దిల్లీ: కాలుష్యంతో విషపూరితమైన గాలిని కృత్రిమ వర్షంతో శుభ్రం చేయవచ్చా?

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కాలుష్యం అనేది నిరంతర సమస్య
    • రచయిత, చెరిలాన్ మోలాన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

దిల్లీ కాలుష్య సమస్యకు సమాధానం మేఘాల్లో దొరుకుతుందా?

దిల్లీలోని కాలుష్యం స్థాయిని తగ్గించడానికి క్లౌడ్ సీడింగ్ సాంకేతికతను పరిశీలిస్తున్నట్లు గతవారం దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

కొన్ని రోజులుగా దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగి గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది.

సుప్రీం కోర్టుతో పాటు ఇతర మంత్రిత్వశాఖల నుంచి ఆమోదం లభిస్తే క్లౌడ్ సీడింగ్ విషయంలో దిల్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.

అంతా అనుకున్నట్లు జరిగితే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెలాఖరులో దిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్‌ను చేయవచ్చు.

దిల్లీలో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారంగా క్లౌడ్ సీడింగ్‌ను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు.

క్లౌడ్ సీడింగ్ అనేది సంక్లిష్ట, చాలా ఖరీదైన వ్యవహారమని కొందరు నిఫుణులు అంటున్నారు.

కాలుష్య నియంత్రణలో క్లౌడ్ సీడింగ్ సమర్థత ఇంకా నిరూపితం కాలేదని చెబుతున్నారు.

ఈ సాంకేతికత వల్ల కలిగే దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని అంటున్నారు.

దిల్లీలో కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

కానీ, దిల్లీ కాలుష్యం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రపంచస్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కుతుంటే, ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం రాజకీయ నాయకులు పట్టుదలగా ఉన్నారు.

గత రెండు వారాలుగా దిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 450 మార్కును దాటింది. సాధారణంగా ఆమోదయోగ్యమైన ఏక్యూఐ కంటే ఇది దాదాపు 10 రెట్లు ఎక్కువ.

ఏక్యూఐ అనేది గాలిలోని సూక్ష్మరేణువుల స్థాయిని కొలుస్తుంది.

శుక్రవారం (నవంబర్ 10) కాసేపు కురిసిన సహజ వాన కారణంగా వారాంతంలో దిల్లీలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది.

అయితే, దీపావళి పండుగ సందర్భంగా ప్రజలంతా టపాసులు కాల్చడంతో సోమవారం గాలి నాణ్యత మళ్లీ ప్రమాదకరంగా మారింది.

దిల్లీలో కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కాలుష్యంపై పోరాడేందుకు ఉపయోగించే సాధనాల్లో యాంటీ స్మోగ్ గన్‌లు కూడా ఉన్నాయి

దుమ్ముధూళి, అధిక వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు వంటి కారణాల వల్ల దిల్లీలో ఏడాదంతా కాలుష్యం సమస్య ఉంటుంది.

కానీ, చలికాలంలో దిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంది. దిల్లీ పొరుగు రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను కాల్చి వేయడం, గాలి వేగం తక్కువగా ఉండటంతో గాలిలో కాలుష్యకారకాలు ఎక్కువగా పేరుకుపోతాయి. ఇలా గాలి విషపూరితం అవుతుంది.

దిల్లీ ప్రభుత్వం ఈసారి ముందుగానే స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రకటించింది. నగరంలో నిర్మాణ పనులను నిషేధించింది.

దిల్లీలో విషపూరిత గాలికి సంబంధించి నమోదైన పిటిషన్లను విచారిస్తోన్న సుప్రీం కోర్టు, క్లౌడ్ సీడింగ్‌ చేపట్టడానికి తమకు అనుమతిస్తుందని దిల్లీ ప్రభుత్వం నమ్మకంతో ఉంది.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి?

వర్షం సృష్టించడానికి మేఘాల్లో తేమ ఘనీభవన ప్రక్రియను వేగవంతం చేసే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అంటారు.

క్లౌడ్ సీడింగ్ అంటే విమానాల సహాయంతో సిల్వర్ అయొడైడ్ లేదా క్లోరైడ్ వంటి లవణాలను మేఘాల్లో చల్లుతారు. భూమి మీద నుంచి కూడా కొన్ని పరికరాల ద్వారా ఈ ప్రక్రియను చేపడతారు.

ఈ లవణాలు న్యూక్లియేటింగ్ కణాలుగా పనిచేసి మేఘాల్లో మంచు స్పటికాలు ఏర్పడేందుకు వీలు కల్పిస్తాయి. మేఘాల్లోని తేమ ఈ మంచు స్పటికాలపై చేరి వర్షంగా మారుతుంది.

కానీ, ఈ ప్రక్రియ అన్నిసార్లు పనిచేయదు.

ఈ ప్రక్రియకు వాతావరణ పరిస్థితులు కచ్చితంగా సరిగ్గా ఉండాలని గాలి నాణ్యత, ఆరోగ్యంపై స్వతంత్రంగా పరిశోధనలు చేసే పరిశోధకుడు పోలాష్ ముఖర్జీ చెప్పారు.

‘‘మంచు కేంద్రకాలు ఏర్పడటానికి మేఘాల్లో తగిన పరిమితిలో తేమ ఉండాలి’’ అని ఆయన అన్నారు.

అంతే కాకుండా, గాలి వేగం వంటి ద్వితీయ కారకాలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు.

లవణాలను అడ్డంగా కాకుండా నిలువుగా పెరిగే నిర్దిష్ట రకమైన మేఘాల్లోకి పిచికారీ చేయాల్సి ఉంటుందని 2018లో డౌన్ టు ఎర్త్ మ్యాగజీన్‌తో వాతావరణ శాస్త్రవేత్త జేఆర్ కులకర్ణి చెప్పారు.

దశాబ్దాలుగా వర్షాల తయారీ ప్రక్రియ మనుగడలో ఉంది.

భారతదేశ వాతావరణ శాఖ తొలి భారత డైరెక్టర్ జనరల్, వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎస్కే బెనర్జీ 1952లోనే కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు చేశారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటోంది?

క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను కాన్పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన పరిశోధకులు సమర్పించారు.

ఈ ప్రణాళిక ప్రకారం, రెండు దశలుగా క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్‌ను చేపడతారు.

మొదటి దశలో 300 చదరపు కిలోమీటర్లు పరిధిలో క్లౌడ్ సీడింగ్ చేస్తారు.

నవంబర్ 20, 21 తేదీల్లో వాతావరణ పరిస్థితులు అనువైనవిగా ఉండటంతో ఆ తేదీల్లోనే ప్రాజెక్టును అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ప్రాజెక్టును నడిపిస్తున్న శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ‘‘దిల్లీని పూర్తిగా కప్పి ఉంచేలా ఆరోజుల్లో మేఘాలు ఉంటాయని మేం అనుకోవట్లేదు. కానీ, కొన్ని వందల కిలోమీటర్లు కవర్ అయ్యేలా మేఘాలు ఉంటే బాగుంటుంది’’ అని అన్నారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

కాలుష్య నియంత్రణకు ఇది నిజంగా ఉపయోగపడుతుందా?

వర్షం పడటం వల్ల వాతావరణంలోని సూక్ష్మరేణువులు కడిగివేసినట్లు అవుతాయి. గాలి శుభ్రపడుతుంది. శ్వాస తీసుకోవడానికి వీలుగా మారుతుంది.

శుక్ర, శనివారాల్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి దిల్లీలో కాలుష్యం స్థాయిలు తగ్గిపోవడం కనిపించింది.

అయితే, కృత్రిమ వర్షాలు ఎంత వరకు మేలు చేస్తాయో స్పష్టంగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

ఇతర దేశాల్లో గాలి నాణ్యత నిర్వహణకు, దుమ్ము అణిచివేత కోసం క్లౌడ్ సీడింగ్‌ను ఉపయోగిస్తున్నారని ముఖర్జీ చెప్పారు.

‘‘గాలి నాణ్యత మీద వర్షపాతం ప్రభావాన్ని పరిశీలిస్తే, అది వెంటనే కాలుష్య స్థాయిని తగ్గిస్తుంది. కానీ 48 నుంచి 72 గంటల్లో పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. క్లౌడ్ సీడింగ్ చాలా ఖరీదైనది’’ అని అన్నారు.

క్లౌడ్ సీడింగ్ అనేది కచ్చితంగా బాగా చర్చించి తీసుకునే పాలసీ అని ఆయన చెప్పారు.

‘‘ఇది తాత్కాలిక నిర్ణయం కాదు. దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రోటోకాల్స్ ఉండాలి. వాతావరణ శాస్త్రవేత్తలు, గాలి నాణ్యత విధాన నిపుణులు, ఎపిడెమియాలజిస్టులతో కూడిన క్రమశిక్షణా కమిటీతో ఈ ప్రొటోకాల్స్‌ను రూపొందించాలి’’ అని వివరించారు.

ఈ ప్రక్రియ గురించి ఇంకా మనకు తెలియని అంశాల గురించి కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా ఎంత మేర ఏక్యూఐ తగ్గుతుందనే దానిపై గణనీయ ఆధారాలు లేవు అని వాతావరణ మార్పులు, సుస్థిరత నిపుణులు అభినాశ్ మొహంతీ చెప్పారు.

‘‘క్లౌడ్ సీడింగ్ ప్రభావాలు ఎలా ఉంటాయో మాకు కూడా తెలియదు. ఎందుకంటే సహజ ప్రక్రియలను మార్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.

వర్షపాతం, గాలివేగం వంటి వాతావరణ అంశాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నివారించలేమని ఆయన చెప్పారు.

‘‘గాలి కాలుష్యానికి కళ్లెం వేయడానికి మరింత సంఘటిత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయోగాలు దీనికి సరిపోవు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)