ఆంధ్రప్రదేశ్: హోం మంత్రి తానేటి వనిత ఫ్లెక్సీ చిరగడమే ఎస్సీ యువకుడి ఆత్మహత్యకు కారణమా... అసలేం జరిగింది?

బొంతా మహేంద్ర, హోం మంత్రి ఫ్లెక్సీ

ఫొటో సోర్స్, Facebook/Mahendra/BBC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గంలో ఎస్సీ యువకుడి ఆత్మహత్య వివాదంగా మారింది.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు సావరం గ్రామానికి చెందిన బొంతా మహేంద్ర(21) ఆత్మహత్యతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల దాడిలో అడిషనల్ ఎస్పీకి గాయాలయ్యాయి.

గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా మంత్రి తానేటి వనిత దొమ్మేరు సావరానికి వస్తున్న సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు చింపేయడం ఈ వివాదానికి మూలం.

ఫ్లెక్సీ చించివేతకు బాధ్యుడిగా వైఎస్సార్సీపీ కార్యకర్త బొంతా మహేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన మహేంద్ర.. తనను అక్రమంగా బంధించి, అవమానించారనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. సంబంధిత ఎస్ఐ మీద ఫిర్యాదు కూడా చేశారు.

అయితే, వైఎస్సార్సీపీలో విబేధాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

దొమ్మేరు

రాజకీయ విభేదాలతోనే ఫ్లెక్సీ వివాదం

పార్టీ అధిష్టానం ఆదేశాలతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మంత్రి తానేటి వనిత పర్యటిస్తున్నారు. దొమ్మేరు సావరంలోనూ ఆమె పర్యటన ఉంది.

అక్కడ వైఎస్సార్సీపీ మరో కీలక నేత రాజీవ్ కృష్ణకు కొంత పట్టుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజీవ్ కృష్ణ భార్యది దొమ్మేరు సావరం. ఆయన అనుచరవర్గం కొంతకాలంగా మంత్రి తానేటి వనిత తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఆ వర్గంలోనే ఉన్న కొవ్వూరు జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి, ఆమె భర్త బొంతా పోశిబాబు కూడా కొంతకాలంగా మంత్రికి దూరంగా ఉంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

బొంతా పోశిబాబు అన్న కొడుకే బొంతా మహేంద్ర.

మంత్రి వనిత పర్యటన నేపథ్యంలో ఒక వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వాటిలో కొంతభాగం గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ముదునూరి నాగరాజు, బొల్లిన సురేష్, ఇతర నేతలు కొందరు కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి వ్యతిరేక వర్గం ఫ్లెక్సీలను చింపేశారన్నది వారి ఆరోపణ.

హోం మంత్రి వనిత ఫ్లెక్సీ

ఈ నేపథ్యంలో పొలంలో పని చేస్తున్న బొంతా మహేంద్రను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కొవ్వూరు ఎస్ఐ భూషణం నవంబర్ 13న ఉదయం నుంచి సాయంత్రం వరకూ మహేంద్రను స్టేషన్‌లో ఉంచారని మృతుడి చిన్నాన్న బొంతా పోశిబాబు బీబీసీకి తెలిపారు.

"ఎస్సైతో మాట్లాడినా వదల్లేదు. దాంతో హోం మంత్రికి ఫోన్ చేసి ఇలా మా అబ్బాయిని బంధించారని చెప్పా. అయినా ఆమె అదిగో, ఇదిగో అంటూ కాలం గడిపేశారు. చివరకు, రాజీవ్ కృష్ణకు చెప్పడంతో ఆయన సీరియస్ అయిన తర్వాత, మేమంతా వెళ్తే వదిలారు. సాయంత్రం వరకూ స్టేషన్‌లో ఉంచేశారు. అక్కడే పోలీసులను అడిగాడు. నేను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నిలదీశాడు. కానీ, పోలీసులు తీసుకెళ్లిపోండి ఇంటికి.. అంటే రాత్రి 7 గంటలు దాటిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాం" అని ఆయన బీబీసీకి వివరించారు.

బొంతా మహేంద్ర ఫ్లెక్సీ

పుట్టిన రోజుకు ఏర్పాట్లు...

ఐటీఐ పూర్తి చేసిన బొంతా మహేంద్ర స్థానికంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పిన్ని జడ్పీటీసీ కావడంతో అధికార పార్టీ వ్యవహారాల్లో చొరవగా ఉండేవారని చెబుతున్నారు.

నవంబర్ 17 నాటికి 21 ఏళ్లు నిండుతుండడంతో పుట్టిన రోజు కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడని మృతుడి తల్లి బొంతా శ్రీదేవి అన్నారు.

"తాను చేయని నేరానికి బంధించారనే బాధతోనే ప్రాణం తీసుకున్నాడు. చాలా అవమానంగా భావించాడు. తనను నేరగాడిని చేశారని కుమిలిపోయాడు. అందుకే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాణాలు కాపాడాలని చాలా ప్రయత్నించాం.

మొదట చాగల్లు తీసుకెళ్లాం. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో ట్రీట్‌మెంట్ ఇప్పించాం. విజయవాడ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాం. కానీ దారిలోనే చనిపోయాడు. ఏటా ఫ్రెండ్స్‌తో సరదాగా బర్త్ డే జరుపుకునే నా బిడ్డని మాకు దూరం చేశారు" అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

శ్రీదేవి భర్త రెండు నెలల క్రితమే మరణించారు. ఇప్పుడు చేతికి అందొచ్చిన కొడుకు కూడా దూరం కావడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

బొంతా మహేంద్ర

ఫొటో సోర్స్, Facebook/Mahendra

ఆందోళన, గాయాలు

వ్యవసాయ ప్రాంతమైన దొమ్మేరులో కూరగాయలు, పండ్ల సాగు విస్తృతంగా జరుగుతుంది. వ్యవసాయాధార కుటుంబాలే అన్నీ. మృతుడు బొంతా మహేంద్ర కూడా వ్యవసాయ పనులు చేస్తుంటాడు.

మహేంద్రను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అతను నవంబర్ 14న ఆత్మహత్యాయత్నం చేశాడు. 15వ తేదీన చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని మంత్రి వనిత దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు రాళ్లు విసరడంతో అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు గాయపడ్డారు. మరికొందరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

దొమ్మేరు సావరం వాసులు నిరసనలకు దిగడంతో పోలీసు బలగాలు రంగంలో దిగాయి. గ్రామంలో బందోబస్తు మధ్య మహేంద్ర అంత్యక్రియలు జరిగాయి.

గొల్లపల్లి సూర్యారావు, టీవీ రామారావు

'ఎస్సీల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి'

దొమ్మేరు సావరంలో జరిగిన పరిణామాలతో పోలీసులు తూర్పు గోదావరి జిల్లా అంతటా అప్రమత్తమయ్యారు. పలువురు ఎస్సీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మాజీ మంత్రి టీడీపీ తూగో జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహార్, మహాసేన రాజేష్ వంటి వారిని గృహనిర్బంధంలో ఉంచారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు జనసేన నేత టీవీ రామారావు , ఇతర నేతలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

"గ్రామాల్లో పోలీసులు తీసుకెళ్తే అదేదో నేరం చేసినట్టుగా చూస్తారు. అందుకే మహేంద్ర దానిని సహించలేకపోయాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై, వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదులు చేసి స్టేషన్‌లో పెడితే, వైఎస్సార్సీపీ మంత్రి ఏమీ చేయలేదంటే ఆ పార్టీలో ఎస్సీల పరిస్థితి అర్థమవుతోంది.

రాష్ట్రంలో నా ఎస్సీ, ఎస్టీ అని చెప్పుకోవడమే తప్ప ఎస్సీల ప్రాణాలకు రక్షణ కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. చిన్న ఫ్లెక్సీ చింపేస్తే స్టేషన్‌లో బంధిస్తారా? కేసు విచారణ కోసమే అయితే వారి వివరాలు తీసుకుని పంపించవచ్చు. కానీ, పొలం పనుల్లో ఉండగా అక్కడికి వచ్చి స్టేషన్‌కి తీసుకెళ్లి సాయంత్రం వరకూ బంధించడం దుర్మార్గం" అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

ఈ కేసులో నష్టపరిహారం అందించి చేతులు దులుపుకోవడం కాకుండా, సమగ్ర విచారణ జరిపి యువకుడి మృతికి కారకులందరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన బీబీసీతో అన్నారు.

కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్

'హోం మంత్రి సరిదిద్దుకుంటారు'

నవంబర్ 16వ తేదీ సాయంత్రం ఏపీ సాంఘింక సంక్షేమ శాఖ మంంత్రి మేరుగ నాగార్జునతో కలిసి స్థానిక మంత్రి తానేటి వనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు, రాజీవ్ కృష్ణ తరఫున మరో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగానూ ఆదుకుంటామని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ జరగకుండా చూస్తామని మంత్రి నాగార్జున మీడియాతో అన్నారు.

"రాజకీయాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొంత అన్ ఈజీగా ఉంది. ఇకపై జాగ్రత్తగా ఉంటాం. చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే సరిచేసుకుంటాం. మంత్రి కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. సరిదిద్దే బాధ్యత రాజీవ్ కృష్ణ తీసుకుంటారు. సీఎం జగన్ ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా న్యాయం చేస్తాం. ఇకపై మంత్రి వనిత అందరినీ కలుపుకుని పోతారు" అని ఆయన అన్నారు.

మరోవైపు, పోలీసు అధికారులు కూడా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ కొవ్వూరు ఎస్సై భూషణాన్ని సస్ఫెండ్ చేశారు. ఎస్సైతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్: 08026995000

ఇవి కూాడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)