్పారు.
మేకలు ఈ నగరానికి ఏడాదిలో రెండుసార్లు వస్తాయి. ఒకసారి శీతాకాలంలో వచ్చి వర్షాకాలంలో పెరిగిన మొక్కలను, చెట్లను, ఆకులను తినేసి వెళ్తాయి.
ఆ తర్వాత శరదృతువు సమయంలో వచ్చి మళ్లీ ఎండిపోయిన బురద మట్టిని, రాలిన ఆకులను తింటాయి.
మేకల పెంపక కంపెనీ వెస్ట్రన్ గ్రేజర్స్‌కి గత సీజన్‌లో ఈ నగరం 1,50,000 డాలర్లను(కోటి రూపాయలకు పైగా) అందించింది.
‘‘మా కొండ ప్రాంతాలు నిటారుగా, దట్టమైన అడవులతో ఉంటాయి. ఒకవేళ అక్కడి నుంచి పడితే వర్కర్లు గాయాలు పాలవుతారు. అందుకే, ఆ ప్రాంతాలకు మేం మేకలను పంపిస్తుంటాం’’ అని పౌపోలో చెప్పారు.
2022 కార్చిచ్చు ప్రమాదంలో హౌసింగ్ కాంప్లెక్స్‌ను కాపాడేందుకు నగర అగ్నిమాపక విభాగానికి మేకల మంద సహకరించింది.
‘‘ఒకవేళ ఈ ప్రమాదానికి ముందే మేకలు ఇక్కడికి వచ్చి గడ్డిని తినకపోతే, అగ్నికీలకు మరింత ప్రమాదకరంగా వ్యాపించేవి’’ అని పౌపోలో చెప్పారు.
‘‘ఈ ప్రమాదానికి కాస్త ముందు మేకల మంద ఇక్కడికి వచ్చి, దట్టంగా, పెద్ద ఎత్తున అల్లుకున్న గడ్డిని 4 అంగుళాల వరకు తినేసింది. దీంతో సిబ్బంది ఈ అగ్నికీలలను దాటుకుని వెళ్లి, కాంప్లెక్స్‌ను కాపాడగలిగారు’’ అని అన్నారు.
వేగంగా పెరుగుతోన్న మొక్కలను, చెట్లను అదుపులో ఉంచేందుకు మేకలు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఇటలీ, గ్రీస్, స్పెయిన్ వంటి పలు యూరప్ దేశాలు భూముల్లో ఉన్న పిచ్చి మొక్కలను, చెట్లను, గడ్డిని తొలగించేందుకు మేకలను వాడటం శతాబ్దాల కాలంగా వస్తోన్న సాంప్రదాయం.
ఈ విధానం కాలిఫోర్నియాలో కొత్త. అగ్నిమాపక విభాగంలో జంతువుల వాడకంపై దశాబ్దకాలంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
2013లో అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలో క్వీవ్‌ల్యాండ్ నేషనల్ ఫారెస్ట్‌లో 100 ఎకరాల అడవిని తాత్కాలికంగా తగ్గించే ప్రాజెక్ట్ కోసం 1,400 మేకలను అమెరికా అటవీ విభాగం(యూఎస్ఎఫ్ఎస్) వాడింది.
అడవికి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి మధ్యలో అదనంగా 300 అడుగుల భూమిని శుభ్రపర్చడమే తమ లక్ష్యమని తెలిపింది.
‘‘అడవుల్లో కార్చిచ్చులకు కారణమయ్యే కట్టెలను తొలగించేందుకు పెద్ద మొత్తంలో కార్మికులు, మిషనరీ, హ్యాండ్ టూల్స్ కావాల్సి ఉంటుంది. అంతేకాక కోసిన ఈ కట్టెలను సురక్షితంగా కాల్చివేయాలి’’ అని ఈ ప్రాంతపు డిస్ట్రిక్ రేంజర్ జాన్ ఫ్రైడ్‌ల్యాండర్ అన్నారు.
అమెరికా అటవీ విభాగం అంచనా ప్రకారం, ఒక్కో ఎకరాన్ని చదును చేసేందుకు 1200 నుంచి 1500 డాలర్ల వరకు ఖర్చు చేయాలి. అదే మేకల ద్వారా అయితే 400 నుంచి 500 డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతుంది.
మేకలు మేసిన తర్వాత, దానికి ముందు ఈ భూములను అటవీ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. దీంతో, సంప్రదాయ విధానంతో పోలిస్తే మేకలు ఎంత సమర్థవంతంగా ఈ పనిని చేపడుతున్నాయో పరిశీలిస్తారు.

ఫొటో సోర్స్, MICHAEL CHOI
‘‘అటవీభూములను నిర్వహించేందుకు మేకలు మాత్రమే ఒకే ఒక్క ఆప్షన్ కాదు. కార్చిచ్చులతో పోరాడేందుకు అందుబాటులో ఉన్న ఎన్నో ఆప్షన్లలో ఇదొకటి’’ అని లాంచ్‌బాగ్ తెలిపారు.
కొన్ని అగ్నిమాపక విభాగాలు కార్చిచ్చులతో పోరాడేందుకు సొంతంగా పశువులను కొనుగోలు చేస్తున్నాయి. అవి గడ్డినంతా మేస్తూ, భూమిని చదును చేస్తున్నాయి.
తమ వద్ద సొంతంగా 300 మేకల మంద ఉందని శాన్ మాన్యువల్ అగ్నిమాపక అసిస్టెంట్ చీఫ్ క్రిస్ నెల్సన్ అన్నారు.
ఒకేసారి ఈ మేకలు రెండు నుంచి ఐదెకరాలను చదును చేయగలవని తెలిపారు. వేసవి చివర్లో మేకల మంద వచ్చి మేసి వెళ్లి తర్వాత ఏమైనా మిగిలిపోయిన చెత్తా, పొదలు, ఎండుగడ్డి ఉంటే వాటిని అటవీ అధికారులు శుభ్రపరుస్తారు.
మేకల మందతో అడవులను మేపేందుకు నగరాలకు పలు గ్రాంట్లను కూడా మంజూరు చేస్తోంది అగ్నిమాపక ఏజెన్సీ కాల్‌ఫైర్.
‘‘అడవుల్లో కార్చిచ్చుకు కారణమయ్యే వాటిని తగ్గించేందుకు మేకల మేత అనేది అత్యంత సమర్థవంతమైన విధానంగా తమ లబ్దిదారుల్లో చాలా మంది గుర్తించారు’’ అని కాల్‌పైర్‌కు చెందిన ప్రభుత్వ ప్రొగ్రామ్ అనలిస్ట్ కారా గారెట్ అన్నారు.
‘‘గడ్డిని తీసే యంత్రాలు, చెట్లను తగ్గించే యంత్రాలు, ట్రాక్టర్లను తప్పుడు సమయంలో వాడితే అవి కార్చిచ్చుకు కారణమవుతాయి. వృక్ష సంపదను కాపాడేందుకు కాలిఫోర్నియాలో మేకల మందతో మేపడమనేది సురక్షితమైన ఎంపికగా వాడుతున్నారు’’ అని చెప్పారు.
ఏ నగరంలోనైనా మేకలను వాడొచ్చని పౌపోలో సూచిస్తున్నారు. వీటి ప్రయోజనాల గురించి దేశంలో ప్రజలకు వివరిస్తున్నారు. అయితే, ఇదే ఉత్తమమైన శాశ్వత పరిష్కారం కాకపోవచ్చని కూడా చెబుతున్నారు.
ఏడాదంతా వీటికోసం పెట్టే ఖర్చులను కూడా లాంచ్‌బాగ్ ప్రస్తావించారు. వాటి అవసరమున్నప్పుడు తదుపరి సీజన్ వచ్చేంత వరకు మేకలను సంరక్షించాల్సి ఉంటుంది.
‘‘ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి అవసరమైన సదుపాయాలు కావాలి. పశువులను ఎలా పెంచాలన్నది తెలియడం కూడా ఒక నైపుణ్యం. మీకొక నిపుణుడైన మేకల కాపరి కావాలి’’ అని లాంచ్‌బాగ్ తెలిపారు.
అయితే, మేకలను ఉపయోగించే భూమి కూడా ఏ రకమైందో తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే, లాంచ్‌బాగ్ ఎక్కువగా పరిశోధన చేసిన గ్రేట్ బేసిన్ ప్రాంతంలో, పొడవైన మొక్కలనేవి పెద్ద సమస్య.
వీటిని తినేందుకు మేకలను కాకుండా ఆవులను వారు ఉపయోగించారు. మేకలు ఎత్తు తక్కువున్న మొక్కలను తినేందుకు ఉపయోగపడితే, ఆవులు ఎత్తు ఎక్కువున్న చెట్లను, మొక్కలను తినేందుకు వాడేవారు.
కాలిఫోర్నియా పచ్చిక బయళ్లలో మేకల మేతను చూడటాన్ని ఇష్టపడే వారికి ఇది ఆర్థిక ప్రయోజనాలు, దాని ప్రభావం కంటే మించినది.
‘‘సహజ పద్ధతిలో కొన్ని విధానాలను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా, అవి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి’’ అని చోయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: హోం మంత్రి తానేటి వనిత ఫ్లెక్సీ చిరగడమే ఎస్సీ యువకుడి ఆత్మహత్యకు కారణమా... అసలేం జరిగింది?
- రోహిత్ శర్మ ‘టాస్’ కావాలనే దూరంగా వేస్తున్నాడా? పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై వివాదమేంటి?
- పట్టిసీమ: కృష్ణా డెల్టా రైతులకు ఇదే పెద్దదిక్కు అయ్యిందా? మరి పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు?
- సువర్ణదుర్గ్: అరేబియా సముద్రంలోని ఈ శివాజీ కోటపై బ్రిటిషర్లు ఎందుకు కన్నేశారు?
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














